కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్‌ పట్టాలు.. | Foreign companies Service For Hydrabad Metro Station | Sakshi
Sakshi News home page

కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్‌ పట్టాలు..

Published Sat, Nov 18 2017 10:48 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

Foreign companies Service For Hydrabad Metro Station - Sakshi

లూయిస్‌బెర్జర్‌ ఇంజినీరింగ్,ఆర్కిటెక్చర్‌ రంగంలో నగర మెట్రో ప్రాజెక్టుకు సహకారం అందించింది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది.

ఏఈకామ్‌ సాంకేతిక,యాజమాన్య సేవలు అందిస్తోంది. పర్యావరణ,ఇంధనం,మంచినీరు,మౌలిక వసతుల విషయంలో మెట్రో ప్రాజెక్టుకు తగిన సలహాలు అందిస్తోంది.

ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ పన్నులు, సేవలు, సలహాలు అందిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టులో కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తున్నందుకు వచ్చే కార్భన్‌ క్రెడిట్స్‌ను ఈ సంస్థ లెక్కగడుతుంది.

హాల్‌క్రో ఈ సంస్థ మెట్రో ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నిర్వహణ అంశాల్లో సహాయ సహకారాలు అందించింది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో: కొరియా కోచ్‌లు..శ్యామ్‌సంగ్‌ హంగులు...ఫ్రాన్స్‌ పట్టాలు..నగర మెట్రో ప్రాజెక్టుకు ఇలా విదేశీ హంగులు అద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో ప్రాజెక్టులో ప్రతీది విశేషమే. పలు విదేశాల నుంచి వచ్చిన వివిధ విడిభాగాలతో నగర మెట్రో ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంద మెట్రో ప్రాజెక్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరవాత మన మెట్రో ప్రాజెక్టుకు డిజైన్లు సిద్ధం చేసిన విషయం విదితమే. మెట్రో నిర్మాణంలో పాలుపంచుకున్న విదేశీ కంపెనీలు...మన మెట్రోకు అద్దిన విదేశీ సొబగులిలా ఉన్నాయి. 

కొరియా కోచ్‌లు: దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్‌ రోటెమ్‌ కంపెనీ మెట్రో రైళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. ఒక్కో బోగీ ఖరీదు రూ.10 కోట్లు. మొత్తం 57 రైళ్లకు 171 భోగీలను రూ.1800 కోట్ల ఖర్చుతో స్టెయిన్‌లెస్‌ స్టీల్, అల్యూమినియం లోహ మిశ్రమాలతో తయారుచేశారు.

ఫ్రాన్స్‌ పట్టాలు : ఆకాశమార్గం (ఎలివేటెడ్‌) పట్టాలను ఫ్రాన్స్‌కు చెందిన రైల్స్, టాటా స్టీల్‌(ప్రాన్స్‌) సంస్థ నగర మెట్రో ప్రాజెక్టుకు సరఫరా చేసింది. సముద్ర మార్గం గుండా మొదట ముంబైకు, అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఉప్పల్, మియాపూర్‌ డిపోకు చేర్చి ఆ తరవాత పట్టాలు పరిచారు. మొత్తం నగర మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్‌ నుంచి 22,500 మెట్రిక్‌ టన్నుల పట్టాలను దిగుమతి చేసుకొని 171 కి.మీ మార్గంలో పట్టాలు పరచడం విశేషం.

శ్యామ్‌సంగ్‌ డేటా సిస్టమ్స్‌: కొరియాకు చెందిన ఈ సంస్థ మెట్రో రైలు స్టేషన్లలో ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్లను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన డిజైన్, విడిభాగాల తయారీ, సరఫరా, పరీక్షలను సైతం ఇదే సంస్థ నిర్వహించనుంది.

పార్సన్స్‌ బ్రింకర్‌హాఫ్‌: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందినదీ  సంస్థ ..మౌలిక వసతుల కల్పన రంగంలోని భారీ ప్రాజెక్టులకు ఈ సంస్థ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మెట్రో ప్రాజెక్టులో సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత ఇంజినీరింగ్‌ డిజైన్లను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ సంస్థ 1885 నుంచి ఈ రంగంలో నిమగ్నమైంది. ఐదు ఖండాలలో ఈ సంస్థ సేవలందిస్తోంది.

కియోలిస్‌:
ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రజారవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లోని పలు ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టు నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. రైళ్లు, స్టేషన్లు,  డిపోలు, సిబ్బంది నియామకం నిర్వహణ విధులు ఈ సంస్థనే 15 ఏళ్లపాటు నిర్వహించనుంది.

ఓటీఐఎస్‌:
నగరంలోని ఎలివేటెడ్‌ మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన 260 లిఫ్టులను, 410 ఎస్కలేటర్లను ఈ సంస్థ సరఫరా చేసింది. చైనాకు చెందిన ఈ కంపెనీ నగర మెట్రో ప్రాజెక్టులో సుమారు రూ.400 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది.

ఆర్థిక సహకారం అందిస్తున్న బ్యాంకులు  
నగర మెట్రో ప్రాజెక్టుకు ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.3500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో రూ.11,500 కోట్లను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రబ్యాంక్, దేనాబ్యాంక్‌ల నుంచి రుణంగా సేకరిస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఖర్చు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement