ముద్దనూరు రైల్వేస్టేషన్ ,ముదిగుబ్బ రైల్వేస్టేషన్
వైఎస్‌ఆర్ జిల్లా, రాజంపేట : పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాలు రైలుకూతకు దూరంగా ఉన్నాయి. ఈ మార్గాల మీదుగా రైలు మార్గాలేవీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో రైలు కూత వినిపించడంలేదు. జిల్లాలో రైల్వేపరంగా అభివృద్ధికి ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు కృషి చేస్తున్నారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ రాయచోటి, ఇటు పులివెందుల నియోజకవర్గ పరిధిలో వెళుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు రైల్వే సేవలు అందే అవకాశముంది. తాజాగా ఈ ఏడాది బడ్జెట్‌లో ముద్దనూరు–ముదిగుబ్బలైను తెర మీదకు వచ్చింది. దీంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు రేకేత్తించాయి.
65కిలోమీటర్ల రైల్వేలైన్..
ముదిగుబ్బ రైల్వేస్టేషన్ గుంతకల్–బెంగళూరు రైలు మార్గంలో ఉంది. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో ఈ లైనుకు రైల్వేశాఖ సర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు 65 కిలోమీటర్ల దూరం ఉంది. ముద్దనూరు–ముదిగుబ్బ కొత రైల్వే లైన్ సర్వేకి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ లైను సర్వే ఏ దిశగా ఉంటుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రకటించిన కొత్తరైల్వేలైన్ల సర్వేలా ఉండిపోతుందా.. ముందుకు వెళుతుందా అనేది వేచిచూడాల్సిందే. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా కదిరి మార్గంలో ముదిగుబ్బ వరకు వెళ్లే విధంగా అలైన్‌మెంట్ చేస్తారా..లేక పులివెందుల సమీప ప్రాంతం నుంచి వెళ్లే విధంగా అలైన్‌మెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలైన్‌మెంట్ స్పష్టమైతే పులివెందుల మీదుగా అయితే అక్కడి వాసులు రాబోయే రోజుల్లో రైలుకూత వినవచ్చు. బడ్జెట్‌లో కొత్త లైను సర్వేకి నామమాత్రంగా నిధులు కేటాయిచారని విమర్శ ఉంది. ఈ లైనును త్వరిగతిన రాబట్టుకుంటే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు రైలు కూత వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment