ఈ సారైనా కూసేనా! | Kotipalli Narsapur Project Pending in East Godavari | Sakshi
Sakshi News home page

ఈ సారైనా కూసేనా!

Published Thu, Jan 31 2019 8:22 AM | Last Updated on Thu, Jan 31 2019 8:22 AM

Kotipalli Narsapur Project Pending in East Godavari - Sakshi

కేంద్రం ప్రవేశపెట్టే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై కోనసీమవాసులు ఆశలు పెట్టుకున్నారు. కోటిపల్లి నుంచి కోనసీమ మీదుగా నర్సాపురం సాగే ఈ రైల్వేలైన్‌ కోసం కోనసీమ వాసులు దశాబ్దాలుగా కలలుగంటున్నారు. అరకొర నిధుల మంజూరుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాలేదు. గడిచిన మూడేళ్లుగా మోదీ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో పనులు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌లో ఈ ప్రాజెక్టుకు మరోసారి భారీగా నిధులు కేటాయిస్తారని కోనసీమవాసులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

తూర్పుగోదావరి , అమలాపురం: కోటిపల్లి–నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణానికి రూ.2,150 కోట్లు అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖ ద్వారా 75 శాతం అంటే రూ.1,690 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు కేటాయించి రూ.42 కోట్లు కాగా, 2014–18 వరకు నాలుగేళ్లలో ఎన్డీయే సర్కార్‌ రూ.835 కోట్లు కేటాయించింది. కేంద్రం గడిచిన నాలుగేళ్లలో తొలి ఏడాది 2015–16న రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ.ఐదు కోట్లు మాత్రమే కేటాయించింది. తరువాత ఏడాది 2016–17న రూ. 200 కోట్లు, 2017–18న 430 కోట్లు, 2018–19న రూ.200ల చొప్పున నిధులు కేటాయించింది. మొత్తం నాలుగేళ్లలో రూ.835 కోట్లు కేటాయించింది.

ప్రస్తుత నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇంకా తన వాటాగా రూ.858 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ప్రాజెక్టుకు దివంగత మహా నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 25 శాతం నిధులు అంటే రూ.537 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.125 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇవ్వాల్సిన దానిలో కేవలం 20 శాతమే నిధులు ఇచ్చిన చంద్రబాబు సర్కార్‌ కేవలం రూ.2.96 కోట్లు మాత్రమే రైల్వేశాఖకు డిపాజిట్‌ చేశారు. ఇక రాష్ట్రం ఎంత కేటాయిస్తుంది.. కేటాయింపుల్లో ఎంత రైల్వేశాఖకు ఇస్తుందనే దానిపై కోనసీమవాసులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నారు. మోదీ సర్కార్‌కు ఈ పాలనా కాలంలో ఇదే చివరి బడ్జెట్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై తనస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కోనసీమ రైల్వే సాధన సమితి, కోనసీమ జేఏసీ ప్రతినిధులు నిధుల కేటాయింపుపై రామ్‌మాధవ్‌ను సంప్రదిస్తున్నారు. ’గతంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రాజెక్టులో భాగంగా గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరిన్ని నిధులు కేటాయిస్తే వంతెన నిర్మాణాలతోపాటు రైల్వే ట్రాక్‌ నిర్మాణం కూడా సమాంతరంగా జరుగుతుంది’ అని కోనసీమ జేఏసీ కన్వీనర్‌ బండారు రామ్మోహన్‌ ‘సాక్షి’కి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement