త్రీ మంకీస్ - 3 | Three Monkeys | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 3

Published Mon, Oct 20 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

త్రీ మంకీస్  - 3

త్రీ మంకీస్ - 3

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 3
  - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘మిమ్మల్నే. ఎవరిదా ఫోన్ అంటే వినపడదా?’’ ఆయన గొంతు పెంచాడు.
 ‘‘మీ గురించి తెలుసు కాబట్టి నల్ల కోట్ల వారిదై ఉండదు యువర్ ఆనర్. కొత్తవాళ్ళదై ఉంటుంది’’ క్లర్క్ చెప్పాడు.
 ‘‘నేను పది లెక్కపెట్టేలోగా ఎవరి సెల్‌ఫోన్ మోగిందో వారు వెంటనే చేతిని ఎత్తండి. ఒన్... టు...’’
 ఎవరూ ఎత్తలేదు.
 ‘‘నాకు ఓపిక లేదు. లేదా అందరికీ శిక్ష వేస్తాను. మీ పదిహేడు మందికి. త్రి... టెన్. సరే. వీళ్ళందర్నీ ఈ రాత్రి లాకప్‌లో ఉంచి రేపు విడుదల చేయండి. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు విధులని అడ్డగించారు’’ యమధర్మరాజు ఆజ్ఞాపించాడు.
 కిక్కురుమంటే శిక్ష పెరుగుతుందని అంతా భయపడి నోరు మెదపకుండా కానిస్టేబుల్స్ వెంట బయటికి నడిచారు. వాళ్ళు బయటికి వెళ్ళాక కారిడార్‌లోంచి పెద్దగా వారి మాటలు వినిపించాయి.
 ‘‘ఇంకో ముద్దాయి ఎవరు?’’ యమధర్మరాజు సిఐని అడిగాడు.
 ‘‘ఇతను సార్.’’
 ‘‘నేనే ముద్దాయిని సార్’’ కపీష్ చెప్పాడు.
 జీన్స్ పేంట్, టి షర్ట్ ధరించిన ఆ ఇరవై మూడేళ్ళ యువకుడి వంక ఆయన నిరసనగా చూసాడు. టి షర్ట్ మీద రాసింది చదివి మొహం ముడిచాడు. దాని మీద ఇలా రాసి ఉంది.
 ‘సేవ్ వాటర్. డ్రింక్ బీర్.’
 పోలీస్ ఇన్‌స్పెక్టర్ అందించిన స్టేట్‌మెంట్‌ని చదివి మెజిస్ట్రేట్ కపీష్ వంక చూసి కోపంగా అడిగాడు.
 ‘‘పేరు?’’
 ‘‘కపీష్.’’
 ‘‘అదేం పేరు? పిచ్చి పేరు?’’
 ‘‘వెరైటీ పేరని మా నాన్న పెట్టారు.’’
 ‘‘వెరైటీ పేరని ఈ మధ్య పిచ్చిపిచ్చి పేర్లు పెడుతున్నారు. కపీష్ అంటే అర్ధం తెలుసా?’’
 ‘‘ఆంజనేయస్వామి. మా నాన్న ఆంజనేయస్వామి భక్తుడు.’’
 ‘‘కపీష్ అంటే కోతి అని అర్థం.’’
 ‘‘ఛ!?!’’ కపీష్ సిగ్గుగా చెప్పాడు.
 ‘‘మీ నాన్న పేరు?’’
 ‘‘తిరుపతి.’’
 ‘‘ఊరి పేరు కాదు. నేనడిగింది మీ నాన్న పేరు.’’
 ‘‘నేను చెప్పింది కూడా మా నాన్న పేరే సార్. తిరుపతి.’’
 ‘‘ఊరు?’’
 ‘‘తిరుపతి.’’
 ‘‘కన్‌ఫ్యూజ్ కాకు. నేను అడిగింది మీ నాన్న పేరు కాదు. మీ నాన్న ఊరి పేరు.’’
 ‘‘మీరూ కన్‌ఫ్యూజ్ కాకండి సార్. నేను చెప్పింది కూడా మా నాన్న ఊరి పేరే.’’
 ‘‘అంటే ఆయన పేరు, ఆయన ఊరి పేరు తిరుపతే అంటావ్.’’
 ‘‘అవును సార్. అంటాను.’’
 ‘‘ఈ సంతకం నీదేనా?’’
 ‘‘యస్సార్.’’
 ‘‘దీన్ని చదివే పెట్టావా?’’ ఇంకా కోపంగా అడిగాడు.
 ‘‘యస్సార్.’’
 ‘‘ఎవరి బలవంతం లేదుగా?’’
 ‘‘నేను పుట్టాక నన్నెవరూ ఏ విషయంలో ఇంతదాకా బలవంతం చేయలేదండి.’’
 ‘‘అంటే నీ నేరాన్ని ఒప్పుకున్నట్లేగా. సరే. పధ్నాలుగు రోజులు రిమాండ్.’’
 ‘‘థాంక్ యు యువరానర్’’ చెప్పి సీఐ కానిస్ట్టేబుల్స్, ముద్దాయిలు ఇద్దరితో బయటికి నడిచాడు.
 ‘‘ఏమిటి యువర్ ఆనర్ గారు ఇవాళ ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నారు?’’ సీఐ బంట్రోతుని అడిగాడు.
 ‘‘సార్ భార్య హాస్పిటల్‌లో చావు బతుకుల్లో ఉంది సార్.’’
 ‘‘అయ్యో పాపం’’ కపీష్ చెప్పాడు.
   
 సీఐ ఇద్దరు ముద్దాయిలని పోలీస్‌వేన్ ఎక్కించి సరాసరి జైలుకి తీసుకెళ్ళాడు. కోర్టు ఆర్డర్‌తో పాటు వాళ్ళని జైలర్‌కి అప్పగించాడు.
 జైలర్ గార్డ్‌తో చెప్పాడు.
 ‘‘సీనియారిటీ ప్రకారం పంపు.’’
 ముందుగా లింబాద్రి వెళ్ళాడు. కొద్ది నిమిషాల్లో అతను జైలర్ గదిలోంచి బయటికి వచ్చాక జైలర్ కపీష్‌ని లోపలికి పిలిచాడు. అతని కేసు ఫైల్‌ని చదివి అడిగాడు.
 ‘‘ఏం చదువుకున్నావ్?’’
 ‘‘ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని సార్.’’
 ‘‘అబ్బో! ఏ బ్రాంచో?’’
 ‘‘ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సార్.’’
 ‘‘ఐటీలో సీట్ రాకా?’’
 ‘‘కాదు. ఈ బ్రాంచ్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువని.’’
 ‘‘కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్‌లో ఎంతొచ్చిందో?’’
 ‘‘ఎయిటీ సెవెన్ పర్సెంట్ సార్.’’
 ‘‘మరి? ఉద్యోగం చేసుకోకుండా దొంగతనానికి దిగావేమిటి?’’
 కపీష్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
 ‘‘రాలేదు సార్. రాదు కూడా సార్.’’
 ‘‘ఏం రాలేదు? ఏం రాదు కూడా?’’
 ‘‘ఉద్యోగం సార్.’’
 ‘‘ఫ్లేష్‌బేకా?’’
 ‘‘అవును సార్. నా ఆరో పుట్టినరోజుకి మా నాన్న నాకు ఎస్సై యూనిఫాం కొనిచ్చాడు. దాంతో ఫోటో కూడా తీసుకున్నాను. అలా మొదలైంది నేను పోలీస్ శాఖలో చేరాలనే కోరిక. రిపబ్లిక్ దినోత్సవంలో పోలీసు పతకాలు అందుకునే పోలీసులని టీవీలో చూశాక ఆ కోరిక తపనగా మారింది. ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దయి ఎప్పుడెప్పుడు ఎస్సై అవుదామా అనే తపన.’’
 ‘‘మరి ఎందుకు ఎస్సై కాలేదు? బదులుగా దొంగెందుకు అయ్యావు?’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement