పట్టాపై ఏర్పడిన రంధ్రాలు
ఇంజన్ చక్రాలకు రంధ్రాలు
డోర్నకల్: ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై ఇనుప గోలీలు(చర్రాలు) పెట్టిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. గురువారం రాత్రి ముద్దునూరు నుంచి బొగ్గులోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్సు రైలు గార్ల సమీపంలో మున్నేరువాగు బ్రిడ్జి దాటుతుండగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో రైలు డ్రైవర్, రైల్వే గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డోర్నకల్ రైల్వేస్టేషన్‌కు సమాచారం అందించారు. రైలును డోర్నకల్ స్టేషన్‌లో నిలిపిన అధికారులు.. ఇంజన్ చక్రాలకు రంధ్రాలు పడి ఉండటాన్ని గుర్తించారు.
వెంటనే పెట్రోలింగ్, మహబూబాబాద్ పీడబ్ల్యూఐ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీ చేయగా పట్టాలపై గోలీల లాంటి రెండు ఇనుప వస్తువులు కనిపించారుు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం ఏడీఆర్‌ఎం(ట్రాఫిక్) పీసీ టాంటతో పాటు పీడబ్ల్యూఐ అధికారులు, జీఆర్‌పీ సీఐ స్వామి, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పట్టాలపై కూడా రెండు చోట్ల రంధ్రాలు పడటాన్ని గుర్తించారు. ఈ చర్యకు పాల్పడింది ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు.