బుధవారం హైదరాబాద్‌లో ‘టీ–యాప్ ఫోలియో’ను రిమోట్ ద్వారా ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో జయేశ్ రంజన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘భారతీయులు సులువుగా, వేగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. సాంకేతికత పట్ల మక్కువ, అందిపుచ్చుకునే విషయంలో విజ్ఞత భారతీయుల్లో ఎక్కువ. ప్రపంచంలో మరే దేశంలో వినియోగించుకోని విధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లను దేశంలో వినియోగిస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా, సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకున్నా దాని వల్ల కలిగే ఫలితాలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తే అద్భుతాలు సాధించవచ్చు. మొబైల్ ఫోన్‌తో వివిధ రకాల పౌర సేవలందించేందుకు ప్రవేశపెట్టిన టీ–యాప్ ఫోలియోను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారని నమ్మకముంది’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సేవలను మొబైల్ ఫోన్ ద్వారా పౌరులకు అందించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) శాఖ రూపొందించిన ‘టీ–యాప్ ఫోలియో’యాప్‌ను మంత్రి బుధవారం ఆవిష్కరించారు.
ఏడాదిలో 1,000 రకాల సేవలు
వివిధ శాఖల సేవలన్నీంటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి యాప్ రూపంలో నిక్షిప్తం చేయడం ద్వారా మొబైల్ గవర్నెన్స్ (ఎం–గవర్నెన్స్) సేవల వైపు అడుగులు వేశామని కేటీఆర్ చెప్పారు. ‘మొబైల్ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను అందించడంలో కర్ణాటక తర్వాత దేశంలో రెండో రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో యాప్‌ను రూపొందించాం. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను వినియోగించుకోవచ్చు. తొలుత 150 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ల్యాండ్ రికార్డులు, రేషన్ సరఫరా, అత్యవసర సహాయం తదితర సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఏడాదిలో 1,000 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’అని వివరించారు.
ప్రజల చేతి వేళ్లపై పాలన..
సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని పుంతలు తొక్కినా సాధారణ ప్రజలకు ప్రయోజనం లేకపోతే నిరర్థకమని సీఎం కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార శూన్యం నుంచి సమాచార విప్లవం వచ్చిందని.. దేశ జనాభాకు సమాన సంఖ్యలో దేశంలో మొబైల్ ఫోన్లు ఉన్నాయన్నారు. ప్రజల చేతి వేళ్లపై పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ‘హైదరాబాద్ నగరంలో పౌర సేవల కోసం తెచ్చిన ‘మై జీహెచ్‌ఎంసీ’యాప్‌ను ఇప్పటివరకు 3 లక్షల మంది, ‘మై ఆర్టీఏ’యాప్‌ను 30 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. బ్లాక్ చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కొత్త సాంకేతిక పరిజ్ఞానాల గురించి నిత్యం పత్రికల్లో వస్తోంది, ప్రజలకు సేవలందించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటాం. ల్యాండ్ రికార్డుల నిర్వహణలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం’అని పేర్కొన్నారు.
‘మీ–సేవ’ నిర్వాహకులకు ఆందోళన వద్దు
రాష్ట్రంలో 4,500కి పైగా మీ–సేవ కేంద్రాలున్నాయని, వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వారి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ–యాప్ ఫోలియోను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలకు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజల సౌలభ్యత కోసమే టీ–యాప్ ఫోలియోను తీసుకొచ్చామని, మీ–సేవ కేంద్రాల నిర్వాహకుల పొట్టగొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment