
అడుగుల దూరంలో ఆగిన మృత్యువు
♦ భార్యతో గొడవపడి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి
♦ గుర్తించి రైలు ఆపిన లోకో పెలైట్
అనంతపురం: అర నిమిషం గడిచి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్ అతని ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్నిచ్చాడు. దీంతో మృత్యువు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ( పీటీసీ) సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద చోటు చేసుకుంది. కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ముత్యాలు, జయమ్మ భార్యాభర్తలు.
ముత్యాలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యా భర్తల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ముత్యాలు ఆత్మహత్యకు యత్నించాడు.ఈ క్రమంలో అతను అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన గుంతకల్లు- హిందూపురం ప్యాసింజర్ రైలుకింద పడాలనుకున్నాడు.లోకోపెలైట్ దూరం నుంచే గుర్తించి బ్రేక్ వేశాడు. సుమారు పదడుగుల దూరంలోకి వచ్చి రైలు ఆగిపోయింది. లోకో పెలైట్ ముత్యాలును లేపి పక్కకు తప్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు.