ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి
* ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ
* ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై
బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్‌హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీనియర్లు వైదొలగడంపై..
ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు.
రోహన్ మూర్తిపై..
‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది.
అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం..
ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్‌వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్‌వెర్వ్‌ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది.
మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు..
మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది.
తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్‌మెంట్‌కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు.