Flipakart Founder Sachin Bansal Success Story In Telugu - Sakshi
Sakshi News home page

Sachin Bansal: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది

Published Tue, Aug 31 2021 12:01 PM | Last Updated on Tue, Oct 25 2022 6:04 PM

Where Is Flipkart Founder Sachin Bansal And What He Is Doing - Sakshi

Sachin Bansal Biography: ఫ్లిప్‌కార్ట్‌, ఇండియాలో ఇ కామర్స్‌కి రాచబాటలు వేసిన స్టార్టప్‌. సచిన్‌బన్సాల్‌, బిన్ని బన్సాల్‌ అనే ఇద్దరు యువ ఇంజనీర్లు స్థాపించిన ఇ కామర్స్‌ కంపెనీ మన దగ్గర రికార్డులు సృష్టించింది. 2007లో నాలుగు లక్షలతో ప్రారంభిస్తే 2018లో ఆ కంపెనీలో వాటా అమ్మినందుకు ప్రతిఫలంగా సచిన్‌ బన్సా్‌ల్‌కి వన్‌ బిలియన్‌ డాలర్లు ప్రతిఫలంగా దక్కాయి. మన కరెన్సీలో అయితే ఏకంగా 73 వేల కోట్ల రూపాయల పైమాటే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ని అమ్మేసిన తర్వాత సచిన్‌ బన్సాల్‌ ఏం చేస్తున్నారు? అక్కడ వచ్చని సొమ్మును ఎలా వెచ్చిస్తున్నారు?

సమస్య నుంచే పుట్టిందే ఫ్లిప్‌కార్ట్‌
ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్‌ చదివేప్పుడు అవసమైర పుస్తకాల కోసం బుక్‌స్టోర్స్ గాలించే వాడు సచిన్‌ బన్సాల్‌, ఒక్కో పుస్తకం ఒక్కో షాపులో దొరికేది. కొన్ని పుస్లకాల కోసం నగరంలోని  మార్కెట్లను జల్లెడ పట్టాల్సి వచ్చేది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి పక్క ఊరి నుంచి కూడా పుస్తకాలు తెప్పించుకునే వాడు. తాను పడ్డ ఇబ్బందులకు పరిష్కార మార్గం ఆలోచించే పనిలో పుట్టిందే ఫ్లిప్‌కార్ట్‌. పుస్తకాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట అన్ని లభించేలా ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభమైంది. 

నాలుగు లక్షల పెట్టుబడి
ఇండియా ఐటీ సెక్టార్‌ క్యాపిటల్‌ బెంగళూరు కేంద్రంగా  కేవలం రూ. 4,00,000 పెట్టుబడితో 2007లో ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ తప్పనిసరి యాప్‌గా ఫ్లిప్‌కార్ట్‌ మారింది. మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలు, చిన్న మున్సిపాలిటీల వరకు ఫ్లిప్‌కార్ట్‌ సేవలు విస్తరించాయి. చివరకు 2018లో వాల్‌మార్ట్‌ సంస్థ 16 బిలియన్‌ డాలర్లకు ఈ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పుడే ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బయటకు వచ్చారు సచిన్‌ బన్సాల్‌.

బ్యాంకులు ఇలా పని చేస్తాయా !
ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండర్‌గా ఉంటూ టెక్నోక్రాట్‌గా ఎంట్రప్యూనర్‌గా అంత వరకు గడిపిన లైఫ్‌ ఒకటైతే ఆ తర్వాత మరో లైఫ్‌ గడపాల్సి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ అమ్మగా వచ్చిన బోలెడంత డబ్బు చేతిలో ఉంది. అప్పటి వరకు తన ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేందుకు సచిన్‌ బన్సాల్‌ ఓ పెద్ద బ్యాంక్‌కి చెందిన యాప్‌ని వినియోగించేవాడు. ఆ సమయంలో ఆ యాప్‌ క్రాష్‌ అయ్యింది. నాలుగు రోజుల పాటు పని చేయలేదు. ఆర్థిక లావాదేవీలన్నీ నాలుగు రోజుల పాటు నిలిచి పోయాయి. అప్పడే బ్యాంకులు, వాటి పనితీరు, వాటి నిర్వహాణ పద్దతుల మీద సచిన్‌లో ఆలోచన మొదలైంది.

ఆరు నెలల పాటు..
ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు బ్యాంకులు కష్టమర్ల ఎంపిక, లోన్లు ఇచ్చే తీరు, వసూలు చేసే పద్దతిలను జాగ్రత్తగా గమనించాడు. దాదాపుగా అన్ని బ్యాంకులు ఒకే పద్దతిని అనుసరిస్తూ లోన్లు ఇచ్చేప్పుడు విపరీతమైన ఆలస్యం చేస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చాడు. అంతేకాదు అర్హత కలిగిన ఎంతో మందికి బ్యాంకుల ద్వారా లోన్లు పొందడం కష్టంగా ఉందనే విషయం అర్థమైంది. ఇక బ్యాంకుల డిజిటల్‌ లావాదేవీలు జటిలంగా ఉండటానికి గమనించాడు.

నావికి రూపకల్పన
సామాన్యుల నుంచి బిజినెస్‌ టైకూన్ల వరకు అందరి ఆర్థిక వ్యవహరాలు నిర్వర్తించడానికి వీలుగా ఉండేలా నావి పేరుతో డిజిటల్‌ ఫైనాన్సియల​ సర్వీసెస్‌ యాప్‌ని సచిన్‌ బన్సాల్‌ రూపకల్పన చేశారు. నావిగేటర్‌ అనే పదం నుంచి నావిని తీసుకున్నారు. హోం లోన్లు, పర​‍్సనల్‌ లోన్లతో పాటు హెల్త్‌ ఇన్సురెన్స్‌ సేవలను అందివ్వడం నావి ప్రత్యేకత. 

20 నిమిషాల్లోనే
నావి ద్వారా లోన్లు పొందేందుకు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, వందల కొద్ది సంతకాలు, పదుల కొద్ది డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఐదు నుంచి 20 నిమిషాల లోపే అన్ని పనులు నావి యాప్‌ ద్వారా చేసేయోచ్చని ఆ వెంటనే లోన్‌ పొందవచ్చని సచిన్‌ చెబుతున్నారు. తమ యాప్‌లోని ఆర్టిఫీషియల​ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ సాయంతో పని త్వరగా పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నారు. రికవరీ కూడా అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

వంద కోట్ల మందికి 
వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి నావి డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ ద్వారా రూ. 4200 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా రూ. 900 కోట్లు రుణాలు ఇచ్చారు. కేవలం మైక్రోఫైనాన్స్‌లకే రూ.1500 కోట్లు ఇవ్వాలని లక్క్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే నావి బ్యాంకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బ్యాంకులు ప్రధానంగా ఆన్‌లైన్‌ వేదికగానే ఎక్కువ పనులు చక్కబెడతాయి. వంద కోట్ల మందికి సేవలు అందివ్వాలన్నదే లక్క్ష్యంగా నావి ముందుకు పోతుంది.

భవిష్యత్తు డిజిటల్‌దే
ఒకప్పుడు మన దగ్గర ఒక వస్తువు కొనేప్పుడు దాన్ని ముట్టుకుని, గట్టిగా పట్టుకుని సంతృప్తి​ చెందితేనే కొనే అలావాటు ఉండేది. అలాంటిది ఫ్లిప్‌కార్ట్‌ రాకతో నెట్‌లో చూసి నమ్మకంతో వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పదేళ్లలో బిలియన్‌ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు. అదే తీరులో నావి కూడా భవిష్యత్తులో ప్రతీ ఒక్కరికి చేరువ అవుతుందనే నమ్మకంతో సచిన్‌ ఉన్నారు. ఎందుకంటే 5జీ రాకతో డిజిటల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సచిన్‌ అంటున్నారు.

మనీకంట్రోల్‌ సౌజన్యంతో
 

చదవండి: Alibaba: అత్యాచార బాధితురాలికి అండగా పోస్టులు.. పది మంది ఎంప్లాయిస్‌ డిస్మిస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement