ప్రవచన నిధి..మల్లాది
అది దాదాపు 1955–60 మధ్య కాలం .. గుంటూరులోని బ్రాడీపేట మైదానంలో పురాణ పఠనం జరుగుతోంది. దాదాపు పది వేల మంది కూర్చుని ఉన్నారు. అప్పట్లో మైకుల ఏర్పాటు అన్నిచోట్లా కుదిరేది కాదు. అయినా ఆ మైదానంలో చేరిన చివరి వ్యక్తికి సైతం ఒక కంఠం స్పష్టంగా విన్పిస్తోంది. శ్రావ్యంగా, మరింత వినాలనిపించే రీతిలో సాగుతున్న పురాణ పఠనం వారిని కట్టిపడేసింది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతమంతా ఒక శ్రోతగా మారిపోయింది.
అదే గుంటూరు ప్రాంతం. మహాభారత ప్రవచనం రెండేళ్లపాటు సాగింది. ఎన్నో గాథలు.. మరెన్నో కొత్త విషయాలు.. పిట్టకథలు.. సామాజిక కోణంలో కథనం.. ధర్మాచరణను నొక్కి చెప్పే నిగూఢ ప్రయత్నం.. సంప్రదాయాలు–విలువలు, నీతి నిజాయితీలు, ఆచరణీయాలు, నడవడిక, బతుకుకు అర్థం.. ఇలా ఒకటేమిటి, ధారాపాతంగా ఎన్నో విషయాలు.. ఆ రెండేళ్లూ ప్రతిరోజూ సాయంత్రం కాగానే ఆ మైదానానికేసి వేల మంది పయనం..అలాగే వరంగల్లో ఏడాది పాటు రామాయణ ప్రవచనం.. రాముడంటే ఓ పౌరాణిక పాత్ర కాదు, మనిషంటే ఇలా జీవించాలి అని శ్రోతలకు ఆలోచన పుట్టించే రీతిలో సాగిన పురాణం..ఆయన మాటే ఓ మంత్రం..ఆయనే మల్లాది చంద్రశేఖరశాస్త్రి.
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చు.. కానీ టీవీ చానళ్లలో నిత్యం వినిపించే ‘ప్రవచనాలకు’ మల్లాది చంద్రశేఖరశాస్త్రి ఆది. ఆయన 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మిం చారు. తల్లిదండ్రులు దక్షిణామూర్తి, అదిలక్ష్మ మ్మ ఆయనపై ఎక్కువగా ప్రభావం చూపినట్లు చెబుతారు. తన 15వ ఏట నుంచే చంద్రశేఖర శాస్త్రి ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు. అప్పటివరకు పురాణాలు చెప్పే తీరు వేరు.. మల్లాది వారు ప్రవచించటం ప్రారంభించిన తర్వాత అది మరో తీరు. రేడియోకు అతుక్కుపోయి పురాణ ప్రవచనం వినే వారి సంఖ్య అప్పట్లో లక్షల్లో ఉండేది.
పురాణ కాలక్షేపం అన్న మాట చాలాకాలం విస్తృత వినియోగంలో ఉండేది. కానీ.. అది తప్పని, పురాణ ప్రవచనం అనాలి కానీ పురాణ కాలక్షేపం అనకూడదని, కాలక్షేపం అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లేనని మల్లాది అనేవారు. పురాణం వినటం కాలక్షేపం కోసం కాదు, జీవన గమనాన్ని మార్చుకునేందుకన్న విషయాన్ని గుర్తించాలని చెప్పేవారు. పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని జీవితానికి అన్వయించుకోవాలని ఆయన బలంగా చెప్పేవారు.
96 ఏళ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన చివరివరకు నిత్యం ఏదో ఓ గ్రంథాన్ని పఠిస్తూ ఉండేవారు. వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, వేదాంత భాష్యంలో విశేష ప్రవేశం ఉన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులుగా సామాజిక హితం కోసం విశేష కృషి చేశారు. తన తాతగారైన రామకృష్ణ విద్వన్ మహాఅహితాగ్ని వద్దే ప్రధాన విద్యనభ్యసించారు. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునేలా ప్రవచనం చేయడంలో మల్లాది సుప్రసిద్ధులు.
సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించినట్టే..
టీవీలు విస్తృత ప్రాచుర్యంలోకి రాకముందు రేడియోల ద్వారానే ముఖ్య కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనం వినేవారు. వాటిల్లో ముఖ్యమైంది భద్రాద్రి రామకళ్యాణం. నాలు గైదు దశాబ్దాల క్రితం వరకు ఊరూరా రామనవమి వేడుకలు జరుగుతున్నా, భద్రాద్రి శ్రీ రామకల్యాణ వ్యాఖ్యానాన్ని రేడియోలో వినటానికి భక్తులు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ కణ్యాణ వ్యాఖ్యానంలో మల్లాదివారే కీలకం. చంద్రశేఖర శాస్త్రి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా వ్యాఖ్యానిస్తూంటే రేడియో సెట్ల ద్వారా దాన్ని వింటూ భక్తకోటి ప్రత్యక్షంగా తిలకిస్తున్న అనుభూతి పొందేవారు.
ఆ తరహా వ్యాఖ్యానాన్ని ప్రారంభించింది ఆయనే. ఇక ప్రభుత్వ పక్షాన అధికారికంగా ఉగాది పంచాంగ పఠనానికి కూడా ఆయ నే ఆద్యుడు. రాష్ట్రమంతటా ప్రవచనాలు చెప్పటం ద్వారా అన్ని ప్రాంతాల్లో ఆయన అభిమానాన్ని చూరగొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాది రెండేళ్ల పాటు ప్రవచనాలు కొనసాగేవి. తెలుగు–సంస్కృతంలో ప్రవచనం చెప్పగలిగిన ఒకేఒక పౌరాణికులు ఆయన. దీంతో ఆయనకు ప్రవచన సవ్యసాచి అన్న బిరుదు వచ్చింది. ఇక అభినవ వ్యాసులు, పౌరాణిక సార్వభౌములు, మహామహోపాధ్యాయ, పురాణ వాచస్పతి లాంటి మరెన్నో బిరుదులున్నాయి. రాజలక్ష్మీ పురస్కారాన్ని అందుకున్నారు.
మల్లాది మంచి మాటలు..
‘మతమనేది మనం సృష్టించుకున్న మాటనే. ఆ పేరుతో భేద భావం కూడదు. ధర్మాచరణే ముఖ్యమైంది..
’ సంతృప్తిని మించిన సంపద మరోటి లేదు. ధర్మంగా చేసే పనేదైనా, ఆదాయం ఎంతైనా సంతృప్తిగా ఉండాలి. పెద్ద సంపాదన ఉంటే అహంకారంతో ఉండటం సరికాదు. సదా దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి’
‘నా మాట వినేందుకు వచ్చేవారు పేదలా, ధనవంతులా, పండితులా, పామరులా అన్న ఆలోచన నాలో ఉండదు. చెప్పే విషయాల్లో లీనమై ప్రవచిస్తాను. ధర్మంతో కూడుకున్న మాటలే చెబుతాను. నేను మాత్రమే గొప్పగా చెప్తానన్న అహంకారం నాలో లేదు.’