ఫ్లిప్‌‘కార్ట్’లోకి 6 వేల కోట్లు | Flipkart raises $1 bn in funds, company may be valued at $7 bn | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌‘కార్ట్’లోకి 6 వేల కోట్లు

Published Wed, Jul 30 2014 4:51 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌‘కార్ట్’లోకి 6 వేల కోట్లు - Sakshi

ఫ్లిప్‌‘కార్ట్’లోకి 6 వేల కోట్లు

దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద నిధుల సమీకరణగా రికార్డు
 
వ్యాపార విస్తరణ, మొబైల్ కామర్స్‌కు వినియోగిస్తామంటున్న కంపెనీ
ఐపీఓ ఆలోచనలేదని స్పష్టీకరణ...
తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ. 42,000 కోట్లుగా అంచనా

 
బెంగళూరు: దేశీ ఈ-కామర్స్ అగ్రగామి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లోనేకాదు.. నిధుల సమీకరణలోనూ బిలియన్ డాలర్ల రికార్డును నమోదు చేసింది. ఇన్వెస్టర్ల నుంచి తాజాగా బిలియన్ డాలర్ల(సుమారు రూ.6,000 కోట్లు) నిధులను సమీకరించినట్లు మంగళవారం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పటివరకూ భారత్‌లోని ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో ఇదే అతిపెద్ద నిధుల సమీకరణ కావడం గమనార్హం.
 
ఇప్పటికే కంపెనీలో పలు వెంచర్ క్యాపిటల్(వీసీ), ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో ప్రస్తుత వాటాదారులైన టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, నాస్పర్స్‌తో పాటు సింగపూర్‌కు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్, జీఐసీ, యాక్సెల్ పార్ట్‌నర్స్, డీఎస్‌టీ గ్లోబల్, ఐకానిక్ క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంటల్, సోఫ్నియాలు ఉన్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో ఎవరికి ఎంత వాటాలున్నాయన్న వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు.

ఇదిలాఉండగా.. ఈ భారీ నిధుల సమీకరణ నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ(వేల్యుయేషన్) దాదాపు రూ.42,000 కోట్లకు ఎగబాకినట్లు పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే డీఎస్‌టీ గ్లోబల్ 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఫిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. తాజా పెట్టుబడులను కలిపితే కంపెనీ ఇప్పటిదాకా వివిధ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం 1.7 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా.
 
ఐపీఓ ప్రణాళికలేవీ లేవు...
విక్రేతల సంఖ్యను పెంచుకోవడం, కస్టమర్లకు మరింత మెరుగైన సదుపాయాలు, పరిశోధన- అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), ఆన్‌లైన్-మొబైల్ సేవల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. భవిష్యత్‌లో తమ కంపెనీని మొబైల్ ఈ-కామర్స్‌లో దూసుకెళ్లేలా చేయడం... ఉత్పత్తులు, టెక్నాలజీలకు సంబంధించి వినూత్న ఒరవడులు తీసుకొచ్చేలా పెట్టుబడులు చేయనున్నామని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సచిన్ బన్సల్ పేర్కొన్నారు. తాము దీనిపై దృష్టిని కేంద్రీకరించేందుకు 2020కల్లా దేశంలో మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు ఎగబాకనుండటమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.  
 
టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారేందుకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయన్నారు. పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) కి వచ్చే ప్రణాళికలు, ఆలోచనలేవీ లేవని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. ప్రజల నుంచి నిధులు సమీకరించేంత స్థాయికి ఇంకా తమ బిజినెస్ మోడల్ చేరుకోలేదన్నారు. అమెరికాలో ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో బన్సల్ ఈవిధంగా స్పందించారు.
 
అనతికాలంలోనే....
2007లో బెంగళూరు కేంద్రంగా సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పారు. ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, దుస్తులు ఇలా సమస్త ఉత్పత్తుల అమ్మకానికి వేదికగా నిలుస్తోంది. కంపెనీలో 14,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2.2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించింది. రోజుకు 40 లక్షలకుపైగా విజిట్స్(వెబ్‌సైట్‌లో సెర్చ్) నమోదవుతున్నాయి.
 
నెలకు 50 లక్షల మేర ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. గతేడాదిలోనే బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును అందుకుంది కూడా. విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఈబేలతోపాటు స్నాప్‌డీల్ ఇతరత్రా దేశీ కంపెనీల నుంచి విపరీతమైన పోటీని తట్టుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ ‘మింత్రా’ను రూ.2,000 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement