settlement option
-
సెబీ సెటిల్మెంట్ స్కీమ్ కింద10,980 కంపెనీలు
న్యూఢిల్లీ: ఇల్లిక్విడ్ స్టాక్ ఆప్షన్లలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. సెటిల్మెంట్ స్కీమ్ 2022 పేరుతో వీటిని పరిష్కరించుకునే అవకాశం సెబీ కల్పించగా, దీన్ని పెద్ద సంఖ్యలో కంపెనీలు వినియోగించుకున్నాయి. 10,980 కంపెనీలు తమపై కేసులను సెబీ వద్ద పరిష్కరించుకున్నాయి. ఈ పథకం కింద దరఖాస్తుకు 2022 ఆగస్ట్ 22 నుంచి నవంబర్ 21 వరకు మూడు నెలల పాటు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2023 జనవరి 21 వరకు పొడిగించారు. ‘‘మొత్తం 10,980 కంపెనీలు ఈ పథకం కింద కేసులను పరిష్కరించుకున్నాయి. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాయి’’అని సెబీ తన ప్రకటనలో తెలిపింది. -
ప్యానాసానిక్ ‘ఎల్యూగా యు’@ రూ.18,990
న్యూఢిల్లీ: ప్యానాసానిక్ కంపెనీ ఎల్యూగా సిరీస్ స్మార్ట్ఫోన్లను బుధవారం భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల మొదటివారం నుంచి ‘ఎల్యూగా యు’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు. ధర రూ.18,990 అని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే, 16 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్-2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. 15 స్మార్ట్ఫోన్లు: రానున్న కొన్ని నెలల్లో 15కు పైగా కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేనున్నామని మనీష్ శర్మ తెలిపారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ వాటా ప్రస్తుతం 3 శాతమని, ఏడాదిలో దీనిని 5 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా 15కు పైగా స్మార్ట్ఫోన్లను, 8 ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తేనున్నామని పేర్కొన్నారు. అయితే స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. భారత్ కేంద్రంగా తమ మొబైల్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. సరైన ధరలకు నాణ్యత గల మొబైళ్లనందించే తమలాంటి కంపెనీలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. -
ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే
న్యూఢిల్లీ: పన్ను పరిధిని పెంచడంతో పాటు అప్రకటిత ఆదాయానికి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆర్థికంగా వృద్ధిచెందుతున్న కొన్ని నగరాల్లో లగ్జరీ కార్ల కొనుగోలు, పెట్టుబడులపై వడ్డీ, వ్యక్తిగత వ్యయం, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మూలధన రాబడి (క్యాపిటల్ గెయిన్స్) తదితర లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, కొచ్చి, లక్నో, భోపాల్, గువాహటిల్లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా నిఘా, నేర పరిశోధన కార్యాలయం(డీఐసీఐ)ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. గువాహటిలో షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో భారీగా చేసే వ్యక్తిగత ఖర్చులను, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులను, భవనాల కొనుగోళ్లను అధికారులు విశ్లేషించనున్నారు. బెంగళూరులో కార్పొరేట్ బాండ్లు, సహకార రుణ సంఘాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడులపై వ్యక్తులకు వచ్చే వడ్డీని అక్కడి ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. తమిళనాడులో ఇసుక తవ్వకం, కలప దిగుమతుల్లోకి వచ్చే పెట్టుబడులపై చెన్నైలోని ఐటీ ఉద్యోగులు ఆరా తీయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీబీడీటీ, ఐటీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి.. ఐటీ రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది. -
ఫ్లిప్‘కార్ట్’లోకి 6 వేల కోట్లు
దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద నిధుల సమీకరణగా రికార్డు వ్యాపార విస్తరణ, మొబైల్ కామర్స్‌కు వినియోగిస్తామంటున్న కంపెనీ ఐపీఓ ఆలోచనలేదని స్పష్టీకరణ... తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ. 42,000 కోట్లుగా అంచనా బెంగళూరు: దేశీ ఈ-కామర్స్ అగ్రగామి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లోనేకాదు.. నిధుల సమీకరణలోనూ బిలియన్ డాలర్ల రికార్డును నమోదు చేసింది. ఇన్వెస్టర్ల నుంచి తాజాగా బిలియన్ డాలర్ల(సుమారు రూ.6,000 కోట్లు) నిధులను సమీకరించినట్లు మంగళవారం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పటివరకూ భారత్‌లోని ఆన్లైన్ షాపింగ్ రంగంలో ఇదే అతిపెద్ద నిధుల సమీకరణ కావడం గమనార్హం. ఇప్పటికే కంపెనీలో పలు వెంచర్ క్యాపిటల్(వీసీ), ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో ప్రస్తుత వాటాదారులైన టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, నాస్పర్స్‌తో పాటు సింగపూర్‌కు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్, జీఐసీ, యాక్సెల్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్, ఐకానిక్ క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంటల్, సోఫ్నియాలు ఉన్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో ఎవరికి ఎంత వాటాలున్నాయన్న వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఇదిలాఉండగా.. ఈ భారీ నిధుల సమీకరణ నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ(వేల్యుయేషన్) దాదాపు రూ.42,000 కోట్లకు ఎగబాకినట్లు పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే డీఎస్టీ గ్లోబల్ 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఫిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. తాజా పెట్టుబడులను కలిపితే కంపెనీ ఇప్పటిదాకా వివిధ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం 1.7 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. ఐపీఓ ప్రణాళికలేవీ లేవు... విక్రేతల సంఖ్యను పెంచుకోవడం, కస్టమర్లకు మరింత మెరుగైన సదుపాయాలు, పరిశోధన- అభివృద్ధి(ఆర్అండ్డీ), ఆన్లైన్-మొబైల్ సేవల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. భవిష్యత్‌లో తమ కంపెనీని మొబైల్ ఈ-కామర్స్‌లో దూసుకెళ్లేలా చేయడం... ఉత్పత్తులు, టెక్నాలజీలకు సంబంధించి వినూత్న ఒరవడులు తీసుకొచ్చేలా పెట్టుబడులు చేయనున్నామని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సచిన్ బన్సల్ పేర్కొన్నారు. తాము దీనిపై దృష్టిని కేంద్రీకరించేందుకు 2020కల్లా దేశంలో మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు ఎగబాకనుండటమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారేందుకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయన్నారు. పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) కి వచ్చే ప్రణాళికలు, ఆలోచనలేవీ లేవని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. ప్రజల నుంచి నిధులు సమీకరించేంత స్థాయికి ఇంకా తమ బిజినెస్ మోడల్ చేరుకోలేదన్నారు. అమెరికాలో ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో బన్సల్ ఈవిధంగా స్పందించారు. అనతికాలంలోనే.... 2007లో బెంగళూరు కేంద్రంగా సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పారు. ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, దుస్తులు ఇలా సమస్త ఉత్పత్తుల అమ్మకానికి వేదికగా నిలుస్తోంది. కంపెనీలో 14,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2.2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించింది. రోజుకు 40 లక్షలకుపైగా విజిట్స్(వెబ్సైట్లో సెర్చ్) నమోదవుతున్నాయి. నెలకు 50 లక్షల మేర ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. గతేడాదిలోనే బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును అందుకుంది కూడా. విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఈబేలతోపాటు స్నాప్‌డీల్ ఇతరత్రా దేశీ కంపెనీల నుంచి విపరీతమైన పోటీని తట్టుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ ‘మింత్రా’ను రూ.2,000 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. -
బీమాలో 49% ఎఫ్‌డీఐకి ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. తద్వారా ఈ రంగంలోకి రూ.25 వేల కోట్ల విదేశీ నిధుల రాకకు మార్గం సుగమం చేసింది. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ రంగంలో 26 శాతానికి మించిన పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతి అవసరమనీ, యాజమాన్య అజమాయిషీ మాత్రం భారతీయ ప్రమోటర్ల చేతుల్లోని ఉంటుందనీ పేర్కొన్నాయి. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి ప్రధాన సంస్కరణ ఇదే. రక్షణ, రైల్వేల వంటి రంగాల్లోని ఎఫ్‌డీఐ పరిమితులను సడలిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేబినెట్ ఆమోదించిన బీమా చట్టాల (సవరణ) బిల్లును ఇక పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఇవే నిబంధనలు పెన్షన్ రంగానికి కూడా వర్తిస్తాయి. దేశంలో లైఫ్, నాన్ లైఫ్ రంగాల్లో ప్రస్తుతం రెండు డజన్లకు పైగా ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు ఉన్నాయి. బీమా రంగానికి పెట్టుబడులు అవసరమనీ, కనుక ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచుతామనీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్వత్రా హర్షం... యాజమాన్యాన్ని భారతీయుల చేతిలో ఉంచుతూనే ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడంవల్ల ఈ రంగానికి అత్యంత అవసరమైన దీర్ఘకాలిక నిధులు వస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం బహుముఖ ప్రభావం చూపుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ బీమా రంగ అభివృద్ధి పునరుద్ధరణకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీ మెరుగుపడుతుంది. - అమితాబ్ చౌదరి, ఫిక్కీ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ బీమా రంగ సరళీకరణతో మోడీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందనే సందేశం గ్లోబల్ ఇన్వెస్టర్లకు వెళ్తుంది. దేశంలో ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటు పునరుద్ధరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది. - రాణా కపూర్, అసోచామ్ అధ్యక్షుడు భారతీయ ప్రమోటర్ల యాజమాన్య అజమాయిషీపై తగినంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మరో రూ.25 వేల కోట్ల వరకు అదనపు విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది. - శశ్వత్ శర్మ, కేపీఎంజీ (ఇండియా) భాగస్వామి పెట్టుబడుల సెంటిమెంటు పునరుద్ధరణకు ఎఫ్‌డీఐ పరిమితి పెంపు ఎంతగానో దోహదపడుతుంది. - శరద్ జైపురియా, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు ఎఫ్‌డీఐ పెంపునకు కేబినెట్ ఆమోదముద్రతో బీమా రంగానికి ఎంతో అవసరమైన దీర్ఘకాలిక మూలధనం సమకూరుతుంది. - రాజేశ్ సూద్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ -
మొండిబకాయిల సమస్య నుంచి గట్టెక్కినట్టే..చందా కొచర్
ఐసీఐసీఐ సీఈఓ, ఎండీ చందా కొచర్ ముంబై: దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ మొండి బకాయిల(ఎన్పీఏ) గడ్డు పరిస్థితుల నుంచి దాదాపు గట్టెక్కినట్లేనని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలికాలంలో బ్యాం కుల ఎన్పీఏలు ఎగబాకడం తీవ్ర ఆందోళనకలిగిస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా మొండిబకాయిలు, రుణాల పునర్వ్యవస్థీకరణలు కొంత పెరిగే అవకాశం ఉందని.. అయితే, క్రితం ఏడాది స్థాయిలో ఉండకపోవచ్చని కొచర్ పేర్కొన్నారు. కార్పొరేట్ రంగంలో ప్రాజెక్టులకు ఇక వేగంగా అనుమతులు లభిస్తాయని భావిస్తున్నామని.. నగదు ప్రవాహంలో ఏవైనా ఒత్తిడి ఉంటే తొలగించాల్సిన అవసరం ఉంద న్నారు. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థకు తక్షణ సమస్య ఎన్పీఏల పెరుగుదలేనంటూ తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. కాగా, తమ బీమా యూనిట్లకు(ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్) సరైన విలువ లభిస్తుందన్న విశ్వాసంవస్తే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కొచర్ పేర్కొన్నారు. తక్షణం తమ అనుబంద సంస్థల లిస్టింగ్ యోచనేదీ లేదని తేల్చిచెప్పారు. -
సిటీ గ్యాస్‌కు మంచిరోజులు!
న్యూఢిల్లీ: సహజవాయువు కేటాయింపు విధానంలో సమూల మార్పులకు మోడీ సర్కారు తెరతీయనుంది. ఇప్పటివరకూ ఉన్న ప్రాధాన్యత రంగాల్లో త్వరలోనే భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ కేటాయింపుల్లో యూరియాను తయారుచేసే ఎరువుల ప్లాంట్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతర్వాత ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు వరుసలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్న సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) ప్రాజెక్టులకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), అదేవిధంగా నగరాల్లో ఇళ్లకు నేరుగా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ని సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వంటి సీజీడీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఇక నుంచి ముందుగా గ్యాస్‌ను సరఫరా చేయాల్సి వస్తుంది. సీఎన్జీ, పీఎన్జీల వల్ల కాలుష్యం చాలావరకూ తగ్గుతుందని... అంతేకాకుండా సబ్సిడీతో విక్రయిస్తున్న డీజిల్, వంటగ్యాస్ల స్థానంలో వీటిని పెద్దమొత్తంలో అందించేందుకు వీలుందని ఆయావర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశీయంగా రోజుకు 77 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) గ్యాస్ సరఫరాల్లో ఐజీఎల్ వంటి సీజీడీ సంస్థలకు 8.32 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తోంది. కొత్త నగరాల్లో కూడా సిటీ గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ రంగం వృద్ధికి వీలుగా ప్రభుత్వం కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిపాదిత కొత్త కేటాయింపుల విధానం ప్రకారం ఇప్పటివరకూ ప్రాధాన్య రంగాలకు కాకుండా ఇతర రంగాలకు చమురు శాఖ నిర్ణయించిన కేటాయింపుల నుంచి కోత విధించి సీజీడీకి అవసరమైన సరఫరాలకు మొదటి ప్రాధాన్యం కింద ఇవ్వనున్నారు. సహజవాయువు నుంచి అధికంగా ఉపఉత్పత్తులను సంగ్రహించే ప్లాంట్లకు రెండో స్థానం లభించనుంది. ఇక అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి వ్యూహాత్మక రంగాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్లాంట్లకు కొత్త విధానంలో రెండో ప్రాధాన్య స్థానం దక్కనుంది. ఇక గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు నాలుగో స్థానం, విద్యుత్ ప్లాంట్లకు ఐదో ర్యాంక్ లభించనున్నాయి. ఉత్పత్తి పడిపోవడంతో... ప్రస్తుతం దేశీ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో సీజీడీ, ఎల్పీజీ రంగాలకు తప్ప ఇతర రంగాలన్నింటికీ కేటాయింపులను 2013-14 ఏడాదికి సరఫరా స్థాయిలవద్దే నిలిపేయాలని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2013-14లో ఎరువుల ప్లాంట్లకు 29.79 ఎంసీఎండీలు, విద్యుత్ ప్లాంట్లు 25.59, ఎల్పీజీ సంగ్రహణ ప్లాంట్లకు 1.83 ఎంసీఎండీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లకు 3.32, రిఫైనరీలకు 1.89, స్టీల్ ప్లాంట్లకు 1.32 ఎంసీఎండీల చొప్పున గ్యాస్ లభించింది. కాగా, కేజీ-డీ6 తదితర నెల్ప్ బ్లాక్‌లు, గుజరాత స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ)కు చెందిన దీన్‌దయాళ్ గ్యాస్‌ల నుంచి భవిష్యత్తులో పెరగనున్న ఉత్పత్తిని గతేడాది ఆగస్టు 23న సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యుత్ ప్లాంట్లకు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, మోడీ సర్కారు ఈజీఓఎంల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రాధాన్య రంగాల జాబితాలను కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) ఖరారు చేసి, త్వరలోనే తుది ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
దయతో బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా గ్రూప్ ఆస్తులను విక్రయించి రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్- సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన రూ.10,000 కోట్ల సమీకరించడానికి వీలుకలుగుతుందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసుకుంది. ఐటీ అఫిడవిట్‌కు 2 వారాల గడువు... కాగా కేసుకు సంబంధించి గ్రూప్ కంపెనీలు తనకూ రూ.7,000 కోట్ల పన్ను చెల్లింపులు జరపాల్సి ఉందని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వివరాలు తెలుపుతూ రెండు వారాల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. -
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వివిధ దేశాల నుంచి వస్తూత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో దేశీయ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ కుదేలవుతోంది. ఈ రంగంలో ఆధారపడ్డ లక్షలాది మంది భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. భార త సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ నిలబడాలంటే దిగుమతుల కట్టడి ఒక్కటే పరిష్కారమని అసోసియేషన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్(ఏఎస్‌ఎస్‌ఐ) కేంద్రానికి స్పష్టం చేసింది. వివిధ దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను ఢిల్లీలో కలిసి విన్నవించినట్టు ఏఎస్‌ఎస్‌ఐ కన్వీనర్ రాజ మహేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్ వ్యవస్థకు స్వస్తి పలకాలని కోరినట్టు చెప్పారు. పాత కంపెనీలకూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కంపెనీలకు ఇవ్వబోయే ప్రయోజనాలను పాత కంపెనీలకూ వర్తింపజేయాలని మంత్రిని కోరామని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలను తిరిగి కంపెనీలకు చెల్లించాలి. పెట్టుబడి పరిమితి విషయంలో రూ.1 కోటి వరకు సూక్ష్మ స్థాయి కంపెనీగా పరిగణించాలి. రూ.1-10 కోట్ల మధ్య చిన్నతరహా, రూ.10-25 కోట్ల మధ్య పెట్టుబడిని మధ్యతరహా కంపెనీగా పరిగణించాలి. రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడి సబ్సిడీని ప్రస్తుతమున్న రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలి’ అని మంత్రికి విన్నవించామన్నారు. రూరల్ క్లస్టర్లు.. ఉపాధిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని పారిశ్రామిక సంఘాలకు మంత్రి కల్రాజ్ మిశ్రా పిలుపునిచ్చారు. పరిశ్రమ డిమాండ్లను నెరవేరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్ల స్థాపనకు తాము సిద్ధమేనని మంత్రికి చెప్పామని రాజ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే విధాన నిర్ణయాల్లో తమనూ భాగస్వాములను చేయాలని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్‌రెడ్డి మంత్రిని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఫ్యాప్సీ, ప్లాస్టిక్, ఫౌండ్రీ అసోసియేషన్లు, అలీప్ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. -
ఆస్తులు అమ్ముకుంటాం.. పెరోల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆస్తుల విక్రయానికి వీలు కల్పిస్తూ తనకు కనీసం 40 రోజుల పెరోల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును గురువారం కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మదుపుదారుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు డబ్బు వసూలు చేసిన కేసులో గత 4 నెలలుగా ఆయన తీహార్ జైలులో కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు కట్టాలని కోర్టు షరతు విధించింది. ఈ నిధుల సమీకరణకు వీలు కల్పించాలని ఇప్పటికే సహారా చీఫ్ పలు ప్రతిపాదనలతో కోర్టు ముందుకు వచ్చారు. వీటిని సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుత పెరోల్ విజ్ఞప్తి ఈ దిశలో తాజాది. న్యూయార్క్, లండన్లలో లగ్జరీ హోటళ్లను విక్రయిస్తామని సహారా పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న ఆస్తుల విక్రయానికన్నా ముందు దేశీయంగా ఉన్న ఆస్తులను మొదట ఎందుకు విక్రయించకూడదని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సహారా న్యాయవాది రాజీవ్ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి ధావన్ సమాధానం ఇస్తూ, తద్వారా రూ.5,000 కోట్ల సమీకరణ కష్టమని వివరించారు. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్‌లోని డ్రీమ్ డౌన్‌టౌన్, ప్లాజా హోటళ్లను, అలాగే లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్‌ను తొలుత విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనితో... ఒకవేళ విదేశాల్లోని ఆస్తుల విక్రయింపు ప్రక్రియ పర్యవేక్షణ ఎలా అన్న విషయంలో సలహాలను ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని బెంచ్‌కు సూచించింది. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఐటీ షాక్... మరోవైపు గ్రూప్ చెల్లించాల్సిన పన్నుల విషయంలో ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ కూడా రంగంలోకి దిగింది. పన్నుగా సంస్థ రూ.7,000 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విచారణలో భాగంగా తమ వాదనలూ వినాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆదాయపు పన్నుకు సంబంధించి ఐటీ చేసిన వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీనిని కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తుందని తెలిపారు. -
ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్
విశాల్ మరింత వృద్ధి సాధిస్తారని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఆదాయాన్ని పెంచడంలో కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సఫలీకృత ం అయ్యారని నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన విశాల్ శిక్కా భవిష్యత్‌లో కంపెనీని మరింత వృద్ధిబాటన నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈవో శిబూలాల్ నుంచి శిక్కా ఆగస్ట్‌లో బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు లేదా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాకుండా ఇతర సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఇన్ఫోసిస్ సీఈవోగా ఎంపిక చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కాగా, ఇన్ఫీని గాడిలో పెట్టేందుకు రెండోసారి అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టారని, ఇకపై శిక్కా ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళతారని కామత్ వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి పదవీ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే. సానుకూల ధృక్పథంతోనే విజయాలను సాధించగలమని, ఇన్ఫోసిస్‌ను తాను ఈ దృష్టితోనే చూస్తానని చెప్పారు. నారాయణమూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్‌ను వీడారు. 1981లో ఆవిర్భవించిన ఇన్ఫోసిస్ 8 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) కంపెనీగా నిలిచింది. -
పోంజీ ఆర్డినెన్సుకు త్వరలో చట్ట రూపం
సెబీ చైర్మన్ సిన్హా ఆశాభావం న్యూఢిల్లీ: స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధానికి జారీ చేసిన ఆర్డినెన్సు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని సెబీ చైర్మన్ యు.కె.సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. మదుపర్లను మోసగిస్తూ అక్రమ పద్ధతుల్లో డిపాజిట్ల సేకరణ ఇప్పటికీ భారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పోంజీ వ్యతిరేక ఆర్డినెన్సును గతేడాది నుంచి ఇప్పటికి 3 సార్లు జారీ చేశా రు. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే చట్టరూపం దాలుస్తుంది. పన్ను ప్రయోజనాలపై స్పష్టత.. క్యాపిటల్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఆర్ఈఐటీ) వంటి కొత్త ప్రొడక్టులపై పన్ను ప్రయోజనాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిన్హా కోరారు. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, డెబిట్ సెక్యూరిటీలకు ట్యాక్స్ బెనిఫిట్లపైనా స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆర్‌ఈఐటీలకు సంబంధించిన నిబంధనలను సెబీ త్వరలోనే ఖరారు చేస్తుందనీ, అయితే పన్ను సంబంధ అంశాల్లో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామనీ తెలిపారు. ఏకరీతి పన్నులు అవసరం.. బాండ్ మార్కెట్లో లోటుపాట్ల తొలగింపునకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాల్సి ఉందని సెబీ చైర్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బాండ్లలో పెట్టుబడులు చేసే సంస్థలపై పన్ను రేట్లు భిన్న రకాలుగా ఉన్నాయని చెప్పారు. లోటుపాట్లున్నంత కాలం వీటిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సందేహిస్తారని అన్నారు. ఇన్వెస్టర్లందరిపైనా పన్నులు ఒకే రకంగా ఉండాలని తెలిపారు. -
బొగ్గు ఉత్పత్తి పెంచండి
కోల్ ఇండియాకు కేంద్ర మంత్రి గోయల్ ఆదేశం న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్ కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించారు. ‘బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తవ్వకాలు జరుపుతున్న గనుల నుంచి మరింత బొగ్గును వెలికితీసేందుకు అనుమతించాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖను కోరాం. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెరిగే విధంగా ఈ-వేలంలో బొగ్గు పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశించాం..’ అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీలన్నిటికీ సరఫరా చేసేందుకు బొగ్గు ఉత్పత్తిని 50-60 శాతం పెంచాలని కోల్ ఇండియాను కోరినట్లు చెప్పారు. దేశంలో విద్యుత్ కొరతకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రైవేట్ విద్యుత్ దిగ్గజాలు అనిల్ అంబానీ (రిలయన్స్ పవర్), గౌతమ్ ఆదానీ (ఆదానీ గ్రూప్), వినీత్ మిట్టల్ (వెల్స్పన్ ఎనర్జీ), నవీన్ జిందాల్ (జిందాల్ పవర్) తదితరులతో గోయల్ సమావేశం నిర్వహించారు. -
గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్ మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్‌ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది. -
హీరో ఆరో ప్లాంట్.. దక్షిణాదిన
స్థలం కోసం అన్వేషణ కంపెనీ సీఈవో పవన్ ముంజాల్ సావో పాలో: హీరో మోటోకార్ప్ ఆరో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దక్షిణ భారతదేశ మార్కెట్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా అక్కడ ఆరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. స్థలం కోసం అన్వేషిస్తున్నామని చెప్పిన ఆయన ఎప్పటికల్లా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు ప్లాంట్లు-ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని గుర్గావ్, దారుహెరల్లో టూవీలర్లను ఉత్పత్తి చేస్తోంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 69 లక్షలు. నాలుగో ప్లాంట్‌ను రూ.400 కోట్ల పెట్టుబడులతో రాజస్థాన్‌లోని నీమ్రాణాలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76.5 లక్షలు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నడుస్తోందని, త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ముంజాల్ పేర్కొన్నారు. ఇక గుజరాత్‌లోని హలోల్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో ఐదో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 18 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. దక్షిణ భారతంలో ఏర్పాటు చేయనున్న ఆరో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు పెరుగుతుంది. కాగా దేశీయంగా తమ వాహనాలు మంచి అమ్మకాలు సాధించగలవన్న ధీమాను పవన్ ముంజాల్ వ్యక్తం చేశారు. మరోవైపు తాము క్రీడలకు సంబంధించి టీమ్‌ను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని, కేవలం స్పాన్సరర్లుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఫుట్‌బాల్ క్రీడ అంటే ఇష్టమని వివరించారు. -
సంస్కరణల జోష్
మార్కెట్ల సరికొత్త రికార్డు25,500ను దాటిన సెన్సెక్స్ 184 పాయింట్ల లాభం 7,655 వద్ద నిలిచిన నిఫ్టీ 71 పాయింట్లు ప్లస్ రియల్టీ ఇండెక్స్ 6% హైజంప్ క్యాపిటల్ గూడ్స్, పవర్ 2% అప్ కొత్త ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన సంస్కరణల ఎజెండా మార్కెట్లకు జోష్‌నిచ్చింది. దీంతో మరోసారి స్టాక్ బుల్ కదం తొక్కింది. సెన్సెక్స్ 184 పాయింట్లు పుంజుకుని తొలిసారి 25,500 పాయింట్లను అధిగమించింది. 25,580 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 71 పాయింట్లు బలపడి 7,655 వద్ద స్థిరపడింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త రికార్డులు నమోదుకావడం విశేషం! నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించిన సంస్కరణల అజెండా ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. పార్లమెంట్ ఉభయసభలను ఉద్ధేశించి రాష్ర్టపతి ప్రణబ్ చేసిన ప్రసంగంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, ఉద్యోగ కల్పన, వృద్ధికి ఊపునివ్వడం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, వివాదరహిత పన్ను విధానాల అమలు వంటి ఆర్థిక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. వీటితోపాటు బొగ్గు, విద్యుత్, రైల్వేలు తదితర రంగాలకు ఊపునిచ్చే విధంగా ప్రకటించిన అజెండా అన్ని రంగాల షేర్లకూ డిమాండ్ పెంచింది. ప్రధానంగా 2022కల్లా అందరికీ ఇళ్లు కల్పించడం, 100 పట్టణాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలు రియల్టీ రంగానికి ఊపునిచ్చాయి. దీంతో రియల్టీ ఇండెక్స్ 5%పైగా దూసుకెళ్లింది.దీనితోపాటు క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, మెటల్, ఆటో రంగాలు సైతం 2.5-2% మధ్య లాభపడ్డాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్ గరిష్టంగా 25,645కు చేరగా, నిఫ్టీ కూడా 7,674ను తాకింది. విదేశీ మార్కెట్లు లాభపడటం కూడా సెంటిమెంట్‌కు జతకలిసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలోనూ సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. విదేశీ అంశాలూ ఉన్నాయ్: అమెరికా ఉద్యోగ గణాంకాలకుతోడు, చైనా వాణిజ్య గణాంకాలు మెరుగుపడటం, జపాన్ ఆర్థిక వృద్ధిపై అంచనాలు పెరగడం, యూరోజోన్ ఆర్థిక వ్యవస్థకు సహాయక ప్యాకేజీల అమలుపై ఈసీబీ సానుకూలంగా స్పందించడం వంటి విదేశీ అంశాలు కూడా దేశీయంగా సెంటిమెం ట్ను మెరుగుపరచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు గడిచిన శుక్రవారం రూ. 1,283 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) తాజాగా మరో రూ. 537 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 490 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బ్లూచిప్స్ పరుగు కోల్ ఇండియా, బజాజ్ ఆటో 5.5% చొప్పున జంప్‌చేయగా, ఎల్అండ్టీ, టాటా పవర్, గెయిల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, హీరోమోటో, టీసీఎస్ 3.8-1.5% మధ్య లాభపడ్డాయి. ఆరు షేర్లు వెనకడుగు సెన్సెక్స్ దిగ్గజాలలో ఆరు షేర్లు మాత్రమే వెనుకంజ వేయగా, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హెచ్‌యూఎల్ 2.3-1% మధ్య నష్టపోయాయి. యూనిటెక్ హవా: రియల్టీ షేర్లలో యూనిటెక్ 17%, డీబీ 15% చొప్పున దూసుకెళ్లగా, శోభా, ప్రెస్టేజ్, ఒబెరాయ్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, ఒమాక్స్ 10-3.5% మధ్య పుంజుకున్నాయి. సిమెంట్ షేర్లకు డిమాండ్ కొత్త ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టనుండటంతో సిమెంట్ షేర్లకు డిమాండ్ పుట్టింది. గ్రాసిం ఇండస్ట్రీస్ దాదాపు 12% జంప్‌చేయగా అంబుజా, ఏసీసీ, అల్ట్రాటెక్ 3.4-4.8% మధ్య పురోగమించాయి. చిన్న షేర్ల దూకుడు బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5-2% మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 2,307 లాభపడితే, కేవలం 778 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో మోతీలాల్ ఓస్వాల్, గ్రాఫైట్, పుర్వంకార, ఇండియా సిమెంట్స్, స్టెరిలైట్, థామస్‌కుక్, హెచ్‌సీసీ, ఐవీఆర్సీఎల్, ఉషా మార్టిన్ 15-9% మధ్య దూసుకెళ్లాయి. లక్ష కోట్లు ప్లస్ మార్కెట్ల పురోభివృద్ధి కారణంగా మొత్తం లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ(క్యాప్) ఒక్క రోజులో దాదాపు రూ. 1.05 లక్షల కోట్లు ఎగసింది. మొత్తం మార్కెట్ విలువ రూ. 90.36 లక్షల కోట్లను తాకింది. వెలుగులో రైల్వే షేర్లు ఇక రైల్వే షేర్లు టెక్స్మాకో, బీఈఎంఎల్, టిటాగఢ్, కెర్నెక్స్ మైక్రో, స్టోన్ ఇండియా 10-5% మధ్య పుంజుకున్నాయి. -
పీఎస్‌యూలకు భారీ రుణాలు వద్దు
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లకు భారీ రుణాలు మంజూరు చేయవద్దని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆదేశించింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలకు మేలు చేయడమే ఈ బ్యాంకుల రుణాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించింది. పీఎస్‌యూలకు పట్టణ సహకార బ్యాంకులు భారీ లోన్లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయా బ్యాంకులకు బుధవారం పంపిన సమాచారంలో ఆర్బీఐ తెలిపింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలు, రైతులు, చిన్నతరహా వ్యాపారుల రుణ అవసరాలు తీర్చడమే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేసింది. కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాలి: రాజన్ ద్రవ్య విధానాల్లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య మరింత సహకారం అవసరమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. పెద్ద దేశాల విధానాలు వర్ధమాన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని నివారించేందుకు ఆయా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాల్సి ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం టోక్యోలో ఏర్పాటు చేసిన సదస్సులో రాజన్ ప్రసంగించారు. ద్రవ్య విధానాలపై ఇతర దేశాల స్పందననూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానానికి ఎలాంటి పద్ధతీ లేకపోవడం ప్రగతికి, ద్రవ్యరంగానికి ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు. -
‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి. పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు... భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి. ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. -
పీఎస్‌యూ బ్యాంకుల మార్కెట్ వాటా పడిపోతుంది!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల మార్కెట్ వాటా 2025కల్లా 20% క్షీణించడం ద్వారా 60%కు పరిమితమవుతుందని రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అంచనా వేసింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో పీఎస్‌యూ బ్యాంకుల వాటా 2000లో 80%గా నమోదైంది. ప్రభుత్వం వాటాలు తగ్గించుకోవడం, బ్యాంకులు పనితీరు మెరుగుపరచుకోవడం వంటి చర్యలను చేపట్టకపోతే మార్కెట్ వాటా పడిపోతుందని తెలిపింది. కాగా, ఇదే సమయంలో ప్రయివేట్ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా మూడో వంతుకు పుంజుకోనున్నట్లు పేర్కొంది. 2000లో ప్రయివేట్ రంగ బ్యాంకుల వాటా 12%గా నమోదైంది. ఇక విదేశీ బ్యాంకుల కార్యకలాపాలు నామమాత్రంగా ఉండనున్నట్లు అభిప్రాయపడింది. ఆస్తుల ఒత్తిడి ... పీఎస్‌యూ బ్యాంకులు అటు మొండి బకాయిలతోపాటు, ఇటు తగినంత మూలధన పెట్టుబడులు లేక ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు ఆర్బీఐ కమిటీ నివేదిక వివరించింది. ఇవి బ్యాంకుల వృద్ధిని అడ్డగిస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 15 ప్రయివేట్ రంగ బ్యాంకులతోపాటు, 30 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. -
మోడీ వస్తే చిన్న ర్యాలీ... రాకపోతే భారీ పతనమే!
మరి ఈసారో?... సగటు ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ వర్గాలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 250-270 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్కెట్లు పరుగులు తీశాయి. గత 5 రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లు భారీగా పెరగడంతో అప్పర్ సర్క్యూట్‌కి(20% పెరగడం) అవకాశాల్లేవని, ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటే లోయర్ సర్క్యూట్‌ను (20% తగ్గడం) తాకొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ గరిష్టంగా 20% పెరగడం లేదా తగ్గడం జరిగితే, ఆ రోజుకి ఇక ట్రేడింగ్ ఆపేస్తారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం స్టాక్ మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం సూచీలు 15 శాతానికి పైగా పెరగడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో 20% కదలికలకు మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. ప్రస్తుతం నిఫ్టీ 7,100 స్థాయి వద్ద ఉంటే పెరిగితే 8,000-8,500 స్థాయి వరకు వెళ్ళొచ్చన్న నమ్మకంతో ట్రేడర్లు కాల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే 6,000-5,500 స్థాయి వరకు పడొచ్చన్న ఉద్దేశ్యంతో ట్రేడర్లు పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. ర్యాలీ జరిపితే కాల్ ఆప్షన్ కొన్నవారికి, తగ్గితే పుట్ ఆప్షన్ కొన్నవారికి లాభం వస్తుంది. ఎగ్జిట్ పోల్ ప్రభావం ఎంత? గత రెండు ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. 2004లో అందరూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్ అంచనాలు వస్తే దానికి భిన్నంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అలాగే 2009లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రాదని, థర్డ్ ఫ్రంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల మద్దతు అవసరం లేకుండానే యూపీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఇంకోటుంది. 2004 ఫలితాల తర్వాత సూచీలు కుప్పకూలినా.. ఆ తర్వాతి కాలంలో ఎన్నడూ ఊహించనంత లాభాలందించాయి. 2009 లో స్వల్పకాలానికి పెరిగినా ఆ తర్వాత కుప్పకూలి పరిమిత శ్రేణిలో కదిలాయి. అప్పర్ సర్క్యూట్ చాన్స్ తక్కువే ఎన్నికల ఫలితాల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం కానుండటంతో 9.15కల్లా ఫలితాల సరళిపై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మార్కెట్లు ప్రారంభంలోనే కొద్దిగా గానప్ అప్ లేదా గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకి 280 వరకు సీట్లు వస్తాయని అంచనాతో మార్కెట్లు ఇప్పటికే పెరగడంతో వాస్తవ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాసరే మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చన్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి 220-240 దగ్గరకొచ్చి ఆగిపోతే భారీ పతనం తప్పకపోవచ్చన్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉండకుండా, చివరివరకూ ఊగిసలాట ధోరణిలో ఉంటే మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయన్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని, బీజేపీఒంటిరిగా ఎన్ని సీట్లు సాధిస్తున్నది అన్న అంశాలను పరిశీలించాలంటున్నారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. ఎన్డీఏ కూటమి 300 సీట్లు దాటితే 10% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కేవలం బీజేపీ సీట్లు 220 లోపునకు పరిమితం అయినా, ఎన్డీఏ కూటమి 230లోపు ఆగినా, థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా సూచీలు లోయర్ సర్క్యూట్ తాకుతాయని సతీష్ పేర్కొన్నారు. స్వల్ప మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెన్సెక్స్ కేవలం 150 నుంచి 200 పాయింట్లు పెరుగుతుందని, అదే ఫలితాలు భిన్నంగా ఉంటే 2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఎడల్విస్ ఫైనాన్షియల్ మేనేజింగ్ పార్టనర్ అంబరీష్ బాలిగ పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం వస్తే రానున్న 12-18 నెలల్లో నిఫ్టీ 8,700 వరకు పెరుగుతుందని, అదే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సూచీలు 15-20% నష్టపోయి 3-6 నెలల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దిశ తీసుకుంటుందనేది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా. ఎన్నికల తర్వాత... సంవత్సరం రెండు రోజుల్లో 1999 6.05% 2004 -16.56% 2009 17.34% -
పీఎస్‌యూ బ్యాంకులకు మరో రూ.8 వేల కోట్ల మూలధనం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్ల అదనపు క్యాపిటల్‌ను అందించే అవకాశముంది. తాత్కాలిక బడ్జెట్లో ఇందుకు రూ.11,200 కోట్లు కేటాయించామనీ, ఇంతకంటే ఎక్కువ మొత్తం అవసరం ఉన్నప్పటికీ రూ.6,000 - 8,000 కోట్ల స్థాయిలో సమకూర్చుతామనీ ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సాంధు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరం సమావేశం అనంతరం సాంధు మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేది కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమేనని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14 వేల కోట్ల మూలధనాన్ని పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.రెండు వేల కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,200 కోట్లు వెళ్లాయి. గ్లోబల్ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులన్నీ టైర్-1 క్యాపిటల్‌ను పెంచుకునే యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాణాల ప్రకారం భారతీయ బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల అదనపు క్యాపిటల్ అవసరమని రిజర్వు బ్యాంకు అంచనా. నిధుల సమీకరణకు హోల్డింగ్ కంపెనీలు.. విస్తరణకు అవసరమైన నిధుల కోసం హోల్డింగ్ కంపెనీ, స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పీఎస్‌యూ బ్యాంకులకు చిదంబరం సూచించారు. మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితి మెరుగుపడి 4.44 శాతానికి చేరిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.07 శాతంగా ఉందనీ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గాలి - నాయక్ కమిటీ నివేదిక ముంబై: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల్లో సర్కారు తన వాటాను 50 శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గించుకోవాలని యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.జె.నాయక్ సారథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సూచించింది. బ్యాంకులను ప్రస్తుతం పాలిస్తున్న తీరును విమర్శించింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక శాఖల పెత్తనం, సీవీసీ, కాగ్ వంటి బాహ్య సంస్థల నిఘా తదితర పరిమితులతో పీఎస్‌యూ బ్యాంకులు సతమతం అవుతున్నాయని నాయక్ కమిటీ రూపొందించిన నివేదిక పేర్కొంది. ‘పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువకు తగ్గిపోతే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బ్యాంకులపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గకుండానే ఆ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. తద్వారా బ్యాంకులు మరింత విజయవంతంగా పనిచేయడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బ్యాంకుల పాలనా సంబంధమైన పలు విధులకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. 1970, 80ల నాటికి బ్యాంకుల జాతీయకరణ చట్టాలతో పాటు ఎస్బీఐ చట్టం, ఎస్బీఐ (అనుబంధ బ్యాంకుల) చట్టాలను రద్దు చేయాలి. అన్ని బ్యాంకులనూ కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలి. బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటా బదిలీకోసం బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటుచేయాలి...’ అని కమిటీ సూచించింది. -
కొత్త ప్రభుత్వ విధానాలపై భవిష్యత్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వ విధానాలపై దేశ భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఆర్థికాభివృద్ధి బాగుంటుందని ప్రతిఒక్కరూ భావిస్తున్నారని, అయితే ప్రభుత్వం అనుసరించే కొత్త విధానాల ప్రాతిపదికపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రణాళికా సంఘం పూర్తి సమయపు సభ్యుల సమావేశం అనంతరం మాంటెక్ విలేకరులతో మాట్లాడారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2012-17) సగటు 8% వృద్ధి లక్ష్యాల సవరణ విషయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, రాబోయో కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలో వృద్ధి సానుకూలంగా లేని సంగతి తెలిసిందే. 2012-13లో ఈ రేటు 4.5%గా ఉంటే, 2013-14లో ఈ పరిమాణం 4.9%గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5% దాటబోదని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 12వ ప్రణాళికలో 8 శాతం వృద్ధి కష్టమన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రణాళికా సంఘం మదింపు జరుపుతోందని (ప్రణాళిక మధ్యంతర మదింపు- ఎంటీఏ), కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే తాజా సంఘం ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళుతుందని మాంటెక్ వెల్లడించారు. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. -
4 నెలల్లో 10 బిలియన్ డాలర్లు ఇన్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వెరసి 2014 తొలి నాలుగు నెలల్లో ఇటు ఈక్విటీలలో 5 బిలియన్ డాలర్లు, అటు రుణ పత్రాల(డెట్ సెక్యూరిటీస్)లో మరో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. దీంతో జనవరి నుంచీ ఎఫ్ఐఐల పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను(రూ. 60,000 కోట్లు) తాకాయి. ఫలితంగా దేశంలోకి ఇప్పటివరకూ ప్రవహించిన ఎఫ్ఐఐల పెట్టుబడుల మొత్తం విలువను 200 బిలియన్ డాలర్లకు చేరింది. సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. అయితే ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు ఈక్విటీలలో రూ. 8,500 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, డెట్ మార్కెట్ల నుంచి రూ. 7,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్
బెంగళూరు: ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను ఎన్.ఆర్.నారాయణ మూర్తి గతేడాది తిరిగి చేపట్టిన తర్వాత కంపెనీకి గుడ్‌బై చెబుతున్న ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు డెరైక్టర్లతో సహా తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ కారణాలతో వైదొలిగారు. తాజాగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎస్.డి.శిబులాల్ అదే బాటపట్టారు. శిబులాల్ వారసుడి కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే పదవి నుంచి వైదొలగుతానని శిబులాల్ (59) చెప్పడమే ఇందుకు కారణమని తెలిపింది. కేరళలోని అలెప్పీలో జన్మించిన ఆయనకు వచ్చే ఏడాది మార్చి 1వ తేదీకి 60 ఏళ్ల నిండనున్నాయి. తన పదవీ కాలం పూర్తి కావడానికి (మార్చి 2015) ముందు, లేదా కొత్త వ్యక్తి ఈ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైనపుడు తాను తప్పుకుంటానని శిబులాల్ గతంలోనే వెల్లడించారని కంపెనీ పేర్కొంది. శిబులాల్ వారసుడి కోసం డెరైక్టర్ల బోర్టులోని నామినేషన్ల కమిటీ అన్వేషణ ప్రారంభించిందని ఇన్ఫోసిస్ తెలిపింది. సంస్థలో ఈ పదవికి అర్హత కలిగిన వారిని నామినేషన్ల కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుందనీ, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో పేరొందిన డెవలప్మెంట్ డెమైన్షన్స్ ఇంటర్నేషనల్ సహాయం తీసుకుంటామనీ పేర్కొంది. ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారిలో తగిన వారిని గుర్తించడంలో కమిటీకి సహకరించేందుకు ఎగాన్ జెండర్ అనే ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీని ఇన్ఫోసిస్ నియమించింది. ముందుగానే రిటైర్ కావాలని శిబులాల్ ఎందుకు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కంపెనీ ప్రతినిధి జవాబు నిరాకరించారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (జనవరి - మార్చి) ఆర్థిక ఫలితాలను త్వరలో (ఈ నెల 15న) ప్రకటించనున్నందున ప్రస్తుతం మౌనం పాటిస్తున్నామని ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్‌లో ఉన్నతమైన సీఈఓ పీఠం కోసం కంపెనీ అధ్యక్షులిద్దరూ (బి.జి.శ్రీనివాస్, యు.బి.ప్రవీణ్ రావు) రేసులో ఉన్నారని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి గత జనవరిలోనే సూచనప్రాయంగా వెల్లడించారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావులు మూడు నెలల క్రితమే ప్రమోట్ అయ్యారు. -
ఎఫ్ఐఐల దూకుడు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అండతో స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 22,214 వద్ద నిలవగా, 40 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 6,642 వద్ద ముగిసింది. ఇవి కొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 22,308, నిఫ్టీ 6,674 పాయింట్లను చేరడం ద్వారా సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి! ఇందుకు ఎఫ్ఐఐల పెట్టుబడుల దూకుడు సహకరిస్తోంది. గత మూడు రోజుల్లో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 2,192 కోట్ల విలువైనషేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 592 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకు షేర్లకు డిమాండ్ కొనసాగింది. కాగా, జెట్ ఎతిహాద్ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ కొట్టివేయడంతో జెట్ ఎయిర్వేస్ 3% ఎగసింది. ఒక దశలో 7% వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో స్పైస్‌జెట్ సైతం 3.5% లాభపడింది. విమానయాన రంగ సంస్థలు వచ్చే మార్చి వరకూ విదేశీ రుణాలను సమీకరించుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించడం ఇందుకు దోహదపడింది. మొబైళ్ల ద్వారా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్.. క్యాపిటల్ మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించేందుకు సెబీ మొబైల్, ఇంటర్నెట్ మాధ్యమాలను వినియోగించుకోనుంది. ఇందుకు పారిశ్రామిక సమాఖ్యలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు తదితరాలతో చేతులు కలపనుంది. తద్వారా ఇన్వెస్టర్లకు క్యాపిటల్ మార్కెట్ల పట్ల మరింత అవగాహన కల్పిం చడం, విజ్ఞానాన్ని పెంచడం వంటి కార్యక్రమాల్లో ఈ సంస్థలను భాగస్వాములను చేయనుంది. దీనిలో భాగంగాగత డిసెంబర్లోనే సెబీ ఇన్వెస్టర్ల సమస్యలు-పరిష్కార మార్గాలు పేరిట కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. -
బుల్ ధనా ధన్
సార్వత్రిక ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంచనాలు, డాలరుతో రూపాయి పుంజుకోవడం, ఎఫ్ఐఐల పెట్టుబడులు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచుతున్నాయి. వెరసి ఉదయం నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి 22,000 పాయింట్ల ఎగువన ముగిసింది. ఇది ఒక విశేషంకాగా, ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 22,074ను తాకింది. ఇక నిఫ్టీ కూడా తొలిసారి 6,591ను చేరడం మరో ప్రత్యేకత! ఇందుకు వచ్చే నెల మొదట్లో చేపట్టనున్న సమీక్షలో ఆర్బీఐ సరళ విధానాన్ని అనుసరిస్తుందన్న అంచనాలు కూడా తోడ్పడ్డాయని నిపుణులు చెప్పారు. గురువారం(27న) డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లలో లావాదేవీలు పుంజుకున్నట్లు తెలిపారు. ఎఫ్ఐఐల జోరు... ఇటీవల దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల దూకుడును చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సోమవారం ఒక్క రోజులో రూ. 1,466 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 770 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. కాగా, ఈ నెల 21 వరకూ ఎఫ్ఐఐలు రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం చెప్పుకోదగ్గ అంశం! బీఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 2.5%పైగా జంప్ చేయగా, హెల్త్‌కేర్, ఐటీ ఇండెక్స్‌లు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మాలతోపాటు, విప్రో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ 1.4-0.4% మధ్య బలహీనపడ్డాయి. అయితే మరోవైపు ప్రభుత్వ రంగ ఈటీఎఫ్‌లో భాగమైన పీఎస్‌యూ షేర్లకు డిమాండ్ కనిపించింది. ఇతర విశేషాలివీ... బ్యాంకింగ్, ఆయిల్ ఇండెక్స్‌లలో అన్ని షేర్లూ లాభపడటం విశేషంకాగా, మధ్యంతర డివి డెండ్ను ప్రకటించనుందన్న వార్తలతో ఓఎన్జీసీ 4% పైగా ఎగసింది. ఈ బాటలో గెయిల్, ఐవోసీ, ఇంద్రప్రస్థ గ్యాస్ 5-3% మధ్య పురోగమించగా, ఆర్ఐఎల్ సైతం దాదాపు 2% బలపడింది. బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ దాదాపు 4% జంప్‌చేయగా, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, కొటక్ మహీంద్రా, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ 5-2.5 మధ్య ఎగశాయి. ఈ బాటలో యాక్సిస్, కెనరా, బీవోబీ, ఎస్బీఐ సైతం 1.5% స్థాయిలో లాభపడ్డాయి. తాజాగా పీఎస్‌యూ షేర్లకు డిమాండ్ కనిపించింది. బీఈఎంఎల్, ఇంజనీర్స్, ఎంవోఐఎల్, కంటెయినర్ కార్పొరేషన్, చెన్నై పెట్రో, మంగళూర్ రిఫైనరీ, ఐవోసీ, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, పీఎఫ్సీ, ఆర్ఈసీ తదితరాలు 8-3% మధ్య దూసుకెళ్లాయి. వీటిలో అధిక శాతం ఈటీఎఫ్‌లో భాగమైన షేర్లుకావడం గమనార్హం! బీఎస్ఈలో మొత్తం 155 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. ఈ జాబితాలో టీవీఎస్ మోటార్, వోల్టాస్, జెన్‌టెక్ వంటి మిడ్క్యాప్స్తోపాటు మారుతీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజాలున్నాయి. సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 10న 21,935 వద్ద ముగియగా, 18న ఇంట్రాడేలో 22,040ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలుకాగా, ప్రస్తుత బుల్ జోరుతో ఇవి చెదిరిపోయి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వడ్డీ తగ్గింపు అంచనాలతో ఆటో రంగ షేర్లు సైతం ర్యాలీ చేశాయి. అశోక్ లేలాండ్, హీరో మోటో, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, మారుతీ, టాటా మోటార్స్ 4-0.6% మధ్య లాభపడ్డాయి. టీవీఎస్ మోటార్ రూ. 101 వద్ద కొత్త గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో 3% నష్టంతో రూ. 96 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ షేరు హవేల్స్ 4% జంప్ చే సి రూ. 900 వద్ద కొత్త గరిష్టాన్ని తాకగా, ఐటీసీ 1% బలపడింది. మార్చి నెలలో చైనా తయారీ రంగం మందగించిన సంకేతాలు వెలువడినప్పటికీ, చైనాసహా తైవాన్, ఇండొనేసియా, జపాన్, దక్షిణ కొరియా తదితర ఆసియా స్టాక్ మార్కెట్లు 0.5-2% మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ... లాంగ్ రోలోవర్స్ దాదాపు 2 వారాలపాటు చిన్నశ్రేణికి పరిమితమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ హఠాత్ ర్యాలీకి కారణం ఈ నెల ఆప్షన్ కాంట్రాక్టుల్లో షార్ట్ కవరింగ్...వచ్చే నెలకు లాంగ్ రోలోవర్స్ జరగడమేనని తాజా డేటా సూచిస్తున్నది. షార్ట్ కవరింగ్ ఫలితంగా ఈ నెల 6,500 కాల్ ఆప్షన్ నుంచి 10.95 లక్షల షేర్లు, 6,600 కాల్ ఆప్షన్ నుంచి 8.15 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,500 పుట్ ఆప్షన్లో 8.49 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నప్పటికీ, స్పాట్ నిఫ్టీతో పోలిస్తే మార్చి నిఫ్టీ ఫ్యూచర్ 15 పాయింట్ల ప్రీమియంతో ముగిసింది. ఏప్రిల్ నెలకు లాంగ్ రోలోవర్స్ను సూచిస్తూ ఆ నెల ప్రీమియం క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 66 పాయింట్ల నుంచి 73 పాయింట్లకు పెరిగింది. ఏప్రిల్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో 23 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ 62 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో క్షీణత సంభవిస్తే 6,500 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 6,600 స్థాయిని అధిగమించగలిగితే మరింత ర్యాలీ సాధ్యమని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ఏప్రిల్ నెలలో మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా వున్నారని, వచ్చే నెలకు ట్రేడవుతున్న భారీ ప్రీమియం సూచిస్తున్నది. -
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. -
ఉచితంగా రుణ సమాచార నివేదికలు!
ముంబై: వినియోగదారులకు రుణ సమాచార నివేదిక(క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్-సీఐఆర్)లను ఉచితంగా ఇవ్వాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. ఈ కమిటీకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ ఆదిత్య పూరి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా సీఐఆర్లను ఇవ్వడం వల్ల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కావాలనుకునేవారిలో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించినట్లవుతుందని ఈ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రుణ క్రమశిక్షణకు సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ఈ సీఐఆర్లు ఉపయోగపడతాయని, లోటుపాట్లు ఏమైనా ఉంటే వినియోగదారులు సరిదిద్దుకుంటారని, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకుంటారని పేర్కొంది. ఈ కమిటీ రుణ సమాచారానికి సంబంధించి వివిధ రకాల సూచనలను అందజేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసే వారి వివరాలను సీఐసీలకు నేరుగా అందించాలని ఈ కమిటీ సూచించింది. వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌కు ఒకే విధమైన వర్గీకరణను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) అనుసరించాలని, అప్పుడే దానిని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం సులభతరమవుతుందని ఈ కమిటీ పేర్కొంది. సిబిల్ విధానాన్నే ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అనుసరించాలని సూచించింది. -
భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్మెంట్కు ఓకే
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు భెల్, ఐవోసీలలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సాధికార మంత్రుల కమిటీ(ఈజీవోఎం) ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఐవోసీలో 10%, భెల్‌లో 5% వాటాను ప్రభుత్వం విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ. 7,300 కోట్లు లభించగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఐవోసీలో 10% వాటాను ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు 5% చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధర రూ. 248 వద్ద ఐవోసీ(10%) వాటాకు రూ. 5,300 కోట్లు లభించే అవకాశమున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ చెప్పారు. వాటా విక్రయాన్ని ఆఫ్‌మార్కెట్ ద్వారా ప్రభుత్వం చేపట్టనుంది. ఇక భెల్‌లో 5% వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఎల్ఐసీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధర రూ. 167 వద్ద భెల్ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,045 కోట్లవరకూ సమకూరవచ్చు. ప్రస్తుతం భెల్‌లో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది. -
పోలీసులకు లొంగిపోయిన సుబ్రతారాయ్
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. లక్నో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మార్చి 4 వరకూ రాయ్ ఉత్తరప్రదేశ్ పోలీస్ కస్టడీలోనే కొనసాగనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.25 వేల కోట్ల సమీకరణ, సుప్రీంకోర్టు రూలింగ్‌కు అనుగుణంగా ఈ మొత్తం పునఃచెల్లింపుల విషయంలో వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్లు, వాయిదా వాయిదాకూ అత్యున్నత న్యాయస్థానం చివాట్ల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. స్వయంగా ఫిబ్రవరి 26న తన ముందు హాజరుకావాలని 20వ తేదీన సుప్రీం ఆదేశించడం, దీనిని పాటించడంలో రాయ్ వైఫల్యం, దీనితో సుప్రీం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ, దీనిని రీకాల్ చేయమని 27న రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం శుక్రవారం తోసిపుచ్చడం వంటి అంశాల నేపథ్యంలో రాయ్ అరెస్ట్ తప్పలేదు. నాటకీయ పరిణామాల మధ్య... రాయ్ అరెస్ట్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని సంబంధిత వర్గాల సమాచారం. దీనిప్రకారం, సహారా గ్రూప్ చీఫ్ అరెస్ట్‌కు పోలీసులు గురువారం నుంచీ పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ఆచూకీ తెలియలేదు. అయితే శుక్రవారం ఉదయం ఆయన స్వయంగా పోలీసులను ఇంటికి పిలిచి మరీ లొంగిపోయారు. అరెస్ట్ అయిన తరువాత కూడా ఆరు గంటలకుపైగా రాయ్ తన నివాసంలోనే కొనసాగారు. అటు తర్వాత ఆయనను లగ్జరీ కార్ల శ్రేణితో సీజేఎం కోర్టుకు తరలించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ, కోర్టు ప్రత్యేకంగా ఏర్పాటయ్యింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆనంద్ కుమార్ యాదవ్ కోర్టులో రాయ్‌ని పోలీసులు ప్రవేశపెట్టారు. హౌస్ అరెస్ట్ కింద ఉంచడానికి అనుమతించాలన్న రాయ్ విజ్ఞప్తిని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. పోలీస్ కస్టడీకి ఆదేశించారు. సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టేంతవరకూ రాయ్‌ని ఎక్కడ ఉంచాలన్నది స్పష్టం కాకపోయినప్పటికీ, ఈ అంశాన్ని పోలీసుల విచక్షణాధికారాలకు వదిలివేసినట్లు ఆయన న్యాయవాది వినోద్ షాహి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాయ్‌ను లక్నో సమీపంలోని అటవీ శాఖ గెస్ట్‌హౌస్‌కు తరలించినట్లు సమాచారం. తుది గడువు మార్చి 4 మధ్యాహ్నం 2 గంటలకల్లా సుప్రీం ముందు రాయ్‌ని హాజరుపరచాల్సిన బాధ్యత పోలీసులదేనని సీజేఎం ఆదేశించారు. వ్యాపారాలపై ప్రభావం చూపదు: సహారా రాయ్ అరెస్ట్ తరువాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే హడావుడిగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కుమారుడు సీమాంతో మాట్లాడారు. అధికారులకు తన తండ్రి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. గ్రూప్ వ్యాపారాలపై ఆయన అరెస్ట్ ప్రభావం ఏదీ పడబోదని స్పష్టం చేశారు. నిజానికి రాయ్ సుప్రీం ముందు హాజరుకావడానికి 24న ఢిల్లీ వచ్చారని, అయితే తల్లి ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి లక్నో వెళ్లిపోయారని సీమాంతో తెలిపారు. అరెస్ట్‌ను తప్పించుకోడానికి ఆసుపత్రిలో చేరిపోవాలని కొందరు సలహా ఇచ్చారని, అయితే ఇలాంటి డ్రామాలకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాగా సహారా మరో ప్రకటన విడుదల చేస్తూ, సెబీపై మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దాదాపు రూ. 2,000 కోట్లు మినహా మొత్తం బకాయిల పునః చెల్లింపులు చేసేసినట్లు తెలిపింది. అయితే మదుపుదారులను గుర్తించడంలో సెబీ నెమ్మదిగా కదులుతోందని ఆరోపించింది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ.. సహారా గ్రూప్ కంపెనీలు... ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్) మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రూ. 24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఇండోర్‌కు చెందిన రోషన్ లాల్ అనే ఇన్వెస్టర్ నాలుగేళ్ల క్రితం సెబీకి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. న్యాయ ప్రక్రియ క్రమంలో 2012 ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పొడిగించింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్లు తక్షణం చెల్లించాలని, రూ. 10,000 కోట్లను 2013 జనవరికల్లా, మిగిలిన సొమ్మును 2013 ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. 2012 డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది. కోర్టులో సెబీ దాఖలుచేసిన ధిక్కరణ పిటిషన్లను సహారా గ్రూప్ ఎదుర్కొంటోంది. సుప్రీం ఆదేశాల మేరకు రూ. 20,000 కోట్ల విలువైన సేల్ డీడ్స్నూ సహారాకు అందించింది. కేసు విచారణ నేపథ్యంలో సహారా చీఫ్ విదేశీ పర్యటనకు వీలులేదని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఒక దశలో డబ్బు తిరిగి చెల్లించేశామని చెప్పిన గ్రూప్, ఈ చెల్లింపులకు సంబంధించి అసలు తనకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలన్న బెంచ్ ఆదేశాలకు తగిన విధంగా స్పందించలేకపోయింది. సహారా అందించిన సేల్ డీడ్స్‌ను అమ్మకాలకు సెబీ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 20న రూలింగ్ ఇచ్చింది. దీనితోపాటు 26న అంటే బుధవారం ధర్మాసనం ముందు రాయ్‌సహా రెండు కంపెనీల్లోని ముగ్గురు డెరైక్టర్లు స్వయంగా హాజరుకావాలని సైతం ఆదేశించింది. అయితే 25న మళ్లీ రాయ్ సుప్రీంను ఆశ్రయిస్తూ... తనకు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలని కోరారు. దీనికి సుప్రీం ససేమిరా అంది. 26న ముగ్గురు డెరైక్టర్లు హాజరయినా, రాయ్ కోర్టుకు రాలేదు. మరణశయ్యపై ఉన్న తల్లి పక్కనే ఉండడానికే ఆయన హాజరుకాలేకపోతున్నట్లు రాయ్ న్యాయవాది రామ్ జెత్మలానీ కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. వ్యక్తిగతంగా హాజరుకానందుకు స్వయంగా క్షమాపణలు చెబుతూ 4న హాజరుకావడానికి సిద్ధమని పేర్కొంటూ ఫిబ్రవరి 27న రాయ్ సుప్రీంలో రికాల్ పిటిషన్ వేశారు. అరెస్ట్ వారంట్ రికాల్‌కు రాయ్ న్యాయవాదులు శుక్రవారం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో 65 సంవత్సరాల రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఫార్మా షేర్ల కి డిమాండ్
దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగడంతోపాటు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారం ఆరంభంలోనే సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 20,811 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 36 పాయింట్లు పుంజుకుని 6,186 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు క్యాడిలా హెల్త్, ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, గ్లెన్‌మార్క్ 5-2% మధ్య ఎగశాయి. వెరసి డాక్టర్ రెడ్డీస్(రూ. 2,795), లుపిన్(రూ. 956), క్యాడిలా(రూ. 995) చరిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత వారం రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథాప్రకారం రూ. 249 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. ఎన్టీపీసీ డౌన్, టాటా పవర్ అప్ కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(సీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించి కొత్తగా ప్రకటించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ బీఎస్ఈలో 11%పైగా పతనమై రూ. 117 వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 3.5 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఉత్పత్తినిబట్టి కాకుండా అమ్మకపుస్థాయి(ఆఫ్టేక్) ఆధారంగా టారిఫ్ నిర్ణయంకానుండం ఇందుకు కారణమైంది. అయితే ముంద్రా ప్రాజెక్ట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌పై నష్టపరిహారంకింద యూనిట్‌కు రూ. 50 పైసలను అదనంగా వసూలు చేసుకునేందుకు సీఈఆర్సీ అంగీకరించడంతో టాటా పవర్ 5% జంప్‌చేసి రూ. 83 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల దూకుడు న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. కేటర్పిల్లర్, మెర్క్ అండ్ కంపెనీ వంటి దిగ్గజాలు ఏడాది గరిష్టానికి చేరడంతో ఎస్అండ్పీ-500 సూచీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం జనవరి 15న సాధించిన 1,848 పాయింట్ల లైఫ్‌టైమ్ హైను అధిగమించి 1,857 వద్ద కదులుతోంది. ఇక నాస్డాక్ 14 ఏళ్ళ గరిష్టమైన 4,309కు చేరగా, డోజోన్స్ 184 పాయింట్లు ఎగసి 16,287 వద్ద ట్రేడవుతోంది. -
ఇటు ఆదా..అటు ఆదాయం
స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టనివారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవటం కొత్తేమీ కాదు. కాకపోతే ఆ ఫండ్స్‌లో కూడా పన్ను మినహాయింపులిచ్చేవి ఉన్నాయి.అంటే ఆ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెడితే అంత మొత్తాన్ని మనం ఆదాయపు పన్ను మినహాయంపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చన్న మాట. ఇప్పటిదాకా ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మినహాయింపు వస్తోంది. దాన్ని రెట్టింపు చేయాలని, రూ.2 లక్షలకు పెంచాలని తాజాగా సెబీ సూచించింది. ఇలా చేస్తే రిటైల్ మదుపరుల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఈ సూచనలు అమల్లోకి వస్తే... చిన్న మదుపరులకు డబుల్ ట్యాక్స్ బొనాంజానే!!. ఈ నేపథ్యంలో అసలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? వీటిల్లో ఉండే లాభనష్టాలేంటీ? ఇవన్నీ వివరించేదే ఈ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందాలనుకునే వారికోసమే పుట్టాయి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలు (ఈఎల్ఎస్ఎస్). వీటినే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌గా కూడా పిలుస్తుంటారు. అటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ దానిపై వచ్చే లాభాలతో పాటు, ఇటు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉండటమే కాక... మిగిలిన పథకాలతో పోలిస్తే వీటి లాకిన్ పీరియడ్ అతి తక్కువ కావడం ప్రధాన ఆకర్షణ. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, బీమా, పోస్టాఫీసు వంటి అనేక పథకాలు ఉన్నప్పటికీ వీటి కాలపరిమితి కనిష్టంగా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటోంది. అదే కొన్ని బీమా పథకాల్లో అయితే 30 నుంచి 40 ఏళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. కాని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో లాకిన్ పీరియడ్ కేవలం మూడేళ్లు. ఇన్వెస్ట్ చేసిన మొదటి మూడేళ్లు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌గా ఉండి, లాకిన్ పీరియడ్ అయిన తర్వాత ఓపెన్ ఎండెడ్ పథకాలుగా మారుతాయి. అంటే మూడేళ్ల తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలగొచ్చు. లేదా మరింత లాభాలను ఆశిస్తే కొనసాగవచ్చు. రాబడిపై హామీ ఉండదు... ఇవి కూడా మ్యూచువల్ ఫండ్సే కావటంతో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అందించే రాబడిపై ఎలాంటి హామీ ఉండదు. సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో అసలు కూడా నష్టపోవాల్సి ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను అందించే సాధనాల్లో ఈక్విటీలే ముందుంటాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గడిచిన మూడేళ్లలో పలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ 8 నుంచి 13 శాతం రాబడిని అందిస్తే, గత ఏడాది కాలంలో 10 నుంచి 18 శాతం వరకు లాభాలను అందించాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వైదొలిగే అవకాశం లేకపోవడంతో ఫండ్ మేనేజర్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించడానికి వీలుండే షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. రెండిందాలా లాభం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు గరిష్ట ట్యాక్స్ శ్లాబ్ (30%)లో ఉన్న వారు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నేరుగా రూ.30,000 పన్ను ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ఇవి లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వస్తాయి కాబట్టి అందించే లాభాలపై కూడా ఎటువంటి పన్ను భారం ఉండదు. అదే బ్యాంకు డిపాజిట్లు అయితే వడ్డీని ఆదాయంగా పరిగణించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సెబీ నిబంధనలు అమల్లోకి వస్తే రెండు లక్షల మేరకు పన్ను ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లు లేదా ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా దగ్గర్లోని మ్యూచువల్ ఫండ్ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. వీటిల్లో ఒకేసారిగా లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి 3 సంవత్సరాలు వేచి చూడాలి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి.- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం పథకం పేరు 3 ఏళ్లలో వృద్ధి% యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 13 బీఎన్పీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 10 హెచ్డీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 8 ఎడల్విస్ ఈఎల్ఎస్ఎస్ 8 రెలిగేర్ ట్యాక్స్ ప్లాన్ 8 పథకం పేరు ఏడాదిలో వృద్ధి యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 18 ఎడల్విస్ ఈఎల్ఎస్ఎస్ 15 బీవోఐ ట్యాక్స్ అడ్వాంటేజ్ 12 ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 10 సహారా ట్యాక్స్ గెయిన్ 10 -
అందరూ అవినీతిపరులు కారు: ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: దేశమంతా అవినీతిలో కూరుకుపోయిందన్నది చాలా తప్పుడు భావన అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. అందరూ అవినీతిపరులు కారన్నారు. నియంత్రణ సంస్థలు కూడా అందరినీ అదే దృష్టికోణంతో చూడకుండా.. క్షమించరాని ఉల్లంఘనలకు కంపెనీలు పాల్పడ్డాయని, క్రిమినల్ నేరాలు చేశాయని పక్కాగా రుజువులు ఉన్నప్పుడే రంగంలోకి దిగాలని సూచించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) స్వర్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు తెలిపారు. ‘నేను అవినీతికి మద్దతు పలకడం లేదు. కానీ అందరూ అవినీతిపరులని మాత్రం నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు, మీ తల్లిదండ్రులు, మిత్రులు, ప్రతి ఒక్కరు అవినీతిపరులన్న భావన్న చాలా దారుణమైనది. ఇలా మనల్ని మనమే తక్కువ చేసుకోవడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను’ అని చిదంబరం చెప్పారు. -
టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు
బిల్ గేట్స్... స్టీవ్ బామర్... తరవాతి పేరు మన వాడిదే. తెలుగువాడు సత్య నాదెళ్లదే. 39 ఏళ్ల చరిత్ర ఉన్న మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈఓగా హైదరాబాదీ సత్య నాదెళ్ల ఎంపికయ్యాడు. మణిపాల్, విస్కాన్సిన్ మీదుగా హైదరాబాద్ నుంచి రెడ్మండ్ చేరిన ఈ సత్య... తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఏకంగా స్కూలే పెట్టారు. ప్రతి భారతీయుడికీ ఆయన ప్రస్థానం స్ఫూర్తినిచ్చేదే. న్యూయార్క్: నిన్న మొన్నటిదాకా ఊహగానాలకి పరిమితమైనది మొత్తానికి వాస్తవరూపం దాల్చింది. మరో అమెరికన్ దిగ్గజానికి మన ఇండియన్ సారథ్యం వహించనున్నారు. 78 బిలియన్ డాలర్ల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి సీఈవోగా మన తెలుగువాడు సత్య నాదెళ్ల నియమితులయ్యారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సత్యను సీఈవోగా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. బిల్‌గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో మన సత్య నాదెళ్ల (47) ముచ్చటగా మూడో సీఈవో. తనతో పోటీపడిన గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుందర్ పిచ్చయ్యను తోసిరాజని సత్య దీన్ని దక్కించుకున్నారు. క్రికెట్ అంటే ఇష్టపడే సత్య.. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ప్రస్తుత సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇండిపెండెంట్ డెరైక్టర్ జాన్ థాంప్సన్ తాజాగా చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ బిల్ గేట్స్ ఇకపై టెక్నాలజీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు. కంపెనీ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 31,400 కోట్ల డాలర్లు. మైక్రోసాఫ్ట్‌కి తగిన సారథి.. కంపెనీ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు. అసాధ్యాలను సాధ్యం చేయగలం.. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు. సత్య... మిస్టర్ నైస్ గై పూర్తి పేరు: నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం: అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, బుక్కాపురం పుట్టిన సంవత్సరం: 1967, హైదరాబాద్‌లో వయసు: 47 కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తండ్రి బీఎన్ యుగంధర్ నాయుడు మాజీ ఐఏఎస్ అధికారి. నివాసం: వాషింగ్టన్లో. చదువు: బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో మొదలు డిగ్రీలు: మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అమెరికా మిల్వాకీలోని విస్కాన్సిన్ వర్సిటీ నుంచి ఎంఎస్. షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. ఉద్యోగ ప్రస్థానం: తొలుత సన్మైక్రోసిస్టమ్స్లో చేరారు. తరవాత 1992 నుంచీ మైక్రోసాఫ్ట్‌లో. {పస్తుత స్థానం: క్లౌడ్ కంప్యూటింగ్ హెడ్ వేతనం: 76 లక్షల డాలర్లు (2012-13) కలిసొచ్చినవివే... స్టీవ్ బామర్ కన్నా సత్యకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. విస్తృతమైన ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరాక... క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈయనను ‘క్లౌడ్ గురు’గా పిలుస్తారు మైక్రోసాఫ్ట్‌కు చెందిన 2000 కోట్ల డాలర్ల సర్వర్ అండ్ టూల్స్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్‌కు చెందిన ఆర్ అండ్ డీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రో సాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు. ఆఫీస్ 365 ప్రోగ్రామ్ విజయం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ‘క్లౌడ్ ఓఎస్’ ఘనత సత్యదే.. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో. క్రికెట్ ఎన్నో నేర్పింది... కవితలన్నా, క్రికెటన్నా సత్య నాదెళ్లకు చాలా ఇష్టం. క్రికెట్ వల్లే టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈవోగా తన నియామకం ఖరారైన అనంతరం ఆయన చెప్పారు. అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఆసక్తికరమైన మలుపులు తిరిగే మ్యాచ్‌ను చూస్తుంటే.. రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారాయన. కవితలైతే రహస్య సంకేతాల్లా అనిపిస్తాయన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారాయన. ‘నేను నిర్మించడాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతా. ఇప్పటికీ తరచు బోలెడన్ని ఆన్లైన్ కోర్సులు చేస్తుంటా. అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకి వెళ్లేవాణ్ణి. శనివారాలు క్లాసులకు హాజరయ్యి.. మళ్లీ సోమవారానికల్లా రెడ్మండ్ (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు)కి వచ్చేసేవాణ్ని. దాదాపు రెండున్నరేళ్లు పట్టింది కానీ... మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేశా. కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయడం మానేసినట్లేనన్నది నా ఉద్దేశం’’ సన్నిహితుల సంతోషం... హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ బాస్‌గా సత్య నాదెళ్ల నియామకం గురించి తెలియటంతో ఆయన కుటుంబం, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన తల్లిదండ్రులుంటున్న నివాసానికి సన్నిహితులు, విలేకరులు వెల్లువెత్తారు. అయితే, సత్య తండ్రి , మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.యుగంధర్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన స్పందన కోసం మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపినా స్పందించలేదు. మరోవైపు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌పీఎస్ సొసైటీ కార్యదర్శి ఫయాజ్ ఖాన్ వెల్లడించారు. హెచ్‌పీఎస్‌లో చదివిన సత్యకి.. ఫయాజ్ సహాధ్యాయి. తగిన సమయం చూసుకుని సత్యను స్కూలుకు ఆహ్వానిస్తామని ఖాన్ చెప్పారు. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త శిఖరాలను అధిరోహించగలదని మరో సహాధ్యాయి, నగరానికి చెందిన టెక్నాలజీ సంస్థ మాజీ సీఈవో అయిన ఎం.చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక భారతీయుడు సీఈవో కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. సత్య నియామకంపై హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థి, అపోలో హాస్పిటల్స్ సీఈవో హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
మారుతీ ఇక ఇండియాది కాదా!
న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన తయారీ ప్లాంట్‌ను మాతృ సంస్థ సుజుకీ మోటార్(జపాన్)కు అప్పగించేందుకు మంగళవారం సమావేశమైన మారుతీ సుజుకీ బోర్డు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సుజుకీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను సుజుకీ మోటార్ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో భాగంగా ఏడాదికి లక్ష కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకీ చెప్పారు. ఆపై సామర్థ్యాన్ని 2.5 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో 7.5 లక్షల వాహన తయారీ సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌లోగా సుజుకీ గుజరాత్‌ను ఏర్పాటు చేస్తామని, ఇది అన్‌లిస్టెడ్ కంపెనీగా ఉంటుందని తెలిపారు. లాభదాయకం! గుజరాత్లో సామర్థ్య విస్తరణ కోసం మారుతీ 2011లో మేసానాకు దగ్గర్లో 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 250 కోట్లను వెచ్చించింది. ఇక్కడ రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు 2012లో ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించక ప్లాంట్ యోచనను వాయిదా వేసింది. కాగా, సుజుకీ మోటార్... ఇటీవల 100% అనుబంధ కంపెనీ ద్వారా ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంతో మారుతీ బోర్డు ఇందుకు అంగీకరించింది. స్థలాన్ని లీజుకి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్లాంట్‌లో మారుతీ కోసమే సుజుకీ గుజరాత్ సంస్థ వాహనాలను తయారు చేసి, తయారీ ధరకే మారుతీకి విక్రయిస్తుందని ఒసాము వివరించారు. దీంతో కంపెనీకి ఆర్థికపరమైన లబ్ది చేకూరుతుందని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. తద్వారా అమ్మకాలు, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి వంటి కార్యకలాపాలను పటిష్టపరచుకునేందుకు వీలు చిక్కుతుందని చెప్పారు. మార్కెట్లకు నచ్చలేదు... క్యూ3 ఫలితాల తరువాత బీఎస్ఈలో మారుతీ షేరు ధర 2.5% పుంజుకుని రూ. 1,750కు చేరింది. అయితే గుజరాత్ ప్లాంట్ విషయాన్ని కంపెనీ వెల్లడించాక ఒక్కసారిగా 8%(రూ. 138) పతనమై రూ. 1,563 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా రూ. 1,541ను తాకింది. నికర లాభం 36% అప్ మారుతీ సుజుకీ నికర లాభం క్యూ3లో 36% ఎగసి రూ. 681 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ. 501 కోట్లను మాత్రమే ఆర్జించింది. అత్యధిక శాతం విడిభాగాలను స్థానికంగా తయారు చేయడం, విదే శీ మారక లాభాలు, వ్యయాల అదుపు లాభాల వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం మాత్రం 3% క్షీణించి రూ. 10,620 కోట్లకు చేరింది. -
ఐఓసీలో 10 శాతం వాటా ఓఎన్జీసీ, ఓఐఎల్ చేతికి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటాల విక్రయం లక్ష్యానికి గడువు దగ్గరపడుతుండటంతో కేంద్రం తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ ఏడాది(2013-14) డిజిన్వెస్ట్మెంట్లో తొలిసారిగా బ్లాక్ డీల్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)లో వాటా విక్రయానికి ఓకే చెప్పింది. 10 శాతం వాటాను(24.27 కోట్ల షేర్లు) ఇతర పీఎస్‌యూ దిగ్గజాలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లకు విక్రయించే ప్రతిపాదనకు సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం ఆమోదముద్ర వేసింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,800-5,000 కోట్లు రావచ్చని అంచనా. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో జరిగిన ఈజీఓఎం భేటీలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు వెల్లడించారు. బ్లాక్ డీల్‌కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే కొలిక్కి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ డెరైక్టర్ల బోర్డుల ఆమోదం అనంతరం వచ్చే వారంలో ఐఓసీ వాటా విక్రయ బ్లాక్ డీల్ ఉండొచ్చని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 30 నాటికి ఐఓసీలో కేంద్రానికి 78.92 శాతం వాటా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర ఉండాల్సినదానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని.. అందువల్ల ఇప్పుడు వాటా విక్రయం వల్ల అటు కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి నష్టమేనని పెట్రోలియం శాఖ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలం(ఆఫర్ ఫర్ సేల్) రూపంలో 10% వాటా అమ్మకాన్ని వాయిదా వేశారు. అయితే, రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి మరో రెండున్నర నెలలే గడువు మిగిలింది. ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లే లభించాయి. దీంతో చివరకు ఐఓసీలో బ్లాక్ డీల్‌కు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వివేక్ రాయ్ తెలిపారు. ఇప్పటికే తమకు ఐఓసీలో 8.77 శాతం వాటా ఉందని... ఇప్పుడు విక్రయించే 10% వాటాను ఓఐఎల్, తమ కంపెనీకి సమానంగా విభజించనున్నట్లు ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. గురువారం బీఎస్ఈలో ఐఓసీ షేరు ధర రూ.3.10(1.48%) లాభపడి రూ.212.05 వద్ద స్థిర పడింది. 52 వారాల గరిష్టస్థాయి రూ.375; కనిష్ట స్థాయి రూ. 186.20గా ఉంది. -
కేజీ డీ6లో పెరగనున్న గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిని రిలయున్స్ ఇండస్ట్రీస్ ఈ నెల నుంచి రోజుకు 1-3 మిలియున్ స్టాండర్ట్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) మేర పెంచనుంది. ఉత్పత్తి క్షీణతకు అడ్డుకట్ట వేసే ప్రక్రియును సంస్థ చేపట్టడంతో ఇది సాధ్యం కానుంది. ఆర్ఐఎల్ తన భాగస్వావుులు బీపీ పీఎల్సీ (యుూకే), నికో రిసోర్సెస్ (కెనడా)లతో కలసి కేజీ డీ6 బ్లాకులో ఎంఏ క్షేత్రాన్ని తవ్వింది. ఎంఏ-8 పేరుగల ఈ క్షేత్రంలో ఈనెల నుంచే ఉత్పత్తి ప్రారంభవుయ్యే అవకాశవుుందని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. ఈ క్షేత్రంలో 1-3 ఎంసీఎండీల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఎంఏ-8లో 3 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తే కేజీ డీ6లో అత్యధికంగా గ్యాస్ ఉత్పత్తి అయ్యే బావి ఇదే అవుతుంది. గత వుూడేళ్లలో కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి నానాటికీ తగ్గుతూ ప్రస్తుతం 12 ఎంసీఎండీలకు చేరింది. డీ1, డీ3 క్షేత్రంలో వుూసేసిన బావుల్లో వుూడో వంతుకు వురవ్ముతులు చేయూలనీ, తద్వారా వూర్చి నాటికి ఉత్పత్తిని వురింత పెంచాలనీ ఆర్ఐఎల్ యుత్నిస్తోంది. ఇసుక, నీరు వస్తుండడంతో డీ1, డీ3ల్లోని మొత్తం 18 బావుల్లో పదింటిని సంస్థ వుూసివేసింది. ఎంఏ క్షేత్రంలోని 6 బావుల్లో రెండు కూడా ఇదే కారణంతో వుూతపడ్డారుు. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి 2010 వూర్చి నాటికి ఉత్పత్తి 69.43 ఎంసీఎండీల గరిష్ట స్థారుుకి చేరింది. -
ఇక ఫలితాలే దిక్సూచి..
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లు జోరు చూపుతాయని అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు అంతర్జాతీయ సంకేతాలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు వంటివి సహకరిస్తాయని తెలిపారు. వీటికి జనవరి రెండో వారంనుంచీ వె లువడనున్న ‘అక్టోబర్-డిసెంబర్’ త్రైమాసిక ఫలితాల అంచనాలు జత కలుస్తాయని చెప్పారు. ఇక మరోవైపు డిసెంబర్ నెలకు బుధవారం(జనవరి 1న) వెల్లడికానున్న వాహన అమ్మకాల నేపథ్యంలో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని వివరించారు. సమీప కాలానికి మార్కెట్లను త్రైమాసిక ఫలితాలే నడిపిస్తాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వారం మధ్యలో కొత్త క్యాలండర్ ఏడాది(2014) మొదలుకానున్న కారణంగా ఈ వారం సెంటిమెంట్ బుల్లిష్‌గానే కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటుపై దృష్టి: రానున్న రోజుల్లో ద్రవ్యలోటు, తయారీ సంబంధ గణాంకాలు వెలువడనున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు కొంతమేర జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. డిసెంబర్లో ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా వ్యవహరిస్తుండటంతో సెంటిమెంట్ బుల్లిష్‌గా మారిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. వీటన్నిటికితోడు విదేశీ మార్కెట్లు పటిష్టంగా సాగుతుండటంతో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ మరింత పుంజుకునేందుకు అవకాశమేర్పడిందని చెప్పారు. వెరసి నిఫ్టీకి 6,325 పాయింట్ల స్థాయి సాంకేతికంగా కీలకంగా నిలవనుందని అంచనా వేశారు. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఎఫ్ఐఐల జోరు: కాగా, దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ నికరంగా... రూ.15,500 కోట్లను(250 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. -
భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్ళలో భారతీయుల వ్యక్తిగత సంపద విలువ రెట్టింపై రూ.411 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ ప్రైవేట్ వెల్త్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారతీయులు వ్యక్తిగత సంపద రూ.202 లక్షల కోట్లుగా ఉన్నట్లు కార్వీ ‘ఇండియా వెల్త్ రిపోర్ట్- 2013’ పేర్కొంది. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశం ముందుకుపోతున్నా ఇప్పటికీ భారతీయులు ఈక్విటీల కంటే బంగారం, స్థిరాస్తి రంగాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఈ మొత్తం సంపదలోనే అత్యధికంగా రూ.60.61 లక్షల కోట్లు (30 శాతం) ఒక్క బంగారానికే కేటాయించారంటే భారతీయులు బంగారంపై ఎంత ప్రేమ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో స్థిరాదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లలో రూ.35 లక్షల కోట్లు (17%), రియల్ ఎస్టేట్‌లో రూ.31.43 లక్షల కోట్లు (16%) ఇన్వెస్ట్ చేశారంట. వీటన్నింటితో పోలిస్తే భారతీయులు కేవలం రూ.24.31 లక్షల కోట్ల(12%) విలువైన ఈక్విటీ సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఇతర పెట్టుబడి సాధనాలన్నింటికీ కలిపి 54 శాతం కేటాయిస్తే కేవలం బంగారం, స్థిరాస్తి రంగాలకే 46 శాతం కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ పెట్టుబడి సాధనాలు, ఫిజికల్ అసెట్స్ పెట్టుబడుల నిష్పత్తి 55:45 వద్ద స్థిరంగానే ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా తెలిపారు. కాని రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటంతో బంగారం నుంచి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంపదలో 30 శాతం వాటా ఉన్న బంగారం వాటా 22 శాతానికి పడిపోతుందని ఈ మొత్తం అత్యధికంగా ఈక్విటీల్లోకి వస్తుందన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా బాగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఫిజికల్ అసెట్స్‌లో బంగారం, స్థిరాస్తి నిష్పత్తి 65:35గా ఉందని, అదే వచ్చే ఐదేళ్ళలో 52:48గా మారుతుందన్నారు.