ఎవరు మీరంతా.. ఎందుకొచ్చిండ్రు!
ఉన్నతాధికారులు... రాజకీయ నేతలు రోజూ ఎందుకు తనవద్దకు వస్తున్నారో తెలియదు... తను కుమారుడిని కని నాలుగు రోజులైనా భర్త తన వద్దకు రాలేదు. రెండేళ్ల కూతురు కనిపించడం లేదు. తనకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్న సిబ్బందికి లంచాలివ్వలేక తన భర్త.. రెండేళ్ల కూతురు తనువు చాలించారన్న విషయం ఆమెకు తెలియదు.
రోజూ అందరూ వస్తున్నారు.. మాట్లాడి పోతున్నారు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. శనివారం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శకు వచ్చినప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది. ‘‘నా పాపను చూడాలని ఉంది.. నా భర్త నా వద్దకు ఎందుకు రాలేదు.. అసలేం జరిగిందో చెప్పండంటూ’’ నాలుగు రోజుల బాలింత నాగలక్ష్మి బోరున విలపించింది.
-మహబూబ్‌నగర్ వైద్యవిభాగం
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: ఆస్పత్రిలో లంచాలు ఇవ్వలేక రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న చెన్నకేశవులు భార్య నాగలక్ష్మి భర్త, ఆమె చిన్నారి కూతురు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నాలుగు రోజుల బాలింత అయిన ఆమె.. తనభర్త చేస్తున్న అఘాయిత్యం తెలియక నాలుగు రోజుల పసిబాబుతో కలిసి జిల్లాకేంద్రాస్పత్రిలో దీనంగా కూర్చొంది. శనివారం పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ మృతుడు చెన్నకేవులు భార్య నాగలక్ష్మిని పరామర్శించడానికి వచ్చారు.
రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడి వస్తున్న తరుణంలో ఆమెకు భర్త చేసుకున్న అఘాయిత్యం తెలియక ఏం జరిగింది...మీరంతా ఎందుకు వస్తున్నారు...మా భర్త రెండు రోజులైంది. ఇంకా రాలేదేమీ, మా పాపను చూడాలని ఉందని ఆ బాలింత బోరున విలపించింది. అభం, శుభం ఎరుగని పసిబాబుతో ఆస్పత్రిలో నాలుగు రోజులుగా బాలింత పడుతున్న ఆవేదన ఇంత అంతా కాదు.
ఆ అభాగ్యురాలు మనోవేదనతో ఏదో జరుగుతుందేమో అనే అనుమానం తప్ప తన భర్త ఇక ఎప్పటికీ రాలేడని, చిన్నారి పాపను ఇక చూడలేదన్న నిజం ఆమెకింకా తెలియక వారి రాకకోసమే ఎదురు చూస్తోంది. అధికారుల హడావుడితో కాస్త అనుమానం కలిగి ఏమైందని.. ప్రశ్నించడం తప్ప ఇంత పని జరిగి ఉండవచ్చునని ఊహించడం లేదు. ఆస్పత్రి సిబ్బంది లంచావతారానికి అమాయక నిరుపేద కుటుంబం బలైపోవడంతో పాటు నాలుగు రోజుల పసిబాబు, బాలింతను వీధిన పడేశాయి. ఈ అఘాయిత్యంపై అదికారులు స్పందించకపోగా, నాలుగు రోజులుగా ఇంకా విచారణతోనే సరిపెడుతున్నారు.
చెన్నకేశవులు కుటుంబాన్ని ఆదుకుంటాం : శ్రీనివాస్‌గౌడ్
ఆస్పత్రి సిబ్బంది లంచావతారానికి ప్రాణాలు తీసుకున్న చెన్నకేశవులు భార్య నాగలక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ శనివారం జిల్లాకేంద్రాస్పత్రిలో పరామర్శించారు. చెన్నకేశవులు భార్యకు 50వేల ఆర్థికసాయం, ఇల్లు, వితంతు పెన్షన్‌ను అందిస్తామన్నారు. పేదలు ఆస్పత్రికి వస్తే రోగుల బంధువులు డబ్బులు ఇవ్వడం లేదని వైద్యం సరిగా చేయడం లేదని, ఇక ఏం జరిగినా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మజ, జిల్లా ఆస్పత్రి సూపరింంటెండెంట్ శ్యామూల్, ఆర్‌ఎంఓ రాంబాబునాయక్‌లకే బాధ్యత వహించాలని హెచ్చరిం చారు.
జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే కఠినచర్యలు తప్పవన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించి ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. వైద్యులు, సిబ్బంది, వర్కర్స్ సమన్వయంతో పనిచేస్తే పొరపాట్లు జరగకుండా ఉంటాయని చెప్పారు. ఆయన వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోవిందు వాగ్మోరే, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మజ, జిల్లాకేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామూల్, ఆర్‌ఎంఓ రాంబాబునాయక్, టీఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, వెంకటయ్య తదితరులున్నారు.