బాలుర వసతి భవనానికి రైల్వేలైన్ గండం
రూ.3కోట్లతో నిర్మాణం
ప్రారంభానికి నోచుకోని వైనం
రైల్వేలైన్ నిర్మాణంలో తొలగనున్న భవనం
వృథాకానున్న
కోట్ల రూపాయల ధనం
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని బాలుర వసతిగృహాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చేందుకు ఆ భవనాన్ని నిర్మించారు. కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ భవనాన్ని ఇంకా ప్రారంభించలేదు. నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగించనున్న భవనంపైప్రత్యేక కథనం.
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఒకే నీడకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2013లో రూ.3కోట్లతో సమీకృత బాలుర వసతిగృహ భవనాన్ని మంజూరు చేసింది. అప్పట్లో మంత్రి రామనారాయణరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకొన్న ఈ భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయింది. ప్రభుత్వం మారడం..సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరిచిపోవడంతో వసతి భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
వసతి భవనానికి రైల్వేలైన్ గండం
కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి భవనానికి నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ గండం నెలకొంది. ఆత్మకూరులోని బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే రైల్వేలైన్ వసతి భవనాన్ని తాకనుంది. రైల్వేలైన్ నిర్మాణానికి భవనాన్ని తొలగించక తప్పదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ వసతి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. అప్పట్లో ఆత్మకూరు తహశీల్దార్ రైల్వేలైన్ నిర్మాణంలో నూతన భవనాన్ని తొలగించక తప్పదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు తహశీల్దార్ సమాచారాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రైల్వేలైన్ రూట్ మ్యాప్ పూర్తయిందని, వసతి భవనం మీదుగా కాకుండా రైల్వేలైన్‌ను మారిస్తే రైల్వేస్టేషన్ ఆత్మకూరు పట్టణానికి దూరమవుతుందని తెలిపారు.
ఈ రైల్వేలైన్‌ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రం రైల్వేలైన్ నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు చూపిన మార్గంలోనే రైల్వేలైన్ నిర్మాణం చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు వసతి భవనాన్ని విస్మరించి స్థలం కేటాయించడంతో రైల్వేలైన్ నిర్మాణానికి కోట్లతో నిర్మించిన భవనాన్ని తొలగించక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయమై తహశీల్దార్ బీకే వెంకటేశులును సంప్రదించగా ప్రస్తుత రైల్వేలైన్ నిర్మాణం డిజైన్ ప్రకారం హాస్టల్ భవనం తొలగించక తప్పదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కలెక్టర్‌తో పాటు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.