హంగేరీలో నకిలీ కంపెనీ స్థాపించిన ఇజ్రాయెల్!
ఈ పేజర్‌ల కోసం ఆర్డర్ ఇచ్చిన హెజ్‌బొల్లా
లెబనాన్‌లో వేలాది పేజర్‌లు ఒకే సమయంలో పేలి వేలాది మందిని గాయపరిచి, కొందరి ప్రాణాలు తీసిన ఘటనలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. పేలిన పేజర్‌లను హంగేరీలోని ఒక సంస్థకు హెజ్‌బొల్లా, లెబనాన్ సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాన్ని అమర్చి సరఫరా చేశారని గత రెండ్రోజులుగా వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ పేజర్‌లను తయారుచేసిన సంస్థ ఇజ్రాయెల్‌కు చెందిన డొల్ల కంపెనీ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. హంగేరీలో పేరులో ‘బీఏసీ’ అక్షరాలుండే కంపెనీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి.
వీటి పోలికలతో ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ’ పేరిట ఒక నకిలీ కంపెనీని ఇజ్రాయెల్ స్థాపించింది. పేజర్‌లను అది తయారుచేస్తుంది. హెజ్‌బొల్లా సభ్యులకు పేలుడు పదార్థమున్న పేజర్‌లను సరఫరా చేసి వారిని అంతంచేయడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇందుకోసం ముగ్గురు ఇజ్రాయెల్ నిఘా విభాగ అధికారులు ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. లెబనాన్ నుంచి పేజర్‌ల సరఫరా కాంట్రాక్ట్ సంపాదించేందుకు ఇజ్రాయెల్ చాన్నాళ్ల క్రితమే మూడు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఈ మూడు కంపెనీల్లో ఒకటైన బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ హంగేరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు, ఇజ్రాయెల్‌కు సంబంధం ఉంటుందని హెజ్‌బొల్లా అస్సలు ఊహించలేదు. ఎలాంటి అనుమానం రాకపోవడంతో బీఏసీ కన్సల్టింగ్ సంస్థకే హెజ్‌బొల్లా పేజర్ల సరఫరా ఆర్డర్ ఇచ్చిందని ఇరాన్‌లోని మెహర్ న్యూస్‌ఏజెన్సీ వివరించింది. బీఏసీ కన్సల్టింగ్ గత మూడేళ్లుగా తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్‌తో పేజర్లు తయారుచేసి విక్రయిస్తోంది. దీంతో హెజ్‌బొల్లా నుంచి చాలా సులువుగా బీఏసీ సంస్థ ఆర్డర్ సాధించగల్గిందని మెహర్ తన కథనంలో పేర్కొంది. అందుకే యూరప్ దేశానికి చెందిన పేజర్‌లు పేలితే తనకేం సంబంధం అన్నట్లు ఇజ్రాయెల్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది.
అయితే ఈ విషయమై బీఏసీ కన్సల్టింగ్ వాదన మరోలా ఉండటం విశేషం. ‘‘ పేజర్ల తయారీలో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం కేవలం వాటిని రవాణా చేశాం’’ అని బీఏసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిణి క్రిస్టినా బార్సోనీ అర్సిడియాకోనో స్పష్టంచేశారు. పేలిన పేజర్లను మాత్రమేగాక సాధారణ పౌరుల కోసం కూడా వేలాది పేజర్‌లను ఈ సంస్థ తయారుచేసినట్లు సమాచారం. ఈ సాధారణ పేజర్‌లు ఏవీకూడా పేలినట్లు వార్తలు రాలేదు. హెజ్‌బొల్లా సభ్యులు వాడిన, పేలిన పేజర్‌లు 2022 ఏడాది అర్ధభాగంలో తయారుచేసి ఉంటారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment