దివ్య డ్రస్సెస్‌లోని దర్జీలను విచారిస్తున్న రైల్వే డీఎస్పీ రమేష్ బాబు
చిత్తూరు, చంద్రగిరి : రైలు కింద పడి మృతి చెందిన ఆ ఇద్దరు ఎవరై ఉంటారోనని, రైల్వే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సోమవారం మండల పరిధిలోని ముంగలిపట్టు సమీపంలో రైల్వే పట్టాలపై సుమారు 55 సంవత్సరాల వయస్సు గల మహిళ, 45 సంవత్సరాలుగల పురుషుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుల ఆచూకీ కోసం రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడి చొక్కా కాలర్‌పై దివ్య డ్రస్సెస్, కొత్తపేట, చంద్రగిరి అనే చిరునామా ఉండటంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
మంగళవారం రైల్వే డీఎస్పీ రమేష్‌బాబు సిబ్బందితో కలసి దివ్య డ్రస్సెస్ టైలర్ దుకాణం వద్దకు వెళ్లారు. దుకాణంలోని దర్జీలను విచారించారు. దుకాణంలో వినియోగదారుల రికార్డులు, వారి పేర్లు, ఫోన్ నంబర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మృతుడి చొక్కా కాలర్‌పై ఉన్న చిరునామా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతులు చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. మృతులు ఎవరు, ఆత్మహత్యకు గల కారణాలేమిటి అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుల వివరాల కోసం ఆటోల ద్వారా ప్రతి గ్రామంలో ప్రచారాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment