Cloud computing
-
10న విశాఖలో ఏఐ, క్లౌడ్ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కీలక వేదికగా నిలిచిన విశాఖ మరో ముఖ్యమైన సదస్సుకు ముస్తాబవుతోంది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన విప్లవాత్మక మార్పులపై ఫిబ్రవరి 10న ఏఐ క్లౌడ్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డీప్‌టెక్ సమ్మిట్స్ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సదస్సు జరుగనుంది. పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, ఐటీ నిపుణులు, ప్రొఫెసర్లు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, ఇంక్యుబేటర్స్, కృత్రిమ మేధ, క్లౌడ్ టెండర్ నిపుణులు పాల్గొననున్నారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌తో కాల్ డ్రాప్స్‌కు చెక్
బార్సెలోనా: కాల్ అంతరాయాల (డ్రాప్స్) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికం నెట్వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్ ఈ విషయాలు వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్వర్క్ సాఫ్ట్వేర్ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
కంపెనీలకు క్లౌడ్ దన్ను
లాస్ వెగాస్, అమెరికా: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తదితర సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుని .. సమర్ధంగా పని చేసేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు క్లౌడ్ కంప్యూటింగ్ తోడ్పాటునిస్తోందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సీఈవో ఆడమ్ సెలిప్స్కీ తెలిపారు. సవాళ్లతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సాధనాలతో కంపెనీలు నిలదొక్కుకుని, పురోగమించగలవని పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్ రీ:ఇన్వెంట్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 2025 నాటికి తమ కార్యకలాపాలకు 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వినియోగించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆడమ్ వివరించారు. ఇప్పటివరకూ ఈ లక్ష్యంలో 85 శాతం వరకూ చేరుకున్నామని పేర్కొన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్‌తో చాలా మంది కస్టమర్లకు 30 శాతం వరకూ ఖర్చులు ఆదా అవుతున్నాయని ఆడమ్ చెప్పారు. కేవలం ఉపయోగించుకున్న సేవలు, మౌలిక సదుపాయాలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, కార్యకలాపాలను వేగవంతంగా విస్తరించుకునేందుకైనా .. తగ్గించుకునేందుకైనా ఇది ఎంతో అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, సర్వర్లను కొనుక్కుని పెట్టుకోవడం, వాటిని నిర్వహించుకోవడం వంటివి ఖర్చులతో కూడుకున్న వ్యవహారమని .. అందుకు భిన్నంగా ఏడబ్ల్యూఎస్ వంటి క్లౌడ్ సేవల సంస్తల నుంచి టెక్నాలజీ సర్వీసులను సులభతరంగా పొందవచ్చని ఆడమ్ చెప్పారు. ఏడబ్ల్యూఎస్ ఇటీవలే 4.4 బిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెజాన్‌కు ఇది భారత్‌లో రెండోది కానుంది. -
సంపన్నుల సీఈఓ జాబితాలో స్లూట్‌మ్యాన్
క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్నోఫ్లేక్ ఊహించని లాభాలను ఆర్జిస్తోంది. క్లౌడ్-కంప్యూటింగ్ సంస్థ మూడవ త్రైమాసిక ఆదాయం వివరాలను ఇటీవల వెల్లడించింది. సంస్థ ఆదాయం గత ఏడాది కంటే రెట్టింపు అయినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 15న తొలిసారి ఈ కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లినప్పటి నుండి ఇప్పటి వరకు దాని షేర్ ధర 223 శాతం పెరిగింది. సంస్థ ఆదాయం భాగా పెరగడంతో కంపెనీ సీఈఓ ఫ్రాంక్ స్లూట్మ్యాన్ను ఆదాయం కూడా బాగా పెరిగింది. దీంతో స్లూట్‌మ్యాన్ ఒక్కసారిగా ప్రపంచంలోనే ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం తన నెల ఆదాయం వచ్చేసి 108 మిలియన్ డాలర్ల(795 కోట్లు) కంటే ఎక్కువగా ఉంది. ఈ మొత్తమంతా షేర్ల రూపంలో ఆయన ఖాతాలో జమవుతోంది.(చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) షేర్ల రూపంలోనే కాకుండా మిస్టర్ స్లోట్మాన్ ఏడాదికి $3,75,000 వార్షిక మూల వేతనం కూడా పొందుతారు. 2019 ఏప్రిల్‌లో సంస్థలో చేరినప్పటి నుంచీ నాలుగేళ్ల వరకు షేర్ ద్వారా వచ్చిన డబ్బులు తన అకౌంట్ లోకి వచ్చి చేరుతుంటాయి. 2023 ప్రారంభంలో తాజా వాటా ధర ఆధారంగా అయన ఖాతాలో షేర్ ద్వారా వచ్చిన డబ్బులను లెక్కిస్తే తన ఆదాయం 5.2 బిలియన్ డాలర్లు(రూ.38 వేల కోట్లు)గా ఉండనుంది. ఆయన కంపెనీలో చేరడానికి ఆరు నెలల ముందు ఆ సంస్థ విలువ 3.5 బిలియన్ల డాలర్లు. ఇప్పుడు సంస్థ యొక్క విలువ110 బిలియన్ డాలర్లు. స్లూట్‌మ్యాన్ గత 20 సంవత్సరాలలో డేటా స్టోరేజ్ సంస్థ డేటా డొమేన్(2003-2009), క్లౌడ్ సర్వీస్ సంస్థ సర్వీస్నవ్(2011-2017) ఐఎన్సీలకు కూడా సీఈవోగా పని చేశారు. -
కరోనా ఎఫెక్ట్ : దూసుకుపోయిన అమెజాన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్ లాభాల్లో దూసుకుపోయింది. క్యూ3లో బ్లాక్ బస్టర్ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ భారీగా పుంజుకున్నాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో వృద్ది నమోదైంది. దీంతో మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఏడాది క్రితంతో పోలిస్తే లాభాలు మూడు రెట్లు పెరిగాయని కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం పెరిగాయి. దీంతో కరోనావైరస్ మహమ్మారి కాలంలో భారీగా లాభపడిన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. (అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు) ఏడాది క్రితం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,655 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం లాభం 6.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46,764 కోట్లు) గా నమోదయ్యాయి. ఆదాయం 37 శాతం పెరిగి 96.15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,12,824 కోట్లు) పెరిగాయి. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధిని 11.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 86,504 కోట్లు) సాధించిందని కంపెనీ తెలిపింది. -
‘ఐటీలో ఉద్యోగానికి ఈ కోర్సులు నేర్చుకోండి’
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరడంతో కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డైటా సైన్స్ లాంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ తదితర కోర్సులను జాబ్ కన్సెల్టెన్సీలు ఆఫర్ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలకు శిక్షణ ఇచ్చే జిగ్సా అకాడమీ సీఈఓ వోహ్రా స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైవిధ్యమైన కోర్సుల్లో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలలో డోకా ఉండదని తెలిపారు. మరోవైపు టెక్నాలజీలకు పేరు పొందిన యుడెమీ సీఈఓ ఇర్విన్ ఆనంద్ స్పందిస్తూ.. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ కోర్సులలో 60శాతంనుంచి 58శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. కాగా లాక్డౌన్ వల్ల వీడియా లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యత పెరిగిందని స్ప్రింగ్ సీఈఓ రవి కాక్లసరి తెలిపారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ డీ.డీ మిశ్రా అభిప్రాయపడ్డారు.(చదవండి: కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి) -
లాక్డౌన్ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోయినప్పటికీ, ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించిన మూడవ త్రైమాసికంలో భారీ లాభాలను, ఆదాయాన్ని సాధించింది. తద్వారా వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. ముఖ్యగా కోవిడ్-19 వైరస్ విస్తరణ,లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమిత మైన ఉద్యోగులు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను విరివిగా వినియోగించడంతో ఈ సంక్షోభ కాలంలో కూడా మైక్రోసాఫ్ట్ మెరుగైన ఫలితాలను సాధించింది. (రూపాయి రయ్..రయ్...) మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం 35 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఆదాయాలు15 శాతం పెరిగాయి.నికర ఆదాయం 22 పెరిగి 10.8 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. అమ్మకాలు 22 శాతం పెరిగాయి. ఆదాయం 33.6 బిలియన్ డాలర్లుగా వుంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవల ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విజయాన్ని సాధించింది. లాక్డౌన్ తో ప్రజలు కంప్యూటర్లకు పరిమితమై ఇంటి నుండి పనిచేయడం ఆన్ లైన్ పాఠాలు లాంటి కారణాలతో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్ఫేస్ హార్డ్‌వేర్ అమ్మకాలు పుంజకున్నాయి. అలాగే ఎక్కువ గేమింగ్ వైపు మొగ్గు చూపడంతో ఎక్స్ బాక్స్ వ్యాపారం కూడా లాభపడింది. తాజా ఫలితాలతో 1.35 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా మైక్రోసాఫ్ట్ స్థానాన్ని దక్కించుకుంది. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) గత త్రైమాసికంలో ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్ సేవల వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దీంతో కేవలం రెండునెలల్లో రెండు సంవత్సరాల డిజిటల్ పరివర్తన చూశామన్నారు. రోజువారీ 75 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులతో ఒక రోజులో 200 మిలియన్లకు పైగా సమావేశాల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. అలాగే ఎక్స్‌బాక్స్ లైవ్ ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి దాదాపు 90 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులుంటే ఈ కాలంలో రికార్డు స్థాయిలో 10 మిలియన్ల యూజర్లు అదనంగా చేరారని నాదెళ్ల ప్రకటించారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు) -
డిజిటల్లో అగ్రగామిగా భారత్
గాంధీనగర్: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ‘డిజిటల్ రంగం ప్రతీ రోజు, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది భారత్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్ కేవలం 24 నెలల్లోనే నంబర్ వన్ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌లో సత్తా చాటనున్న ఐబీఎం
న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం ఐబిఏం క్లౌడ్ కంప్యూటింగ్‌లో అడుగుపెట్టేందుకు సాప్ట్వేర్ కంపెనీ రెడ్ హ్యట్ను 34బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్టు వెల్లడించింది. మెరుగైన లాభాలను ఆర్జిస్తూ వంద ఏళ్ల చరిత్ర ఉన్న రెడ్ హ్యట్ కంపెనీని గత ఏడాది ఐబిఏం కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. ఐబిఏం చీఫ్ ఎగ్జక్యూటివ్ గిన్ని రోమెట్టి సాంప్రదాయ హర్ఢ్వేర్ ఉత్పత్తులను తగ్గించి, వేగంగా అభివృద్ది చెందుతున్నసాప్ట్వేర్ సేవలపై, క్లౌడ్ కంప్యూటింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ భారీ కొనుగోలుకు మార్గం సుగమమైంది. 63 శాతం ప్రీమియంతో రెడ్ హ్యట్ షేర్లను కొనుగోలు చేయడానికి జూన్ నెలఖారున ఈయు రెగ్యులేటర్లు, మే నెలలో యుఏస్ రెగ్యులేటర్లు ఐబిఏం ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. 1993లో స్థాపించిన రెడ్ హ్యట్ సంస్థ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ప్రత్యేకతను ఎర్పరుచుకుంది. ఇది మైక్రోసాప్ట్ కార్ప్చే తయారు చేయబడిన సాప్ట్‌వేర్‌కు కంటే భిన్నంగా ఉండి, ఓపెన్ సోర్స్ సాప్టవేర్గా లైనక్స్ అత్యంత ఆదరణ పోందింది. -
క్లౌడ్ డేటా భారత్‌లోనే..!
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆయా సంస్థలు భారతీయుల సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని ఆదేశించనుంది. జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ విధానం రూపకల్పనకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇదే తరహా సిఫార్సులతో ముసాయిదా నివేదికను రూపొందించింది. దేశ భద్రత దృష్ట్యా భారతీయుల సమాచారాన్ని విదేశాల్లో కాకుండా భారత్‌లోని డేటా సెంటర్లలోనే స్టోర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో ఈ–కామర్స్ సైట్లతో పాటు డిజిటల్ పేమెంట్ విభాగాలనూ చేర్చాలంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు దెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ్థ ఫేస్బుక్ నుంచి ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించిన నేపథ్యంలో భారతీయుల డేటా స్థానికంగానే ఉండటం మంచిదనే వాదన పెరిగింది. సత్వర విచారణకు దోహదం.. డేటా సెంటర్లను భారత్‌లోనే ఏర్పాటు చేస్తే నేరాలకు సంబంధించి విచారణ సంస్థలు కేసుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చని కమిటీ చెబుతోంది. దీంతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయపడింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలో అనువుగా ఉన్న 20 ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరింది. క్లౌడ్ సేవల్ని ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ‘నేషనల్ క్లౌడ్ స్ట్రాటజీ’ని రూపొందించాలని సూచించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి దొంగలించిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కాగా, ఈ ముసాయిదా నివేదికను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ 15లోపు కేంద్ర ఐటీ శాఖకు సమర్పిస్తామని గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తీసుకురానున్న సమాచార భద్రత చట్టంలో ఈ ప్రతిపాదనలకు చోటుదక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలతో నష్టాలేంటి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారత్‌లో తమ డేటా సెంటర్లను ప్రారంభించక తప్పదు. దీంతో క్లౌడ్ సేవల ధరలు పెరిగే అవకాశముందని, అంతిమంగా ఇది చిన్న, మధ్య తరహా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండటం, డేటా సెంటర్ల కోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి రావడం క్లౌడ్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశీ క్లౌడ్ కంపెనీలు సైతం కమిటీ నివేదికపై పెదవి విరుస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సాధారణంగా కంపెనీలు తమ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు కొత్త సాఫ్ట్‌వేర్స్‌ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. దీన్ని పెద్దపెద్ద కంపెనీలు తప్ప చిన్న సంస్థలు భరించలేవు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పుట్టుకొచ్చాయి. దీనికింద అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు చిన్నచిన్న సంస్థలకు సాఫ్ట్వేర్స్, సర్వర్లు, డేటాబేస్, నెట్వర్కింగ్, స్టోరేజ్ సౌకర్యాలను తక్కువ ఫీజుకే అందిస్తాయి. దీనివల్ల ఆయా సంస్థలకు డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్లౌడ్‌లో సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలావరకూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో చాలావరకూ భారత కంపెనీల సమాచారం విదేశాల్లోని డేటా సెంటర్లలోనే స్టోర్ అవుతోంది. ► భారత్‌లో డేటా సెంటర్లు (22 ప్రాంతాల్లో) 141 ► వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నవి 80% ► 2022 కల్లా భారత క్లౌడ్ మార్కెట్ విలువ రూ.47,964 కోట్లు -
క్లౌడ్ కంప్యూటింగ్..
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు అందించే విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ‘క్లౌడ్ కంప్యూటింగ్’. దీన్ని ఉపయోగించుకుంటున్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థల సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో క్లౌడ్ కంప్యూటింగ్ రంగం విస్తృత ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్‌గా మారుతుంది. ఫ్రెషర్స్ మొదలు, అత్యున్నత అనుభవజ్ఞుల వరకు వివిధ స్థాయిల్లోని ఐటీ ఉద్యోగులు ‘క్లౌడ్’పై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్‌పై స్పెషల్ ఫోకస్.. ఐటీ సంస్థలు వివిధ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల సహాయంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో డేటా సమకూరుతుంది. దీని నిర్వహణ, స్టోరేజ్.. కంపెనీలకు ఆర్థిక భారంతో కూడుకుంది. దీనికి పరిష్కారంగా వచ్చిన టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్. భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్ పరికరాలు లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా క్లౌడ్‌తో సేవలందించొచ్చు. కేవలం డేటా స్టోరేజ్‌కే పరిమితం కాకుండా.. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్‌లను కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తోంది. ఉదాహరణకు సాధారణంగా ప్రతి సంస్థలో ఒక్కో ఉద్యోగికి ఒక సిస్టమ్, అందులో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, డేటా ఉంటుంది. వీటిని కలుపుతూ సర్వర్లు ఉంటాయి. కానీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో డేటా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు అన్నీ సర్వర్లలోనే ఉంటాయి. ఈ డేటాను యూజర్లు ఏ డివైజ్ నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్‌లో క్లయింట్స్‌కు అవసరమైన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని యూజర్లు ఇంటర్నెట్ ఆధారంగా యాక్సెస్ చేస్తూ డేటా స్టోర్ చేసుకుంటారు. యూజర్లు పొందుపర్చే డేటాను క్లయింట్స్ నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు. అవకాశాలు అపారం క్లౌడ్‌లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న టాప్ 3 దేశాల్లో భారత్ ఒకటి. 75 లక్షలతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. 40 లక్షలతో అమెరికా, 22 లక్షలతో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో భారీగా క్లౌడ్ ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2020 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ 241 బిలియన్ డాలర్ల మేర విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనుంది. అదే స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగనున్నట్లు జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జాబ్ ప్రొఫైల్స్ సర్టిఫికేషన్ కోర్సులు లేదా ఐటీ కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ లో నైపుణ్యాలు పొందిన వారికి వివిధ జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ అనలిస్ట్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్.. క్లౌడ్‌లో రాణించాలంటే.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో రాణించేందుకు లైనక్స్, జావా, డాట్నెట్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, డేటా మేనేజ్మెంట్, డేటా మైనింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, బిగ్ డేటా, గకఠ్చీట్ఛ తదితర టెక్నాలజీలు ఉపయోగ పడతాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి అకడమిక్ స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేనప్పటికీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకొని, సొంతంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో శిక్షణ ఇస్తున్నాయి. సీడాక్, ఐఐఐటీ, జేఎన్టీయూ తదితర సంస్థలు సాఫ్ట్వేర్ కోర్సుల కరిక్యులంలో క్లౌడ్‌ను చేర్చుతున్నాయి. కొన్ని ఐఐటీలు, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్లౌడ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికోసం ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. క్లౌడ్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, వివిధ సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తున్నాయి. క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్ (సీసీసీ), ఈఎంసీ, వీఎంవేర్ ఇన్స్టిట్యూట్లు సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. -
రైజింగ్ కెరీర్.. క్లౌడ్ కంప్యూటింగ్
కెరీర్ అప్డేట్స్ ఏటా అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా విస్తరిస్తూ.. యువతకు అపార అవకాశాలకు వేదికగా నిలుస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. యూజర్ సంస్థ ఎలాంటిదైనా.. సేవలు ఎలాంటివైనా అంతా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో అందించే విధానం తెరపైకి వచ్చింది. ఆన్లైన్ ద్వారానే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ రూపకల్పన, డేటా మేనేజ్మెంట్ వంటి విధానాలు అమలవుతున్నాతయి. తమ ప్రొడక్ట్.. యూజర్స్‌కు నిమిషాల్లో సేవలను షురూ చేస్తున్నాయి. ఇలాంటి ఆధునిక విధానాలను సాధ్యం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానమే క్లౌడ్ కంప్యూటింగ్. కెరీర్ ఆపర్చునిటీస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల కోణంలో అత్యంత ఆదరణ పొందుతోంది. క్లౌడ్ టెక్నాలజీస్‌ను సమర్థంగా నిర్వహించేందుకు నిపుణులైన మానవ వనరుల అవసరం శరవేగంగా పెరుగుతోంది. ఏటా లక్షల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి కెరీర్ ఆపర్చునిటీస్ అధికంగా ఉన్న విభాగాలు.. క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్, క్లౌడ్ బిజినెస్ అనలిస్ట్, క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్, క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజర్, క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్ స్పెషల్ సర్టిఫికేషన్స్ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలే ఈ విభాగంలో నైపుణ్యం అందించేలా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. అవి.. ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్, ఈఎంసీ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఈఎంసీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్ వంటివి. PaaS (ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌కు సంబంధించి హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ సంబంధిత అంశాలు, అప్లికేషన్స్‌ను సదరు ప్రొడక్ట్ డెవలపర్ ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు అవసరమైన టెక్నాలజీని అందించే విభాగం ఇది. IaaS (ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్) క్లౌడ్ కంప్యూటింగ్‌ను వినియోగిస్తూ ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌కు సంబంధించి మౌలిక వనరులను ఆన్లైన్ విధానంలో నిర్వహించే విధానం ఐఏఏఎస్. SaaS (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఒక నిర్దిష్ట సేవను నిర్ణీత సమయంలో తమ అవసరం మేరకు ఇంటర్నెట్ ద్వారా వినియో గించుకునే అవకాశం కల్పించే విధానం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఆకర్షణీయ వేతనాలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలుగా పేర్కొనే క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌కు కనీసం రూ. 5 లక్షల వార్షిక వేతనం ఖరారవుతోంది. అవసరమైన అర్హతలు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ నేపథ్యం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. వీటికి అదనంగా యూజర్ సపోర్టింగ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాలుంటే అవకాశాలు మెరుగవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గోల్డ్‌మన్ శాచ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం- మ్యాన్ పవర్ డిమాండ్ 1:100 గా ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం 2016లో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2.2 మిలియన్ ఉద్యోగావకాశాలు. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2012తో పోల్చితే 2016 చివరికి క్లౌడ్ సెక్టార్ 400 శాతం పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన మేఘ్రాజ్ పథకంతో ప్రభుత్వ విభాగాలన్నిటిలోనూ క్లౌడ్ ఆధారిత సేవలు, అంతే స్థాయిలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్లో అన్ని విభాగాల్లో, హోదాల్లో మానవ వనరులకు మంచి డిమాండ్ నెలకొంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రొఫైల్ సంస్థల కోణంలో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. - ఎస్. సుమన్, క్లౌడ్ అండ్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్, మూడీస్ కార్పొరేషన్ -
'ఇంజనీరింగ్'లో క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 'ఐబీఎం క్లౌడ్ కంప్యూటింగ్' లో శిక్షణ సేవలను ప్రవేశపెట్టే అంశంపై ‘టాస్క్’, ఐబీఎం ఇండియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వృత్తి విద్యా కళాశాలల్లో నాణ్యమైన విద్యాబోధన కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) పేరుతో ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒప్పందం వివరాలు, ప్రత్యేకతలను వెల్లడిస్తూ టాస్క్, ఐబీఎం ఇండియాలు బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్‌కు బాగా డిమాండ్ ఉంది. ఈ ఒప్పందం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు ఐబీఎం క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంతో అనుసంధానమై తమ ప్రతిభను మెరుగుపరుచుకోడానికి వీలు కలుగుతుంది. 2014లో ఐబీఎం ప్రవేశపెట్టిన బ్లూమిక్స్ పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థగా దూసుకెళ్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రాక్టికల్స్‌తో పాటు ప్రాజెక్టు వర్క్‌పూర్తి చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడనుందని టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ తెలిపారు. -
వచ్చే ఏడాది నుంచి డివిడెండ్ ఇస్తాం
కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్ప్రైజెస్ (సీటీఈ) చైర్మన్ ఆశిష్ కల్రా ♦ రెండేళ్లలో ఐదురెట్ల వ్యాపార వృద్ధి లక్ష్యం ♦ 2017 నాటికి నెలకు 20 లక్షల డాలర్ల ఆదాయం ♦ బిగ్‌డేటా, క్లౌడ్కలయికతో విశ్లేషణ సేవలు ♦ 750కు పెరగనున్న సిబ్బంది సంఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్‌లను అనుసంధానం చేయడం ద్వారా ఒక మౌస్ క్లిక్‌తో వినియోగదారులకు అవసరమైన విశ్లేషణాత్మక సమాచారాన్ని అందిస్తామని కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్ప్రైజెస్ అంటోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ చిన్న స్థాయి ఐటీ కంపెనీ వచ్చే రెండేళ్లలో ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వ్యాపార విస్తరణ, అందిస్తున్న సేవలపై కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్ప్రైజెస్ (సీటీఈ) చైర్మన్ ఆశిష్ కల్రాతో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ఇంటర్వ్యూ... బిగ్‌డేటా, క్లౌడ్ సేవల్లో ఉన్న సీటీఈ ఎటువంటి సేవలను అందిస్తోంది? ఐటీ సర్వీస్ సేవల్లో ఉన్న కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్ప్రైజెస్ (సీటీఈ) గత జనవరి నుంచి వ్యాపార వ్యూహాన్ని మార్చుకున్నాం. అపార అవకాశాలున్న బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ నెట్ వర్కింగ్ డేటాపై దృష్టిసారించాం. అందరిలాగా కాకుండా ఈ మూడింటిని కలిపి విశ్లేషణ సేవలను అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే ఇండియా, అమెరికా డేటా మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ఒక మౌస్ క్లిక్‌తో కావాల్సిన సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా అందించే విధంగా సేవలను విస్తరిస్తున్నాం. ఏ రంగాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు? ముఖ్యంగా ఆరు రంగాలపై దృష్టిపెడుతున్నాం. ఎనర్జీ, లైఫ్‌సెన్సైస్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, టెక్స్టైల్, షిప్పింగ్ రంగాలకు చెందిన కస్టమర్లపై దృష్టిపెడుతున్నాం. ఈ మధ్యనే ఒరాకిల్, అమెజాన్ వెబ్సర్వీసెస్, రాక్‌స్పేస్, ఫోర్జ్రాక్, టాబ్లు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ముఖ్యంగా అమెరికా, ఇండియా మార్కెట్లపైనే దృష్టిసారిస్తున్నాం. ఆదాయం, వ్యాపార వృద్ధి విషయాల గురించి వివరిస్తారా? వచ్చే ఆర్థిక ఏడాది నుంచి క్రమం తప్పకుండా వాటాదారులకు డివిడెండ్ ప్రకటించే కంపెనీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంచనాలకు అనుగుణంగానే వ్యాపార వ్యూహాన్ని మార్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లో ఆదాయంలో రెట్టింపు, నికర లాభంలో ఐదు రెట్ల వృద్ధిని నమోదు చేశాం. 2017 మార్చినాటికి ప్రతి నెలా రెండు మిలియన్ డాలర్ల (నెలకు సుమారు రూ. 13 కోట్లు )ఆదాయాన్ని సమకూర్చే స్థాయికి కంపెనీని తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం కంపెనీ ఆదాయం నెలకు రూ. 2.5 కోట్లుగా ఉంది. ఈ మార్చినాటికి కంపెనీ ఆదాయం రూ. 6.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలతో ఏదైనా కంపెనీలను టేకోవర్ గురించి చేసే ఆలోచన ఉందా? విస్తరణ కార్యక్రమాల గురించి తెలియచేస్తారా? కంపెనీలను కొనుగోలు చేసి వేగంగా విస్తరించే యోచన లేదు. అలాగే సొంతంగా క్యాంపస్ నిర్మించే యోచన కూడా లేదు. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలను ఉద్యోగుల శిక్షణ, కొత్త సిబ్బంది నియాకానికే వినియోగిస్తాం. రెండేళ్లలో సిబ్బంది సంఖ్యను ప్రస్తుతమున్న 250 నుంచి 700కు పెంచనున్నాం. ఇందులోభాగంగా అమెరికాలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను 30 నుంచి 100కు పెంచనున్నాం. మా కంపెనీలో ఉద్యోగుల వలసలు 1 శాతం కంటే తక్కువగా ఉందంటే ఉద్యోగులకు ఎటువంటి సదుపాయాలను కల్పిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత బిగ్‌డేటా, క్లౌడ్ విభాగాల్లో సీటీఈని ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు? మా వ్యాపార విధానమే విభిన్నమైనది. మేము ఎవరికీ పోటీ కాము. బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఇంత పెద్ద మార్కెట్ అవకాశాలున్న దాంట్లో ఒక శాతం వాటాను కైవసం చేసుకున్నా.. మేం రెండేళ్ళలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. -
మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు
శాన్ ఫ్రాన్సిస్కో: క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో తమ సంస్థకు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. రాబోయే రోజుల్లో మొబైల్ , క్లౌడ్ కంప్యూటింగ్‌కి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వివరించారు. బిల్డ్ 2015 కాన్ఫరెన్స్‌లో భాగంగా జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కస్టమర్లు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకోవడంలో గణనీయంగా తోడ్పాటు అందించడమే తమ లక్ష్యమని సత్య నాదెళ్ల వివరించారు. -
మైక్రోసాఫ్ట్ లాభం 10 శాతం డౌన్
⇒ విండోస్‌కు ఆదరణ తగ్గటమే కారణం! ⇒ షేరు ధర కూడా ఒకేరోజు 10% పతనం సియాటిల్: క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం పుంజుకుంటున్నప్పటికీ.. విండోస్ విక్రయాలు మందగిస్తుండటం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం దాదాపు 10 శాతం క్షీణించి 5.86 బిలియన్ డాలర్లకు తగ్గింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ లాభం 6.56 బిలియన్ డాలర్లు. కరెన్సీ మారకం విలువ భారీ హెచ్చుతగ్గులకు లోను కావడం కూడా లాభాల తగ్గుదలకు మరో కారణమని కంపెనీ వర్గాలు తెలిపాయి. పర్సనల్ కంప్యూటర్స్ అమ్మకాలు తగ్గుతున్న ప్రభావం .. విండోస్ సాఫ్ట్వేర్ విక్రయాలపై కూడా పడుతున్న సంగతి తెలిసిందే. అటు కంపెనీ ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి 26.47 బిలియన్ డాలర్లుగా నమోదైంది. * నోకియా కంపెనీ హ్యాండ్సెట్స్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ గతేడాది కొనుగోలు చేయడం ఆదాయం పెరుగుదలకు కొంత దోహదపడింది. కంపెనీ ఆదాయం 26.3 బిలియన్ డాలర్ల మేర ఉండగలదని పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. * మరోవైపు, తాజా నిరుత్సాహకర ఫలితాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ షేరు ఏకంగా 10 శాతం మేర పతనమై 42.30 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. ఒకే రోజులో మార్కెట్ క్యాప్ దాదాపు 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,17,000 కోట్లు) ఆవిరైపోయింది. 348.67 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ అనుబంధ సంస్థల్లో కెరీర్స్ అంటే సాధారణంగా గుర్తొచ్చే విభాగాలు.. ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటా మైనింగ్, అప్లికేషన్స్. వీటితోపాటు ఐటీ రంగంలో ఇప్పుడు ఎమర్జింగ్ సెగ్మెంట్‌గా మారుతున్న విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్. తాజాగా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ రంగ నియామకాల్లో 20 నుంచి 25 శాతం మేర క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫైల్స్‌కు చెందినవే. కంపెనీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేస్తున్న వాటిల్లోనూ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. భవిష్యత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. సాఫ్ట్వేర్ సేవలను సరళతరం చేస్తూ పుష్కల అవకాశాలకు దోహదం చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్‌పై విశ్లేషణ.. ‘ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ రూపొందించి వినియోగదారుల ఆదరణ పొందాలి. ఇప్పుడు ఇందుకు సరైన సాధనం.. క్లౌడ్ కంప్యూటింగ్. యువ సాఫ్ట్వేర్ నిపుణులు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో రాణించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. సాఫ్ట్వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఆవశ్యకతను తెలిపే మాటలివి. దేశంలో అనేక సాఫ్ట్వేర్ సంస్థలు వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. పోటీదారుల కంటే ముందుండేందుకు నిరంతరం కొత్త టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఐటీ సంస్థలు తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. అందులో భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్, అప్లికేషన్ టూల్స్, నెట్వర్క్ ఛానెల్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటన్నిటి స్టోరేజ్ కంపెనీలకు వ్యయభారంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆవిష్కృతమైన సరికొత్త టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్! భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్, లాన్ లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా ఈ-మెయిల్స్ ద్వారా నిర్దిష్ట సేవలను అవసరమైనప్పుడు అందించడమే.. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కంపెనీల వ్యయ భారాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది. సాఫ్ట్వేర్ సేవలను సదరు ప్రొవైడర్ నుంచి సులువుగా ఈ-మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇప్పటివరకు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పుడు దానిపై అవగాహన వచ్చే వరకు ప్రొవైడింగ్ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల వద్ద ఉండాల్సి వచ్చేది. క్లౌడ్ కంప్యూటింగ్‌తో ఈ-మెయిల్స్, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఉదాహరణకు: ఒక వినియోగదారుడి కంప్యూటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కే పరిమితమైంది. కానీ దానికి భిన్నంగా ఉండే మరో అప్లికేషన్(ఉదా: యాపిల్ మ్యాక్) పొందాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటప్పుడు యాపిల్ మ్యాక్ ప్రొవైడర్స్ నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి, ఈ-మెయిల్ ద్వారా సొంతం చేసుకుని యాపిల్ మ్యాక్ అప్లికేషన్స్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఆ ప్రొవైడర్స్ నిర్దేశించే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. స్థూలంగా ఇంటర్నెట్ ఆధారంగా ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్/సర్వీసెస్‌ను అయినా అందించే, సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించే విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్. పెరుగుతున్న డిమాండ్ పోటీ ప్రపంచంలో సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రతి రెండు, మూడేళ్లకు కొత్త కొత్త వెర్షన్లు ఆవిష్కృతమవుతున్నాయి. దాంతో అన్నిటినీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా కంపెనీలకు డేటా స్టోరేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మేరకే సదరు సర్వీసెస్ పొందే అవకాశం లభిస్తుంది. అందుకే గత రెండుమూడేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఇలా ఐటీ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నాయి. లక్షల్లో అవకాశాలు ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ నియామకాల సంఖ్య లక్షల్లో నమోదు కానుంది. నాస్కామ్, సీఐఐ, ఐబీఎం వంటి సంస్థల సర్వేల ప్రకారం- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ ఏడాది భారీగా రిక్రూట్మెంట్ జరుగనుంది. మరోవైపు 2015 చివరి నాటికి అంతర్జాతీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 70 బిలియన్ డాలర్ల మేర కార్యకలాపాలు నమోదు చేసుకోనుంది. 26 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ఏడాదిలోనే 15 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించనుందని నిపుణుల అంచనా. వీటిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో నిలవనుంది. భారత్ మూడు లక్షలకుపైగా ఉద్యోగావకాశాలతో మూడో స్థానం పొందనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరమైన నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో స్థిరపడాలనుకునేవారికి హెచ్‌టీఎంఎల్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, జావా, సీ++, డాట్ నెట్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్ వంటి కోర్ నైపుణ్యాలు అవసరం. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్మెంట్, బిజినెస్ అనాలిసిస్ తదితర యూజర్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉద్యోగ సాధనకు ఉపకరించే అదనపు నైపుణ్యాలు. క్లౌడ్ కోర్సులు క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అకడమిక్‌గా ఇన్స్టిట్యూట్ల స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు లేవు. దీంతో కంపెనీలు బీటెక్ స్థాయిలో ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచ్‌ల విద్యార్థులను నియమించుకుని, సొంతంగా శిక్షణనిచ్చి క్లౌడ్ నైపుణ్యాలు నేర్పిస్త్తున్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ఐటీ, సీ-డాక్ వంటి ఇన్స్టిట్యూట్లు ఆఫర్ చేసే సాఫ్ట్వేర్ కోర్సుల్లోనే క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్‌ను అందిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌కు గ్రాడ్యుయేషన్‌లో పూర్తి స్థాయి కోర్సులు లేకున్నా.. రీసెర్చ్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ-బాంబే, ఐబీఎం-ఇండియా రీసెర్చ్ ల్యాబ్, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్, హెచ్‌పీ లేబొరేటరీల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవి ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా ఔత్సాహికులను ఎంపిక చేస్తున్నాయి. సర్టిఫికేషన్స్ పూర్తి స్థాయిలో కోర్సులు లేని క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పలు ఇన్స్టిట్యూట్లు సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్, ఈఎంసీ, వీఎంవేర్ వంటి ఇన్స్టిట్యూట్లు పలు సర్టిఫికేషన్‌స ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్, ప్రొఫెషనల్ క్లౌడ్ సెక్యూరిటీ మేనేజర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వెండార్ అలైన్మెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్, వర్చువలైజేషన్ ఆఫ్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్ వంటివి. ఆకర్షణీయ వేతనాలు సర్టిఫికేషన్ కోర్సులు లేదా కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పొందినవారికి.. ఈ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్; నెట్వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్; ప్రొడక్ట్ మేనేజర్; సేల్స్ ఎగ్జిక్యూటివ్; క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్; క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. ఈ రంగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు ఎంట్రీ లెవల్లోనే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో వార్షిక వేతనం లభిస్తుంది. మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్‌కు దాదాపు రూ.15 లక్షలు; ఆరేడేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.20 లక్షల మేర వార్షిక వేతనం ఖాయం. క్లౌడ్ సర్టిఫికేషన్స్- ముఖ్య వెబ్‌సైట్స్ ⇒ http://www-03.ibm.com/certify/certs/50001201.shtml ⇒ http://www8.hp.com/us/en/training/portfolio/cloud.html ⇒ education.emc.com ⇒ www.cloudschool.com ⇒ www.microsoft.com/learning ⇒ https://www.itpreneurs.com/it-training-products/cloud-computing/cloud/ l www.cdac.in l www.snia.org. ⇒ www.cloudcomputingtraining.co.in ⇒ www.cloudcredential.org సరికొత్త వేదిక ఐటీ రంగంలో రెగ్యులర్ జాబ్స్‌కు విభిన్నంగా విధులు నిర్వర్తించాలనుకునే వారికి సరికొత్త వేదిక.. క్లౌడ్ కంప్యూటింగ్. మారుతున్న పరిస్థితులు, క్లయింట్ల అవసరాలు, అన్ని స్థాయిల్లోని క్లయింట్లకు చేరుకొని ఎండ్ యూజర్స్ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీలు అనుసరిస్తున్న విధానం.. క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే కచ్చితంగా మంచి అవకాశాలు సొంతమవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లో సుస్థిర భవిష్యత్తు కోరుకునే ఔత్సాహికులకు విషయ పరిజ్ఞానంతోపాటు, క్లయింట్స్‌తో సంప్రదింపులు సాగించే చాతుర్యం; మార్కెట్లో మారుతున్న పరిస్థితులపై అవగాహన; తమ క్లయింట్లకు చెందిన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించే నైపుణ్యాలు అవసరం. - టి.కోమల్, జీఎం-(క్లౌడ్ వింగ్- ఐబీఎం) ఇద్దరికీ అనుకూలం.. అందుకే అవకాశాలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇటు సర్వీస్ ప్రొవైడర్స్, అటు వినియోగదారులు.. ఇద్దరికీ అనువైన విధానంగా మారింది. దాంతో ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇదే క్రమంలో నిపుణులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోర్సులు అందుబాటులో లేకపోయినా.. ఆన్లైన్, మూక్ విధానాల్లో లభించే కోర్సులు పూర్తి చేయడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. అదేవిధంగా పీజీ స్థాయిలో సీఎస్ఈలో క్లౌడ్ కంప్యూటింగ్‌ను కొన్ని ఇన్స్టిట్యూట్ల కరిక్యులంలోనూ పొందుపరుస్తున్నారు. భవిష్యత్‌లో అకడమిక్‌గా పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. - ప్రొఫెసర్ వాసుదేవ వర్మ,డీన్, ఆర్ అండ్ డీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ స్టోరేజ్, మేనేజ్మెంట్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సేవలన్నీ దాదాపు ఆన్లైన్లోనే సాగుతాయి. కానీ ఒక ప్రొడక్ట్‌కు సంబంధించిన యూజర్ ఎప్పుడు కోరినా క్షణాల్లో పంపించే విధంగా డేటా స్టోరేజ్, మేనేజ్మెంట్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలకం. యూజర్, సెగ్మెంట్లను పరిగణనలోకి తీసుకుంటూ.. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించేటప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే దూరదృష్టి ఉంటే ఈ విభాగంలో రాణించడం సులభమే. - ఎం. రాజేశ్,డెలివరీ మేనేజర్, క్లౌడ్ సపోర్ట్- శాప్ ల్యాబ్స్ -
ఇన్ఫీకి సిక్కా జోష్!
ఇన్వెస్టర్లలో ఉత్సాహం.. షేరు పరుగులు పూర్వవైభవానికి సంకేతాలంటున్న విశ్లేషకులు ‘సిక్కా అంటే హిందీలో నాణెం అని అర్థం.. తన పేరుకు తగ్గట్లే ఇన్ఫోసిస్‌కు ఆయన బోలెడంత డబ్బు తెచ్చిపెడతారని ఆశిస్తున్నాను’.. విశాల్ సిక్కాను ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ప్రకటిస్తూ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. సిక్కా మీద మూర్తి ఉంచిన నమ్మకానికి ఇన్ఫీ తాజా త్రైమాసిక ఫలితాలు నిదర్శనంగా నిల్చాయి. ఇటు ఇన్వెస్టర్లను, అటు ఉద్యోగులనూ ఆకట్టుకునే ందుకు సిక్కా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన సారథ్యంలో ఇన్ఫీ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దేశీ ఐటీ పరిశ్రమకు ఒకప్పుడు దిక్సూచిగా నిల్చిన దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రాభవం గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఒకవైపు టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి పోటీ సంస్థలు ముందుకు దూసుకెళ్లిపోతుంటే.. ఇన్ఫీ మాత్రం రేసులో వెనుకబడిపోయింది. వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తిరిగొచ్చి సంస్థ ఊపిర్లూదే ప్రయత్నం చేసినా.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అంతంత మాత్రం పనితీరే కనపర్చగలిగింది. పరిశ్రమ సగటు 13 శాతానికన్నా తక్కువగా 11.5 శాతం ఆదాయ వృద్ధితో నిరుత్సాహపర్చింది. పెపైచ్చు మూర్తి పునరాగమనం తర్వాత డజను మంది పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ నుంచి వైదొలిగారు. దాదాపు 30 వేల మంది పైచిలుకు ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారని పరిశ్రమవర్గాల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ సిక్కా .. ఇన్ఫీ సీఈవోగా నియమితులయ్యారు. ఆయన రాకతోనే కంపెనీ సెంటిమెంటు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించడం మొదలైంది. సెంటిమెంటు, షేరూ జూమ్ సిక్కా బాధ్యతలు చేపట్టాక క్యూ2లో కంపెనీ నికర లాభం అంచనాలను మించి దాదాపు 29 శాతం వృద్ధితో 3,096 కోట్లకు ఎగిసింది. ఆయన వస్తూ.. వస్తూనే ఇన్వెస్టర్లకు దీపావళి ధమాకాను అందించారు. ఒక్కో షేరుకి మరో షేరు బోనస్‌తో పాటు మధ్యంతర డివిడెండు ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా మెరుగుపడింది. సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాల ప్రకారం కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) వాటాలు ఆల్‌టైమ్ గరిష్టమైన 42.76 శాతానికి పెరిగాయి. ఈ పరిణామాలతో ఇన్ఫీ షేరు ధర కొత్త రికార్డు స్థాయి రూ. 3,985ని తాకింది. మొత్తం మీద ఆగస్టు 1న సిక్కా ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టినప్పట్నుంచీ షేరు సుమారు 14 శాతం పైగా ర్యాలీ చేసింది. మరో రెండేళ్లలో స్టాక్ మార్కెట్‌ను తమ షేరే ముందుకు నడిపించేస్థాయికి తీసుకువస్తామంటూ ఇటీవల సిక్కా చేసిన ప్రకటన ఆయన విశ్వాసానికి అద్దంపడుతోంది. ఉద్యోగుల్లో ఉత్సాహం .. విశాల్ సిక్కా ఎంట్రీ ఇటు ఉద్యోగుల్లో కూడా ఉత్సాహం నింపుతోంది. వారి నుంచి పని రాబట్టుకోవడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీంతో.. సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడం క్యూ2లో 82.3 శాతానికి పెరిగింది. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించింది. ఒక్క త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం అన్నది కంపెనీ చరిత్రలో ఇదే ప్రథమం. అయినా సరే.. సిక్కా సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి త్రైమాసికంలో ఉద్యోగుల వలసలు భారీగా ఎగిశాయి. పరిశ్రమ సగటును మించి రికార్డు స్థాయిలో 20.1 శాతంగా నమోదయ్యాయి. అయితే, ఉద్యోగులకు ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు వంటి చర్యలతో అట్రిషన్‌ను సిక్కా నెమ్మదిగా పరిశ్రమ సగటు అయిన 13-15 శాతానికి తీసుకురాగలరని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే గాకుండా గతంలో ఇన్ఫీని వీడిపోయిన ఉద్యోగులను కూడా మళ్లీ వెనక్కి రప్పించేందుకు సిక్కా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా దాదాపు వంద మంది పైచిలుకు పూర్వ ఉద్యోగులు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపారు. రెన్యూ అండ్ న్యూ మంత్రం.. కంపెనీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టడం, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా సిక్కా .. రెన్యూ అండ్ న్యూ మంత్రాన్ని పఠిస్తున్నారు. అలాగే కంపెనీ ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే దిశగా సిక్కా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పూర్వం శాప్‌లో తనతో కలిసి పనిచేసిన సహచరుల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా అయిదుగురు శాప్ ఎగ్జిక్యూటివ్స్ తాజాగా ఇన్ఫీలో చేరారు. మరోవైపు, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకానైతే అన్ని అంశాలూ సిక్కాకు సానుకూలంగానే పనిచేస్తున్నాయి. వాటిని భవిష్యత్‌లో ఎంత కాలం పాటు నిలబెట్టుకోగలరన్నది చూడాల్సి ఉంటుందన్నది పరిశ్రమ వర్గాల మాట. -
క్లౌడ్ తో జర భద్రం..!
సేఫ్టీ స్మార్ట్ఫోన్లు వాడటం ఎంత సౌలభ్యకరమో...అంతే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఖరీదైన గాడ్జెట్స్‌తో ఉన్న సౌకర్యాలే ఒక్కోసారి ఇబ్బందిగా మారతాయి. ఇలాంటి వాటిలో తాజాగా కొంతమంది సెలబ్రిటీలకు తలెత్తిన సమస్య ఏమిటంటే, ఫోటోలు చోరీకి గురవ్వడం. మరి వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్స్‌లోని ఫోటోలు ఎలా చోరీ అయ్యాయి..?! అంటే... ఇక్కడే ఉంది ఒక ఆసక్తికరమైన విషయం. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు క్లౌడ్కంప్యూటింగ్ను వాడుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఫోన్లోని డాటాను క్లౌడ్ సర్వర్‌లో దాచుకోవచ్చు. దానివల్ల ఫోన్‌కు కొంచెం మెమొరీ భారం తగ్గుతుంది. ఫోటోలతోనూ, తీసుకొన్న వీడియోలతోనూ ఫోన్లోని డాటాస్పేస్ నిండిపోయినప్పుడు క్లౌడ్ సర్వర్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ వినియోగదారులయితే ‘ఐ క్లౌడ్’లో ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఫోన్లోని డాటాను అందులోకి చేర్చవచ్చు. అవసరం అయినప్పుడు లాగిన్ అయ్యి, దీనిని వాడుకోవచ్చు. దీనికోసం ఐక్లౌడ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడే సమస్య తలెత్తుతోందిప్పుడు. ఐ క్లౌండ్లో అకౌంట్ సులభంగా హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత హాలీవుడ్నటీమణులు జెన్నీఫర్ లారెన్స్, కేట్ ఆప్టన్ల ఐ క్లౌడ్ అకౌంట్లు హ్యాక్‌కు గురయ్యాయి. వారు క్లౌడ్‌లో దాచుకొన్న ఫోటోలను కొందరు కాపీ చేసుకొన్నారు. తద్వారా వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. మరి ఐ క్లౌడ్ వల్ల సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా బాధితులయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి అమ్మాయిలు ఈ విషయంలో అవగాహనతో వ్యవహరించాల్సి ఉంటుంది. టీనేజ్ గర్ల్స్‌లో చాలామంది తమ ఫొటోలను క్లౌడ్‌లో సర్దేయడం జరుగుతోంది. మరి ఇకపై వ్యక్తిగత సమాచారాన్ని క్లౌడ్‌కు ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి నివారణ ఏముంది? అంటే... ఫోన్లో డాటాస్పేస్ నిండిపోయినప్పుడు క్లౌడ్స్పేస్లో దాచడం కంటే... డాటాకేబుల్ ద్వారా పర్సనల్ కంప్యూటర్లోకి మార్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను దాచడానికి క్లౌడ్స్పేస్ను వీలైనంత తక్కువగా వాడాలని చెబుతున్నారు.