పార్లమెంట్ మకర ద్వారం వద్ద ‘ఇండియా’ పక్షాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రద్దు డిమాండ్‌తో విపక్ష ఇండియా కూటమి నేతలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం నిరసన చేపట్టారు. ‘పన్ను ఉగ్రవాదం’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాందీతో పాటు ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం ఎంపీలు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంపై జీఎస్టీ ప్రజలపై పెనుభారమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు.
జీఎస్టీతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. ఇండియా కూటమి ఎంపీల నిరసనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనలు, నినాదాలు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ప్రవేశ ద్వారం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదన్న నిర్ణయానికి కట్టుబడతామని సభ్యులంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద రూ.8,263 కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment