సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ అగ్రగామి
⇒ మిస్సోరి రాష్ట్ర ప్రతినిధులతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
⇒ టీ–హబ్, టీ–రెక్స్ ఇంక్యూబేటర్ మధ్య ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగం గా అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర ప్రతినిధులు సోమవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమ య్యారు. అనంతరం పరిశోధనలకు ఊతమి చ్చేందుకు టీ–హబ్, సెయింట్ లూయిస్ పట్టణంలో ఉన్న టీ–రెక్స్ ఇంక్యూబేటర్ కలసి పనిచేసేందుకు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ)ను కుదుర్చుకున్నా రు. సిలికాన్ వ్యాలీలో తాము ఏర్పాటు చేసిన టీ–బ్రిడ్జ్ భాగస్వామిగా టీ–రెక్స్ పనిచేయడం ద్వారా అక్కడ ఉన్న టెక్నాలజీ, ఇక్కడ టీ–హబ్‌లో ఉన్న ఆవిష్కరణలకు మధ్య ఒక వారధిలాగా ఈ ఎంవోయూ పనిచేస్తుందన్నారు.
మిస్సోరి లో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. మిస్సోరిలో ఉన్న అత్యుత్తమ విద్యాసంస్థలు, వ్యాపారావకాశాలను మంత్రికి వివరించింది. తెలంగాణలోని కంపెనీలతో మిస్సోరీలోని కంపెనీలతో వ్యాపార, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తామని ప్రతినిధుల బృందం తెలిపింది. రాష్ట్రంలో విద్యా, వ్యాపార రంగా ల్లో ఉన్న అవకాశాలను తమ పర్యట నలో పరిశీలించనున్నట్టు బృంద సభ్యులు మంత్రికి తెలిపారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ, టీ–హబ్, జినొ మ్ వ్యాలీ, ఇక్రిశాట్ వంటి సంస్థలను మూడు రోజుల్లో సందర్శిస్తామన్నారు.
ఉస్మానియా వర్సిటీతో డ్యూయల్ డీగ్రీ కార్యక్రమం ఏర్పాటు చేసుకు నే అవకాశాలను మిస్సోరి బృందం పరిశీలిం చనుంది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానుంది. మిస్సోరి అభివృద్ధిలో కీలకమైన మిస్సోరీ పార్ట్‌నర్‌షిప్ సంస్థ ప్రతినిధులు, సెయింట్ లూయిస్ రీజినల్ చాంబర్, మిస్సోరి ప్రభుత్వాధికారులు బృందంలో ఉన్నారు. సమావేశంలో హైదరాబాద్ అమెరికన్ కాన్సు లేట్ జనరల్ క్యాథరిన్ హెడ్డా ఉన్నారు.