
సందీప్(ఫైల్) గణేష్(ఫైల్) , విద్యార్థులను మింగేసిన చెరువులోని నీటికుంట
మదనపల్లె టౌన్ : హోలీ పండుగ రోజు బడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న ఇద్దరు పిల్లలు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ సమీప బంధువులు. కాగా రెండు కుటుంబాలకూ ఆ ఇద్దరే వారసులు కావడంతో వారి తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. సోమవారం మదనపల్లె మండలం చీకలబైలులో ఈ విషాదకర సంఘటన జరిగింది. రూరల్ పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు చీకలబైలుకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాసులు, భార్య గౌరవమ్మ కుమారుడు సందీప్(13), అదే ఊరికి చెందిన బావమరిది కుక్కల ఈశ్వరయ్య, గంగారాణి కుమారుడు గణేష్(9) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. సోమవారం హోలీ పండుగ కావడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నారు.
ఊరికి సమీపంలో ఉన్న శ్రీనివాసులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. సరదాగా అక్కడ వెంకటమ్మ చెరువు నీటికుంటలో ఈత ఆడేందుకు నీళ్లలోకి దిగారు. వారికి ఈత రాదు. లోతు ఎక్కువగా ఉన్న కుంట నీటిలో మునిగిపోయారు. బట్టలు ఉతుకున్న గ్రామస్తురాలు పాపులమ్మ గమనించి కేకలు వేసింది. సమీపంలో ఉన్న రైతులు పరుగున వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హరిహరప్రసాద్, తహసీల్దార్ సురేష్‌బాబు, వీఆర్వో ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కదిరి పౌర్ణమి రోజు విషాదం
హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే మొలకల, కదిరి పున్నమి రోజు చీకలబైలు గ్రామంలో విషాదం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు పిల్లలు ఈతకెళ్లి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
స్కూలుకు వెళ్లి ఉంటే బతికివుందురే
మా బిడ్డలు రోజూ మాదిరిగానే సోమవారం కూడా స్కూలుకు వెళ్లి ఉంటే బతికుందురే..దేవుడా ఎందుకు వారిని స్కూల్‌కు వెళ్లనీయకుండా చేశావు. మాపై ఎంత అసూయ ఉంటే వారిని దూరం చేసి, కడుపుకోత మిగిల్చావు. మా కుటుంబాలకు వారసులను దూరం చేశావే. మమ్మల్ని కూడా ఇప్పుడే తీసుకెళ్లిపో’ అంటూ మృతుల తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment