కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది.
రంగాల పరంగా చూస్తే...
జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి.
డిమాండ్ పెరగడం హర్షణీయం
అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం.
క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే
జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.