జీవితాంతం ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్‌లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.
ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.
ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్.
కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది.
ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.
2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్‌లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.
విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్‌కు పుట్టిన సంతానాన్ని మిక్స్‌డ్ పాపులేషన్‌గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.
వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది.
వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment