‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్‌మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి.
పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు...
భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి.
ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి.