మోడీ వస్తే చిన్న ర్యాలీ... రాకపోతే భారీ పతనమే!
మరి ఈసారో?...
సగటు ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ వర్గాలు మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 250-270 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్కెట్లు పరుగులు తీశాయి. గత 5 రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లు భారీగా పెరగడంతో అప్పర్ సర్క్యూట్‌కి(20% పెరగడం) అవకాశాల్లేవని, ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటే లోయర్ సర్క్యూట్‌ను (20% తగ్గడం) తాకొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ గరిష్టంగా 20% పెరగడం లేదా తగ్గడం జరిగితే, ఆ రోజుకి ఇక ట్రేడింగ్ ఆపేస్తారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం స్టాక్ మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం సూచీలు 15 శాతానికి పైగా పెరగడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో 20% కదలికలకు మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. ప్రస్తుతం నిఫ్టీ 7,100 స్థాయి వద్ద ఉంటే పెరిగితే 8,000-8,500 స్థాయి వరకు వెళ్ళొచ్చన్న నమ్మకంతో ట్రేడర్లు కాల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే 6,000-5,500 స్థాయి వరకు పడొచ్చన్న ఉద్దేశ్యంతో ట్రేడర్లు పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. ర్యాలీ జరిపితే కాల్ ఆప్షన్ కొన్నవారికి, తగ్గితే పుట్ ఆప్షన్ కొన్నవారికి లాభం వస్తుంది.
ఎగ్జిట్ పోల్ ప్రభావం ఎంత?
గత రెండు ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. 2004లో అందరూ ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్ అంచనాలు వస్తే దానికి భిన్నంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అలాగే 2009లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రాదని, థర్డ్ ఫ్రంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల మద్దతు అవసరం లేకుండానే యూపీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఇంకోటుంది. 2004 ఫలితాల తర్వాత సూచీలు కుప్పకూలినా.. ఆ తర్వాతి కాలంలో ఎన్నడూ ఊహించనంత లాభాలందించాయి. 2009 లో స్వల్పకాలానికి పెరిగినా ఆ తర్వాత కుప్పకూలి పరిమిత శ్రేణిలో కదిలాయి.
అప్పర్ సర్క్యూట్ చాన్స్ తక్కువే
ఎన్నికల ఫలితాల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం కానుండటంతో 9.15కల్లా ఫలితాల సరళిపై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మార్కెట్లు ప్రారంభంలోనే కొద్దిగా గానప్ అప్ లేదా గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల అంచనా వేస్తున్నారు. ఎన్‌డీఏకి 280 వరకు సీట్లు వస్తాయని అంచనాతో మార్కెట్లు ఇప్పటికే పెరగడంతో వాస్తవ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాసరే మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చన్నారు. ఒకవేళ ఎన్‌డీఏ కూటమి 220-240 దగ్గరకొచ్చి ఆగిపోతే భారీ పతనం తప్పకపోవచ్చన్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉండకుండా, చివరివరకూ ఊగిసలాట ధోరణిలో ఉంటే మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయన్నారు. రేపటి ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి ఎన్ని, బీజేపీఒంటిరిగా ఎన్ని సీట్లు సాధిస్తున్నది అన్న అంశాలను పరిశీలించాలంటున్నారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. ఎన్‌డీఏ కూటమి 300 సీట్లు దాటితే 10% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
కేవలం బీజేపీ సీట్లు 220 లోపునకు పరిమితం అయినా, ఎన్‌డీఏ కూటమి 230లోపు ఆగినా, థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా సూచీలు లోయర్ సర్క్యూట్ తాకుతాయని సతీష్ పేర్కొన్నారు. స్వల్ప మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెన్సెక్స్ కేవలం 150 నుంచి 200 పాయింట్లు పెరుగుతుందని, అదే ఫలితాలు భిన్నంగా ఉంటే 2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఎడల్‌విస్ ఫైనాన్షియల్ మేనేజింగ్ పార్టనర్ అంబరీష్ బాలిగ పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం వస్తే రానున్న 12-18 నెలల్లో నిఫ్టీ 8,700 వరకు పెరుగుతుందని, అదే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సూచీలు 15-20% నష్టపోయి 3-6 నెలల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దిశ తీసుకుంటుందనేది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా.
ఎన్నికల తర్వాత...
సంవత్సరం రెండు రోజుల్లో
1999 6.05%
2004 -16.56%
2009 17.34%