న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ రుణాల యాప్‌లపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో డిజిటల్ రుణాల యాప్‌లకు (డీఎల్‌ఏ) స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్‌ఆర్‌వో) ఉండాలని రీసెర్చ్ సంస్థ చేజ్ ఇండియా ఒక నివేదికలో ప్రతిపాదించింది. సక్రమమైన డీఎల్‌ఏల వ్యాపార కార్యకలాపాలు, విధానాలకు చట్టబద్ధత లభించడంతో పాటు వాటికి తగిన నియంత్రణ విధానాలను నిర్దేశించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అలాగే, డీఎల్‌ఏలకు ప్రామాణికమైన నైతిక నియమావళిని కూడా నిర్దేశించాలని సూచించింది.
పరిశ్రమ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలతో చేజ్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. దేశీయంగా డిజిటల్ రుణాల వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి తోడ్పడటంతో పాటు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోతగిన ప్రతిపాదనలతో దీన్ని తీర్చిదిద్దింది. రుణ వ్యవస్థలను పటిష్టం చేసేందుకు పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ (పీసీఆర్)ను రూపొందించాలని చేజ్ ఇండియా పేర్కొంది.
డిజిటల్ రుణాల విభాగం ఎదుగుతున్నప్పటికీ పర్యవేక్షణ లేకుండా డీఎల్‌ఏలు పాటించే విధానాలు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కౌశల్ మహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాధ్యతాయుతంగా వ్యవహరించే సంస్థలను ప్రోత్సహించడంతో పాటు నవకల్పనలకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఇటు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ అటు పరిశ్రమ వృద్ధి మధ్య సమతౌల్యత సాధించవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment