ఈ-కామర్స్‌లో ఉద్యోగాల ‘క్లిక్’ | Jobs in e-commerce sector in demand among B-school, engineering graduates | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌లో ఉద్యోగాల ‘క్లిక్’

Published Mon, Nov 3 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

ఈ-కామర్స్‌లో ఉద్యోగాల ‘క్లిక్’

ఈ-కామర్స్‌లో ఉద్యోగాల ‘క్లిక్’

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగ కంపెనీల్లో పనిచేసేందుకు ఇంజనీరింగ్, బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎఫ్‌ఎంసీజీ, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెలికం, రియల్ ఎస్టేట్, విద్యుత్, మౌలిక రంగాలతో పోలిస్తే ఇ-కామర్స్ వైపు అత్యధికులు మొగ్గు చూపుతున్నారని అసోచాం చెబుతోంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐఐఎం, బిట్స్, ఇక్ఫాయ్ వంటి కళాశాలలకు చెందిన 500 మందికిపైగా విద్యార్థులపై అసోచాం సర్వే నిర్వహించింది.

వీరిలో 71 శాతం మంది ఈ-కామర్స్‌ను ఇష్టపడ్డారు. అలాగే ఈ రంగంలో పెట్టుబడి పెట్టి విజయవంతంగా వ్యాపారం చేయాలనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు. పలు బిజినెస్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆన్‌లైన్ కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 65 శాతం పెరిగింది. గత సీజన్‌లో ఇది 35 శాతమేనని అసోచాం సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. 2010-14 కాలంలో ఆన్‌లైన్ వ్యాపారం అసాధారణ రీతిలో 60 రెట్లు పెరిగిందని వెల్లడించారు. భారత ఇ-కామర్స్ రంగంలో 30 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

అలాగే పరిశ్రమకు అనుబంధంగా మార్కెటింగ్, ఐటీ, సరుకు రవాణా, చెల్లింపులు తదితర విభాగాల ద్వారా మరో 1.8 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందని అసోచాం తెలిపింది. నియామకాల వృద్ధి 60-65 శాతం వృద్ధి చెందుతుందని, తద్వారా 3-5 ఏళ్లలో 5 నుంచి 8 లక్షల నూతన ఉద్యోగాలను ఈ రంగం సృష్టిస్తుందని వెల్లడించింది.

 ఉద్యోగులకు మంచి ప్యాకేజ్..
 ఈ-కామర్స్ కంపెనీలు రూ.10-25 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయని అసోచాం తెలిపింది. 2013తో పోలిస్తే ఇది 15-45 శాతం అధికమని వెల్లడించింది. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, ద్వితీయ శ్రేణి బిజినెస్ స్కూళ్ల విద్యార్థులకు ప్రైవేటు రంగంలో సరాసరి వేతనం రూ.4-7 లక్షలుందని వివరించింది. ఐటీ, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, అనలిటిక్స్, బ్యాక్ ఆఫీస్, మార్కెటింగ్, కంటెంట్ రైటర్స్, స్టైలిస్ట్స్, ఫోటోగ్రాఫర్స్, ఫ్యాషన్ డిజైనర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసింది.

 కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ వంటి విధుల్లో ఫ్రెషర్లకు వార్షిక ప్యాకేజీ రూ.2-3.5 లక్షలు ఉంది. మేనేజ్‌మెంట్, టెక్నికల్ విభాగాల్లో ప్రారంభ వేతనం రూ.8-14 లక్షల మధ్య ఉందని అసోచాం తెలిపింది.


 భారీగా నిధులు..: అమ్మకాల బూస్ట్‌కుతోడు విదేశీ   పెట్టుబడులతో భారత ఈ-కామర్స్ కంపెనీలు జోరుమీదున్నాయి. మౌలిక వసతులు, రవాణా, గిడ్డంగుల ఏర్పాటుకు ఈ-కామర్స్ కంపెనీలకు ఇప్పటికిప్పుడు రూ.3,000 కోట్లు, 2017 నాటికి రూ.5,700-11,400 కోట్లు అవసరమవుతాయి. త్వరలోనే పబ్లిక్ లిస్టింగ్‌కు ఈ కంపెనీలు వెళ్తాయని ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్ ఆపరేషన్స్ డెరైక్టర్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు.

 మిగిలేవి రెండు మూడే..
 2019కల్లా దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న రెండు మూడు దిగ్గజ సంస్థలు మాత్రమే ఈ రంగంలో నిలుస్తాయని స్పైర్ రీసెర్చ్, కన్సల్టింగ్ సీనియర్ డెరైక్టర్ జప్‌నిత్ సింగ్ అంటున్నారు. చిన్న చిన్న కంపెనీలు పెద్ద సంస్థల్లో విలీనం అవుతాయని జోస్యం చెప్పారు. భారత్‌లో 24.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదార్లున్నారు. ఈ-కామర్స్ పరిశ్రమ 38 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. రూ.90 వేల కోట్లుగా ఉన్న పరిశ్రమ ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement