women in tech
-
TeamLease: మహిళా టెకీలకు డిమాండ్
ముంబై: వచ్చే మూడేళ్లలో (2027 నాటికి) టెక్యేతర వ్యాపారాల్లో మహిళా టెకీల పాత్ర దాదాపు పాతిక శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ ధోరణి అన్ని స్థాయుల్లో (ఫ్రెషర్లు, జూనియర్, మిడ్–సీనియర్, లీడర్షిప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్) ఉండనుంది. టీమ్లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో నాన్–టెక్ పరిశ్రమల్లో టెక్నాలజీ విధులు నిర్వర్తిస్తున్న మహిళల సంఖ్య 19.4 లక్షలుగా ఉండగా ఇది 2027 నాటికి 24.3 శాతం పెరిగి 24.1 లక్షలకు చేరనుంది. నాన్–టెక్ రంగాల్లో పని చేస్తున్న మొత్తం మహిళా సిబ్బందిలో 0.5 శాతం మంది మాత్రమే టెక్ ఉద్యోగ విధుల్లో ఉన్నారని, ఈ విభాగంలో వారి వాటా మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుండటం, మహిళల ఆధారిత కార్యక్రమాలు జరుగుతుండటం వంటి అంశాల ఊ తంతో ఈ ఏడాది మహిళా టెకీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రాల వారీగా చూస్తే రాబోయే నెలల్లో మహిళల నియామకాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో అధికంగా ఉండనున్నాయి. చెన్నై, పుణె, నాసిక్, కోయంబత్తూర్, కోచి, ఔరంగాబాద్, వదోదర వంటి నగరాల్లో హైరింగ్ ఎక్కువగా ఉంది. -
విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఇండియా కంపెనీ విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఏడాది కాలంలో పది లక్షల మంది మహిళలకు ఐటీ శిక్షణ ఇవ్వడానికి, ఐటీ రంగంలో వారికి మార్గదర్శకంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం భారత ఐటీ రంగంలో పది లక్షల మంది మహిళలున్నారని, కొన్నేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయడం లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్ధినులు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(ఎస్టీఈఎం-స్టెమ్) విద్యార్ధినులు, మహిళా ఐటీ ఉద్యోగులు, ఎంటర్ప్రెన్యూర్ల కోసం ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ ఎవాంజలిస్ట్ జోసెఫ్ లండేస్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థినులు ఒక ఐటీ ఉద్యోగిగా కానీ, సొంత ఐటీ వెంచర్ ప్రారంభించగల వ్యక్తిగా గానీ ఎదిగేందుకు తగిన తోడ్పాటునందిస్తామని వివరించారు. ఐటీని కెరీర్గా తీసుకునేలా బాలికలను, టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్లుగా మారేందుకు మరింత మంది మహిళలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.