భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు | Individual wealth may double to Rs 411 lakh crore in 5 yrs | Sakshi
Sakshi News home page

భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు

Published Tue, Dec 24 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు

భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్ళలో భారతీయుల వ్యక్తిగత సంపద విలువ రెట్టింపై రూ.411 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ ప్రైవేట్ వెల్త్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారతీయులు వ్యక్తిగత సంపద రూ.202 లక్షల కోట్లుగా ఉన్నట్లు కార్వీ ‘ఇండియా వెల్త్ రిపోర్ట్- 2013’ పేర్కొంది. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశం ముందుకుపోతున్నా ఇప్పటికీ భారతీయులు ఈక్విటీల కంటే బంగారం, స్థిరాస్తి రంగాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఈ మొత్తం సంపదలోనే అత్యధికంగా రూ.60.61 లక్షల కోట్లు (30 శాతం) ఒక్క బంగారానికే కేటాయించారంటే భారతీయులు బంగారంపై ఎంత ప్రేమ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో స్థిరాదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లలో రూ.35 లక్షల కోట్లు (17%), రియల్ ఎస్టేట్‌లో రూ.31.43 లక్షల కోట్లు (16%) ఇన్వెస్ట్ చేశారంట. వీటన్నింటితో పోలిస్తే భారతీయులు కేవలం రూ.24.31 లక్షల కోట్ల(12%) విలువైన ఈక్విటీ సంపదను మాత్రమే కలిగి ఉన్నారు.
 
 ఇతర పెట్టుబడి సాధనాలన్నింటికీ కలిపి 54 శాతం కేటాయిస్తే కేవలం బంగారం, స్థిరాస్తి రంగాలకే 46 శాతం కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ పెట్టుబడి సాధనాలు, ఫిజికల్ అసెట్స్ పెట్టుబడుల నిష్పత్తి 55:45 వద్ద స్థిరంగానే ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా తెలిపారు. కాని రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటంతో బంగారం నుంచి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంపదలో 30 శాతం వాటా ఉన్న బంగారం వాటా 22 శాతానికి పడిపోతుందని ఈ మొత్తం అత్యధికంగా ఈక్విటీల్లోకి వస్తుందన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా బాగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఫిజికల్ అసెట్స్‌లో బంగారం, స్థిరాస్తి నిష్పత్తి 65:35గా ఉందని, అదే వచ్చే ఐదేళ్ళలో 52:48గా మారుతుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement