అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్ | Cloud Computing Funding Stories You Might Have Missed... | Sakshi
Sakshi News home page

అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్

Published Sun, Jan 18 2015 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్

అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ అనుబంధ సంస్థల్లో కెరీర్స్ అంటే సాధారణంగా గుర్తొచ్చే విభాగాలు.. ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటా మైనింగ్, అప్లికేషన్స్. వీటితోపాటు ఐటీ రంగంలో ఇప్పుడు ఎమర్జింగ్ సెగ్మెంట్‌గా మారుతున్న విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్. తాజాగా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ రంగ నియామకాల్లో 20 నుంచి 25 శాతం మేర క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫైల్స్‌కు చెందినవే.

కంపెనీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేస్తున్న వాటిల్లోనూ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. భవిష్యత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. సాఫ్ట్‌వేర్ సేవలను సరళతరం చేస్తూ పుష్కల అవకాశాలకు దోహదం చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్‌పై విశ్లేషణ..

 
 
‘ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ రూపొందించి వినియోగదారుల ఆదరణ పొందాలి. ఇప్పుడు ఇందుకు సరైన సాధనం.. క్లౌడ్ కంప్యూటింగ్. యువ సాఫ్ట్‌వేర్ నిపుణులు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో రాణించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. సాఫ్ట్‌వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఆవశ్యకతను తెలిపే మాటలివి. దేశంలో అనేక సాఫ్ట్‌వేర్ సంస్థలు వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. పోటీదారుల కంటే ముందుండేందుకు నిరంతరం కొత్త టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది.
 
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే
ఐటీ సంస్థలు తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. అందులో భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్, అప్లికేషన్ టూల్స్, నెట్‌వర్క్ ఛానెల్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటన్నిటి స్టోరేజ్ కంపెనీలకు వ్యయభారంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆవిష్కృతమైన సరికొత్త టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్! భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్, లాన్ లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా ఈ-మెయిల్స్ ద్వారా నిర్దిష్ట సేవలను అవసరమైనప్పుడు అందించడమే.. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కంపెనీల వ్యయ భారాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ సేవలను సదరు ప్రొవైడర్ నుంచి సులువుగా ఈ-మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇప్పటివరకు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పుడు దానిపై అవగాహన వచ్చే వరకు ప్రొవైడింగ్ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల వద్ద ఉండాల్సి వచ్చేది. క్లౌడ్ కంప్యూటింగ్‌తో ఈ-మెయిల్స్, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఉదాహరణకు: ఒక వినియోగదారుడి కంప్యూటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కే పరిమితమైంది. కానీ దానికి భిన్నంగా ఉండే మరో అప్లికేషన్(ఉదా: యాపిల్ మ్యాక్) పొందాల్సిన అవసరం ఏర్పడింది.

అలాంటప్పుడు యాపిల్ మ్యాక్ ప్రొవైడర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి, ఈ-మెయిల్ ద్వారా సొంతం చేసుకుని యాపిల్ మ్యాక్ అప్లికేషన్స్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఆ ప్రొవైడర్స్ నిర్దేశించే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. స్థూలంగా ఇంటర్నెట్ ఆధారంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్/సర్వీసెస్‌ను అయినా అందించే, సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించే విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్.
 
పెరుగుతున్న డిమాండ్
పోటీ ప్రపంచంలో సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రతి రెండు, మూడేళ్లకు కొత్త కొత్త వెర్షన్‌లు ఆవిష్కృతమవుతున్నాయి. దాంతో అన్నిటినీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా కంపెనీలకు డేటా స్టోరేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది.

క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మేరకే సదరు సర్వీసెస్ పొందే అవకాశం లభిస్తుంది. అందుకే గత రెండుమూడేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఇలా ఐటీ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నాయి.
 
లక్షల్లో అవకాశాలు
ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ నియామకాల సంఖ్య లక్షల్లో నమోదు కానుంది. నాస్‌కామ్, సీఐఐ, ఐబీఎం వంటి సంస్థల సర్వేల ప్రకారం- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ ఏడాది భారీగా రిక్రూట్‌మెంట్ జరుగనుంది. మరోవైపు 2015 చివరి నాటికి అంతర్జాతీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 70 బిలియన్ డాలర్ల మేర కార్యకలాపాలు నమోదు చేసుకోనుంది.

26 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ఏడాదిలోనే 15 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించనుందని నిపుణుల అంచనా. వీటిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో నిలవనుంది. భారత్ మూడు లక్షలకుపైగా ఉద్యోగావకాశాలతో మూడో స్థానం పొందనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
అవసరమైన నైపుణ్యాలు
క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో స్థిరపడాలనుకునేవారికి హెచ్‌టీఎంఎల్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, జావా, సీ++, డాట్ నెట్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్ వంటి కోర్ నైపుణ్యాలు అవసరం. అదేవిధంగా వెబ్ డెవలప్‌మెంట్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనాలిసిస్ తదితర యూజర్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉద్యోగ సాధనకు ఉపకరించే అదనపు నైపుణ్యాలు.
 
క్లౌడ్ కోర్సులు
క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అకడమిక్‌గా ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు లేవు. దీంతో కంపెనీలు బీటెక్ స్థాయిలో ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచ్‌ల విద్యార్థులను నియమించుకుని, సొంతంగా శిక్షణనిచ్చి క్లౌడ్ నైపుణ్యాలు నేర్పిస్త్తున్నాయి. జేఎన్‌టీయూ, ట్రిపుల్‌ఐటీ, సీ-డాక్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేసే సాఫ్ట్‌వేర్ కోర్సుల్లోనే క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్‌ను అందిస్తున్నాయి.

క్లౌడ్ కంప్యూటింగ్‌కు గ్రాడ్యుయేషన్‌లో పూర్తి స్థాయి కోర్సులు లేకున్నా.. రీసెర్చ్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ-బాంబే, ఐబీఎం-ఇండియా రీసెర్చ్ ల్యాబ్, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్, హెచ్‌పీ లేబొరేటరీల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవి ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా ఔత్సాహికులను ఎంపిక చేస్తున్నాయి.
 
సర్టిఫికేషన్స్
పూర్తి స్థాయిలో కోర్సులు లేని క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్, ఈఎంసీ, వీఎంవేర్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు పలు సర్టిఫికేషన్‌‌స ఆఫర్ చేస్తున్నాయి.

అవి.. ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్, ప్రొఫెషనల్ క్లౌడ్ సెక్యూరిటీ మేనేజర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వెండార్ అలైన్‌మెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్, వర్చువలైజేషన్ ఆఫ్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్ వంటివి.
 
ఆకర్షణీయ వేతనాలు
సర్టిఫికేషన్ కోర్సులు లేదా కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పొందినవారికి.. ఈ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్; నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్; ప్రొడక్ట్ మేనేజర్; సేల్స్ ఎగ్జిక్యూటివ్; క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్; క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. ఈ రంగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు ఎంట్రీ లెవల్‌లోనే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో వార్షిక వేతనం లభిస్తుంది. మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్‌కు దాదాపు రూ.15 లక్షలు; ఆరేడేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.20 లక్షల మేర వార్షిక వేతనం ఖాయం.
 
క్లౌడ్ సర్టిఫికేషన్స్- ముఖ్య వెబ్‌సైట్స్
 
http://www-03.ibm.com/certify/certs/50001201.shtml
http://www8.hp.com/us/en/training/portfolio/cloud.html
education.emc.com
www.cloudschool.com
www.microsoft.com/learning
https://www.itpreneurs.com/it-training-products/cloud-computing/cloud/ l www.cdac.in  l www.snia.org.
www.cloudcomputingtraining.co.in
www.cloudcredential.org
 

సరికొత్త వేదిక
ఐటీ రంగంలో రెగ్యులర్ జాబ్స్‌కు విభిన్నంగా విధులు నిర్వర్తించాలనుకునే వారికి సరికొత్త వేదిక.. క్లౌడ్ కంప్యూటింగ్. మారుతున్న పరిస్థితులు, క్లయింట్ల అవసరాలు, అన్ని స్థాయిల్లోని క్లయింట్లకు చేరుకొని ఎండ్ యూజర్స్ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీలు అనుసరిస్తున్న విధానం.. క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే కచ్చితంగా మంచి అవకాశాలు సొంతమవుతాయి.

క్లౌడ్ కంప్యూటింగ్‌లో సుస్థిర భవిష్యత్తు కోరుకునే ఔత్సాహికులకు విషయ పరిజ్ఞానంతోపాటు, క్లయింట్స్‌తో సంప్రదింపులు సాగించే చాతుర్యం; మార్కెట్లో మారుతున్న పరిస్థితులపై అవగాహన; తమ క్లయింట్లకు చెందిన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించే నైపుణ్యాలు అవసరం.
- టి.కోమల్, జీఎం-(క్లౌడ్ వింగ్- ఐబీఎం)
 
ఇద్దరికీ అనుకూలం.. అందుకే అవకాశాలు
క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇటు సర్వీస్ ప్రొవైడర్స్, అటు వినియోగదారులు.. ఇద్దరికీ అనువైన విధానంగా మారింది. దాంతో ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఇదే క్రమంలో నిపుణులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోర్సులు అందుబాటులో లేకపోయినా.. ఆన్‌లైన్, మూక్ విధానాల్లో లభించే కోర్సులు పూర్తి చేయడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. అదేవిధంగా పీజీ స్థాయిలో సీఎస్‌ఈలో క్లౌడ్ కంప్యూటింగ్‌ను కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల కరిక్యులంలోనూ పొందుపరుస్తున్నారు. భవిష్యత్‌లో అకడమిక్‌గా పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
- ప్రొఫెసర్ వాసుదేవ వర్మ,డీన్, ఆర్ అండ్ డీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్
 
స్టోరేజ్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు
క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సేవలన్నీ దాదాపు ఆన్‌లైన్‌లోనే సాగుతాయి. కానీ ఒక ప్రొడక్ట్‌కు సంబంధించిన యూజర్ ఎప్పుడు కోరినా క్షణాల్లో పంపించే విధంగా డేటా స్టోరేజ్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలకం. యూజర్, సెగ్మెంట్‌లను పరిగణనలోకి తీసుకుంటూ.. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించేటప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే దూరదృష్టి ఉంటే ఈ విభాగంలో రాణించడం సులభమే.
 - ఎం. రాజేశ్,డెలివరీ మేనేజర్, క్లౌడ్ సపోర్ట్- శాప్ ల్యాబ్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement