చికుబుకు చికుబుకు రైలే..! | Movement in Train Track Work in Nadikudi to Srikalahasti | Sakshi
Sakshi News home page

చికుబుకు చికుబుకు రైలే..!

Published Tue, Jan 28 2020 1:24 PM | Last Updated on Tue, Jan 28 2020 1:24 PM

Movement in Train Track Work in Nadikudi to Srikalahasti - Sakshi

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు: జిల్లాల్లోని పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పయనించే రైలు కూతవేటు దూరంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్ట్‌ కలలు నెరవేరనున్నాయి. దశాబ్దాల నుంచి ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ రైలు మార్గం గత టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. 2011–12 బడ్జెట్‌లో రూ.2,450 కోట్ల వ్యయంతో కేంద్రం పచ్చజెండా ఊపింది. 2016 వరకు పనుల్లో పురోగతి లేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత గల రైల్వేలైను నిర్మాణాల జాబితాలో చేర్చారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వేలైను నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మరింత జాప్యం చోటు చేసుకుంది.

ఉదయగిరి: నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేసింది. ఎట్టకేలకు 2019–20 బడ్జెట్‌లో రూ.700 కోట్లు కేటాయించడంతో పనులు మొదలయ్యాయి. 2022 కల్లా ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని రైల్వే అధికారులు సంకల్పించారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటికే గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 46 కి.మీ రైల్వేలైను పూర్తి చేసి ట్రయల్‌ నిర్వహించి మొదటి దశ పనులు పూర్తి చేశారు.

రైల్వే లైను నిర్మాణం స్వరూపం
గుంటూరు జిల్లా నడికుడి నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు వయా ప్రకాశం, నెల్లూరు మీదుగా 308.76 కి.మీ నిడివి గల ఈ మార్గంలో తొలుత 33 స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. తాజాగా ఇటీవల మరో నాలుగు కొత్త స్టేషన్ల నిర్మాణానికి రైల్వేశాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో మొత్తంగా 37 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 23 మెట్ట మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు అవసరమైన 5,189 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించనుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 800 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 1,900 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 2,200 భూసేకరణ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందజేసింది. నెల్లూరు జిల్లాలో భూసేకరణ జరిగినా ఇంత వరకు నష్టపరిహారం అందించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియను పూర్తయితే కానీ జిల్లాలో రైల్వేలైను నిర్మాణం జరిగే పరిస్థితి లేదు.

ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా..
న్యూఢిల్లీ–చెన్నై, హౌరా–చెన్నై ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన శ్రీకాళహస్తి–నడికుడి రైల్వేలైను కొత్త ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు నిర్మిస్తున్న ఈ మార్గంలో రవాణా సౌకర్యాలు ఎంతగానో మెరుగు పడనున్నాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, కృష్ణపట్నం, ఓబుళాపురం రైల్వే మార్గాలతో అనుసంధానం ఏర్పడనుంది. ఈ రైల్వేలైను పూర్తయితే హైదరాబాద్‌–చెన్నై, హౌరా–చెన్నై మధ్య రైళ్ల రద్దీ తగ్గే అవకాశముంది. హైదరాబాద్‌–చెన్నై మధ్య సుమారు 90 కి.మీ దూరం కూడా తగ్గనుంది. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన పరిస్థితుల్లో కోస్తా తీరంలో ప్రస్తుతం వెళ్తున్న హైదరాబాద్‌–చెన్నై రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ మార్గం ఉపయోగించుకునే అవకాశముంది. గుంటూరు జిల్లాలో వెనుకబడిన పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పొదిలి, కనిగిరి, పామూరు ప్రాంతం, నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మెట్ట ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది.

రైలు నడిచే ప్రాంతాలివే..
నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో నడికుడి నుంచి వయా పిడుగురాళ్ల, దాచేపల్లి, నగిరికల్లు, బ్రాహ్మణపల్లి, సంతగుడిపాడు, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ, ఐనవోలు, కురిచేడు, ముండ్లమూరు, దరిశి, పొదిలి, కొనకమిట్ట, కనిగిరి, పామూరు, వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, బాలాయపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి వరకు నడుస్తుంది. గతంలో 33 రైల్వేస్టేషన్లును గుర్తించి, నిర్మించాలని ప్రతిపాదన. అయితే తాజాగా మరో నాలుగు కొత్త స్టేషన్లకు నోటిఫికేషన్‌ ఇస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పిడుగురాళ్ల న్యూ, నెమలిపురి, కుంకలగుంట, వేల్పూరు రైల్వేస్టేషన్లు జత చేకూరాయి. దీంతో మొత్తంగా 37 రైల్వేస్టేషన్లు ఏర్పాటు అవుతాయి. 

రవాణాకు ఎంతోమేలు
ఈ రైల్వేలైను పూర్తయితే వెనుకబడిన మెట్ట ప్రాంతాలుగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లా పొదిలి, కనిగిరి, పామూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయి. రైతులు పండించే వాణిజ్య పంటలు, ఇతర ఉద్యాన పంటలు, పొగాకు, గ్రానైట్‌ రైల్వే మార్గం ద్వారా నేరుగా పెద్ద పెద్ద నగరాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రైలు మార్గం ఏర్పడడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగే అవకాశాలున్నాయి.

జిల్లాలో మొదలుకాని పనులు
నెల్లూరు జిల్లాలో 2,200 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో కొంత మేర హద్దులు కూడా రాళ్లు నాటారు. ప్రైవేట్‌ భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇంత వరకు ఇవ్వకపోవడంతో ఆ భూముల్లో పనులు చేసే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించాల్సి ఉన్నందున రైతులకు నష్టపరిహారం శరవేగంగా అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఈ రైల్వే లైనుకు సంబంధించి పలుమార్లు అధికారులతో చర్చించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

రైలు మార్గంతో ఉదయగిరి అభివృద్ధి
నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి పార్లమెంట్‌ సభ్యుడిగా మా అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయించడంలో కీలక పాత్ర వహించారు. ఈ లైను పూర్తయితే ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు మెట్ట మండలాలతో పాటు ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉదయగిరి ప్రాంత వాసులకు కూడా ఎంతో మేలు చేకూరనుంది.    – మేకపాటిచంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి

నాలుగు దశల్లో పనులు పూర్తి
శ్రీకాళహస్తి–నడికుడి రైల్వేలైను పనులు నాలుగు దశల్లో పూర్తికానున్నాయి.
మొదటి దశ : పిడుగురాళ్ల నుంచిశావల్యాపురం వరకు 46 కి.మీ
రెండో దశ : గుండ్లకమ్మ, దరిశి, ఆత్మకూరు, వెంకటగిరి వరకు 126.16 కి.మీ
మూడో దశ : కనిగిరి నుంచి ఆత్మకూరు వరకు 95.55 కి.మీ
నాల్గో దశ : వెంకటగిరి నుంచిశ్రీకాళహస్తి వరకు 41 కి.మీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement