రైలు పట్టాలు ‘డెత్ ట్రాక్స్’గా మారుతున్నాయి. నిర్లక్ష్యంగా..తెలిసీ తెలియక పట్టాలు దాటుతూ, సెల్ఫీలు దిగుతూ, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఏటా వందలాది మందిమృత్యువాతపడుతున్నారు. నగరంలో సుమారు 48 కిలోమీటర్ల మేర ఉన్న ఎంఎంటీఎస్ మార్గాలు ప్రతినిత్యం మరణమృదంగం మోగిస్తున్నాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పోలీస్ పరిధిలోనే ఏటా వెయ్యి మందికి పైగా అసువులు బాస్తున్నారు. కాచిగూడ–మలక్‌పేట మార్గంలో గతేడాది 34 మంది, సికింద్రాబాద్– జేమ్స్ స్ట్రీట్ మార్గాల్లో 20 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే పోలీస్ విభాగం సిటీ పరిధిలో మొత్తం 334 ప్రమాద ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వేకు ఒక నివేదిక సమర్పించింది. కానీ ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సాక్షి, సిటీబ్యూరో: రైల్వే పట్టాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఏటా వందలాది మంది పట్టాలు దాటుతూ మృత్యువాత పడుతున్నారు. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు మరో గత్యంతరం లేక పట్టాలు దాటుతూ ప్రమాదం బారిన పడేవాళ్లు కొందరైతే, వేగంగా దూసుకొచ్చే రైళ్లను గమనించకుండా, అవగాహనా రాహిత్యంతో పట్టాలు దాటుతూ, పట్టాల పక్కన నించొని సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు మరి కొందరు. మరోవైపు అనేక కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్లు కూడా ట్రైన్ కింద పడి చనిపోయేందుకు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 48 కిలోమీటర్‌ల ఎంఎంటీఎస్ మార్గాలు ప్రతి నిత్యం మరణ మృదంగం మోగిస్తున్నాయి. పట్టాల నిర్వహణకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, కనీసం హెచ్చరిక సూచీలు కూడా లేకపోవడం వల్ల ఒక్క సికింద్రాబాద్ రైల్వే పోలీసు పరిధిలోనే ఏటా 1000 మందికి పైగా చనిపోతున్నారు. రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలని, అవసరమైన చోట్ల కాపలాతో కూడిన లెవెల్ క్రాసింగ్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ...ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ప్రతి రోజు సగటున కనీసం ఇద్దరు పట్టాలపై ప్రాణాలు వదులుతున్నారు.
బలి పట్టాలు....
ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి–సికింద్రాబాద్ వరకు మొత్తం 48 కిలోమీటర్‌ల మార్గాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు తీస్తాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కనీసం ప్రతి అరగంటకు, 45 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఫలక్‌నుమా నుంచి మలక్‌పేట్ వరకు వందలాది కాలనీలు, చిన్న చిన్న బస్తీలు, మురికివాడలను ఆశ్రయించుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. ఫలక్‌నుమా, జంగమ్మెట్, కందికల్‌గేట్, ఉప్పుగూడ, దానయ్యనగర్, అశోక్‌నగర్, శివాజీనగర్, పటేల్‌నగర్, డబీర్‌పురా,ఆజంపురా, యాఖూత్‌పురా, ఎస్సార్టీ కాలనీ, చంద్రానగర్, చంచల్‌గూడ, ఫరత్‌నగర్, తదితర వందలాది నివాసప్రాంతాలన్నీ రైల్వే పట్టాలకు రెండువైపులా ఉన్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు ఏ అవసరం కోసమైనా ప్రజలు ఇరువైపులా పట్టాలు దాటక తప్పడం లేదు.
కిరాణాషాపులు, స్కూళ్లు, ఉద్యోగ, వ్యాపారాలు తదితర అవసరాల కోసం పట్టాలు దాటుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కాలకృత్యాల కోసం కూడా జనం పట్టాలపైకి వచ్చేస్తున్నారు. ఈ కాలనీల్లో చాలా వరకు పట్టాలు దాటాల్సిన అనివార్యత ఉంది. మరోవైపు అవగాహనా రాహిత్యంతో పట్టాలపైకి ఎక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. మొత్తంగా ఒక్క కాచిగూడ–మలక్‌పేట్ మార్గంలోనే గత సంవత్సరం అత్యధికంగా 34 మంది మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసు అధికారులు గుర్తించిన మరో ప్రమాదభరితమైన మార్గం సికింద్రాబాద్–జేమ్స్‌స్ట్రీట్. ఈ మార్గంలో కూడా రెండువైపులా వందలాది కాలనీలు రాకపోకలు సాగిస్తాయి. గత సంవత్సరం 20 మంది ఈ ట్రాక్‌లో చనిపోయారు.
ప్రాణాలు తీస్తున్న సెల్ఫీ ....
పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ పక్కన నించొని సెల్ఫీ తీసుకోవాలనే కోరిక కూడా ప్రాణాలు హరించివేస్తుంది. ఇందుకు మౌలాలి, బేగంపేట్, భరత్‌నగర్, హైటెక్‌సిటీ, బోరబండ వంటి ప్రాంతాలు వేదికగాలు మారాయి. ఇటీవల శివ అనే ఓ కుర్రవాడు సెల్ఫీ దిగుతూ క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి గుర్తుండే ఉంటుంది. గతేడాది గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు సంపత్‌కుమార్, బబ్లూ, అనిల్‌లు మౌలాలీ వద్ద ఫొటో దిగుతుండగా ట్రైన్ ఢీకొని సంపత్ అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బోరబండ–భరత్‌నగర్ మధ్య గతేడాది 18 మంది చనిపోగా, మౌలాలీ, హైటెక్‌సిటీ, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో సగటున 3 నుంచి 5 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
రక్షణ గోడలు లేకపోవడమే కారణం
భారతీయ రైల్వే చట్టంలోని 147వ యాక్ట్ ప్రకారం రైల్వే పట్టాలపై నుంచి దాటుతూ పట్టుబడే వారిపై రూ.500 వరకు జరిమానా విధించి వదిలేస్తున్న దక్షిణమధ్య రైల్వే పట్టాలు ,రైల్వే స్థలాల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 2005లోనే మొత్తం ఎంఎంటీఎస్ మార్గాలకు రక్షణ గోడలు కట్టించాలని, అసవరమైన చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే ప్రజలు ఎక్కువగా పట్టాలు దాటే ఏరియాలను గుర్తించి ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, లెవల్ క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రమాదాల బారిన పడి చనిపోయే మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.8 లక్షల చొప్పున పరిహారం అందజేస్తోంది.
ఏటా వందలా మంది మృతుల కుటుంబాలకు అందజేసే కోట్లాది రూపాయల పరిహారంలో కనీసం పదో వంతు ఖర్చు చేసినా శాశ్వతంగా రక్షణ గోడలు నిర్మించడంతో పాటు అన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ దక్షిణమధ్య రైల్వే నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసు విభాగం మొత్తం 334 ప్రమాద ఏరియాలను గుర్తించి దక్షిణమధ్య రైల్వేకు గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక నివేదకను కూడా అందజేసింది. ఆ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై ఒక సారి సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏ విధమైన కార్యాచరణ మాత్రం నిర్ణయించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment