ఔను.. ఇన్ఫీలో లుకలుకలు నిజమే!
కంపెనీలో కార్పొరేట్ నైతికత దిగజారింది..
• బాంబు పేల్చిన నారాయణ మూర్తి...
• అలాంటిదేమీ లేదంటున్న కంపెనీ బోర్డు
• కొన్ని అంశాల్లో ప్రమోటర్లకు బోర్డుకు మధ్య విభేదాలున్నాయన్న కిరణ్ షా
• సీఈఓ విశాల్ సిక్కాకు బోర్డు సభ్యుల సంపూర్ణ మద్దతు
బెంగళూరు: దేశీ కార్పొరేట్ రంగంలో ఉన్నత ప్రమాణాలకు నెలవైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో బోర్డు రూమ్ యుద్ధం నిజమేనన్న విషయం బట్టబయలైంది. కంపెనీ ప్రమోటర్లకు, బోర్డు సభ్యుల మధ్య అగ్గి రాజుకుందన్నది ఊహాగానాలు కాదని.. వాస్తవమేనని తేలిపోయింది. కంపెనీలో కార్పొరేట్ నైతిక ప్రమాణాలు(గవర్నెన్స్) దిగజారాయని.. స్వయంగా కంపెనీ కీలక వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి బాంబు పేల్చడంతో లుకలుకలు తీవ్రరూపం దాల్చాయి.
బోర్డుకు, ప్రమోటర్లకు మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతోంది. సీఈఓ విశాల్ సిక్కాకు వేతన ప్యాకేజీని భారీగా పెంచడం, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్ద మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీని ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ ఊహాగానాలేనంటూ కొట్టిపారేసిన కంపెనీ సిక్కా.. మూర్తి వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారో వేచిచూడాల్సి ఉంది. కాగా, కార్పొరేట్ ప్రమణాల అమల్లో లోపాలు ఉన్నాయన్న వాదనలను ఇన్ఫోసిస్ కొట్టిపారేసింది.
బోర్డును ప్రక్షాళన చేయాల్సిందే...
ఇన్ఫీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా తర్వాత వీడ్కోలు ప్యాకేజీ కింద దాదాపు రూ. 23 కోట్ల భారీ మొత్తాన్ని బోర్డు ఆఫర్ చేయడం తెలిసిందే. మరో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కెన్నడీకి కూడా రూ.5.85 కోట్ల రాజీనామా ప్యాకేజీ ఇచ్చారు. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా వార్షిక వేతన ప్యాకేజీని ఇప్పుడున్న 7.08 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 11 మిలియన్ డాలర్లకు పెంచేందుకు బోర్డు ఓకే చెప్పింది. ఇష్టానుసారంగా ఇలా భారీ ప్యాకేజీలను ఆమోదించడాన్ని నారాయణమూర్తితో పాటు ఇతర కీలక వ్యవస్థాకులు నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్ గట్టిగా వ్యతిరేకించినట్లు ఇప్పుడు తేటతెల్లమైంది. ఎంతో గొప్ప ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఇన్ఫోసిస్‌లో ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చూస్తుంటే బాధ కలుగుతోందని నారాయణ మూర్తి ఒక బిజినెస్ దిన పత్రిక, టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించారు. బోర్డులో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మూర్తి ఏమన్నారంటే...
‘ఉన్నత కార్పొరేట్ ప్రమాణాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మేం(ఇన్ఫోసిస్) ఎన్నో అవార్డులు అందుకున్నాం. అయితే, 2015, జూన్ 1 నుంచి(సిక్కాను అదే నెలలో సీఈఓగా ఎంపిక చేశారు) క్రమంగా ఈ ప్రమాణాలు దిగజారుతున్నాయి. దీనిపై వ్యవస్థాపకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది’ అని మూర్తి పేర్కొన్నారు. తాజా ఉదంతంలో ప్రధానంగా మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్ ప్యాకేజీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, విశాల్ సిక్కా పనితీరుపై మాత్రం ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ‘ఒక విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. మేనేజ్‌మెంట్‌పై మాకు ఎలాంటి ఆందోళనా లేదు. సీఈఓపై మేం చాలా సంతృప్తితో ఉన్నాం. ఆయన పనితీరు బాగుంది. అయితే, మమ్మల్ని(వ్యవస్థాపకులు, సీనియర్లు, మాజీ ఉద్యోగులు) ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఒక్కటే. కొన్ని నిర్ణయాలు, అంశాలకు సంబంధించి కార్పొరేట్ ప్రమాణాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది’ అని మూర్తి పేర్కొన్నారు.
‘రాజీనామా చేసిన వాళ్లకు చాలా రహస్యాలు, కంపెనీ కీలక సమాచారం తెలుసని చైర్మన్ ఏజీఎంలో చెప్పారు. అయితే, ఇన్ఫోసిస్‌లో గతంలో ఇద్దరు సీఎఫ్‌ఓలతోపాటు పలువురు సీనియర్లు కూడా వైదొలిగారు. వాళ్లలో కొందరు బోర్డులో సభ్యులు కూడా. వాళ్లకు కూడా కంపెనీకి సంబంధించి చాలా రహస్యాలు, కీలక సమాచారం తెలుసు. అయినా, వాళ్లెవరికీ ఇంత భారీ మొత్తంలో ప్యాకేజీలు(బన్సల్‌ను ఉద్దేశిస్తూ) ఇవ్వలేదు. అని మూర్తి పేర్కొన్నారు. కంపెనీకి ఇబ్బంది కలిగించే సమాచారం ఉన్నదన్న కారణంగానే బన్సల్‌కు అంతభారీగా ప్యాకేజీ ఇచ్చారని మార్కెట్లో ఊహాగానాలు ఉన్నాయన్న ప్రశ్నకు.. దానికీ దీనికీ సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.
బోర్డులోకి వచ్చే ఉద్దేశం లేదు..: పాయ్
ప్రధాన వాటాదారులుగా వ్యవస్థాపకులకు కంపెనీలో లోపాలు, చట్టబద్ధమైన ఆందోళనలను వ్యక్తం చేసే అధికారం ఉందని ఇన్ఫీ మాజీ సీఎఫ్‌ఓ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు. అయితే, ప్రమోటర్లతో పాటు తామెవ్వరం మళ్లీ బోర్డులోకి రావాలని భావించడం లేదని చెప్పారు.
గవర్నెన్స్ లోపాల్లేవు: శేషసాయి
కంపెనీలో కార్పొరేట్ ప్రమా ణాల అమలులో లోపాలున్నాయన్న వాదనలను ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. ‘ఇన్ఫీని కొత్త శిఖరాలవైపు నడిపించే దిశగా సీఈఓ విశాల్ సిక్కా వ్యూహాలు, ఆయన తీసుకుంటున్న చర్యలు ఎంతో అభినందించదగినవి. బోర్డు, సీఈఓల మధ్య మంచి సమన్వయం ఉంది’ అని కంపెనీ చైర్మన్ ఆర్. శేషసాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇన్ఫీ ఉదంతంలోకి మమ్మల్ని లాగొద్దు: సీతారామన్
కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం నెలకొన్న విభేదాల్లోకి తమను(ప్రభుత్వాన్ని) లాగొద్దని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్వతంత్ర డైరెక్టర్‌గా కేంద్ర మంత్రి జయంత్ సిన్హా భార్య పునీతా సిన్హా నియామకంలో స్వార్థ ప్రయోజనాలేవీ ముడిపడి లేవని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ఒక దిగ్గజ కార్పొరేట్ సంస్థలో చోటుచేసుకునే సంఘటనలపై మీడియాలో వస్తున్న వార్తలను చూసి వ్యాఖ్యానించడం మంచిది కాదు.
ఇక పునీతా సిన్హా నియామకానికి ప్రస్తుతం ఇన్ఫీలో కార్పొరేట్ ప్రమాణాలపై నడుస్తున్న భేదాభిప్రాయాలకూ సబంధం ఉందని నేను భావించడం లేదు. ఈ రంగంలో పునీతా చాన్నాళ్ల నుంచీ కొనసాగుతున్నారు. ఆమెకున్న నైపుణ్యాలు, సామర్థ్యం మేరకే ఇన్ఫీలో చోటు లభించి ఉండొచ్చు’ అని సీతారామన్ పేర్కొన్నారు.
ప్రమాణాలను ఉల్లంఘించలేదు..: షా
ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ నైతిక ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని బోర్డు సభ్యుల్లో ఒకరైన కిరణ్ మజుందార్ షా శుక్రవారం స్పష్టం చేశారు. అయితే, కొన్ని నిర్ణయాత్మక అంశాల్లో ప్రమోటర్లతో బోర్డు విభేదించి ఉండొచ్చని చెప్పడం విశేషం. ప్రమోటర్ల ఆందోళనలను తగ్గించే విషయంలో తగిన చర్యలపై బోర్డు దృష్టిసారిస్తుందని ఆమె పేర్కొన్నారు. సీఈఓ విశాల్ సిక్కా సారథ్యం పట్ల బోర్డు పూర్తి సంతృప్తితో ఉందని.. ఆయనను బాసటగా నిలుస్తుందని కూడా షా తేల్చిచెప్పారు. కలసికట్టుగా కంపెనీని కొత్త శిఖరాల దిశగా తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి గందరగోళాన్ని సృష్టించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మొత్తంమీద బోర్డుకు, వ్యవస్థాకులకు మధ్య పొరపొచ్చాలు ఉన్నాయన్నది షా మాటలతో స్పష్టం అవుతోంది.
‘కొన్ని అంశాలపై నారాయణ మూర్తి, ఇతర ప్రమోటర్లు అభ్యంతరం తెలపడం వాస్తవమే. ఇవన్నీ కేవలం అభిప్రాయపపరమైన విభేదాలే తప్ప.. కార్పొరేట్ ప్రమాణాలు దిగజారడం కిందకు రావని నేను అనుకుంటున్నా’ అని షా వ్యాఖ్యానించారు. ఇక మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్‌కు భారీ ప్యాకేజీ ఇవ్వడంపై స్పందిస్తూ... పలు సంక్లిష్టతల నడుమ దీనికి బోర్డు ఆమోదం తెలిపిందని, ఇలాంటి నిర్ణయాత్మక అంశాలను యాజమాన్యానికే వదిలిపెట్టడం మంచిదని షా పేర్కొన్నారు. బన్సల్ ప్యాకేజీని బోర్డు మొత్తం సమర్థించినట్లు కూడా ఆమె వెల్లడించారు.
చైర్మన్ వైదొలగాల్సిందే: బాల
కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్‌లో లోపాలకు పూర్తిగా చైర్మన్(ఆర్. శేషసాయి)దే బాధ్యత అని.. తక్షణం ఆయన పదవి నుంచి వైదొలగాలంటూ కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ వి. బాలకృష్ణన్ పేర్కొన్నారు. వాటాదారుల ఆందోళనలను పరిష్కరించేందుకు తాత్కాలిక చైర్మన్‌ను నియమించాలని కూడా ఆయన సూచించారు. ‘లోపాలకు బోర్డు, చైర్మన్‌దే పూర్తి బాధ్యత. చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాలి. వ్యవస్థాపకులు లేవనెత్తిన ఆందోళనలను నేరుగా పరిష్కరించేందుకు బోర్డు తాత్కాలిక చైర్మన్‌ను నియమించాల్సిందే’ అని బాల ఒక ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించారు.
కాగా, కార్పొరేట్ గవర్నెన్స్ అంశం అనేది వ్యవస్థాపకులు, ప్రస్తుతం సీఈఓ విశాల్ సిక్కాలకు సంబంధించినది కకాదన్నారు. కంపెనీతో సంబంధాలు తెగిపోయాక వ్యాపార కార్యకలాపాల్లో ప్రమోటర్లు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని కూడా చెప్పారు. ‘సిక్కా కు స్వయంగా వ్యవస్థాపకులే సారథ్యాన్ని కట్టబెట్టారు. ఆయనకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారుతోందంటూ ప్రమోటర్లు గత కొన్నాళ్లుగా ఆందోళనలను వ్యక్తపరుస్తున్నారు. అయినా, దీన్ని పరిష్కరించే దిశగా బోర్డు సమర్థమైన చర్యలేవీ తీసుకోలేదు’ అన్నారు. అయితే, బోర్డులో సిక్కా కూడా ఒక సభ్యుడే కాబట్టి.. ఆయనకు తామేమీ క్లీన్‌చిట్ ఇవ్వదలచుకోలేదని చెప్పారు.