సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 'ఐబీఎం క్లౌడ్ కంప్యూటింగ్' లో శిక్షణ సేవలను ప్రవేశపెట్టే అంశంపై ‘టాస్క్’, ఐబీఎం ఇండియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వృత్తి విద్యా కళాశాలల్లో నాణ్యమైన విద్యాబోధన కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) పేరుతో ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒప్పందం వివరాలు, ప్రత్యేకతలను వెల్లడిస్తూ టాస్క్, ఐబీఎం ఇండియాలు బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ప్రస్తుతం ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్‌కు బాగా డిమాండ్ ఉంది. ఈ ఒప్పందం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు ఐబీఎం క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంతో అనుసంధానమై తమ ప్రతిభను మెరుగుపరుచుకోడానికి వీలు కలుగుతుంది. 2014లో ఐబీఎం ప్రవేశపెట్టిన బ్లూమిక్స్ పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థగా దూసుకెళ్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రాక్టికల్స్‌తో పాటు ప్రాజెక్టు వర్క్‌పూర్తి చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడనుందని టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ తెలిపారు.