Nadikudi-Srikalahasti railway line
-
చికుబుకు చికుబుకు రైలే..!
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు: జిల్లాల్లోని పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పయనించే రైలు కూతవేటు దూరంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్ట్ కలలు నెరవేరనున్నాయి. దశాబ్దాల నుంచి ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ రైలు మార్గం గత టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. 2011–12 బడ్జెట్లో రూ.2,450 కోట్ల వ్యయంతో కేంద్రం పచ్చజెండా ఊపింది. 2016 వరకు పనుల్లో పురోగతి లేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత గల రైల్వేలైను నిర్మాణాల జాబితాలో చేర్చారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వేలైను నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మరింత జాప్యం చోటు చేసుకుంది. ఉదయగిరి: నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేసింది. ఎట్టకేలకు 2019–20 బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించడంతో పనులు మొదలయ్యాయి. 2022 కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైల్వే అధికారులు సంకల్పించారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటికే గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 46 కి.మీ రైల్వేలైను పూర్తి చేసి ట్రయల్ నిర్వహించి మొదటి దశ పనులు పూర్తి చేశారు. రైల్వే లైను నిర్మాణం స్వరూపం గుంటూరు జిల్లా నడికుడి నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు వయా ప్రకాశం, నెల్లూరు మీదుగా 308.76 కి.మీ నిడివి గల ఈ మార్గంలో తొలుత 33 స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. తాజాగా ఇటీవల మరో నాలుగు కొత్త స్టేషన్ల నిర్మాణానికి రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో మొత్తంగా 37 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 23 మెట్ట మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు అవసరమైన 5,189 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించనుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 800 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 1,900 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 2,200 భూసేకరణ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందజేసింది. నెల్లూరు జిల్లాలో భూసేకరణ జరిగినా ఇంత వరకు నష్టపరిహారం అందించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియను పూర్తయితే కానీ జిల్లాలో రైల్వేలైను నిర్మాణం జరిగే పరిస్థితి లేదు. ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా.. న్యూఢిల్లీ–చెన్నై, హౌరా–చెన్నై ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన శ్రీకాళహస్తి–నడికుడి రైల్వేలైను కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు నిర్మిస్తున్న ఈ మార్గంలో రవాణా సౌకర్యాలు ఎంతగానో మెరుగు పడనున్నాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, కృష్ణపట్నం, ఓబుళాపురం రైల్వే మార్గాలతో అనుసంధానం ఏర్పడనుంది. ఈ రైల్వేలైను పూర్తయితే హైదరాబాద్–చెన్నై, హౌరా–చెన్నై మధ్య రైళ్ల రద్దీ తగ్గే అవకాశముంది. హైదరాబాద్–చెన్నై మధ్య సుమారు 90 కి.మీ దూరం కూడా తగ్గనుంది. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన పరిస్థితుల్లో కోస్తా తీరంలో ప్రస్తుతం వెళ్తున్న హైదరాబాద్–చెన్నై రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ మార్గం ఉపయోగించుకునే అవకాశముంది. గుంటూరు జిల్లాలో వెనుకబడిన పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పొదిలి, కనిగిరి, పామూరు ప్రాంతం, నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మెట్ట ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. రైలు నడిచే ప్రాంతాలివే.. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో నడికుడి నుంచి వయా పిడుగురాళ్ల, దాచేపల్లి, నగిరికల్లు, బ్రాహ్మణపల్లి, సంతగుడిపాడు, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ, ఐనవోలు, కురిచేడు, ముండ్లమూరు, దరిశి, పొదిలి, కొనకమిట్ట, కనిగిరి, పామూరు, వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, బాలాయపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి వరకు నడుస్తుంది. గతంలో 33 రైల్వేస్టేషన్లును గుర్తించి, నిర్మించాలని ప్రతిపాదన. అయితే తాజాగా మరో నాలుగు కొత్త స్టేషన్లకు నోటిఫికేషన్ ఇస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పిడుగురాళ్ల న్యూ, నెమలిపురి, కుంకలగుంట, వేల్పూరు రైల్వేస్టేషన్లు జత చేకూరాయి. దీంతో మొత్తంగా 37 రైల్వేస్టేషన్లు ఏర్పాటు అవుతాయి. రవాణాకు ఎంతోమేలు ఈ రైల్వేలైను పూర్తయితే వెనుకబడిన మెట్ట ప్రాంతాలుగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లా పొదిలి, కనిగిరి, పామూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయి. రైతులు పండించే వాణిజ్య పంటలు, ఇతర ఉద్యాన పంటలు, పొగాకు, గ్రానైట్ రైల్వే మార్గం ద్వారా నేరుగా పెద్ద పెద్ద నగరాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రైలు మార్గం ఏర్పడడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో మొదలుకాని పనులు నెల్లూరు జిల్లాలో 2,200 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో కొంత మేర హద్దులు కూడా రాళ్లు నాటారు. ప్రైవేట్ భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇంత వరకు ఇవ్వకపోవడంతో ఆ భూముల్లో పనులు చేసే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించాల్సి ఉన్నందున రైతులకు నష్టపరిహారం శరవేగంగా అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఈ రైల్వే లైనుకు సంబంధించి పలుమార్లు అధికారులతో చర్చించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రైలు మార్గంతో ఉదయగిరి అభివృద్ధి నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి పార్లమెంట్ సభ్యుడిగా మా అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయించడంలో కీలక పాత్ర వహించారు. ఈ లైను పూర్తయితే ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు మెట్ట మండలాలతో పాటు ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉదయగిరి ప్రాంత వాసులకు కూడా ఎంతో మేలు చేకూరనుంది. – మేకపాటిచంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి నాలుగు దశల్లో పనులు పూర్తి శ్రీకాళహస్తి–నడికుడి రైల్వేలైను పనులు నాలుగు దశల్లో పూర్తికానున్నాయి. మొదటి దశ : పిడుగురాళ్ల నుంచిశావల్యాపురం వరకు 46 కి.మీ రెండో దశ : గుండ్లకమ్మ, దరిశి, ఆత్మకూరు, వెంకటగిరి వరకు 126.16 కి.మీ మూడో దశ : కనిగిరి నుంచి ఆత్మకూరు వరకు 95.55 కి.మీ నాల్గో దశ : వెంకటగిరి నుంచిశ్రీకాళహస్తి వరకు 41 కి.మీ -
మెట్టకు ‘రైలు’ వచ్చేనా!
సాక్షి, కావలి: జిల్లాలోని మెట్టప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం. 2020 నాటికి ఈ రైలు మార్గం పూర్తి చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూసేకరణే పూర్తి కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జిల్లాలోని వందలాది పడమటి పల్లెల ప్రజలు శ్రీకాళహస్తి–నడికుడి మార్గంలో రైలు కూత వినాలనే ఆకాంక్షతో ఉన్నా చంద్రబాబు ప్రభుత్వ అటకెక్కించింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని నడికుడి వరకు పడమట పల్లెల్లో నూతన రైలు మార్గం నిర్మించాలని, ఆ రైలు మార్గం జిల్లాలో కూడా మెట్టప్రాంతంలోని పల్లెల మీదుగా నిర్మించాలని 50 ఏళ్ల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు అంగీకరించింది. అయితే గుంటూరు జిల్లాలోని నడికుడి జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి కాకుండా, అక్కడికి 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజుపాళెం మండలం అనుపాలెం అనే గ్రామం నుంచి ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నుంచి కాకుండా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి వరకే ఈ రైలు మార్గాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు. అటకెక్కిన భూసేకరణ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వ్యయాన్ని భరించి భూసేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉంది. జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లోని 2,267.77 ఎకరాల భూమిని సేకరించాల్సిఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 777.09 ఎకరాలు కాగా, మిగిలిన పట్టా భూములు 1,054.54 ఎకరాలు, అసైన్డ్ భూములు 436.14 ఎకరాలు గుర్తించారు. అంటే 1,590.68 ఎకరాల భూమికి సంబంధించిన యజమానులకు నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. ఎకరాకు కనీసం రూ.4.25 లక్షల నుంచి గరిష్టం రూ.15 లక్షల వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ ధరను బట్టి నిర్ణయించాల్సిఉంది. రూ.100 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సివస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం నిధుల విడుదలకు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు కూడా భూములకు ప్రాంతాల వారీగా నష్టపరిహారం చెల్లించడానికి ధరలు కూడా ఖరారు చేయకుండా పక్కన పెట్టేశారు. నిర్మాణానికి నిధుల మాటేమిటో.. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతోనే భూసేకరణ జరిపి రైల్వేశాఖకు భూములు అప్పగించాల్సిఉంది. అలాగే రైలు మార్గం నిర్మాణంలో అయ్యే ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రైలు మార్గం ఖర్చు రూ.2,454 కోట్లు అవుతుంది. జిల్లాలో భూసేకరణకు నిధులు మంజూరు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్మాణానికి నిధులు ఎప్పటికి మంజూరు చేస్తుందోనని అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల 2020 నాటికి ఈ మార్గం పూర్తి కావాలనే లక్ష్యం నేరవేరే పరిస్థితి లేకుండాపోయింది. అసమగ్రంగా స్టేషన్ల ఏర్పాటు శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం పొడవు 308.7 కిలోమీటర్లు కాగా అందులో నెల్లూరు జిల్లాలోనే 146.11 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం రైల్వేస్టేషన్లు 33 కాగా, జిల్లాలో 15 ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ఈ రైలు మార్గంలో జిల్లాలోనే ఎక్కువ స్టేషన్లు నిర్మించనున్నారు. అయితే కొండాపురం, కలిగిరి, పొదలకూరు మండలాల్లోని భూములు కూడా రైలు మార్గం నిర్మాణానికి తీసుకుంటున్నప్పటికీ ఆ మండలాల్లో ఒక్క రైల్వేస్టేషన్ కూడా నిర్మించడం లేదు. వరికుంటపాడు మండలంలోని కొల్లువారిపల్లె, వింజమూరు మండలంలో గోళ్లవారిపల్లె, రావిపాడు, వింజమూరు గ్రామాల్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు కావాల్సిఉంది. ఏఎస్‌పేట మండలంలో దూబగుంట, ఆత్మకూరు మండలంలో పమిడిపాడు, ఆత్మకూరు, చేజర్ల మండలంలో ఓబులాయపల్లె, కొత్తూరు, రాపూరు మండలంలో వెంకటాపురం, ఆదూరుపల్లి, రాపూరు, డక్కిలి మండలం వెల్లంపల్లి, ఆల్తూరుపాడు, వెంకటగిరి మండలంలో బాలసముద్రం గ్రామాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాల్సిఉంది. ఈ రైలు మార్గం నిర్మిస్తున్న జిల్లాలోని 11 మండలాల్లో పెద్ద మండలాలు పొదలకూరు, కలిగిరి. ఈ మండలాల్లో కనీసం ఒక్క రైల్వేస్టేషన్ కూడా నిర్మించడం లేదు. పొదలకూరు మండలంలో, పక్కనే ఉన్న సైదాపురం మండలంలో నిమ్మతోటలు భారీగా ఉన్నాయి. ఈ మండలాల్లోని నిమ్మకాయలు దక్షిణ, ఉత్తర భారతదేశంలోని చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, కొచ్చిన్, త్రివేండ్రం, కలకత్తా, న్యూఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల మార్కెట్‌కు రవాణా అవుతున్నాయి. పొదలకూరు మండలం మీదుగా రైలు మార్గం ఉన్నప్పటికీ కనీసం రైల్వేస్టేషన్‌ను లేకపోవడంతో గమనార్హం. భూసేకరణకే నిధులు మంజూరు చేయని చంద్రబాబు ప్రభుత్వం మెట్టప్రాంత ప్రజల దశబ్దాల నాటి రైలుమార్గం స్వప్నాన్ని నీరుగారుస్తోంది. రవాణాకు అనువు ప్రస్తుతం ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గానికి శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం బలమైన ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. తుపాన్లు, వరదలతో కోస్తా తీరానికి సమీపంలో ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గంలో అంతరాయం ఏర్పడినప్పడు, రద్దీ ఏర్పడినప్పడు శ్రీకాళహస్తి–నడికుడి రైలుమార్గం అందుబాటులో ఉండడం వల్ల దక్షిణ–ఉత్తర భారతదేశాలకు అనుసంధానమైన వాణిజ్య రవాణాకు అనువుగా ఉంటుందని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన
వింజమూరు: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి సర్వే చేసిన అటవీ భూములను రైల్వే-అటవీ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం పరిశీలించారు. వింజమూరు, కాటేపల్లి, డక్కనూరు, రాజోలు తదితర ప్రాంతాల్లో రైల్వేలైన్ కోసం సర్వే చేసిన భూములను కావలి సబ్‌డివిజన్ డీఎఫ్ఓ సీహెచ్ నాగభూషణం, రైల్వే సీనియర్ ఇంజినీరు సీహెచ్ సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సీహెచ్ నాగభూషణం మాట్లాడుతూ 97.2 హెక్టార్లలో అటవీ భూములు రైల్వే శాఖకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రైల్వే లైను నిడివి 308.7 కిలోమీటర్లు కాగా మన జిల్లాలో 145 కిలోమీటర్లు లైను ఏర్పాటవుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 110 కి.మీ, మిగిలినది గుంటూరు జిల్లాలో ఉందన్నారు. మొత్తం బడ్జెట్లో రూ.800 కోట్లు భూముల నష్ట పరిహారం కోసం కేటాయించారన్నారు. -
బాలుర వసతి భవనానికి రైల్వేలైన్ గండం
రూ.3కోట్లతో నిర్మాణం ప్రారంభానికి నోచుకోని వైనం రైల్వేలైన్ నిర్మాణంలో తొలగనున్న భవనం వృథాకానున్న కోట్ల రూపాయల ధనం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని బాలుర వసతిగృహాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చేందుకు ఆ భవనాన్ని నిర్మించారు. కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ భవనాన్ని ఇంకా ప్రారంభించలేదు. నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగించనున్న భవనంపైప్రత్యేక కథనం. ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఒకే నీడకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2013లో రూ.3కోట్లతో సమీకృత బాలుర వసతిగృహ భవనాన్ని మంజూరు చేసింది. అప్పట్లో మంత్రి రామనారాయణరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకొన్న ఈ భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయింది. ప్రభుత్వం మారడం..సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరిచిపోవడంతో వసతి భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. వసతి భవనానికి రైల్వేలైన్ గండం కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి భవనానికి నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ గండం నెలకొంది. ఆత్మకూరులోని బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే రైల్వేలైన్ వసతి భవనాన్ని తాకనుంది. రైల్వేలైన్ నిర్మాణానికి భవనాన్ని తొలగించక తప్పదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ వసతి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. అప్పట్లో ఆత్మకూరు తహశీల్దార్ రైల్వేలైన్ నిర్మాణంలో నూతన భవనాన్ని తొలగించక తప్పదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు తహశీల్దార్ సమాచారాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రైల్వేలైన్ రూట్ మ్యాప్ పూర్తయిందని, వసతి భవనం మీదుగా కాకుండా రైల్వేలైన్‌ను మారిస్తే రైల్వేస్టేషన్ ఆత్మకూరు పట్టణానికి దూరమవుతుందని తెలిపారు. ఈ రైల్వేలైన్‌ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రం రైల్వేలైన్ నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు చూపిన మార్గంలోనే రైల్వేలైన్ నిర్మాణం చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు వసతి భవనాన్ని విస్మరించి స్థలం కేటాయించడంతో రైల్వేలైన్ నిర్మాణానికి కోట్లతో నిర్మించిన భవనాన్ని తొలగించక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయమై తహశీల్దార్ బీకే వెంకటేశులును సంప్రదించగా ప్రస్తుత రైల్వేలైన్ నిర్మాణం డిజైన్ ప్రకారం హాస్టల్ భవనం తొలగించక తప్పదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కలెక్టర్‌తో పాటు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.