ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా | Infosys names Vishal Sikka as first external CEO in turnaround bid | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా

Published Fri, Jun 13 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా

ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా

ఆగస్టు 1 నుంచి సీఈఓ, ఎండీగా బాధ్యతలు
   
* తొలిసారి కంపెనీ బయటివ్యక్తికి పగ్గాలు
* పదవి నుంచి రేపు వైదొలగనున్న
* ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి

 
టెక్నాలజీ పరిశ్రమ మార్గదర్శకులు నెలకొల్పిన ఇన్ఫోసిస్‌కు సారథ్యం వహించడం నాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఇన్ఫీ ఉద్యోగులతో కలసి పనిచేయాలని, వారి నుంచి నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. కంప్యూటింగ్ టెక్నాలజీ అన్ని పరిశ్రమల తీరుతెన్నులను మారుస్తోంది. మా ఖాతాదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వాటాదారుల విలువను మరింత ఇనుమడింపచేసేలా బ్రేక్‌త్రూ సొల్యూషన్స్‌ను అందించే అరుదైన అవకాశం మాకు లభించింది.
 - ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ, ఎండీగా ఎంపికైన తర్వాత విశాల్ సిక్కా వ్యాఖ్యలు
 
బెంగళూరు: వరుసగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్ర్కమణతో సతమతమవుతున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా(47) నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి శనివారం పదవి వీడనున్నారు. మరో సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ కూడా అదే రోజు తప్పుకోనున్నారు. ఈ విషయాలను ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. కాగా, అసలు ఇన్ఫోసిస్‌కు సంబంధం లేని బయటవ్యక్తి కంపెనీకి సారథ్యం వహించడం తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, కంపెనీ వ్యవస్థాపకుల్లో లేనివ్యక్తి సీఈఓ కావడం కూడా ఇదే మొట్టమొదటిసారి.
 
జర్మన్ సాఫ్ట్‌వేర్ సంస్థ శాప్ ఏజీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యుడైన సిక్కా ఇన్ఫీ పూర్తికాల డెరైక్టర్‌గా శనివారం చేరనున్నారు. ఇప్పటివరకు ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ఎస్.డి.శిబూలాల్ వచ్చే మార్చిలో రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ ముందుగానే పదవీ విరమణ చేస్తానని చెప్పడంతో ఆయన వారసుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. కాగా, ఇన్ఫోసిస్‌లోకి నారాయణ మూర్తి గతేడాది జూన్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రెండో ఇన్నింగ్ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటిదాకా 11 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పడం తెలిసిందే.
 
అక్టోబర్ వరకు నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా...

గతంలో ఇన్ఫీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ మూర్తి, కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది జూన్ 1న మళ్లీ పగ్గాలు చేపట్టారు. మూర్తి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, గోపాలకృష్ణన్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వచ్చే అక్టోబర్ 10 వరకు కొనసాగుతారు. ఇన్ఫీ బోర్డు ఎక్స్‌టర్నల్ డెరైక్టర్ కె.వి.కామత్ అక్టోబర్ 11 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారు. ‘సంస్థ పురోగతికి అందించిన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 11 నుంచి మూర్తి గౌరవ చైర్మన్ (చైర్మన్ ఎమిరిటస్)గా వ్యవహరిస్తారు..’ అని ఇన్ఫీ ప్రకటన తెలిపింది.
 
14 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫీసు రద్దు...
ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (నారాయణ మూర్తి) కార్యాలయం ఈ నెల 14 నుంచి రద్దు కానుంది. మూర్తి కుమారుడు, ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోహన్ పదవీకాలం మూర్తితో పాటే ముగియనుంది. అంటే, రోహన్ శనివారం నుంచే కంపెనీని వీడనున్నారు. కంపెనీలో సీనియర్ ఉద్యోగులైన పన్నెండు మందికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి ఇవ్వడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థ కొత్త సీఈఓగా సిక్కాను ఎంపికచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. గ్లోబల్ కార్పొరేషన్ సారథిగా పనిచేసిన ఆయన తన విలువైన అనుభవాన్ని ఇన్ఫీ అభివృద్ధికి వినియోగిస్తారు. శాప్‌లో విశేష విజయాలు సాధించిన సిక్కాను ఇన్ఫీ అత్యున్నత పదవికి ఎంపికచేయడం ఆదర్శనీయం..’ అని మూర్తి తెలిపారు.
 
నేనూ టీచర్ కుమారుడినే: విశాల్
పంజాబీ కుటుంబంలో జన్మించిన విశాల్ సిక్కా విద్యాభ్యాసం గుజరాత్‌లో కొనసాగింది. ఆయన తండ్రి రైల్వే ఇంజనీరు. వడోదరలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌ను సిక్కా పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని సైరాక్యూస్ యూనివర్సిటీలో ఎంఎస్(కంప్యూటర్ సైన్స్) చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 1996లో పీహెచ్‌డీ పొందారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ ఇన్ఫీ సీఈఓ పదవి ఆయన్ను వరించడానికి కారణం ఆయన విజ్ఞాన తృష్ణే. పలువురు సీనియర్ లెవల్ అధికారులు ఇటీవల ఇన్ఫీకి గుడ్‌బై చెప్పారు. మరోపక్క టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ నుంచి ఇన్ఫీకి పోటీ పెరిగింది.
 
ఈ నేపథ్యంలో ఇన్ఫీ సారథ్యాన్ని చేపట్టడం సవాలు వంటిదే. ‘కొత్త బాధ్యతలను నేను సంతోషంగా, వినయంగా స్వీకరిస్తున్నాను. నారాయణ మూర్తిలానే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ రాజ్‌కోట్ (గుజరాత్)లో టీచరుగా పనిచేశారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇన్ఫీ ఇస్తున్న ప్రాధాన్యత నన్ను సంభ్రమానికి గురిచేసింది..’ అని విశాల్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జెరాక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత సోదరునితో కలసి ఐబ్రెయిన్ పేరుతో తొలి కంపెనీని స్థాపించారు.
 
ఐబ్రెయిన్‌ను ఆ తర్వాత పాటెర్న్ ఆర్‌ఎక్స్ టేకోవర్ చేసింది. తదనంతరం నెలకొల్పిన బోధ.కామ్‌ను పెరిగ్రైన్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. అందులో కొంతకాలం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సిక్కా, 2002లో శాప్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గ్రూప్ హెడ్‌గా చేరారు. ఐదేళ్లలోనే కంపెనీ సీటీఓ స్థాయికి ఎదిగారు. గేమ్ చేంజింగ్ ‘హానా’ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఘనత విశాల్‌దే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement