Pager Blasts
-
పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా?
లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారని లెబనాన్ ఆరోపిస్తోంది. అయితే.. ప్రస్తుతకాలంలో ప్రపంచంలోని మరేయితర దేశం ఎదుర్కొనంత యుద్ధ సంక్షోభం తాము ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. ఒకవైపు హమాస్.. మరోవైపు హెజ్బొల్లా దాడులతో క్లిష్టమైన పరిస్థితుల్లో తాము ఉన్నట్లు చెబుతోంది. అదే సమయంలో.. ప్రత్యర్థులపై చేస్తున్న జరుగుతున్న ‘మిస్టరీ దాడుల్ని’ తోసిపుచ్చకపోవడం గమనార్హం!!. అయితే.. భారత్‌లో ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియా ఛానెల్ డిబేట్లో పాల్గొన్నారు. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఇది ఇజ్రాయెల్, దాని నిఘా సంస్థల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా అని యాంకర్ అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘గతంలో సైన్యాల మీదనో, ఉగ్రవాదం మీదనో దాడులు జరిగేవి. ప్రస్తుతం యుద్ధం అనేది సంప్రదాయ పద్ధతుల నుంచి హైబ్రీడ్ పద్ధతికి మారిపోయింది. ఈ కాలంలో ఇజ్రాయెల్ ఎదుర్కొన్నంత దాడులు మరేయితర దేశం ఎదుర్కొలేదు. రాకెట్లు, మిస్సైల్స్ మాత్రమే కాదు.. మా దేశంపై సైబర్ దాడులు కూడా జరిగాయి. నింగి, నేల, జల మార్గం ఆఖరికి టన్నెల్స్ ద్వారా కూడా మాపై దాడులు జరిగాయి... ఇలాంటి పరిస్థితుల్లో.. ఇజ్రాయెల్ కేవలం తనను తాను రక్షించుకోవడం మీద మాత్రమే ఫోకస్ చేయడం లేదు. అదే టైంలో తన దాడులతో శత్రు దేశాలకు ‘సర్ప్రైజ్’ చేయాలనుకుంటోంది కూడా. ఇజ్రాయెల్ ఇప్పుడు ఏ తరహా దాడులు చేస్తుందో.. అనే అంశం లోతుల్లోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. కానీ, ప్రత్యర్థులు దొడ్డిదారిన దాడులకు తెగబడినప్పుడు వాళ్లకు అదే రీతిలో బదులివ్వడం తప్పేం కాదు కదా’’ అని రూవెన్ వ్యాఖ్యానించారు.ఇదే ఇంటర్వ్యూలో ఆయన.. తాజా యుద్ధ పరిణామాలతో పాటు అమెరికా, భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు దక్కిన మద్ధతు, తాజా అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్‌తో భేటీ కావడం లాంటి అంశాలపైనా స్పందించారు. లెబనాన్‌లో సెప్టెంబర్ 17-18 తేదీల మధ్య పేజర్లు, ఆ మరుసటి రోజే వాకీటాకీలు.. ఇతర శాటిలైట్ డివైజ్‌లు పేలిపోయి 37 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇవి హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్.. దాని నిఘా సంస్థ మోస్సాద్ జరిపిన దాడులేనని లెబనాన్ ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మెరుపు దాడి.. హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ -
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం.