లెబనాన్‌ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం? | Lebanon Pager Case: What Kerala techie Role Reveals Probe Details | Sakshi
Sakshi News home page

లెబనాన్‌ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం! దర్యాప్తులో ఏం తేలిందంటే..

Published Sat, Sep 21 2024 11:07 AM | Last Updated on Sat, Sep 21 2024 11:38 AM

Lebanon Pager Case: What Kerala techie Role Reveals Probe Details

హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో..  కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. 

వయనాడ్‌కు చెందిన రిన్‌సన్‌ జోస్‌(37)..  నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్‌ లిమిటెడ్‌ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్‌బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. 

బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్‌ఎస్‌, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్‌ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.

‘‘లెబనాన్‌ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్‌ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో  పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్‌జాక్షన్స్‌) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్‌ఎస్‌ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే)  పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.

ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్‌ వీళ్లదే

సెప్టెంబర్‌ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..

తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్‌ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్‌-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్‌ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన  ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్‌ మార్క్‌ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది.  

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన  రిన్‌సన్‌ జోస్‌.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్‌ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్‌ పేలుళ్ల కేసు నుంచి క్లీన్‌చిట్‌ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement