ఇన్ఫీకి సిక్కా జోష్! | Vishal Sikka hopes to turn around Finacle’s fortunes with ex-SAP colleague at helm | Sakshi
Sakshi News home page

ఇన్ఫీకి సిక్కా జోష్!

Published Sat, Oct 18 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

ఇన్ఫీకి సిక్కా జోష్!

ఇన్ఫీకి సిక్కా జోష్!

ఇన్వెస్టర్లలో ఉత్సాహం.. షేరు పరుగులు
పూర్వవైభవానికి సంకేతాలంటున్న విశ్లేషకులు

 
‘సిక్కా అంటే హిందీలో నాణెం అని అర్థం.. తన పేరుకు తగ్గట్లే ఇన్ఫోసిస్‌కు ఆయన బోలెడంత డబ్బు తెచ్చిపెడతారని ఆశిస్తున్నాను’.. విశాల్ సిక్కాను ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ప్రకటిస్తూ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. సిక్కా మీద మూర్తి ఉంచిన నమ్మకానికి ఇన్ఫీ తాజా త్రైమాసిక ఫలితాలు నిదర్శనంగా నిల్చాయి. ఇటు ఇన్వెస్టర్లను, అటు ఉద్యోగులనూ ఆకట్టుకునే ందుకు సిక్కా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన సారథ్యంలో ఇన్ఫీ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

 
దేశీ ఐటీ పరిశ్రమకు ఒకప్పుడు దిక్సూచిగా నిల్చిన దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రాభవం గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఒకవైపు టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి పోటీ సంస్థలు ముందుకు దూసుకెళ్లిపోతుంటే.. ఇన్ఫీ మాత్రం రేసులో వెనుకబడిపోయింది. వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తిరిగొచ్చి సంస్థ ఊపిర్లూదే ప్రయత్నం చేసినా.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అంతంత మాత్రం పనితీరే కనపర్చగలిగింది. పరిశ్రమ సగటు 13 శాతానికన్నా తక్కువగా 11.5 శాతం ఆదాయ వృద్ధితో నిరుత్సాహపర్చింది. పెపైచ్చు మూర్తి పునరాగమనం తర్వాత డజను మంది పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ నుంచి వైదొలిగారు. దాదాపు 30 వేల మంది పైచిలుకు ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారని పరిశ్రమవర్గాల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ సిక్కా .. ఇన్ఫీ సీఈవోగా నియమితులయ్యారు. ఆయన రాకతోనే కంపెనీ సెంటిమెంటు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించడం మొదలైంది.

సెంటిమెంటు, షేరూ జూమ్
సిక్కా బాధ్యతలు చేపట్టాక క్యూ2లో కంపెనీ నికర లాభం అంచనాలను మించి దాదాపు 29 శాతం వృద్ధితో 3,096 కోట్లకు ఎగిసింది. ఆయన వస్తూ.. వస్తూనే ఇన్వెస్టర్లకు దీపావళి ధమాకాను అందించారు. ఒక్కో షేరుకి మరో షేరు బోనస్‌తో పాటు మధ్యంతర డివిడెండు ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా మెరుగుపడింది. సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాల ప్రకారం కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) వాటాలు ఆల్‌టైమ్ గరిష్టమైన 42.76 శాతానికి పెరిగాయి. ఈ పరిణామాలతో ఇన్ఫీ షేరు ధర కొత్త రికార్డు స్థాయి రూ. 3,985ని తాకింది. మొత్తం మీద ఆగస్టు 1న సిక్కా ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టినప్పట్నుంచీ షేరు సుమారు 14 శాతం పైగా ర్యాలీ చేసింది. మరో రెండేళ్లలో స్టాక్ మార్కెట్‌ను తమ షేరే ముందుకు నడిపించేస్థాయికి తీసుకువస్తామంటూ ఇటీవల సిక్కా చేసిన  ప్రకటన ఆయన విశ్వాసానికి అద్దంపడుతోంది.
 
ఉద్యోగుల్లో ఉత్సాహం ..

విశాల్ సిక్కా ఎంట్రీ ఇటు ఉద్యోగుల్లో కూడా ఉత్సాహం నింపుతోంది. వారి నుంచి పని రాబట్టుకోవడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీంతో..  సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడం క్యూ2లో 82.3 శాతానికి పెరిగింది. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించింది. ఒక్క త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం అన్నది కంపెనీ చరిత్రలో ఇదే ప్రథమం. అయినా సరే.. సిక్కా సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి త్రైమాసికంలో ఉద్యోగుల వలసలు భారీగా ఎగిశాయి.

పరిశ్రమ సగటును మించి రికార్డు స్థాయిలో 20.1 శాతంగా నమోదయ్యాయి. అయితే,  ఉద్యోగులకు ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు వంటి చర్యలతో  అట్రిషన్‌ను సిక్కా నెమ్మదిగా పరిశ్రమ సగటు అయిన 13-15 శాతానికి తీసుకురాగలరని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే గాకుండా గతంలో ఇన్ఫీని వీడిపోయిన ఉద్యోగులను కూడా మళ్లీ వెనక్కి రప్పించేందుకు సిక్కా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా దాదాపు వంద మంది పైచిలుకు పూర్వ ఉద్యోగులు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపారు.

రెన్యూ అండ్ న్యూ మంత్రం..
కంపెనీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టడం, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా సిక్కా .. రెన్యూ అండ్ న్యూ మంత్రాన్ని పఠిస్తున్నారు. అలాగే కంపెనీ ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే దిశగా సిక్కా కసరత్తు చేస్తున్నారు.  ఇందుకోసం పూర్వం శాప్‌లో తనతో కలిసి పనిచేసిన సహచరుల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా అయిదుగురు శాప్ ఎగ్జిక్యూటివ్స్ తాజాగా ఇన్ఫీలో చేరారు. మరోవైపు, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకానైతే అన్ని అంశాలూ సిక్కాకు సానుకూలంగానే పనిచేస్తున్నాయి. వాటిని భవిష్యత్‌లో ఎంత కాలం పాటు నిలబెట్టుకోగలరన్నది చూడాల్సి ఉంటుందన్నది పరిశ్రమ వర్గాల మాట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement