
అమెజాన్‌తో 14 వేల ఉద్యోగాలు
- నగరంలో భారీ క్యాంపస్ ఏర్పాటు
- శంకుస్థాపన చేసిన కేటీఆర్
- 10 ఎకరాల్లో.. రూ.1,400 కోట్లతో నిర్మాణం
- అమెరికా తర్వాత అమెజాన్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం
- 2019 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
- త్వరలో యాపిల్, గూగుల్ కార్యాలయాలు: కేటీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ సంస్థ నగరంలో భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ, ఐటీఈఎస్ సెజ్ వద్ద నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌కు మంత్రి కె.తారకరామారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా. అమెజాన్ క్యాంపస్ కోసం ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
అందులో భారత్‌తో పాటు అంతర్జాతీయ కార్యకలాపాలకు బ్యాక్ ఆఫీస్‌గా ఉండటం కోసం రూ.1,400 కోట్లతో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అమెరికా తరువాత అమెజాన్ సంస్థకు ఇదే అతి పెద్ద కేంద్రం కావడం గమనార్హం. నగరానికి సమీపంలోని కొత్తూరు వద్ద 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ భారీ గిడ్డంగిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఏడాదిలోపే మరోసారి తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకు రావ డం విశేషం. 2019లో ఈ క్యాంపస్ పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.
జూన్‌లో యాపిల్ రాక..: రాష్ట్రంలో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండటంతో ఇది మరిన్ని ఈ-కామర్స్, ఐటీ కంపెనీలు రావటానికి దోహదపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందనటానికి ఇది సూచన. రాష్ట్రంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ఈ-కామర్స్ కంపెనీల కోసం నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించాం. స్థానిక చేతివృత్తుల ఉత్పత్తులను కూడా అమెజాన్‌లో విక్రయించేలా ఆ సంస్థతో కలసి పనిచేస్తున్నాం. ఈ సంస్థతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో గూగుల్ కొత్త క్యాంపస్‌కు మే లేదా జూన్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కూడా హైదరాబాద్‌లో ప్రతిపాదిత టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనుంది.
అది కూడా జూన్‌లో జరిగే అవకాశం ఉంది...’’ అని చెప్పారు. కాగా సంస్థ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్య దేశాల్లో భారత్ ఒకటని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ జపోస్కీ చెప్పారు. కంపెనీ ఐటీ కార్యకలాపాలకు 2005 నుంచి తెలంగాణ కేంద్ర బిందువైందని పేర్కొన్నారు. నాణ్యమైన మానవ వనరులు, మౌలిక వసతులు, ప్రగతిశీల ప్రభుత్వం.. వీటన్నిటివల్లే ఈ భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.