mean
-
నరకయాతన
‘గాంధీ’లో అందని వైద్యం అల్లాడుతున్న రోగులు వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత మొరాయిస్తున్న వైద్య పరికరాలు అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు నేడు గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ రాక గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షగా మారింది. మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచే వచ్చే వారు నరకయాతన అనుభవి స్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత, యంత్రాలు మొరాయించడం వంటి సమస్యలతో రోగులు సతమతమవుతున్నారు. మూలనపడ్డ వైద్యపరికరాలు... ఆస్పత్రిలోని పలు విభాగాల్లో అత్యవసర వైద్యయంత్రాలు మూలనపడ్డాయి. సుమారు 70 వెంటిలేటర్లు ఉండగా వాటిలో అత్యధికం పనిచేయడం లేదు. కార్డియాలజీ విభాగంలో యాంజియోగ్రఫీ, ఈసీజీ యం త్రాలు వారం రోజులుగా పనిచేయడంలేదు. రేడియాలజీలో ఎంఆర్ఐ, సీటీ తదితర యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. నెఫ్రాలజీ వార్డులోని మూడు డయాలసిస్ యంత్రాలు మూలనపడి ఏళ్లు గడుస్తున్నాయి. వార్డుల్లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. భర్తీకాని పోస్టులు... ఆసుపత్రిలో ప్రస్తుతం 1,849 పడకలు ఉన్నాయి. తదనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. 908 పోస్టులకు గాను వివిధ కేటగిరీల్లో 237 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన పడకలకు అనుగుణంగా మరో వేయి పోస్టులు మంజూరు చేయాలని ఆసుపత్రి అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. 36 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్డియాలజీ విభాగాన్ని ఒక ప్రొఫెసర్, మరో పీజీతో ఏడాదిగా నెట్టుకొస్తున్నారు. అనస్తీషియా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. హెచ్ఐవీ బాధితులకు వైద్యసేవలందించే ఏఆర్టీ సెంటర్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఆస్పత్రిలో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిఘా వర్గాలు హెచ్చరించగా, ఎట్టకేలకు నెలరోజుల క్రితం కేవలం 14 కెమెరాలు ఏర్పాటు చేశారు. వైద్య విద్యార్థులకు వసతి కొరత గాంధీ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి సౌకర్యం కొరత తీవ్రంగా ఉంది. ఇదే కారణంతో ఎంసీఐ గత ఏడాది పెంచిన 50 ఎంబీ బీఎస్ సీట్లను రద్దు చేసింది. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల వసతి సౌకర్యాల కల్పనలో జాప్యం జరిగిందనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రద్దు చేసిన సీట్లను తిరిగి కేటాయించింది. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ, హౌస్‌సర్జన్, సూపర్‌స్పెషాలిటీ పీజీలు చదువుతున్న సుమారు 700 మంది విద్యార్థులకు వసతి కల్పించాల్సి ఉంది. సీఎం రాకతోనైనా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఆయన ఇక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. ఇక్కడి సమస్యలను ఆలకించి పరిస్థితులను మెరుగు పరచాలని వారు వేడుకుంటున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి, యంత్ర పరికాలను సమకూర్చి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు. జయశంకర్ విగ్రహానికి తుదిమెరుగులు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని టీజీజీడీఏ ప్రతినిధులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేశ్ తెలిపారు. కార్యక్రమాలు ఇలా.. ఆసుపత్రి నిర్వహణ కమిటీ నేతృత్వంలో 60 వసంతాల వేడుకలు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. వేడుకల కమిటీ, పూర్వవిద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేస్తారు. అనంతరం వివేకానంద ఆడిటోరియంలో జరిగే వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరవుతారని కమిటీ ప్రతినిధులు టి. రాజయ్య, కె.లింగయ్య, పి.శ్రీనివాస్, కె,.రమేశ్‌రెడ్డి తెలిపారు. 2కే10 బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రెషర్స్‌డే ఫెస్టివల్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని ఫెస్ట్ నిర్వాహకులు మనోజ్ తెలిపారు. -
కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది. రంగాల పరంగా చూస్తే... జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ పెరగడం హర్షణీయం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం. క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి. పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు... భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి. ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి.