టెక్నాలజీలో మన పోలీసులు సూపర్
⇒ సీఎం నమ్మకాన్ని పోలీసు శాఖ నిలబెట్టింది: మంత్రి కేటీఆర్
⇒ మున్సిపల్ విభాగంలోనూ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
⇒ సీసీటీఎన్‌ఎస్ గో లైవ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులకు అందనంతగా టెక్నాలజీని వినియో గించి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాని మోదీ అభినందనలు పొందిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మంగళవారం ఇక్కడ ఆయన పోలీస్ కంప్యూటర్ సర్వీస్, టెక్నికల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సీసీటీఎన్‌ఎస్(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్) గో లైవ్ ప్రాజెక్ట్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతో కలసి ప్రారంభించారు. తాను నిజాం కాలేజీలో చదువుతున్నప్పు డు బైక్‌పై వన్ వేలో రైడ్ చేస్తే పోలీసులు పట్టుకొని ఫైన్ వేసిన సందర్భాన్ని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.
ఇప్పుడంతా ఈ–చలాన్ ద్వారా జరిమానాలు వేయడం టెక్నాలజీ పోలీసింగ్‌కు నిదర్శన మన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం ముందు నుంచి శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పేవారని, ఆ నమ్మకంతోనే పోలీస్ శాఖకు తోడ్పాటు అందించా రన్నారు. సీఎం నమ్మకాన్ని డీజీపీ అనురాగ్ శర్మ, రాష్ట్ర పోలీస్ శాఖ ఏడాదిలోనే నిజం చేసి చూపార న్నారు. హైదరాబాద్ పోలీస్ తీసుకొచ్చిన ఆర్టీఏ–ఎం వ్యాలెట్ నగరంలో 12 లక్షల మంది, హ్యాక్‌ఐ యాప్‌ను 5 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకు న్నారన్నారు. త్వరలో మున్సిపల్ కార్యాలయా ల్లోనూ రిసెప్షన్ సెంటర్లను ప్రారంభిస్తానన్నారు.
హోం శాఖ వద్దన్నా: నాయిని
ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేసీఆర్ తన మంత్రి వర్గంలో తనకు హోంశాఖ ఇస్తున్నానని చెప్పగా.. తాను నిరాకరించానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. తాను నిత్యం పోలీసులపైనే పోరాటాలు చేసి నాయకుడిగా వచ్చానని, ఇప్పుడు మళ్లీ అదే పోలీస్‌తో వాదించలేనని సీఎంకు చెప్పగా.. ‘అన్నా.. నేనున్నా కదా..’ అని వారించి హోంశాఖ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు హోంశాఖ మంత్రిగా చాలా గర్వపడుతున్నానన్నారు.
సామాన్యుడిలా ఫిర్యాదు చేశా..
తన స్నేహితుడొకరు సర్జన్‌గా పని చేస్తున్నాడని, ఆయన భార్య మార్కెట్‌కు వెళ్తుంటే కొందరు టీజిం గ్‌కు ప్రయత్నిస్తే తనకు ఫోన్ చేసి చెప్పాడని కేటీఆర్ అన్నారు. తాను మంత్రిగా కాకుండా సాధారణ వ్యక్తి గా డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని, 2 గంటల్లోనే టీజింగ్ యత్నించిన వ్యక్తులను అరెస్ట్‌చేసి, ఫీడ్ బ్యాక్ కోసం 3 సార్లు కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్లు చేశారన్నారు. పోలీస్ నియామకాల ద్వారా వచ్చే 10 వేల మంది సిబ్బందితో వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేయాలని డీజీపీని మంత్రి కోరారు.