Train tracks
-
అనకాపల్లిలో తప్పిన రైలు ప్రమాదం.. పలు ట్రైన్స్ ఆలస్యం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సెఫ్టీ గడ్డర్ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. దీంతో, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.వివరాల ప్రకారం.. అనకాపల్లి పెను ప్రమాదం తప్పింది. అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను లారీ ఢీకొనడంతో పైన ఉన్న రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. ఇదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు వచ్చింది. అయితే, ట్రాక్ పక్కకి జరిగిన విషయాన్ని గుర్తించిన గూడ్స్ లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేశారు. ఎలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పైకి నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉండగా.. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీంతో, అడ్డూ అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. పరిధికి మించి లారీల్లో రాయి NOABకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలకు క్వారీ లారీలు కారణం అవుతున్నాయి. నేడు బ్రిడ్డిని లారీ ఢీకొంది. నిన్న క్వారీ.. ఎల్ఐసీ ఏజెంట్‌ను ఢీకొనడంతో అతడు మృతిచెందారు. ఇక, ఓవర్ లోడ్ వస్తున్న లారీ కారణంగా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. లారీల ఓవర్ స్పీడ్ కారణంగా గామాస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
తిరుపతి: విరిగిన రైలు పట్టాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా: గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా? లేక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. -
రైలు పట్టాల మధ్యలో పడుకుని.. చావు తప్పించుకున్నాడు
ఓ వ్యక్తి పట్టాలపై నడుస్తుండగా ఎదురుగా రైలు దూసుకొచ్చింది. వెంటనే పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు తన మీదుగా వెళ్తున్నంత సేపు కదలలేదు. మెదలలేదు. రైలు వెళ్లిపోగానే లేచి.. దుమ్ము దులుపుకొని ఇంటి దారి పట్టాడు. చూసినవారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనయ్యింది. కేరళ రాష్ట్రంలో కన్నూర్ జిల్లాలో జరిగిన ఘటనను చిత్రీకరించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. మంగళూరుృతిరువనంతపురం ట్రైన్ కన్నూర్ృచిరక్కల్ రైల్వే స్టేషన్ల గుండా వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆ మార్గంలోని పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతను ఫోన్లో మాట్లాడుతుండటంతో రైలు దగ్గరగా వస్తున్న విషయాన్ని గమనించలేదు. తీరా చూసేసరికి.. తప్పించుకునే వీలులేకుండా పోయింది. వెంటనే సమయ స్ఫూర్తితో వ్యవహరించిన పవిత్రన్.. పట్టాల మధ్యలో పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోగానే లేచి ఇంటికెళ్లిపోయాడు. #Kerala: A middle-aged man from Chirakkal narrowly survived after a train passed over him in Pannenpara, Kannur, while he was walking along the tracks. Eyewitnesses reported that he lay down on the tracks just before the train approached, emerging unscathed. pic.twitter.com/ZPApakxHRp— Informed Alerts (@InformedAlerts) December 24, 2024 అయితే వీడియో వెనుకనుంచి చిత్రీకరించడంతో వ్యక్తిని గుర్తించడం కష్టమైంది. వైరలైన వీడియోను చూసిన పోలీసులు.. తాగిన మత్తులో వ్యక్తి అలా చేశాడేమోనని భావించారు. తరువాత విచారించగా ఆ వ్యక్తి స్కూల్ వ్యాన్ క్లీనర్‌గా 56 ఏళ్ల పవిత్రన్ అని తేలింది. తాను తాగలేదన్న పవిత్రన్.. ప్రాణాలను కాపాడుకోవడానికి అలా పట్టాలపై పడుకున్నానని చెప్పారు. ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేదన్నారు. వీడియో చూసి తాము ఆశ్చర్యపోయామని, బక్కగా ఉండటం వల్లే పవిత్రన్ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు అంటున్నారు. -
కేంద్ర రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ.. గద్వాల–డోర్నకల్ వరకు..
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం రైల్వేరంగం అభివృద్ధిపై దృష్టిసారించడంతో కొత్త రైల్వేలైన్లపై ఆశలు చిగురిస్తున్నాయి. గద్వాల– డోర్నకల్ (మహబూబాబాద్) మధ్య రైల్వేలైన్ సర్వే కోసం ఆదేశాలు జారీ కావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కావడం పట్ల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దీనికి సంబంధించి పైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు కేంద్ర ప్రభుత్వం రూ.7.40 కోట్లు విడుదల చేసింది. దీంతో 296 కి.మీ., పొడవైన గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట మీదుగా డోర్నకల్ వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేల అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ మార్గంలో కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా విడుదలైన నిధులతో రైల్వేలైన్‌కు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు గత నెల 26న కేంద్ర రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
షాకింగ్ ఘటన: మూడేళ్ల చిన్నారిని కర్కశంగా.. రైలు పట్టాలపైకి తోసేసి..
మూడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా రైలు పట్టాలపైకి తోసేసింది ఓ మహిళ. దీంతో సదరు బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన అమెరికాలో ఒరెగాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ర్వైలే స్టేషన్లో ఫ్లాట్‌ఫాంపై తన తల్లితో ఉన్న మూడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలపైకి తోసేసింది. ఈ మేరకు ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం...మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్‌మెన్ అనే మహిళ తోసేసినట్లు పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిల్లాడిందని తెలిపారు. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్ ఫాంపై ఉన్న మిగత వ్యక్తులు వెంటనే స్పందించి...సదరు చిన్నారిని రక్షించారు. ఆ చిన్నారి పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఈ షాకింగ్ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి దారుణాలకు ఎందుకు ఒడిగడుతుంటారో అర్థం కాదంటూ.. ప్రయాణికులలో ఒకరు ఆవేదనగా అన్నారు. ఈ మేరకు ఈ దారుణానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక బెయిల్ లేకుండా కస్టడీలోనే ఉంచనున్నట్లు అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు) -
Assam Floods: రైలు పట్టాలే దిక్కు
గువాహటి: అస్సాంలో వరద బీభత్సం వల్ల జనం చెల్లాచెదురైపోతున్నారు. సొంత గ్రామాలు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. జమునాముఖ్ జిల్లాలో చాంగ్జురాయ్, పాటియా పత్తర్ గ్రామాలకు చెందిన 500కుపైగా కుటుంబాలు ఇప్పుడు రైలు పట్టాలపై తలదాచుకుంటున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వారి ఇళ్లు నీట మునిగిపోయాయి. గత్యంతరం లేక రైలు పట్టాలపై ఉంటున్నామని జనం చెప్పారు. వరదలతో కట్టు బట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదని, ఆకలితో అల్లాడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కొన్నిచోట్ల తాత్కాలిక గుడారాల్లో జనం సర్దుకుంటున్నారు. ఐదు రోజులుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. అస్సాంలోని 29 జిల్లాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలతోపాటు కొండ చరియలు విరిగి పడడంతో 14 మంది మరణించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 343 సహాయక శిబిరాల్లో 86,772 మంది ఆశ్రయం పొందుతున్నారు. -
23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
ఇన్సూరెన్స్ కింద కోట్ల రూపాయలు ఆర్జించవచ్చనే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. ఇది జరగడానికి కొంతకాలం ముందు సదరు వ్యక్తి ఒకటి, రెండు కాదు సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్నాడు. ఐతే ఏళ్లు గడుస్తున్నా బీమా తాలూకు రూ. 23 కోట్ల డబ్బు పొందలేకపోతున్నాననే బాధతో ఈ పనికి పూనుకున్నాడు సదరు వ్యక్తి. డబ్బుకోసం కాళ్లను నరుక్కున్న ఈ వ్యక్తిని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం హంగేరీకి చెందిన సెందర్ అనే వ్యక్తి ఇన్సురెన్స్ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకుని రెండు కాళ్లు నరుక్కున్నాడు. 2014లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో 54 ఏళ్ల సెందర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకువెళ్లదీస్తున్నాడు. కాళ్లు కోల్పోయిన తర్వాత బీమా డబ్బు కోసం సెందర్ బీమా కంపెనీలను సంప్రదించాడు. కానీ అతని ఎత్తుగడ బీమా సంస్థలు పసిగట్టి అతనికి ఊహించని షాక్ ఇచ్చాయి. నిజానికి సెందర్ తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను ఆలస్యం చేశాయి. దీనితో మనస్థాపం చెందిన సెండర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో విషయం అంతా బట్టబయలయ్యింది. పొదుపు ఖాతాల కంటే బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక సలహా అందుకున్న తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. అందుకే పాలసీలు కూడా తీసుకున్నాడట. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో తాజాగా జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు సరికదా పరువు కూడా పోయింది. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
ఎవరిదీ శవం?
రాంగోపాల్‌పేట్: రైల్వే పట్టాల పక్కన పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో నాలుగు రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 2న బన్సీలాల్‌పేట్‌కు చెందిన యువకుడు మిస్సింగ్ కావటంతో ఈ మృతదేహం అతనిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బైబిల్ హౌజ్ ప్రాంతంలోని రైల్వే పట్టాలకు దూరంగా చెట్ల పొదల్లో ఓ మృతదేహం పడి ఉందన్న సమాచారంతో మహంకాళి, గాంధీనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం కావడం, పూర్తిగా చీకటిగా ఉండటంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. మృతదేహాన్ని తరలించడం కూడా కష్టంగా ఉండటంతో అక్కడే ఉంచారు. గురువారం ఉదయం మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు చెప్పారు. గత నెల 31 నుంచి బన్సీలాల్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అతని బంధువులు ఈ నెల 2న గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన రోజు ఆ యువకుడు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో కలిసి ఉండటం గమనించిన స్థానికులు, బంధువులు పోలీసులకు ఈ విషయం చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిందితులను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో బన్సీలాల్‌పేట్‌లో చంపేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మహంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌లు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఆ ఇద్దరు మృతులెవరు ?
చిత్తూరు, చంద్రగిరి : రైలు కింద పడి మృతి చెందిన ఆ ఇద్దరు ఎవరై ఉంటారోనని, రైల్వే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సోమవారం మండల పరిధిలోని ముంగలిపట్టు సమీపంలో రైల్వే పట్టాలపై సుమారు 55 సంవత్సరాల వయస్సు గల మహిళ, 45 సంవత్సరాలుగల పురుషుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుల ఆచూకీ కోసం రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడి చొక్కా కాలర్‌పై దివ్య డ్రస్సెస్, కొత్తపేట, చంద్రగిరి అనే చిరునామా ఉండటంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. మంగళవారం రైల్వే డీఎస్పీ రమేష్‌బాబు సిబ్బందితో కలసి దివ్య డ్రస్సెస్ టైలర్ దుకాణం వద్దకు వెళ్లారు. దుకాణంలోని దర్జీలను విచారించారు. దుకాణంలో వినియోగదారుల రికార్డులు, వారి పేర్లు, ఫోన్ నంబర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మృతుడి చొక్కా కాలర్‌పై ఉన్న చిరునామా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతులు చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. మృతులు ఎవరు, ఆత్మహత్యకు గల కారణాలేమిటి అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుల వివరాల కోసం ఆటోల ద్వారా ప్రతి గ్రామంలో ప్రచారాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ నరసింహరాజు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ముద్దనూరు–ముదిగుబ్బ లైనుపై ఆశలు
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాలు రైలుకూతకు దూరంగా ఉన్నాయి. ఈ మార్గాల మీదుగా రైలు మార్గాలేవీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో రైలు కూత వినిపించడంలేదు. జిల్లాలో రైల్వేపరంగా అభివృద్ధికి ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు కృషి చేస్తున్నారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ రాయచోటి, ఇటు పులివెందుల నియోజకవర్గ పరిధిలో వెళుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు రైల్వే సేవలు అందే అవకాశముంది. తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బలైను తెర మీదకు వచ్చింది. దీంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు రేకేత్తించాయి. 65కిలోమీటర్ల రైల్వేలైన్.. ముదిగుబ్బ రైల్వేస్టేషన్ గుంతకల్–బెంగళూరు రైలు మార్గంలో ఉంది. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో ఈ లైనుకు రైల్వేశాఖ సర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు 65 కిలోమీటర్ల దూరం ఉంది. ముద్దనూరు–ముదిగుబ్బ కొత రైల్వే లైన్ సర్వేకి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ లైను సర్వే ఏ దిశగా ఉంటుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రకటించిన కొత్తరైల్వేలైన్ల సర్వేలా ఉండిపోతుందా.. ముందుకు వెళుతుందా అనేది వేచిచూడాల్సిందే. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా కదిరి మార్గంలో ముదిగుబ్బ వరకు వెళ్లే విధంగా అలైన్మెంట్ చేస్తారా..లేక పులివెందుల సమీప ప్రాంతం నుంచి వెళ్లే విధంగా అలైన్మెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలైన్మెంట్ స్పష్టమైతే పులివెందుల మీదుగా అయితే అక్కడి వాసులు రాబోయే రోజుల్లో రైలుకూత వినవచ్చు. బడ్జెట్లో కొత్త లైను సర్వేకి నామమాత్రంగా నిధులు కేటాయిచారని విమర్శ ఉంది. ఈ లైనును త్వరిగతిన రాబట్టుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు రైలు కూత వినిపిస్తుంది. -
త్వరలోనే సౌరశక్తి రైలింజన్ కూత
రాజంపేట/జమ్మలమడుగు: జిల్లాలో రెండో రైలుమార్గంలో విద్యుద్దీకరణ పనులకు ఎట్టకేలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ విద్యుద్దీకరణ (ట్రాక్షన్) పనులు ఇక ఊపందుకోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే కేంద్రం పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వేమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ఈ పనులకు శంకుస్థాపన చేయడంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక స్వప్నం నెరవేరనుందని ఆశాభావంతో ఉంది. శంకుస్థాపన చేస్తూ తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సౌరవిద్యుత్ సెక్షనుగా ఈ మార్గాన్ని ప్రకటించారు. ఇప్పటివరకూ ఈమార్గంలో డీజిల్ లోకో రైళ్లు నడుస్తున్నాయి. డీఎంయూ (డీజల్ మల్టిపుల్ యూనిట్) ప్యాసింజర్ రైలు ఒకటి నడుస్తోంది. అదొక్కటే ఉపయోగకరంగా ఉంది. ధర్నవరం నుంచి అమరావతికి వారంలో రెండురోజులు ఈ ప్యాసింజర్ రైలును నడిపిస్తున్నారు. డీజల్ లోకో(రైలింజన్)తో గూడ్స్ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. త్వరలోనే సౌరవిద్యుత్ సహాయంలో రైళ్లను నడపాలని రైల్వే అధికారులు సంకల్పిస్తున్నారు. రైలుమార్గం తీరు ఇలా.. కర్నూలు, కడప జిల్లాలను రాజధాని అమరావతికి అనుసంధానం చేసే ఈ రైలు మార్గం (ఎర్రగుంట్ల–నంద్యాల) 123 కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఈ రూటులో ఇప్పటికే రూ.967కోట్లు వివిధ పనులకు వెచ్చించారు. 780హెక్టార్లు భూమిని ఈ మార్గం కోసం సేకరించారు. 139 ఆర్‌యూబీలు, కాపలా ఉన్నవి 5, లేనివి 15 ఎల్సీ గేట్లు ఉన్నాయి. 36 పెద్దవంతెనలు, 469 చిన్న వంతెనలున్నాయి. ఈ మార్గంలో ప్రొద్దుటూరు,జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజమల, కోయిలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్లు కవరవుతాయి. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ ట్రాక్షన్ పనులు గతేడాది జనవరిలో ప్రారంభిస్తారని భావించారు. బడ్జెట్లో నిధులు మంజూరయినా పనులను ప్రారంభించలేదు. రేణిగుంట–గుంతకల్ రైలుమార్గం విద్యుద్ధీకరణ అయినందున ఎర్రగుంట్ల నుంచి నంద్యాల రైల్వేలైన్ కూడా విద్యుద్దీకరణ పూర్తయితే ఎలక్ట్రికల్ ఇంజన్లతో రైళ్లు నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే కడప..కర్నూలు జిల్లా ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. దక్షిణ మధ్య రైల్వేలో తొలి సౌర విద్యుత్ వినియోగ సెక్షనుగా దీనిని రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వేపరిధిలో సౌర విద్యుత్ సహాయంతో నడిచే రైలింజన్లు లేవు. అనుకున్న సమయంలో ఈ పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిధులు స్వల్పమే.. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ విద్యుద్దీకరణకు కేంద్రం గత బడ్జెట్లో రూ.111.48 కోట్లు కేటాయించింది. ట్రాక్షన్ సర్వే పనులు కూడా నిర్వహించింది. ట్రాక్షన్ పనులను ఆర్వీఎన్ఎల్(రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్) సంస్థ చేపట్టనుంది. ఈఏడాది బడ్జెట్లో రూ.18కోట్లు కేటాయించింది. ఈమార్గం 123 కిలోమీటర్ల మేర రైలుమార్గంలో విద్యుద్దీకరణకు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ కేంద్రం కేటాయించిన నిధులు స్వల్ప మేననే ఆవేదన వ్యక్తమవుతోంది. ఉత్త మాటలు కాకుండా నిధుల విడుదలలో కేంద్రం మరింత చొరవ చూపిస్తే ఈ మార్గంలో సౌరశక్తి సహాయంతో రైళ్ల కూత వినే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. -
నేను ప్రేమించడం లేదు.. చస్తే చావు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ప్రేమ వ్యవహారమే ఇంటర్ విద్యార్థిని మృతికి దారి తీసిందని.. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలించి.. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విలేకర్లకు మంగళవారం వెల్లడించారు. ఆత్మహత్యకు కారణమైన బాలుడ్ని అరెస్టు చేసి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఆత్యహత్యగా నిర్ధారించడంతో మిస్టరీ వీడింది. అసలేం జరిగింది.. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జనవరి 26న గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించింది. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన తర్వాత రైల్వే ట్రాక్‌పై పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును పలాస రైల్వే పోలీసులు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 8 రోజులపాటు అన్ని కోణాల్లో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కూడా రావడంతో దర్యాప్తు వేగవంతమైంది. బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం కావడంతో హత్య కోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆత్మహత్య కోణంపై దర్యాప్తు సాగింది. మొత్తం 50 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఇంటర్ విద్యార్థిని ప్రశ్నించారు. కాల్ డేటా, మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లు పరిశీలించారు. ఈ విద్యార్థి వ్యవహారం వల్లే బాలిక మృతి చెందినట్లు భావించారు. నిందితుడిపై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ వేణుగోపాలరావు నిన్ను ప్రేమించడం లేదు.. ప్రియుడిగా అనుమానిస్తున్న విద్యార్థితో బాలికకు మూడు నెలల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత నెల 23వ తేదీన చివరి సందేశంలో ‘నేను ప్రేమించడం లేదు. చస్తే చావు’ అని చేప్పాడు. ప్రేమించడం లేదని చెప్పడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 25న అర్ధరాత్రి దాటిన తర్వాత బహిర్భూమికని వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి విద్యార్థిని అరెస్టు చేశామని, విద్యార్థి మైనర్ కావడంతో జువైనల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్‌రావు సిబ్బంది ఉన్నారు. బంధువులు, గ్రామస్తుల ఆందోళన విద్యార్థిని జువైనెల్ కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల అదుపులో వారం రోజులకుపైగా స్టేషన్లోనే ఎందుకు ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బాలుడ్ని చూపించడంతో పట్టువిడిచారు. అనంతరం శ్రీకాకుళం కోర్టుకు వాహనంలో తరలించారు. -
చికుబుకు చికుబుకు రైలే..!
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు: జిల్లాల్లోని పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పయనించే రైలు కూతవేటు దూరంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్ట్ కలలు నెరవేరనున్నాయి. దశాబ్దాల నుంచి ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ రైలు మార్గం గత టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. 2011–12 బడ్జెట్లో రూ.2,450 కోట్ల వ్యయంతో కేంద్రం పచ్చజెండా ఊపింది. 2016 వరకు పనుల్లో పురోగతి లేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత గల రైల్వేలైను నిర్మాణాల జాబితాలో చేర్చారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వేలైను నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మరింత జాప్యం చోటు చేసుకుంది. ఉదయగిరి: నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేసింది. ఎట్టకేలకు 2019–20 బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించడంతో పనులు మొదలయ్యాయి. 2022 కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైల్వే అధికారులు సంకల్పించారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటికే గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 46 కి.మీ రైల్వేలైను పూర్తి చేసి ట్రయల్ నిర్వహించి మొదటి దశ పనులు పూర్తి చేశారు. రైల్వే లైను నిర్మాణం స్వరూపం గుంటూరు జిల్లా నడికుడి నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు వయా ప్రకాశం, నెల్లూరు మీదుగా 308.76 కి.మీ నిడివి గల ఈ మార్గంలో తొలుత 33 స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. తాజాగా ఇటీవల మరో నాలుగు కొత్త స్టేషన్ల నిర్మాణానికి రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో మొత్తంగా 37 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 23 మెట్ట మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు అవసరమైన 5,189 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించనుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 800 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 1,900 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 2,200 భూసేకరణ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందజేసింది. నెల్లూరు జిల్లాలో భూసేకరణ జరిగినా ఇంత వరకు నష్టపరిహారం అందించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియను పూర్తయితే కానీ జిల్లాలో రైల్వేలైను నిర్మాణం జరిగే పరిస్థితి లేదు. ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా.. న్యూఢిల్లీ–చెన్నై, హౌరా–చెన్నై ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన శ్రీకాళహస్తి–నడికుడి రైల్వేలైను కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు నిర్మిస్తున్న ఈ మార్గంలో రవాణా సౌకర్యాలు ఎంతగానో మెరుగు పడనున్నాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, కృష్ణపట్నం, ఓబుళాపురం రైల్వే మార్గాలతో అనుసంధానం ఏర్పడనుంది. ఈ రైల్వేలైను పూర్తయితే హైదరాబాద్–చెన్నై, హౌరా–చెన్నై మధ్య రైళ్ల రద్దీ తగ్గే అవకాశముంది. హైదరాబాద్–చెన్నై మధ్య సుమారు 90 కి.మీ దూరం కూడా తగ్గనుంది. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన పరిస్థితుల్లో కోస్తా తీరంలో ప్రస్తుతం వెళ్తున్న హైదరాబాద్–చెన్నై రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ మార్గం ఉపయోగించుకునే అవకాశముంది. గుంటూరు జిల్లాలో వెనుకబడిన పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పొదిలి, కనిగిరి, పామూరు ప్రాంతం, నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మెట్ట ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. రైలు నడిచే ప్రాంతాలివే.. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో నడికుడి నుంచి వయా పిడుగురాళ్ల, దాచేపల్లి, నగిరికల్లు, బ్రాహ్మణపల్లి, సంతగుడిపాడు, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ, ఐనవోలు, కురిచేడు, ముండ్లమూరు, దరిశి, పొదిలి, కొనకమిట్ట, కనిగిరి, పామూరు, వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, బాలాయపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి వరకు నడుస్తుంది. గతంలో 33 రైల్వేస్టేషన్లును గుర్తించి, నిర్మించాలని ప్రతిపాదన. అయితే తాజాగా మరో నాలుగు కొత్త స్టేషన్లకు నోటిఫికేషన్ ఇస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పిడుగురాళ్ల న్యూ, నెమలిపురి, కుంకలగుంట, వేల్పూరు రైల్వేస్టేషన్లు జత చేకూరాయి. దీంతో మొత్తంగా 37 రైల్వేస్టేషన్లు ఏర్పాటు అవుతాయి. రవాణాకు ఎంతోమేలు ఈ రైల్వేలైను పూర్తయితే వెనుకబడిన మెట్ట ప్రాంతాలుగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లా పొదిలి, కనిగిరి, పామూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయి. రైతులు పండించే వాణిజ్య పంటలు, ఇతర ఉద్యాన పంటలు, పొగాకు, గ్రానైట్ రైల్వే మార్గం ద్వారా నేరుగా పెద్ద పెద్ద నగరాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రైలు మార్గం ఏర్పడడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో మొదలుకాని పనులు నెల్లూరు జిల్లాలో 2,200 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో కొంత మేర హద్దులు కూడా రాళ్లు నాటారు. ప్రైవేట్ భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇంత వరకు ఇవ్వకపోవడంతో ఆ భూముల్లో పనులు చేసే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించాల్సి ఉన్నందున రైతులకు నష్టపరిహారం శరవేగంగా అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఈ రైల్వే లైనుకు సంబంధించి పలుమార్లు అధికారులతో చర్చించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రైలు మార్గంతో ఉదయగిరి అభివృద్ధి నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి పార్లమెంట్ సభ్యుడిగా మా అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయించడంలో కీలక పాత్ర వహించారు. ఈ లైను పూర్తయితే ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు మెట్ట మండలాలతో పాటు ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉదయగిరి ప్రాంత వాసులకు కూడా ఎంతో మేలు చేకూరనుంది. – మేకపాటిచంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి నాలుగు దశల్లో పనులు పూర్తి శ్రీకాళహస్తి–నడికుడి రైల్వేలైను పనులు నాలుగు దశల్లో పూర్తికానున్నాయి. మొదటి దశ : పిడుగురాళ్ల నుంచిశావల్యాపురం వరకు 46 కి.మీ రెండో దశ : గుండ్లకమ్మ, దరిశి, ఆత్మకూరు, వెంకటగిరి వరకు 126.16 కి.మీ మూడో దశ : కనిగిరి నుంచి ఆత్మకూరు వరకు 95.55 కి.మీ నాల్గో దశ : వెంకటగిరి నుంచిశ్రీకాళహస్తి వరకు 41 కి.మీ -
విధి వంచిత.. వలస కుటుంబం
అగనంపూడి(గాజువాక): రైలు పట్టాలపై విద్యుత్ షాక్‌కు గురై చిన్న కొడుకును కోల్పోయిన బాధ నుంచి తేరుకోని తల్లిదండ్రులకు అదే రైలు పట్టాలు మళ్లీ యమపాశాలుగా మారాయి. పండగ కోసం వెళ్లిన పెద్ద కొడుకు ప్రాణాలు కూడా తీసేశాయి. సరదాగా గ్రామదేవత పండగకు స్నేహితులతో వెళ్లిన పదో తరగతి విద్యార్థి రైలు పట్టాలపై శవమై తేలాడు. పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంపై విధి కన్నెర్ర చేసిన ఉదంతం ఇది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి అగనంపూడి నిర్వాసిత కాలనీ దానబోయినపాలెం వద్ద రైలు పట్టాలపై జరిగిన ప్రమాదానికి సంబంధించి దువ్వాడ జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజగిరి పదేళ్ల క్రితం ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో విశాఖకు వలస వచ్చారు. ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అగనంపూడి నిర్వాసిత కాలనీ దిబ్బపాలెంలో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమారుడు ఆదిత్య గిరి(14) అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. గత నెలలో పరీక్షలు కూడా రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం డొంకాడలో గ్రామదేవత పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి వెళ్తున్నట్టు తల్లి రాణికి చెప్పి వెళ్లాడు. అయితే ఆదిత్య రాత్రి 11 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో బీ–షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వచ్చిన మనోజ్ పండగ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కుమారుడి కోసం వెతికాడు. కనిపించకపోవడంతో స్నేహితులు, తెలిసిన వారి ఇళ్లలో వాకబు చేసినా ఫలితం లేదు. పండగలో విధులు నిర్వహించే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటాడు.. ఉదయం చూద్దామనుకొని ఇంటికి వచ్చిన మనోజ్‌కు శుక్రవారం ఉదయం గుండె పగిలే వార్త తెలిసింది. తన ఇంటికి దగ్గరలోని దానబోయినపాలెం సమీపంలోని రైలు పట్టాల పై ఆదిత్య శవమై కనిపించాడు. ఈ దుర్ఘటనలో తల, మొండెం రెండుగా విడిపోవడంతో పాటు శరీర భాగాలు నుజ్జయ్యాయి. ఆదిత్య తన సైకిల్‌ను పట్టాల పక్కన ఉంచి బహిర్భూమికి వెళ్లే సమయంలో రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. దువ్వాడ పోలీసులు, జీఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. మృతుని తల్లిదండ్రులు, చెల్లి ప్రమాద విషయం తెలిసి తల్లడిల్లిపోయారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న గతేడాది ఇదే సమయంలో ఆదిత్య తమ్ముడు అలోక్ గిరి ఆడుకుంటూ వెళ్లి వడ్లపూడి రైలు పట్టాల వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఇంకా ఆ బాధ నుంచి తేరుకోకముందే ఇప్పుడు ఆదిత్య మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీటిపర్వంతమయ్యారు. -
విరిగిన రైలు బోగీ బాలిస్టర్ స్ప్రింగ్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగి పోవడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచిపోయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదటి ప్లాట్‌ఫాంపైకి వస్తుండగా టీఎక్సార్ డిపార్ట్మెంట్ వారు ఏసీ కోచ్ నంబర్ సీ–2 కింద స్ప్రింగ్ విరిగి ఉండటాన్ని గుర్తించారు. తక్షణమే అప్రమత్తమైన అధికారులు రైలును రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి తరలించి విరిగిన స్ప్రింగ్ స్థానంలో కొత్తది వేసి రైలును విజయవాడ పంపించారు. ఈ బాలిస్టర్ స్ప్రింగ్ మార్చేందుకు రెండు గంటల సమయం పట్టడంతో సాయంత్రం 6 గంటల సమయంలో రైలు విజయవాడకు బయలు దేరింది. -
కృష్ణపట్నం రైల్వేలైన్‌కు పచ్చజెండా
కృష్ణపట్నం (వెంకటాచలం)–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గం పూర్తి కావడానికి దశాబ్దన్నర కాలంపట్టింది. ఈలైను నిర్మాణం ముగింపుదశలో ఉంది.నెల్లూరు వైపు వెలుగొండల్లో నిర్మితమవుతున్న (6.5కి.మీ) టన్నెల పూర్తిఅయితే అంతాసిద్ధమైనట్లే. ఈనెల 21న లాంఛనంగా ఉపరాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించేందుకు రైల్వేఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : దక్షిణమధ్య రైల్వే రవాణా సదుపాయం కల్పిస్తున్న ఓడరేవుల్లో ముఖ్యమైనది కృష్ణపట్నం ఓడరేవు. జోన్ నుంచి రవాణా అయ్యే సరుకు రవాణాల్లో గణనీయభాగం ఈ పోర్ట్ నుంచి జరుగుతోంది. ప్ర స్తుతం కృష్ణపట్నం పోర్ట్ విజయవాడ–గుంటూరు–గుడూరు ప్రధాన రైలుమార్గంలోని వెంకటాచలం స్టే షన్ వద్ద అనుసంధానమైంది. వెంకటాచలం నుంచి ఓబులవారిపల్లెని కలుపుతూ చెన్నై–హౌరా, చెన్నై– ముంబాయి రైలుమార్గాలకు దగ్గరి దారిగా ఉంది. ఉపరాష్ట్రపతి మానస పుత్రిక ఈలైను ఉపరాష్ట్రపతి మానస పుత్రిక అయిన ఈ రైల్వేలైన్‌ను ఆయన లాంఛనంగా త్వరలో ప్రారంభించనున్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో ఈలైను మంజూరుకు తన హోదాలో కృషి చేశారు. ఈ మేరకు నెల్లూరు రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేమంత్రిత్వ శాఖ సన్నహాలు చేస్తున్నారు. ఈనెల 21న ఈ మార్గం ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. రెండు మెయిన్లైన్లకు అనుసంధానం కృష్ణపట్నం పోర్ట్ –వెంకటాచలం–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గం ప్రాజెక్టు రెండు ప్రధానరైలు మార్గాల మధ్య అనుసంధానమై గుంతకల్ డివిజన్ నుంచి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. ఓబులవారిపల్లె–రేణిగుంట–గుడూరు సెక్షన్లో రద్దీకూడా తగ్గనుంది. ప్రస్తుత కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులో వెంకటాచలం రోడ్ జంక్షన్–వెలికల్లు మధ్య (60కిమీ), చెర్లోపల్లె–వెలికల్లు మధ్య 7కిమీ అడవిలో సొరంగం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తియితే కృష్ణపట్నం–వెంకటాచలం–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గంలో రైళ్లను నడపడానికి వీలవుతోంది. వైఎస్సార్‌తోనే సకాలంలోరైల్వేలైన్ భూసేకరణ దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి వల్లనే ఓబులవారిపల్లె –కృష్ణపట్నం రైల్వేలైనుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయ్యింది. రైల్వేలైను కోసం 1900 ఎకరాల భూసేకరణ చేశారు. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో కేంద్రమంత్రి హోదా టన్నెల్ పరిశీలన సందర్భంగా తెలియజేయడం గమనార్హం. అప్పట్లో అటవీశాఖ మంత్రి అటవీ భూమికి సంబంధించి 325 ఎకరాలు రైల్వేలైనుకు కేటాయించారు. ప్రయాణికుల, సరుకుల రవాణాకు.. కొత్త రైల్వేలైన్ మార్గం చేపట్టడం వల్ల విజయవాడ–గూడూరు–రేణిగుంట –గుంతకల్లు సెక్షన్లో ప్రయాణికుల, సరుకుల రవాణా రైళ్లు నిరంతరాయంగా సాగడానికి వీలవుతుంది. ఈ మార్గం అందుబాటులోకి రాగానే సరుకుల రవాణాలో ఆశించిన అభివృద్ధి సాధ్యపడుతుందని అంచనా. వెనుకబడిన ప్రాంతాల్లో సాంఘిక, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. రద్దీగా ఉన్న విజయవాడ–గూడూరు రైలుమార్గం ప్రస్తుతం విజయవాడ–గూడూరు రైలుమార్గం నిరంతరం రైళ్ల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటోంది. ముంబై, పశ్చిమ తీర ప్రాంతాలకు సరుకుల రవాణా చేయడంలో సౌలభ్యంతో పాటు నిరంతరాయ రవాణా సౌకర్యం కల్పించాలని , సరుకు రవాణా వినియోగదారులు కోరుతున్నారు. 2005–2006లో ఈ కొత్త రైలుప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఏపీలోని నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల మధ్య నుంచి సాగుతోంది. సరుకు రవాణా అవసరాలు తీర్చడానికి, వేగన్ల టర్న్ అరౌండ్ అభివృద్ధి , రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్, కృష్ణపట్నం పోర్ట్ , ఏపీ సర్కారు, సాగరమాల డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్‌ఎంజీసీ , బ్రహ్మిణి స్టీల్స్ సంస్థలు కలిసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీపీ) ద్వారా కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ (కెఆర్‌సీఎల్)ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టులో ప్రధానంశాలివే.. ♦ ఓబులవారిపల్లె నుంచి వెంకటాచలం రోడ్ జంక్షన్ వరకున్న రైలుమార్గం పొడవు 93 కి.మీ. ♦ వెంకటాచలం రోడ్ జంక్షన్–వెలికల్లు , చెర్లోపల్లె–ఓబులవారిపల్లె మధ్య పూర్తయిన రైలుమార్గం పొడవు 82 కి.మీ. ♦ వెంకటాచలం రోడ్ జంక్షన్–ఓబులవారిపల్లె మధ్య రైల్వేలైన్ కోసం సవరించిన నిర్మాణ వ్యయం రూ.1,656 కోట్లు. ♦ ఈ మార్గంలో 23 భారీ వంతెనలు, 123 చిన్న వంతెనలు, సబ్‌వేలు 60 ఉన్నాయి. ♦ వెంకటాచలం రోడ్ జంక్షన్–ఓబులవారిపల్లె మధ్య కసుమూరు, కొత్తుండిపల్లె, బ్రహ్మణపల్లె, ఆదూర్పల్లి, నెల్లెపల్లి, రాపూరు, వెల్లికల్లు, చెర్లోపల్లె,నేతివారిపల్లె, మంగపేటరోడ్ కొత్త రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ♦ చెర్లోపల్లె–వెలికల్లు మధ్య కిలోమీటర్ పొడ వు సొరంగం మార్గం నిర్మాణం పూర్తయిం ది. 7కి.మీ పొడవు ఉన్న మరో భారీ సొరంగమార్గం నిర్మాణదశలో కొనసాగుతోంది. -
ఈ సారైనా కూసేనా!
కేంద్రం ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై కోనసీమవాసులు ఆశలు పెట్టుకున్నారు. కోటిపల్లి నుంచి కోనసీమ మీదుగా నర్సాపురం సాగే ఈ రైల్వేలైన్ కోసం కోనసీమ వాసులు దశాబ్దాలుగా కలలుగంటున్నారు. అరకొర నిధుల మంజూరుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాలేదు. గడిచిన మూడేళ్లుగా మోదీ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో పనులు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్లో ఈ ప్రాజెక్టుకు మరోసారి భారీగా నిధులు కేటాయిస్తారని కోనసీమవాసులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి , అమలాపురం: కోటిపల్లి–నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణానికి రూ.2,150 కోట్లు అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖ ద్వారా 75 శాతం అంటే రూ.1,690 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు కేటాయించి రూ.42 కోట్లు కాగా, 2014–18 వరకు నాలుగేళ్లలో ఎన్డీయే సర్కార్ రూ.835 కోట్లు కేటాయించింది. కేంద్రం గడిచిన నాలుగేళ్లలో తొలి ఏడాది 2015–16న రైల్వే బడ్జెట్లో కేవలం రూ.ఐదు కోట్లు మాత్రమే కేటాయించింది. తరువాత ఏడాది 2016–17న రూ. 200 కోట్లు, 2017–18న 430 కోట్లు, 2018–19న రూ.200ల చొప్పున నిధులు కేటాయించింది. మొత్తం నాలుగేళ్లలో రూ.835 కోట్లు కేటాయించింది. ప్రస్తుత నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇంకా తన వాటాగా రూ.858 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ప్రాజెక్టుకు దివంగత మహా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 25 శాతం నిధులు అంటే రూ.537 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.125 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇవ్వాల్సిన దానిలో కేవలం 20 శాతమే నిధులు ఇచ్చిన చంద్రబాబు సర్కార్ కేవలం రూ.2.96 కోట్లు మాత్రమే రైల్వేశాఖకు డిపాజిట్ చేశారు. ఇక రాష్ట్రం ఎంత కేటాయిస్తుంది.. కేటాయింపుల్లో ఎంత రైల్వేశాఖకు ఇస్తుందనే దానిపై కోనసీమవాసులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నారు. మోదీ సర్కార్‌కు ఈ పాలనా కాలంలో ఇదే చివరి బడ్జెట్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై తనస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కోనసీమ రైల్వే సాధన సమితి, కోనసీమ జేఏసీ ప్రతినిధులు నిధుల కేటాయింపుపై రామ్‌మాధవ్‌ను సంప్రదిస్తున్నారు. ’గతంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రాజెక్టులో భాగంగా గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరిన్ని నిధులు కేటాయిస్తే వంతెన నిర్మాణాలతోపాటు రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా సమాంతరంగా జరుగుతుంది’ అని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. -
తీరని శోకం
విశాఖపట్నం, ఎస్.రాయవరం(పాయకరావుపేట): నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకుల మృతి మిస్టరీగా మారింది. అన్నవరం గ్రామానికి చెందిన ఆ ఇద్దరు యువకుల మృతి రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగల్చగా, ఎలా మృతి చెందారనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ గ్రామంలో తిరిగా రు. మిత్రులతో క్రికెట్ ఆడి సంతోషంగా గడిపారు. ఆ రాత్రి గడిచి సోమవారం తెల్లారుతుండగానే విషాద వార్త గ్రామస్తుల కంట కన్నీ రు పెట్టించింది. కోటవురట్ల మండలం అన్నవరం గ్రా మానికి చెందిన పైల లక్ష్మీనా రాయణ(20), బోళెం వాసు(22) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మండలంలోని నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద రైల్వే ట్రాక్‌పై ఇద్దరి మృతదేహాలు పడి ఉండడాన్ని సోమవారం గుర్తించా రు. పట్టాలకు మధ్యలో మృతదేహాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుని స్టేషన్లో రైలు ఎక్కి ఇద్దరూ విశాఖపట్నం వెళుతుండగా నర్సీ పట్నం రోడ్డు రైల్వే స్టేషన్ దాటాక ప్రమాదశాత్తూ జారిపడ్డారా? లేక ఎవరైనా రైలు లో నుంచి నెట్టేశారా అన్నది ప్రశ్నార్ధకం. లేకపోతే ఒకరు జారిపోతుండగా రక్షించబోయి మరో యువకుడు కూడా ప్రమాదానికి గురయ్యాడా? ఇవన్నీ అంతుపట్ట ని ప్రశ్నలు. గ్రామస్తులు, మిత్రుల కథ నం మేరకు ఇరువురు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని తెలుస్తోంది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామనే తప న ఇద్దరిలో ఉండేదంటున్నారు. ఉద్యోగ ప్రయత్నంలోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తమవుతోంది. పైల సత్తిబా బు, వరహాలమ్మకు ఒక కుమార్తె, కుమారుడు కాగా లక్ష్మీనారాయణ కుటుంబం లో చిన్నవాడు. ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడితే అందొస్తాడని తల్లిదండ్రలు కలలు కన్నారు. వారి ఆశలను హరి స్తూ ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మరో యువకుడు బోళెం వాసు దంపతులు పాత్రుడు, సత్యవతులకు ముగ్గురు కుమార్తెల తరువాత పుట్టాడు. నిరుపేద కుటుంబం కావడంతో కష్టపడి డిప్లమా చదివించారు. ఉద్యోగంలో స్థిరపడితే కష్టాలు తీరిపోతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు డ్రిప్ ఇరిగేషన్లో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణవార్త ఆ తల్లిదండ్రుల గుండెల్లో విషాదం నింపింది. మృతులు ఇద్దరూ ఒకే గ్రామస్తులు కావడంతో అన్నవరంలో విషాదం అలుముకుంది. రెండిళ్ల వద్ద స్థానికులు గుమిగూడారు. కాగా తుని రైల్వే ఎస్ఐ ఎస్.కె.అబ్దుల్‌మరూఫ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు పట్టాలపై మరణ మృదంగం
హడావుడిగా పట్టాలు దాటుతూ ఇనుప చక్రాల కింద నలిగిపోతున్న బతుకులు కొన్ని.. ఎక్కడ పుట్టారో.. ఎక్కడ పెరిగారో.. బతుకు ప్రయాణంలో రైలు పట్టాలపై అనాథలుగా అనంత లోకాలకు వెళుతున్న జీవితాలు మరికొన్ని.. చికాకులు, మానసిక ఒత్తిళ్లతో జీవితం ఒద్దురా అంటూ రైలుకు ఎదురెళ్లితనువు చాలించే బతుకులు ఇంకొన్ని.. ఇలా నిత్యం ఎంతోమంది అభాగ్యుల చావు కేకలు రైలు కూతలో కలిసిపోతున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతను, కడదాకా తోడుంటానన్న భాగస్వామికి కన్నీటిని మిగిల్చి రైలు పట్టాలపైచివరి మజిలీ మింగేసుకుంటున్నాయి. చిత్తూరు, తిరుపతి క్రైం: సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటా యి. ధైర్యంగా ముందుకు సాగితే వాటంతట అవే దూరమవుతాయి. భయపడితే మరింత భయపెడతాయి. అంతేగాని క్షణికావేశంలో జీవితం అయిపోయిందని భావించి తీసుకునే నిర్ణయాలు కన్నతల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో అభాగ్యులతోపాటు ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం కొంత ఆందోళనను కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఈ తరహా మరణాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటున్నాయి. నిదర్శనాలు ఇవే.. ♦ తిరుపతి నగరంలోని వెంకటేశ్వర థియేటర్ రైల్వే గేటు వద్ద 45 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ♦ రెండు రోజుల క్రితం తిరుపతి నగరంలోని ఒక ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థిని కాటన్ మిల్ సమీపంలో రైలు కింద పడుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ♦ 15 రోజుల క్రితం నగరంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు ఎక్కి కాలు జారి కింద పడి మృతిచెందాడు. ♦ నెలరోజుల క్రితం 30 ఏళ్లు గల వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని బలవణ్మరణానికి పాల్ప డ్డాడు. తల, మొండెం వేరై మృతదేహన్ని గుర్తుపట్టడానికి కూడా వీలులేకుండా పోయింది. నేరాల నుంచి తప్పించుకునేందుకు.. కొందరు నేరాలు తప్పించుకునేందుకు కూడా రైలు పట్టాల వద్దకు చేరుకుంటున్నారు. ఎవరినో ఒకరిని చంపడం దానిని రైలు ప్రమాదాలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా కనుగొనలేని విధంగా మృతదేహాలు చిద్రమవుతున్నాయి. తద్వారా నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. గుర్తించడంలో లోపం :రైలు నుంచి జారిపడిన సందర్భాల్లో గుర్తించడంలో జాప్యం కారణంగా ఒక్కొక్కసారి ఉన్నవారిని కూడా కాపాడలేకపోతున్నారు. సమాచారం లేదన్న సాకుతో శవ పంచనామా, శవపరీక్షలకు కాలయాపన జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు కూడా ఇటీవల చాలా చోటు చేసుకున్నాయి. కొందరు వ్యక్తులు రైలు కింద పడితే కనీసం రైలు నడుపుతున్న వ్యక్తి కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వారి శవాలు తెల్లవారు జరిగితే రాత్రి సమయంలో గుర్తించిన రోజులు కూడా ఉన్నాయి. అజాగ్రత్తతోను అధికమే రైలు ప్రయాణంలో అజాగ్రత్త ప్రమాదాలకు దారితీస్తోంది. రైల్వే స్టేషన్లో రైలు వచ్చేది లేనిది చూసుకోకుండా పట్టాలు దాటడం, రైలు బోగీ దగ్గర నిలుచోవడం, మెట్లపై కూర్చోవడం, కదిలే రైలు ఎక్కడం ప్రమాదాలకు దారితీస్తోంది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా ఉండడంతో బోగీ కుదింపులకు ఒక్కొసారి జారిపడుతున్నారు. శీతాకాలంలో బోగీ డోర్ దగ్గర ఉండే ఇనుపరాడ్లు మంచుతో తడిసి జారిపోవడం ప్రమాదాలకు ఆస్కారమవుతోంది. -
నిర్లక్ష్యం వద్దు!
నెల్లూరు(క్రైమ్): క్షణాల్లో మృత్యువు కౌగిలిస్తుందని తెలిసినా కొందరిలో అదే నిర్లక్ష్యం. ప్రమాదమని తెలిసే వేసి ఉన్న గేట్ల కిందనుంచి దూరిపోతున్నారు. నడకకూ చోటేలేని వంతెనలపై పట్టాలు దాటుతున్నారు. అందుకే నగరంలో 7 కి.మీ రైలు మార్గంలో నిత్యం ఎక్కడో ఒకచోట పట్టాలు రక్తసిక్తం అవుతూనే ఉన్నాయి. పెన్నావారధి నుంచి వేదాయపాలెం వరకు ఉన్న పట్టాలపై సగటున వారానికి ముగ్గురు నుంచి నలుగురు మృతిచెందుతున్నారు. పాత చెక్‌పోస్ట్ రైల్వే గేట్, రంగనాయకులపేట, విజయమహాల్‌గేట్, కొండాయపాలెంగేట్తో పాటూ సౌత్ రైల్వేస్టేషన్, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని నక్కలోళ్ల సెంటర్, ఎస్2 థియేటర్ సమీపం, వేదాయపాళెం ప్రాంతాల్లోని రైలుపట్టాలు నిత్యం రక్తమోడుతున్నాయి. ఇప్పటికి 125 జిల్లా వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రమాదాల్లో ఏటా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య 250. కేవలం నగరంలోని ఏడు కి.మీ çపరిధిలోనే మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. 2016, 2017 సంవత్సరాల్లో జిల్లాలో 485 మంది దుర్మరణం చెం దారు. 2018లో ఇప్పటివరకు 125 మంది మృతి చెందారు. వీరిలో అధికశాతం మంది పట్టాలు దాటేక్రమంలో రైలుఢీకొని మృతి చెందినట్లు సమాచారం. కారణాలివే.. రైల్వేగేట్లు ఉన్న పాత చెక్‌పోస్ట్, రంగనాయకులపేట, విజయమహల్గేట్, కొండాయపాలెంగేట్ తదితర ప్రాంతాలు నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. వాహనదారులు, పాదచారులు రైలు వచ్చే క్షణాల్లోనే తొందరగా వెళ్లాలని వేసి ఉన్నగేట్లు కింద నుంచి దూరి వెళుతున్నారు. రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటుతూ మృత్యువడిలోకి చేరుతున్నారు. ♦ సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య దుకాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో నిత్యం వందలాదిమంది రైలుపట్టాలను దాటి వెళుతుంటారు. సౌత్‌స్టేషన్ నుంచి ఎస్2 థియేటర్ సమీప రైలుపట్టాల మధ్య దూరం సుమారు అర కి.మీ థియేటర్‌కు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లడం బదులుగా నిమిషాల వ్యవధిలో పట్టాలు దాటేందుకు కనీసం ఫుట్‌పాత్ కూడా లేని వంతెన (పట్టాలు మాత్రమే ఉన్నవి) మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. ♦ ఆత్మకూరు బస్టాండ్ నుంచి కనకమహాల్కు రావాలంటే సుమారు 15 నిమిషాలు సమయం పడుతుంది. అదే నక్కలోళ్ల సెంటర్ నుంచి పట్టాలు దాటితే కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీంతో పాదచారులు నిత్యం వందలాదిమంది ఇటుగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో మార్గం మలుపు తిరిగి ఉండటంతో తీరా దగ్గరకు వచ్చింతేవరకు రైలు వస్తున్నట్లు తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టించుకోని రైల్వేశాఖ రైలుపట్టాలపై నడక చట్టరీత్యానేరం. అయితే రైల్వే పోలీసులు తమ కళ్లెదుటే ఎంతోమంది హడావుడిగా పట్టాలు దాటుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పట్టాలపై చావులకు గల కారణాలు గురించి ఆరా తీయకుండానే ప్రమాదవశాత్తు చోటుచేసుకుందని తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి సరిపెట్టుకొంటున్నారు. మరోవైపు రైల్వే శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఉన్న ఆరాకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కక్షణం ఆలోచించాలి ♦ మలుపుల వద్ద, ఫుట్‌పాత్‌లు లేని వంతెనలు, త్వరగా వెళ్లాలన్న ఆలోచనతో పట్టాలు దాటుతున్నప్పుడే అధిక మంది మృతిచెందుతున్నారన్న విషయాన్ని పాదచారులు గమనించాలి. ♦ రైల్వేస్టేషన్లలో వంతెనల మీదుగానే నడవడం మంచిది. గేట్లు వేసి ఉన్న సమయంలో కిందనుంచి దూరి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు. ♦ పట్టాలపై నిర్లక్ష్యంగా నడిచేవారిపై, గేట్ కింద నుంచి దూరే వాహనదారులు, పాదచారులపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి. ♦ జనసంచారం ఉన్న ప్రాంతాల్లో, ప్రమాదకర మలుపుల వద్ద పాదచారులు రైలుపట్టాలపై నుంచి రాకపోకలు సాగించకుండా రైల్వే పోలీసులు సిబ్బందిని నియమించాలి. ♦ ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు పట్టాలకు ఇరువైపులా జనం రాకుండా గోడలు నిర్మించాలి. నగర వాసులకు అవగాహన కల్పించాలి. డేంజర్స్పాట్ ఇదే విజయమహాల్‌గేట్ నుంచి సౌత్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మృతిచెందుతున్న వారిలో ఎక్కవమంది 20 నుంచి 40 ఏళ్లలోపు వయస్సున్న వారే. ఈ ప్రాంతంలోని రైలుపట్టాల వెంబడి రాత్రి, పగలు అన్నతేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం మత్తులో ఇక్కడకు వచ్చే వ్యక్తులు కొందరు రైళ్లు ఢీకొని మృత్యువాతపడుతుండగా మరికొందరు ఘర్షణలకు దిగి పరిగెత్తుతూనో, మద్యం మత్తులోనే రైలుఢీకొని చనిపోతున్నారు. ఈ విషయం రైల్వే శాఖ అధికారులు, సిబ్బందికి తెలిసినా పట్టించుకోవడం లేదు. స్థానిక పోలీసులు సైతం అటువైపుగా కన్నెతైనా చూడకపోవడంతో ఈ ప్రాంతం డేంజర్స్పాట్గా మారింది. రెండురోజులకొకరు రైలు ఢీకొనో?, కిందపడో? ఇతర కారణంతోనో మృతిచెందుతున్నారు. రైల్వే పోలీసులు మాత్రం ఏ చావైనా ఒక్కటే కేసుగా భావిస్తున్నారు. కొన్ని ఘటనలు ♦ జూన్ 30వ తేదీన చింతారెడ్డిపాలెం బలిజపాళేనికి చెందిన వి.వెంకటసురేంద్ర (49) బాబా సమోసా సమీపంలోని రైలుపట్టాలు దాటుతుండగా కావలి వైపు వెళ్లే గుర్తుతెలియని రైలుఢీకొని మృతిచెందాడు ♦ జూలై 1వ తేదీన గూడూరు పట్టణానికి చెందిన టి.శ్రీధర్‌రావు (45) విజయమహాల్‌గేట్ – ఎస్2 మధ్యలో పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలుఢీకొని మృత్యువాడపడ్డాడు. ♦ జూలై 3వ తేదీన అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌కు చెందిన కృష్ణకుమారి (32) నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ♦ జూలై 4వ తేదీన వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీప రైలుపట్టాలను దాటుతున్న కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ఆటోడ్రైవర్ జి.వీరరాఘవులు (38) రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ♦ ఈనెల 10వ తేదీన విజయమహాల్‌గేట్ సమీప రైలుపట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతిచెందాడు. ♦ రంగనాయకులపేట రైలు గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా ఓ యువకుడ్ని రైలు ఢీకొంది. గాయాలపాలైన అతడిని స్థానికులు చికిత్సనిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. -
మామా.. జాగ్రత్త సుమా..!
కృష్ణా : మామా.. ఎన్ని లైక్‌లు, ఎన్ని కామెంట్లు వచ్చాయిరా .. అబ్బబ్బా ఏం ఫొటో అప్లోడ్ చేశావ్‌రా.. ఈ రోజంతా ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్ అంతా నీ ఫొటో గురించే చర్చ. సూపర్ మామా.. అని తోటి స్నేహితుడు అంటుంటే ఫోన్ వైపు చూసుకుంటూ తన ఫొటోను మరొక్కసారి తిలకిస్తూ మురిసిపోయాడు మరో స్నేహితుడు.. ఇలాంటి ప్రశంస కోసం నేటి యువత వెర్రెక్కిపోతోంది. ఒకవైపు అర్ధరాత్రి హైవేపై జిగేల్మనే లైటింగ్‌లో సెల్ఫీలతో కుల్ఫీ అవుతోంది. మరో వైపు రయ్యిమంటూ దూసుకెళ్లే రైలు పక్కన రాజాలా ఫోజులు పెడుతోంది. ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని చిరు దరహాసం చేస్తోంది. ఎన్ని లైక్‌లు వచ్చినా, ఎన్ని కామెంట్లు ముంచెత్తినా వీటన్నింటికన్నా ప్రాణం ఖరీదైంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎంజాయ్ చేయాలి. జీవితంలో మజాను ఆస్వాదించారు. విజయవాడలో ఆదివారం యువత సీతానగరం వద్ద రైల్వే బ్రిడ్జి, కృష్ణానదిలో పడవలపైనా ఇలా ఫొటోలు దిగుతుండగా సాక్షి క్లిక్‌మనిపించింది. – ఫొటోలు, నడిపూడి కిషోర్,సాక్షి ఫొటోగ్రాఫర్ -
గంటల వ్యవధిలోనే పట్టాల మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైలు పట్టాలు మారుస్తున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు వీలైనంత తక్కువ అంతరాయం కలిగేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైళ్ల రాకపోకలు తక్కువగా ఉండే వేళల్లో నాలుగైదు గంటలు రాకపోకలు నిలిపి ఆధునిక యంత్రాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలిసారి 5 గంటలు రైళ్ల రాకపోకలు నియంత్రించి 4 సెక్షన్ల పరిధిలో పనులు పూర్తి చేశారు. వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని బీనా–కట్నీ రైల్వే సెక్షన్లో 5 గంటలు మెగా బ్లాక్ నిర్వహించి 2,200 మీటర్ల నిడివి గల మార్గాన్ని బీసీఎం యంత్రాల సాయంతో మరమ్మతు చేశారు. సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్ ట్యాపింగ్ కూడా నిర్వహించారు. 410 మీటర్ల దూరంలో స్లీపర్లను మార్చడంతోపాటు 2.8 కిలోమీటర్ల మేర కొత్త రైలు పట్టాలు బిగించారు. ఇదే తరహాలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా మెగా బ్లాక్‌కు వేళలు గుర్తించి వేగంగా పనులు పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. -
రైలు పట్టాలకు డ్రోన్ల రక్షణ!
రైల్వే ట్రాక్‌ల భద్రత, సంరక్షణకు ఇకపై లైన్మెన్లు రేయింబవళ్లు కష్టపడాల్సిన పనిలేదు. లైన్మెన్లకు ఊరటనిచ్చే ఓ సరికొత్త విధాన రూపకల్పన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఐఐటీ రూర్కీ విద్యార్థులకు అప్పజెప్పింది. రైల్వే ట్రాక్‌ని అనునిత్యం పర్యవేక్షించే డ్రోన్ల తయారీతో ఐఐటీ రూర్కీ ఈ విధానానికి రూపకల్పన చేయబోతోంది. టెలికం ఇండస్ట్రీ, రైల్వే ప్రోత్సాహంతో ఐఐటీ రూర్కీ తయారు చేసిన రైల్వే ట్రాక్‌ని పర్యవేక్షించే డ్రోన్లను ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పరీక్షించారు. త్వరలోనే రైల్వేలో ప్రవేశ పెట్టబోయే ఈ డ్రోన్లపై పేటెంట్ కోసం ఐఐటీ రూర్కీ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ట్రాక్ పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగపడే ఈ డ్రోన్లను భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆపదలో ఉన్న వారిని గుర్తించి, రక్షించేందుకు ఉపయోగించే వీలుందంటున్నారు నిపుణులు. సమర్థవంతమైన రైల్వేల నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనలో భాగంగా ఈ డ్రోన్లను తయారు చేసి త్వరలోనే ప్రవేశ పెట్టనున్నామని ఇండియన్ రైల్వే అధికార ప్రతినిధి ఆర్డీ బాజ్‌పేయ్ వెల్లడించారు. ఇప్పటికే జబల్పూర్, భోపాల్, కోటా డివిజన్లలో రైల్వే ట్రాక్ పర్యవేక్షణకు వీటిని ఉపయోగించినట్టు తెలిపారు. 2017–18లో రైళ్లు 54 సార్లు పట్టాలు తప్పాయి. గతేడాది 78 సార్లు, 2010–11లో 141 పర్యాయాలు రెళ్లు పట్టాలు తప్పాయి. 2016–17లో రైల్వే ప్రమాదాల్లో గాయపడిన వారూ, మరణించిన వారూ 607 మంది. గతేడాది రైలు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య 254కి తగ్గింది. ట్రాక్‌ల వీడియో దృశ్యాలూ, ఫొటోలను తీసే డ్రోన్ల ద్వారా పర్యవేక్షించే వీలుంటుంది కనుక రైలు ప్రమాదాలను భారీగా తగ్గించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
గమ్యం చేరని ప్రయాణం
బిట్రగుంట: రైల్వే అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల అవగాహనా లోపం వెరసి రైలు పట్టాలు తర చూ రక్తసిక్తమవుతున్నాయి. ప్రతి ఏటా ఆం దోళన కలిగించే స్థాయిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లలో విపరీతమైన రద్దీ కారణంగా ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ, కదులుతున్న రైల్లోంచి ది గాలని ప్రయత్నిస్తూ, వేగంగా వెళ్తున్న రైలును చివరి క్షణంలో అందుకోవాలని ప్రయత్నిస్తూ ప్ర మాదవశాత్తు జారిపడి రైలు చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇంకొందరు దూరం తగ్గించేందుకు రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఒక్కరోజే నెల్లూరు–కావలి స్టేషన్ల మధ్య వేర్వేరు ప్రమాదాల్లో రైలు పట్టాలపై నలుగురు మృతి చెందటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోం ది. ప్రయాణికుల భద్రతపై అవగాహన కలిగించాల్సిన రైల్వే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా నమోదవుతుంది. ఆచూకీ దొరకడం కష్టమే రైలు పట్టాలపై విగత జీవులుగా మారుతున్న వారిలో గుర్తుతెలియని మృతదేహాలే అధికం. ఎక్కడి నుంచి ఎక్కడికో రైల్లో ప్రయాణిస్తూ మధ్యలో ప్రమాదవశాత్తు జారిపడుతుండటంతో వీరి వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యంకావడం లేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్నా సాధ్యం కావడం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారుతుంది. దీంతో సగం మంది వివరాలు కూడా పోలీసులు కనిపెట్ట లేకపోతున్నారు. మరో వైపు తమవారు ఏమైపోయారో తెలియక మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఏళ్ల తరబడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలకు ఇవి కారణాలు అధిక శాతం మంది ప్రయాణికులు అవగాహనా లోపం కారణంగానే ప్రమాదాల బారిన పడుతున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తూ నిద్రమత్తులో జారిపడటం, పరుగెడుతున్న రైలును అందుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెల్ఫోన్లో మాట్లాడు తూ, ఇయర్ ఫోన్స్‌లో పాటలు వింటూ పట్టాలు దాటే వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నా రు. రైళ్లలో జనరల్ బోగీలు పెంచడం, ఆటోమేటిక్ లాక్ సౌకర్యం ఉండే తలుపులు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉన్నా రైల్వేశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఫుట్‌బోర్డు ప్రయాణాలపై అవగాహన కూడా కలిగించడం లేదు. -
డెత్‌ట్రాక్స్!
రైలు పట్టాలు ‘డెత్ ట్రాక్స్’గా మారుతున్నాయి. నిర్లక్ష్యంగా..తెలిసీ తెలియక పట్టాలు దాటుతూ, సెల్ఫీలు దిగుతూ, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఏటా వందలాది మందిమృత్యువాతపడుతున్నారు. నగరంలో సుమారు 48 కిలోమీటర్ల మేర ఉన్న ఎంఎంటీఎస్ మార్గాలు ప్రతినిత్యం మరణమృదంగం మోగిస్తున్నాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పోలీస్ పరిధిలోనే ఏటా వెయ్యి మందికి పైగా అసువులు బాస్తున్నారు. కాచిగూడ–మలక్‌పేట మార్గంలో గతేడాది 34 మంది, సికింద్రాబాద్– జేమ్స్ స్ట్రీట్ మార్గాల్లో 20 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే పోలీస్ విభాగం సిటీ పరిధిలో మొత్తం 334 ప్రమాద ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వేకు ఒక నివేదిక సమర్పించింది. కానీ ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాక్షి, సిటీబ్యూరో: రైల్వే పట్టాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఏటా వందలాది మంది పట్టాలు దాటుతూ మృత్యువాత పడుతున్నారు. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు మరో గత్యంతరం లేక పట్టాలు దాటుతూ ప్రమాదం బారిన పడేవాళ్లు కొందరైతే, వేగంగా దూసుకొచ్చే రైళ్లను గమనించకుండా, అవగాహనా రాహిత్యంతో పట్టాలు దాటుతూ, పట్టాల పక్కన నించొని సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు మరి కొందరు. మరోవైపు అనేక కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్లు కూడా ట్రైన్ కింద పడి చనిపోయేందుకు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 48 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ మార్గాలు ప్రతి నిత్యం మరణ మృదంగం మోగిస్తున్నాయి. పట్టాల నిర్వహణకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, కనీసం హెచ్చరిక సూచీలు కూడా లేకపోవడం వల్ల ఒక్క సికింద్రాబాద్ రైల్వే పోలీసు పరిధిలోనే ఏటా 1000 మందికి పైగా చనిపోతున్నారు. రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలని, అవసరమైన చోట్ల కాపలాతో కూడిన లెవెల్ క్రాసింగ్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ...ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ప్రతి రోజు సగటున కనీసం ఇద్దరు పట్టాలపై ప్రాణాలు వదులుతున్నారు. బలి పట్టాలు.... ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి–సికింద్రాబాద్ వరకు మొత్తం 48 కిలోమీటర్ల మార్గాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు తీస్తాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కనీసం ప్రతి అరగంటకు, 45 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఫలక్‌నుమా నుంచి మలక్‌పేట్ వరకు వందలాది కాలనీలు, చిన్న చిన్న బస్తీలు, మురికివాడలను ఆశ్రయించుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. ఫలక్‌నుమా, జంగమ్మెట్, కందికల్‌గేట్, ఉప్పుగూడ, దానయ్యనగర్, అశోక్‌నగర్, శివాజీనగర్, పటేల్‌నగర్, డబీర్‌పురా,ఆజంపురా, యాఖూత్పురా, ఎస్సార్టీ కాలనీ, చంద్రానగర్, చంచల్‌గూడ, ఫరత్నగర్, తదితర వందలాది నివాసప్రాంతాలన్నీ రైల్వే పట్టాలకు రెండువైపులా ఉన్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు ఏ అవసరం కోసమైనా ప్రజలు ఇరువైపులా పట్టాలు దాటక తప్పడం లేదు. కిరాణాషాపులు, స్కూళ్లు, ఉద్యోగ, వ్యాపారాలు తదితర అవసరాల కోసం పట్టాలు దాటుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కాలకృత్యాల కోసం కూడా జనం పట్టాలపైకి వచ్చేస్తున్నారు. ఈ కాలనీల్లో చాలా వరకు పట్టాలు దాటాల్సిన అనివార్యత ఉంది. మరోవైపు అవగాహనా రాహిత్యంతో పట్టాలపైకి ఎక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. మొత్తంగా ఒక్క కాచిగూడ–మలక్‌పేట్ మార్గంలోనే గత సంవత్సరం అత్యధికంగా 34 మంది మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసు అధికారులు గుర్తించిన మరో ప్రమాదభరితమైన మార్గం సికింద్రాబాద్–జేమ్స్‌స్ట్రీట్. ఈ మార్గంలో కూడా రెండువైపులా వందలాది కాలనీలు రాకపోకలు సాగిస్తాయి. గత సంవత్సరం 20 మంది ఈ ట్రాక్‌లో చనిపోయారు. ప్రాణాలు తీస్తున్న సెల్ఫీ .... పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ పక్కన నించొని సెల్ఫీ తీసుకోవాలనే కోరిక కూడా ప్రాణాలు హరించివేస్తుంది. ఇందుకు మౌలాలి, బేగంపేట్, భరత్‌నగర్, హైటెక్‌సిటీ, బోరబండ వంటి ప్రాంతాలు వేదికగాలు మారాయి. ఇటీవల శివ అనే ఓ కుర్రవాడు సెల్ఫీ దిగుతూ క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి గుర్తుండే ఉంటుంది. గతేడాది గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు సంపత్‌కుమార్, బబ్లూ, అనిల్‌లు మౌలాలీ వద్ద ఫొటో దిగుతుండగా ట్రైన్ ఢీకొని సంపత్ అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బోరబండ–భరత్‌నగర్ మధ్య గతేడాది 18 మంది చనిపోగా, మౌలాలీ, హైటెక్‌సిటీ, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో సగటున 3 నుంచి 5 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రక్షణ గోడలు లేకపోవడమే కారణం భారతీయ రైల్వే చట్టంలోని 147వ యాక్ట్ ప్రకారం రైల్వే పట్టాలపై నుంచి దాటుతూ పట్టుబడే వారిపై రూ.500 వరకు జరిమానా విధించి వదిలేస్తున్న దక్షిణమధ్య రైల్వే పట్టాలు ,రైల్వే స్థలాల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 2005లోనే మొత్తం ఎంఎంటీఎస్ మార్గాలకు రక్షణ గోడలు కట్టించాలని, అసవరమైన చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే ప్రజలు ఎక్కువగా పట్టాలు దాటే ఏరియాలను గుర్తించి ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, లెవల్ క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రమాదాల బారిన పడి చనిపోయే మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.8 లక్షల చొప్పున పరిహారం అందజేస్తోంది. ఏటా వందలా మంది మృతుల కుటుంబాలకు అందజేసే కోట్లాది రూపాయల పరిహారంలో కనీసం పదో వంతు ఖర్చు చేసినా శాశ్వతంగా రక్షణ గోడలు నిర్మించడంతో పాటు అన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ దక్షిణమధ్య రైల్వే నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసు విభాగం మొత్తం 334 ప్రమాద ఏరియాలను గుర్తించి దక్షిణమధ్య రైల్వేకు గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక నివేదకను కూడా అందజేసింది. ఆ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై ఒక సారి సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏ విధమైన కార్యాచరణ మాత్రం నిర్ణయించకపోవడం గమనార్హం. -
‘చెత్త’ గోడుకు ‘గోడ’ విరుగుడు
సాక్షి, హైదరాబాద్ : జనావాసాలకు చేరువగా ఉండే రైలు పట్టాలు చెత్తాచెదారంతో నిండి ఉండటం కనిపిస్తూనే ఉంటుంది. ట్రాక్‌కు చేరువగా ఉండే వారు ఇళ్లల్లోని చెత్తను పట్టాలపై వేస్తుండటంతో పెద్దమొత్తంలో చెత్త పోగై పట్టాలు అసహ్యంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అంటూ పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. పట్టాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్న రైల్వే బోర్డు.. ‘గోడ’పరిష్కారాన్ని కనుగొంది. జనావాసాలు ఉన్న చోట పట్టాలకు రెండువైపులా కాంక్రీట్ గోడలు నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే జోనల్ రైల్వే అధికారుల సూచనలు బోర్డు స్వీకరించగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులూ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అడ్డుగోడలే పరిష్కారమని.. చాలా చోట్ల పట్టాలను ఆనుకుని పేదలు తాత్కాలిక ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల మురికివాడలున్నాయి. సాధారణ కాలనీల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. మురికివాడలపై అంతగా దృష్టి లేదు. దీంతో ఇళ్లల్లోని చెత్తను రైల్వే పట్టాల వెంట స్థానికులు డంప్ చేస్తున్నారు. వీటిల్లోని ప్లాస్టిక్ సంచులు గాలికి కొట్టుకొచ్చి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నాయని సిబ్బంది ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సమస్య కన్నా కూడా రైల్వే స్థలాలు అత్యంత అసహ్యంగా కనిపిస్తుండటమే పెద్ద సమస్యగా మారింది. స్థానికుల్లో అవగాహన కోసం గతంలో అనేక సార్లు రైల్వే శాఖ యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అడ్డుగోడలు నిర్మించడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించారు. తొలుత ఇనుప మెష్‌లు.. తొలుత ఇనుప మెష్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దాన్ని చోరీ చేసే అవకాశాలుండటంతో విరమించుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో కాంక్రీట్ గోడ నిర్మించాలనుకుంటున్నారు. కానీ.. అవసరమైన నిధులు విడుదల చేయక ఎన్నో రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న తరుణంలో గోడ కోసం భారీగా వ్యయం ఏంటని విమర్శలొస్తున్నాయి. అయితే స్వచ్ఛభారత్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తున్నందున గోడ నిర్మాణానికే రైల్వే శాఖ మొగ్గు చూపుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ‘ట్రాక్ పొడవునా గోడ ఉండదు. ఇళ్లు చేరువగా ఉన్న చోటే నిర్మిస్తారు. ఇది భారీ వ్యయం కాకపోవచ్చు’అని ఓ రైల్వే అధికారి అన్నారు. నిర్మించినా సాధ్యమా?.. గోడ నిర్మించినా సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కవర్లలో చెత్త మూటగట్టి గోడపై నుంచి ట్రాక్ వైపు గిరాటేసే అవకాశం ఉందని వాదన. అయితే గోడ ఎత్తుగా ఉండనున్నందున అన్ని చోట్లా చెత్త కవర్లు ఎత్తేసే అవకాశం ఉండదని, సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ పరిధిలోని ‘ది రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’గోడ నిర్మాణ నమూనాలూ సిద్ధం చేసిందని, దీనికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపిందని చెబుతున్నారు. -
ఎందుకో.. ఏమిటో!
వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. ఇద్దరు చాలా సేపు వాదులాడుకున్నారు. అనంతరం రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. పిఠాపురం టౌన్: స్థానిక గోర్స రైల్వే గేటు సమీపంలోని విజయవాడ వైపు వెళ్లే రైలు పట్టాలపై సోమవారం తెల్లవారుజామున ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతుడు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన ఇందిన సూరిబాబు(30) అని రైల్వే పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం వద్ద దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించినట్టు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 26 ఏళ్లు ఉంటాయని, మెడలో నల్లపూసలున్నాయని, వివాహితురాలిగా భావిస్తున్నామని, ఇంకా ఆమె వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. వీరిద్దరూ భార్యభర్తలు మాత్రం కాదన్నారు. మృతుడు సూరబాబుకి పెళ్లయ్యిందని ఇద్దరు పిల్లలున్నట్టు బంధువులు తెలిపారని చెప్పారు. సూరిబాబు కుటుంబసభ్యులతో హైదరాబాదులో ఉంటున్నాడని అతడి భార్య అక్కడ వంటిమనిషిగా పనిచేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఆదివారం సూరిబాబు ఏడిదలోని బంధువులకు ఫోన్ చేసి తాను పిఠాపురంలో ఉన్నానని ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టుగా చెప్పినట్టు తెలిపారు. సంఘటనా స్థలం వద్ద మృతులిద్దరూ వాదులాడుకోవడం చూశానని ప్రత్యక్షసాక్షి తెలిపాడు. ప్రమాద సంఘటనను పరిశీలిస్తే సూరిబాబు ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలకు అడ్డుగా పడుకుని ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. వివాహిత మహిళ మృతదేహం మాత్రం రైలుపట్టాలకు ఓ వైపున పడి ఉంది. సామర్లకోట రైల్వే పోలీసులు మృతదేహాలను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతురాలి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు. -
వణికిస్తున్న రైలు ప్రయాణం
గుంతకల్లు: శీతాకాలం అంటే రైల్వే ప్రయాణికులే కాదు.. ఆ శాఖ అధికారులను సైతం హడలెత్తిపోతున్నారు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, తగినంత ఉష్ణోగ్రత లేకపోవడం వంటి కారణాతో రైలు కమ్మీలు విరిగిపోవడం, వెల్డింగు జాయింట్లు ఊడిపోవడం వంటి ఘటనలతో రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులే కాకుండా ఆ శాఖ అధికారులు కూడా వణికిపోతున్నారు. ముఖ్యంగా నల్లరేగడి, చెరువుల సమీపంలోని ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటోంది. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. సిబ్బంది కొరతతో ఇబ్బంది గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కి.మీల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఐదేళ్లలో వేలాది మంది ఉద్యోగ విరమణ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం అంతంత మాత్రమే. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 6031 పోస్టులు ఉండగా, కేవలం డివిజన్ వ్యాప్తంగా మొత్తం 4783 మంది మాత్రమే పని చేస్తున్నారు. మొత్తం మీద 1248 పోస్టులు ఖాళీ ఉన్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. అసలే సిబ్బంది కొరత, దీనికి తోడు ఇంజనీరింగ్ విభాగంలో కొందరు సిబ్బంది గ్యాంగ్‌ల్లో పని చేయడం చేతకాక అధికారుల నివాస గృహాల్లో ఇంటి పనులు చేస్తూ సర్వీస్‌ను కొనసాగిస్తున్నారు. దురదృష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సీనియర్ పర్యవేక్షకులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 ఘటనలు నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 6 వరకు గుంతకల్లు రైల్వే డివిజన్ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో రైలు పట్టాలు విరిగినట్లు అధికారులు వెల్లడించారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహా డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. లోకో రన్నింగ్ సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్త వహించినా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం తథ్యం. రైలు కమ్మీలు విరగడం, వెల్డింగ్ ఊడిపోవడం వల్ల జరిగిన ప్రమాదాలు మచ్చుకు కొన్ని... ∙నవంబర్ 24న గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని 4వ నంబర్ ప్లాట్ఫారంలో రైలు కమ్మీల వెల్డింగ్ ఊడిపోయింది. లోకో పైలెట్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ∙ఈ నెల 4న రామరాజుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగి ఉండటాన్ని కీమెన్ రాజు గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కేకే ఎక్స్‌ప్రెస్, ధర్మవరం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. -
కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్ పట్టాలు..
లూయిస్‌బెర్జర్ ఇంజినీరింగ్,ఆర్కిటెక్చర్ రంగంలో నగర మెట్రో ప్రాజెక్టుకు సహకారం అందించింది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏఈకామ్ సాంకేతిక,యాజమాన్య సేవలు అందిస్తోంది. పర్యావరణ,ఇంధనం,మంచినీరు,మౌలిక వసతుల విషయంలో మెట్రో ప్రాజెక్టుకు తగిన సలహాలు అందిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ పన్నులు, సేవలు, సలహాలు అందిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టులో కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తున్నందుకు వచ్చే కార్భన్ క్రెడిట్స్‌ను ఈ సంస్థ లెక్కగడుతుంది. హాల్క్రో ఈ సంస్థ మెట్రో ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నిర్వహణ అంశాల్లో సహాయ సహకారాలు అందించింది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: కొరియా కోచ్‌లు..శ్యామ్‌సంగ్ హంగులు...ఫ్రాన్స్ పట్టాలు..నగర మెట్రో ప్రాజెక్టుకు ఇలా విదేశీ హంగులు అద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో ప్రాజెక్టులో ప్రతీది విశేషమే. పలు విదేశాల నుంచి వచ్చిన వివిధ విడిభాగాలతో నగర మెట్రో ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంద మెట్రో ప్రాజెక్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరవాత మన మెట్రో ప్రాజెక్టుకు డిజైన్లు సిద్ధం చేసిన విషయం విదితమే. మెట్రో నిర్మాణంలో పాలుపంచుకున్న విదేశీ కంపెనీలు...మన మెట్రోకు అద్దిన విదేశీ సొబగులిలా ఉన్నాయి. కొరియా కోచ్‌లు: దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. ఒక్కో బోగీ ఖరీదు రూ.10 కోట్లు. మొత్తం 57 రైళ్లకు 171 భోగీలను రూ.1800 కోట్ల ఖర్చుతో స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం లోహ మిశ్రమాలతో తయారుచేశారు. ఫ్రాన్స్ పట్టాలు : ఆకాశమార్గం (ఎలివేటెడ్) పట్టాలను ఫ్రాన్స్‌కు చెందిన రైల్స్, టాటా స్టీల్(ప్రాన్స్) సంస్థ నగర మెట్రో ప్రాజెక్టుకు సరఫరా చేసింది. సముద్ర మార్గం గుండా మొదట ముంబైకు, అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఉప్పల్, మియాపూర్ డిపోకు చేర్చి ఆ తరవాత పట్టాలు పరిచారు. మొత్తం నగర మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్ నుంచి 22,500 మెట్రిక్ టన్నుల పట్టాలను దిగుమతి చేసుకొని 171 కి.మీ మార్గంలో పట్టాలు పరచడం విశేషం. శ్యామ్‌సంగ్ డేటా సిస్టమ్స్: కొరియాకు చెందిన ఈ సంస్థ మెట్రో రైలు స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన డిజైన్, విడిభాగాల తయారీ, సరఫరా, పరీక్షలను సైతం ఇదే సంస్థ నిర్వహించనుంది. పార్సన్స్ బ్రింకర్‌హాఫ్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందినదీ సంస్థ ..మౌలిక వసతుల కల్పన రంగంలోని భారీ ప్రాజెక్టులకు ఈ సంస్థ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మెట్రో ప్రాజెక్టులో సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత ఇంజినీరింగ్ డిజైన్లను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ సంస్థ 1885 నుంచి ఈ రంగంలో నిమగ్నమైంది. ఐదు ఖండాలలో ఈ సంస్థ సేవలందిస్తోంది. కియోలిస్: ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రజారవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లోని పలు ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టు నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. రైళ్లు, స్టేషన్లు, డిపోలు, సిబ్బంది నియామకం నిర్వహణ విధులు ఈ సంస్థనే 15 ఏళ్లపాటు నిర్వహించనుంది. ఓటీఐఎస్: నగరంలోని ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన 260 లిఫ్టులను, 410 ఎస్కలేటర్లను ఈ సంస్థ సరఫరా చేసింది. చైనాకు చెందిన ఈ కంపెనీ నగర మెట్రో ప్రాజెక్టులో సుమారు రూ.400 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది. ఆర్థిక సహకారం అందిస్తున్న బ్యాంకులు నగర మెట్రో ప్రాజెక్టుకు ఎల్అండ్టీ సంస్థ రూ.3500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో రూ.11,500 కోట్లను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రబ్యాంక్, దేనాబ్యాంక్‌ల నుంచి రుణంగా సేకరిస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఖర్చు చేసింది. -
అడుగుల దూరంలో ఆగిన మృత్యువు
♦ భార్యతో గొడవపడి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి ♦ గుర్తించి రైలు ఆపిన లోకో పెలైట్ అనంతపురం: అర నిమిషం గడిచి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్ అతని ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్నిచ్చాడు. దీంతో మృత్యువు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ( పీటీసీ) సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద చోటు చేసుకుంది. కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ముత్యాలు, జయమ్మ భార్యాభర్తలు. ముత్యాలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యా భర్తల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ముత్యాలు ఆత్మహత్యకు యత్నించాడు.ఈ క్రమంలో అతను అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన గుంతకల్లు- హిందూపురం ప్యాసింజర్ రైలుకింద పడాలనుకున్నాడు.లోకోపెలైట్ దూరం నుంచే గుర్తించి బ్రేక్ వేశాడు. సుమారు పదడుగుల దూరంలోకి వచ్చి రైలు ఆగిపోయింది. లోకో పెలైట్ ముత్యాలును లేపి పక్కకు తప్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు. -
కొనసాగుతున్న ట్రాక్ మరమ్మతు
తక్కువ వేగంతో వెళ్తున్న రైళ్లు కేసముద్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని జమలాపురం వద్ద గురువారం రైలు పట్టాలపై ఆరు చోట్ల మెత్తబడి గుంతలుగా ఏర్పడిన విష యం తెలిసిందే. సాయంత్రం వరకు ఆ పట్టాలను కట్‌చేసి, మరోపట్టాను బిగించి రైళ్లను నె మ్మదిగా నడిపించారు. కాగా, బిగించిన పట్టాల మధ్య వెల్డింగ్ పనులను చేపట్టకపోవడంతో శుక్రవారం డౌన్‌లైన్‌లో వెళ్లే రైళ్ల వేగాన్ని తగ్గించి, 30 కిలోమీటర్ల స్పీడుతోనే పంపించారు. శని వారం నుంచి యథావిధిగా తగిన స్పీడుతో(100-120 కిలో మీటర్లు) నడిపించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఇలా పట్టాలు మెత్తబడి గుంతలుగా ఏర్పడటం, ఇదే తొలిసారని రైల్వే సిబ్బంది తెలిపారు. గూడ్సురైలు వెనక చక్రాలు బ్రేకులు పట్టేయడం, ముందు చక్రాలు తిరగడం మూ లంగా, అదే విధంగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇలా పట్టాలు మెత్తబడి, గుంతలు పడినట్లుగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. -
రైలు పట్టాలపై రెండు మృతదేహాలు
కాచిగూడ: గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో లలితాబాగ్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి (35) మృతదేహాన్ని శనివారం గుర్తించారు. అలాగే, ఉందానగర్ - బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా మరో యువకుడి మృతదేహాన్ని గుర్తించగా... పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు పట్టాలపై ఇనుప గోలీలు
ఇంజన్ చక్రాలకు రంధ్రాలు డోర్నకల్: ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై ఇనుప గోలీలు(చర్రాలు) పెట్టిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. గురువారం రాత్రి ముద్దునూరు నుంచి బొగ్గులోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్సు రైలు గార్ల సమీపంలో మున్నేరువాగు బ్రిడ్జి దాటుతుండగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో రైలు డ్రైవర్, రైల్వే గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డోర్నకల్ రైల్వేస్టేషన్‌కు సమాచారం అందించారు. రైలును డోర్నకల్ స్టేషన్లో నిలిపిన అధికారులు.. ఇంజన్ చక్రాలకు రంధ్రాలు పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పెట్రోలింగ్, మహబూబాబాద్ పీడబ్ల్యూఐ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీ చేయగా పట్టాలపై గోలీల లాంటి రెండు ఇనుప వస్తువులు కనిపించారుు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం ఏడీఆర్ఎం(ట్రాఫిక్) పీసీ టాంటతో పాటు పీడబ్ల్యూఐ అధికారులు, జీఆర్పీ సీఐ స్వామి, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పట్టాలపై కూడా రెండు చోట్ల రంధ్రాలు పడటాన్ని గుర్తించారు. ఈ చర్యకు పాల్పడింది ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు జీఆర్పీ ఎస్ఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. -
విరిగిన రైలు పట్టా: తప్పిన ప్రమాదం
నెల్లూరు(మనుబోలు): రైలు పట్టా విరగడాన్ని సకాలంలో లోకో పైలట్(డ్రైవర్) గుర్తించడంతో పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలపరిధిలోని కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని యలమంద కాలువ వద్ద 149-15 కిలోమీటర్‌లోని అప్‌లైన్‌లో వేకువ జామున 4:00ల ప్రాంతంలో రైలుపట్టా విరిగింది. ఆ సమయంలో విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలు నడక శబ్ధంలో తేడాను గుర్తించి రైలును ఆపేశాడు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిదానంగా ఎలాగో దానిని దాటించి రైలు పోనిచ్చాడు. అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది. యుద్ధప్రాతిపదికన పట్టాకు మరమ్మతులు చేశారు. ఈ సమయంలో వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. పట్టా విరిగిన చోట వంతెన కూడా ఉండడంతో ఈ విషయాన్ని డ్రైవర్ సకాలంలో గుర్తించకపోతే పెద్దప్రమాదం జరిగేదని సిబ్బంది తెలిపారు. -
పట్టాలపై గుర్తుతెలియని శవం
మేడ్చల్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది. రైలు వ్యక్తి మీద వెళ్లడంతో.. శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపడింది. చెల్లాచెదురైన శరీర భాగాలను గుర్తించిన స్థానికులు మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ పోలీసులు, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
వెల్దుర్తి: రైలు పట్టాలు దాటుతున్న ఓ మహిళను ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న సంఘటన వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట- శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. మాసాయిపేట గ్రామం ఎస్సీ వాడకు చెందిన బ్యాగరి నాగమ్మ, యాదయ్యలు రైల్వే పట్టాలు దాటుతుండగా సికింద్రాబాద్ నుండి నాందేడ్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రైలు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ తలబాగం రైతు పట్టాల మధ్యలో పడి ఉండగా కాళ్ళు, చేతులు విరిగిపోయి రైలు పట్టాల అవతలి భాగంలో పడిపోయాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని తెలియజేసినట్టు తెలిసింది. -
పట్టాలు తప్పిన దురంతో
ఇద్దరు హైదరాబాదీ మహిళల మృతి, ఏడుగురికి గాయాలు కర్ణాటకలో ప్రమాదానికి గురైన సికింద్రాబాద్-ముంబై రైలు విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం కలబుర్గి(కర్ణాటక): సికింద్రాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన దురంతో రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. కర్ణాటకలోని కలబుర్గి సమీపంలోని మార్టూర్ స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (సోలాపూర్) కె.మధుసూదన్ చెప్పారు. మృతులను హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన పుష్పలత(40), జ్యోతి(28)గా గుర్తించినట్లు తెలిపారు. గాయపడిన వారిని గుల్బర్గాలోని ఆస్పత్రికి తరలించామని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు రైల్వే భద్రత కమిషనర్‌ను ఆదేశించారని, నివేదిక వస్తే ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుస్తుందని రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ చె ప్పారు. ‘దురంతో ప్రమాదం కలచివేసింది. బాధితుల కు తక్షణమే వైద్య, ఇతరత్రా సహాయక సేవలు అందించాలని రైల్ బోర్డు చైర్మన్‌ను ఆదేశించాం’ అని రైల్వే మంత్రి ప్రభు ట్విటర్లో పేర్కొన్నారు. మృతుల కుటుం బాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు ఇస్తామని మిట్టల్ చెప్పారు. 700 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ప్రయాణికులందరినీ వారి గమ్యస్థానాలకు ఉచితంగా పంపాలని ఈశాన్య కర్ణాటక ఆర్టీసీని కోరామని, ఏ ఒక్క ప్రయాణికుడు కూడా నిలిచిపోలేదని మధుసూదన్ చెప్పారు. ప్రమాద స్థలంలో ఒక లైనును పునరుద్ధరించామని, శనివారం అర్ధరాత్రికల్లా మిగతా పనులు పూర్తవుతాయని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా చెప్పారు. దీనిపై రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. -
బండి మీద బండి.. రైలింజనండీ
రైలు పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ ఒక్కసారిగా లారీ పైన చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ రైలింజన్‌ను లారీ ట్రాలీలో రాయిచూర్ వైపు దేవరకద్ర మీదుగా తరలించారు. దీంతో పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ లారీ ట్రాలీపై వెళ్తుండడంతో ఈ దృశ్యాన్ని గ్రామస్తులు, ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా గమనించారు. ఆ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. - దేవరకద్ర రూరల్ -
కాపాడలేదు కానీ, రికార్డు చేశారు!
తిరువనంతపురం: ఓ మహిళ రైలు పట్టాలు దాటుతోంది. దగ్గర్లో రైలొస్తోంది. ఆమె భయంతో సొమ్మసిల్లింది.. దగ్గర్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ఆమెను పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడతారు. కానీ ఆ ఇద్దరు యువకులు మాత్రం జేబుల్లోంచి సెల్ఫోన్లు తీశారు. సొమ్మసిల్లి పడిపోయిన ఆమె పైనుంచి రైలు వెళ్లిన బీభత్సాన్ని ఫోన్లలో రికార్డు చేశారు! మానవత్వం ఉనికిని ప్రశ్నించే ఈ ఉదంతం కేరళలోని కొట్టాయం జిల్లా ముత్తాంబళంలో బుధవారం చోటుచేసుకుంది. లైలా తంగచ్చన్(47) పట్టాలు దాటుతుండగా పరశురాం ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైల్వేగేటు కాపలాదారు రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ఎర్రజెండా ఊపినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి ముందు.. ఆమెకు దగ్గర్లో ఉన్న యువకులు ఆమెను కాపాడకుండా ఫోన్లలో ఆ ఘటనను చిత్రీకరించారు. -
ఎవరు మీరంతా.. ఎందుకొచ్చిండ్రు!
ఉన్నతాధికారులు... రాజకీయ నేతలు రోజూ ఎందుకు తనవద్దకు వస్తున్నారో తెలియదు... తను కుమారుడిని కని నాలుగు రోజులైనా భర్త తన వద్దకు రాలేదు. రెండేళ్ల కూతురు కనిపించడం లేదు. తనకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్న సిబ్బందికి లంచాలివ్వలేక తన భర్త.. రెండేళ్ల కూతురు తనువు చాలించారన్న విషయం ఆమెకు తెలియదు. రోజూ అందరూ వస్తున్నారు.. మాట్లాడి పోతున్నారు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. శనివారం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శకు వచ్చినప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది. ‘‘నా పాపను చూడాలని ఉంది.. నా భర్త నా వద్దకు ఎందుకు రాలేదు.. అసలేం జరిగిందో చెప్పండంటూ’’ నాలుగు రోజుల బాలింత నాగలక్ష్మి బోరున విలపించింది. -మహబూబ్‌నగర్ వైద్యవిభాగం మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: ఆస్పత్రిలో లంచాలు ఇవ్వలేక రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న చెన్నకేశవులు భార్య నాగలక్ష్మి భర్త, ఆమె చిన్నారి కూతురు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నాలుగు రోజుల బాలింత అయిన ఆమె.. తనభర్త చేస్తున్న అఘాయిత్యం తెలియక నాలుగు రోజుల పసిబాబుతో కలిసి జిల్లాకేంద్రాస్పత్రిలో దీనంగా కూర్చొంది. శనివారం పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ మృతుడు చెన్నకేవులు భార్య నాగలక్ష్మిని పరామర్శించడానికి వచ్చారు. రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడి వస్తున్న తరుణంలో ఆమెకు భర్త చేసుకున్న అఘాయిత్యం తెలియక ఏం జరిగింది...మీరంతా ఎందుకు వస్తున్నారు...మా భర్త రెండు రోజులైంది. ఇంకా రాలేదేమీ, మా పాపను చూడాలని ఉందని ఆ బాలింత బోరున విలపించింది. అభం, శుభం ఎరుగని పసిబాబుతో ఆస్పత్రిలో నాలుగు రోజులుగా బాలింత పడుతున్న ఆవేదన ఇంత అంతా కాదు. ఆ అభాగ్యురాలు మనోవేదనతో ఏదో జరుగుతుందేమో అనే అనుమానం తప్ప తన భర్త ఇక ఎప్పటికీ రాలేడని, చిన్నారి పాపను ఇక చూడలేదన్న నిజం ఆమెకింకా తెలియక వారి రాకకోసమే ఎదురు చూస్తోంది. అధికారుల హడావుడితో కాస్త అనుమానం కలిగి ఏమైందని.. ప్రశ్నించడం తప్ప ఇంత పని జరిగి ఉండవచ్చునని ఊహించడం లేదు. ఆస్పత్రి సిబ్బంది లంచావతారానికి అమాయక నిరుపేద కుటుంబం బలైపోవడంతో పాటు నాలుగు రోజుల పసిబాబు, బాలింతను వీధిన పడేశాయి. ఈ అఘాయిత్యంపై అదికారులు స్పందించకపోగా, నాలుగు రోజులుగా ఇంకా విచారణతోనే సరిపెడుతున్నారు. చెన్నకేశవులు కుటుంబాన్ని ఆదుకుంటాం : శ్రీనివాస్‌గౌడ్ ఆస్పత్రి సిబ్బంది లంచావతారానికి ప్రాణాలు తీసుకున్న చెన్నకేశవులు భార్య నాగలక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ శనివారం జిల్లాకేంద్రాస్పత్రిలో పరామర్శించారు. చెన్నకేశవులు భార్యకు 50వేల ఆర్థికసాయం, ఇల్లు, వితంతు పెన్షన్‌ను అందిస్తామన్నారు. పేదలు ఆస్పత్రికి వస్తే రోగుల బంధువులు డబ్బులు ఇవ్వడం లేదని వైద్యం సరిగా చేయడం లేదని, ఇక ఏం జరిగినా డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మజ, జిల్లా ఆస్పత్రి సూపరింంటెండెంట్ శ్యామూల్, ఆర్ఎంఓ రాంబాబునాయక్లకే బాధ్యత వహించాలని హెచ్చరిం చారు. జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే కఠినచర్యలు తప్పవన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించి ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. వైద్యులు, సిబ్బంది, వర్కర్స్ సమన్వయంతో పనిచేస్తే పొరపాట్లు జరగకుండా ఉంటాయని చెప్పారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ గోవిందు వాగ్మోరే, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మజ, జిల్లాకేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామూల్, ఆర్ఎంఓ రాంబాబునాయక్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, వెంకటయ్య తదితరులున్నారు. -
పట్టాలపై దారుణం
తల్లి, ఇద్దరు కూతుళ్లను బలిగొన్న కలహాల కాపురం మహబూబాబాద్/ఖమ్మం అర్బన్ : భర్త వేధింపులు ఆ ఇల్లాలిని కుంగదీశారుు. పన్నెండేళ్ల సంసారంలో సంతోషంగా ఉన్నది తక్కువే. భర్త రోజూ తాగొచ్చి వేధించినా.. ఆమె భరించింది. ఊరునిండా అప్పులుచేసినా కూలో నాలో చేసి తీర్చింది. అరుునా అతడిలో మార్పు రాకపోగా.. రెండు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తుం డడంతో విసిగివేసారింది. పాఠశాల నుంచి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని పుట్టెడు దుఃఖంతో రైలు పట్టాలపైకి చేరుకుంది. పిల్లలతో సహా రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడి కానరాని లోకాలకు చేరింది. మహబూబా బాద్ లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో రైలు పట్టాలు రక్తసిక్తమయ్యూరుు. మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెం, ప్రస్తుతం నివాసముంటున్న టేకులపల్లిలో విషా దాన్ని నింపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట జగ్గవరం కాలనీకి చెందిన తూము నాగమణి, గంగాధరం దంపతుల కుమార్తె శ్రావణి(28)కి అదే జిల్లా బోనకల్ మం డలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఆంజనేయులుతో 12 ఏళ్ల క్రితం వి వాహమైంది. వారికి కుమార్తెలు అమూల్య(11), జీవణి(9) ఉన్నారు. మద్యానికి బానిసైన ఆంజనేయులు భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడు. దీంతో మూడేళ్లుగా ఆమె తన పిల్లలతో కలిసి భర ్తకు దూరంగా ఉంటోంది. మూడు నెలల క్రితమే పెద్దమనుషులు ఎదుట తాను మారానని, తాగు డు మానానని ఒప్పుకుని భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. ప్రస్తుతం వారు ఖమ్మం శివారు టేకులపల్లిలో శ్రీలక్ష్మినగర్ రోడ్డు నంబర్ 4లో నివాసముంటున్నారు. శ్రావణి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. ఆంజనేయులు ఖమ్మం శివారులోని క్వారీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11న తాగొచ్చి ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. రోజూ అలాగే కొడుతుండడంతో ఓపిక నశించిన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయల్దేరింది. ఖమ్మం రోటరీనగర్‌లో ఉంటున్న తన అక్క దగ్గరికి వెళుతున్నట్లు ఇంటి పక్కవారికి చెప్పి తన కుమార్తెలు చదువుతున్న కస్తూర్భా స్కూల్‌కు చేరుకుంది. వారితో పని ఉందని వెం టబెట్టుకుని బయల్దేరింది. అల్లుడు రోజూ కొడు తున్నాడని తెలియడంతో కూతురిని చూసేందుకు నాగమణి శుక్రవారం సాయంత్రం శ్రావణి ఉండే ఇంటికి వెళ్లగా ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన కుమా రుల తో కలిసి వెళ్లి రాత్రి రాత్రి 9 గంటలకు ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారు సమీపంలోని సాగర్‌కాల్వ, పరిసర ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. ఆమె వాడుతున్న సెల్ సిగ్నల్స్ ఆధానంగా పోలీసులు ఆరా తీయగా నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అచూకీ లభించలే దు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక మహబూబాబాద్ వద్ద రైలు కిందపడి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన వార్త టీవీల్లో శనివారం ఉదయం రావడం చూసి ఖమ్మం అర్బ న్ ఎస్సై రుద్రగాని వెంకటనారాయణ వెంటనే మహబూబాబాద్ పోలీసులకు సమాచారమి చ్చారు. అదృశ్యమైన తల్లీ కూతుళ్ల ఫొటోలు పంపారు. వాటిని పరిశీలించిన మానుకోట పోలీసులు మృతులు వారేనని నిర్ధారించారు. దీం తో సమాచారం అందుకున్న మృతుల బంధువు లు మహబూబాబాద్‌కు చేరుకున్నారు. విగతజీవు లుగా పడి ఉన్న కూతురు, మన వరాళ్లను చూ డగానే నాగమణి రోదించిన తీరుచూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యూరు. ఈ కేసును ఖమ్మం అర్బన్‌కు బదిలీ చేశాక విచారణ చేసి చర్య తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
జీవితాలు రైలు పట్టాలపై ఛిద్రం
కడప అర్బన్: నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన వారు క్షణికావేశంతో రైలు పట్టాల మధ్య తమ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను, భార్య పిల్లల ఆశలను ఆవిరిచేస్తున్నారు. జిల్లాలో కడప నుంచి నందలూరు వైపు, కడప నుంచి ఎర్రగుంట్ల వైపు రెండు రైల్వే పోలీసుస్టేషన్లు, ఒక ఓపీ స్టేషన్ పరిధిల్లో 2012 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 236 మంది రైలు పట్టాలపై అసువులు బాసారు. * ఈ సంఘటనల్లో ఈ ఏడాది ప్రధానంగా కొన్ని సంచలనాలు కలిగించాయి. వాటి వివరాలిలా ఉన్నాయి. * 2012 సంవత్సరంలో 112 కేసులు నమోదు అయ్యూరుు. వాటిలో 99 మరణాల కేసులు, 13 కేసులు ఇతర నేరాలకు సంబంధించినవి. * 2013లో 104 కేసులు నమోదయ్యూరుు. వీటిలో 96 కేసులు మృత్యువాత కేసులే. 80 మంది వివరాలు తెలిశాయి. మిగిలిన 16 మంది ఎవరనేది ఇప్పటికీ తెలియరాలేదు. వీటిలో ఎనిమిది ఇతర కేసులు. * 2014లో ఆగస్టు వరకు 54 కేసులు నమోదయ్యూరుు. వీటిలో 41 కేసులు మృత్యువాత పడిన కేసులే. ఈ కేసుల్లో 42 మంది మృతి చెందారు. మిగిలిన 13 కేసులు ఇతర నేరాలకు సంబంధించినవి. * 2014లో ప్రధానంగా సంచలనం కలిగించిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. జనవరి 27వ తేదీన చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన లక్ష్మిరెడ్డి భార్య సావిత్రిని హత్య చేసి రాయచోటి రైల్వేగేటు సమీపంలో మూటగట్టి పడేశారు. హత్యను కప్పిపుచ్చేందుకు కొందరు నిందితులు ప్రయత్నించారు. ఈ సంఘటనలో బంధువుల ఫిర్యాదు మేరకు ఆమెను హత్య చేశారని తేలడంతో రైల్వే పోలీసులు కేసును తాలూకా పోలీసులకు బదిలీ చేశారు. ఆ సంఘటనలో నిందితులను కూడా అరెస్టు చేసి కటకటాలపాలు చేశారు. * ఈ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు రాయచోటి రైల్వేగేటు సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. * ఈ సంవత్సరం మొదట్లో ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో మాజీ సైనికోద్యోగి మారుతీ (40) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను కమలాపురం ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. * ఆగస్టు 4వ తేదీన కడప నగరానికి చెందిన ఇద్దరు ఇంటర్మీయట్ విద్యార్థులు స్నేహితులుగా ఉండి రైలు పట్టాల మధ్య తమ జీవితాలను బలి తీసుకున్నారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన లోకేష్‌నాయక్, మృత్యుంజయకుంటకు చెందిన శివతేజరెడ్డిలు ఆగస్టు 3వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమో, ఇతరత్రా కారణాలతోనో ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోకేష్‌నాయక్ తన మరణానికి కొన్ని రోజుల ముందు ‘ఐ వాంట్ టు డై’ అని నోటు పుస్తకంలో రాసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి మరణం వెనుక అసలు కారణాలను ఇంకా రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. * అలాగే గత ఏడాది చివరిలో మాధవరానికి చెందిన జె.రవి అనే యువకుడు ఓబులవారిపల్లె ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. డబ్బును పంచేందుకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకు వస్తుండగా చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో దోపిడీ జరిగింది. తర్వాత ఒంటిమిట్ట సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. * బద్వేలు సుమిత్రానగర్‌కు చెందిన కొత్తకోట రమేష్‌బాబు అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన భాకరాపేట సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తాను చనిపోతున్నానని, ఎవరికీ సంబంధం లేదని, తల్లిదండ్రులు బాధపడవద్దని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. * కడప నబీకోటలో నివసిస్తూ ఒంటిమిట్ట హౌసింగ్ ఏఈగా పనిచేసి అనారోగ్యంతో సంవత్సరకాలంగా ఇంటి వద్దనే ఉన్న సింగారెడ్డి రామిరెడ్డి (51) ఆగస్టు లో రాయచోటి రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. ఇలా క్షణికావేశానికి లోనై రైలు పట్టాల మధ్య తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. -
రైలు పట్టాల పై వ్యక్తి మృతి
-
పడిగాపులే..
నెల్లూరు (నవాబుపేట), న్యూస్‌లైన్ : మనుబోలు రైల్వేస్టేషన్లో క్రాసింగ్ వద్ద గురువారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నెల్లూరు మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నైకి వెళ్లే మెమో యూనిట్‌ను రద్దు చేశారు. దీంతో నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లోనే మెమో రైలు నిలిపివేశారు. గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. అలాగే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తిరుమల, శేషాద్రి, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. నెల్లూరు నుంచి బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ వేదాయపాళెంలో రెండున్నర గంటలకు పైగా నిలిచి పోయింది. 8.50 గంటలకు లైన్ క్లియర్ చేసి రైలుకు పచ్చజెండా ఊపారు. తిరువనంతపురం వెళ్లే త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై మధ్య నడిచే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, అసన్సోల్-చెన్నై మ ధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్, చెన్నై-హైదరాబాద్ మధ్యనడవాల్సిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, ఎగ్మోర్-కాకినాడ మధ్య నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్, కొల్లం, కేరళా ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు ప్రధాన రైల్వేస్టేషన్లో రైళ్ల కోసం వేచి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్ల రద్దు, ఆలస్యం తదితర వాటిపై సమాచారం తెలిపేందుకు రైల్వే స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్ల రద్దుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.