ఏటీఎంలకు ‘ఎక్స్‌పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్‌పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్‌పీ మూడు జనరేషన్‌లు వెనకబడి ఉంది.
వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కూడా హెచ్చరించింది.