
రైల్వే ట్రాక్‌ల భద్రత, సంరక్షణకు ఇకపై లైన్‌మెన్లు రేయింబవళ్లు కష్టపడాల్సిన పనిలేదు. లైన్‌మెన్లకు ఊరటనిచ్చే ఓ సరికొత్త విధాన రూపకల్పన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఐఐటీ రూర్కీ విద్యార్థులకు అప్పజెప్పింది. రైల్వే ట్రాక్‌ని అనునిత్యం పర్యవేక్షించే డ్రోన్ల తయారీతో ఐఐటీ రూర్కీ ఈ విధానానికి రూపకల్పన చేయబోతోంది. టెలికం ఇండస్ట్రీ, రైల్వే ప్రోత్సాహంతో ఐఐటీ రూర్కీ తయారు చేసిన రైల్వే ట్రాక్‌ని పర్యవేక్షించే డ్రోన్లను ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పరీక్షించారు. త్వరలోనే రైల్వేలో ప్రవేశ పెట్టబోయే ఈ డ్రోన్లపై పేటెంట్ కోసం ఐఐటీ రూర్కీ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ట్రాక్ పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగపడే ఈ డ్రోన్లను భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆపదలో ఉన్న వారిని గుర్తించి, రక్షించేందుకు ఉపయోగించే వీలుందంటున్నారు నిపుణులు.
సమర్థవంతమైన రైల్వేల నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనలో భాగంగా ఈ డ్రోన్లను తయారు చేసి త్వరలోనే ప్రవేశ పెట్టనున్నామని ఇండియన్ రైల్వే అధికార ప్రతినిధి ఆర్‌డీ బాజ్‌పేయ్ వెల్లడించారు. ఇప్పటికే జబల్‌పూర్, భోపాల్, కోటా డివిజన్లలో రైల్వే ట్రాక్ పర్యవేక్షణకు వీటిని ఉపయోగించినట్టు తెలిపారు. 2017–18లో రైళ్లు 54 సార్లు పట్టాలు తప్పాయి. గతేడాది 78 సార్లు, 2010–11లో 141 పర్యాయాలు రెళ్లు పట్టాలు తప్పాయి. 2016–17లో రైల్వే ప్రమాదాల్లో గాయపడిన వారూ, మరణించిన వారూ 607 మంది. గతేడాది రైలు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య 254కి తగ్గింది. ట్రాక్‌ల వీడియో దృశ్యాలూ, ఫొటోలను తీసే డ్రోన్ల ద్వారా పర్యవేక్షించే వీలుంటుంది కనుక రైలు ప్రమాదాలను భారీగా తగ్గించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.