కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్ | Infosys begins search for new CEO, Shibulal wants early retirement | Sakshi
Sakshi News home page

కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్

Published Sat, Apr 12 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్

కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్

బెంగళూరు:  ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను ఎన్.ఆర్.నారాయణ మూర్తి గతేడాది తిరిగి చేపట్టిన తర్వాత కంపెనీకి గుడ్‌బై చెబుతున్న ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు డెరైక్టర్లతో సహా తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ కారణాలతో వైదొలిగారు. తాజాగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎస్.డి.శిబులాల్ అదే బాటపట్టారు. శిబులాల్ వారసుడి కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే పదవి నుంచి వైదొలగుతానని శిబులాల్ (59) చెప్పడమే ఇందుకు కారణమని తెలిపింది.

 కేరళలోని అలెప్పీలో జన్మించిన ఆయనకు వచ్చే ఏడాది మార్చి 1వ తేదీకి 60 ఏళ్ల నిండనున్నాయి. తన పదవీ కాలం పూర్తి కావడానికి (మార్చి 2015) ముందు, లేదా కొత్త వ్యక్తి ఈ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైనపుడు తాను తప్పుకుంటానని శిబులాల్ గతంలోనే వెల్లడించారని కంపెనీ పేర్కొంది. శిబులాల్ వారసుడి కోసం డెరైక్టర్ల బోర్టులోని నామినేషన్ల కమిటీ అన్వేషణ ప్రారంభించిందని ఇన్ఫోసిస్ తెలిపింది. సంస్థలో ఈ పదవికి అర్హత కలిగిన వారిని నామినేషన్ల కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుందనీ, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో పేరొందిన డెవలప్‌మెంట్ డెమైన్షన్స్ ఇంటర్నేషనల్ సహాయం తీసుకుంటామనీ పేర్కొంది.

ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారిలో తగిన వారిని గుర్తించడంలో కమిటీకి సహకరించేందుకు ఎగాన్ జెండర్ అనే ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీని ఇన్ఫోసిస్ నియమించింది.  ముందుగానే రిటైర్ కావాలని శిబులాల్ ఎందుకు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కంపెనీ ప్రతినిధి జవాబు నిరాకరించారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (జనవరి - మార్చి) ఆర్థిక ఫలితాలను త్వరలో (ఈ నెల 15న) ప్రకటించనున్నందున ప్రస్తుతం మౌనం పాటిస్తున్నామని ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్‌లో ఉన్నతమైన సీఈఓ పీఠం కోసం కంపెనీ అధ్యక్షులిద్దరూ (బి.జి.శ్రీనివాస్, యు.బి.ప్రవీణ్ రావు) రేసులో ఉన్నారని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి గత జనవరిలోనే సూచనప్రాయంగా వెల్లడించారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావులు మూడు నెలల క్రితమే ప్రమోట్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement