
ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.
ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది.