Vishal Sikka
-
విశాల్ సిక్కాపై టెరాడేటా ’ఐపీ’ చౌర్యం ఆరోపణలు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవల సంస్థ ఎస్ఏపీ మేధోహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని, ఇందులో ఆ సంస్థ మాజీ సీటీవో విశాల్ సిక్కాకు కూడా భాగం ఉందని అమెరికన్ టెక్నాలజీ సంస్థ టెరాడేటా ఆరోపించింది. ’హెచ్ఏఎన్ఏ’ ప్లాట్‌ఫాం రూపకల్పనలో తమ వ్యాపార రహస్యాలను, మేధోహక్కులను చోరీ చేశారంటూ అమెరికా కోర్టులో దావా వేసింది. హెచ్ఏఎన్ఏను రూపొందించే క్రమంలో తమ కాపీరైట్స్‌ను చౌర్యం చేసేందుకే ఎస్ఏపీ తమతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిందని, ప్రాజెక్టు పూర్తి కాగానే తెగదెంపులు చేసుకుందని టెరాడేటా ఆరోపించింది. ఎస్ఏపీ దశాబ్దకాలంగా కస్టమర్లు, భాగస్వామ్య సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందంటూ పేర్కొంది. మరోవైపు, ’హెచ్ఏఎన్ఏ’ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సిక్కా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. హెచ్ఏఎన్ఏను పూర్తి నిబద్ధతతో రూపొందించామని, మేధోహక్కుల ఉల్లంఘనేదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోగా కూడా సిక్కా పనిచేసిన సంగతి తెలిసిందే. -
విశాల్ సిక్కాకు ఇన్ఫీ క్లీన్చిట్
బెంగళూరు : ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాకు క్లీన్చిట్ లభించింది. వివాదస్పద డీల్ పనయ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని నేతృత్వంలో జరిగిన బోర్డు తేల్చింది. మాజీ సీఈవో విశాల్ సిక్కాకు మద్దతుగా నిలుస్తూ.. అవతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నిలేకని పేర్కొన్నారు. ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ డీల్‌లో ఎలాంటి అవతవకలు జరుగలేదని విచారణలో బోర్డు తేల్చినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. పనయ డీల్, కార్పొరేట్ గవర్నెన్స్ విషయాల్లోనే కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, మాజీ సీఈవో విశాల్ సిక్కాకు మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే విశాల్ సిక్కా రాజీనామా చేయడం, తదుపరి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంపెనీ ప్రయోజనాలరీత్యా విచారణ నివేదికను బహిర్గతం చేయట్లేదని నిలేకని పేర్కొన్నారు. ప్రస్తుతం పనయ డీల్ విషయంలో వెలువడిన ప్రకటనతో నారాయణమూర్తి ఆరోపణల్లో ఎలాంటి రుజువు లేదని తెలిసింది. పనయ డీల్‌ను బహిర్గతం చేయాలంటూ పలుమార్లు నారాయణమూర్తి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీలోకి నిలేకని పునరాగమనం అనంతరం తొలిసారి ఇన్ఫోసిస్ తన క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో కంపెనీ లాభాలు ఏడాదికి 7 శాతం పెరిగి రూ.3726 కోట్ల ఆర్జించినట్టు రిపోర్టు చేసింది. 2018 ఆర్థిక సంవత్సరపు గైడెన్స్‌ను మాత్రం కంపెనీ 6.5-8.5 శాతం నుంచి 5.5-6.5 శాతానికి తగ్గించింది. -
విశాల్ సిక్కా భార్య వందన రాజీనామా
బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ మాజీ సీఎండీ విశాల్ సిక్కా భార్య వందన సిక్కా ఐటీ సేవల దాతృత్వ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను వీడారు. కంపెనీకి అందించిన ఈమెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యుఎస్ఎ ఛైర్ పర్సన్‌గా తన పాత్రనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే తన రాజీనామా విషయాన్ని తన బ్లాగ్‌లో, ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు. కంపెనీ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామాచేయడంతో ఆయన భార్యకూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ పదవికి గుడ్ బై చెప్పారు. రెండున్నర సంవత్సరాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఆమె పనిచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌లో చేరకముందు ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని యోచించారు. Proud of 2.5 amazing yrs creating & scaling purposeful work with the team @InfyFoundation! Thx all for your support.https://t.co/0etMhfTJJA — Vandana Sikka (@VTSikka) August 29, 2017 -
ఇన్ఫీ కోల్పోయింది.. హెచ్‌పీకి దక్కుతుందా?
-
ఇన్ఫీ కోల్పోయింది.. హెచ్‌పీకి దక్కుతుందా?
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ కోల్పోయింది.. హెచ్‌పీకి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య వివాదాలతో కంపెనీ సీఈవోగా వైదొలిగిన విశాల్ సిక్కా, ఐకానిక్ అమెరికన్ సంస్థ హెచ్‌పీలో చేరబోతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్, చిప్ మేకర్ దిగ్గజం హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్(హెచ్‌పీఈ)లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా సిక్కా జాయిన్ కాబోతున్నారని పలు వర్గాలు చెప్పాయి. ఆశ్చర్యకరంగా సిక్కా రాజీనామా చేయడానికి కొన్ని రోజుల ముందే, విశాల్ సిక్కాకు సీఈవో పదవి కంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగమే మంచిదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ పోస్టులోనే విశాల్ సిక్కా చేరబోతున్నారని తెలియడం గమనార్హం. ఈ రిపోర్టులపై విశాల్ సిక్కా ఇంకా స్పందించలేదు. హ్యూలెట్ ప్యాకర్డ్ నుంచి విడిపోయి 2015లో హెచ్‌పీఈ ఏర్పడింది. ఈ సంస్థలో రెండు లక్షల మంది ఉద్యోగులున్నారు. డేటా సెంటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను హెచ్‌పీఈ విక్రయిస్తోంది. అదేవిధంగా హెచ్‌పీ పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటర్స్‌ను అమ్ముతోంది. హెచ్‌పీఈ ప్రధాన కార్యాలయం పాల్ ఆల్టో. మెక్ వైట్‌మ్యాన్ దీనికి చైర్మన్. అటు విశాల్ సిక్కా కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే. దీంతో సిక్కాను ఆ కంపెనీలోకి తీసుకోవడానికి హెచ్‌పీ వెనుకాడదని తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్‌పీఈలో సీటీఓ పదవి ఖాళీగా ఉంది. గతేడాది హెచ్‌పీఈ సీటీఓగా మార్టిన్ ఫింక్ తప్పుకోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరకముందు కూడా విశాల్ సిక్కా, జర్మన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఎస్ఏపీకి సీటీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. స్టాన్‌ఫోర్డ్‌లో సిక్కా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డాక్టరేట్ కూడా పొందారు. -
ఇన్ఫో @ నీలేకని
♦ మళ్లీ సొంతగూటికి... చైర్మన్‌గా పగ్గాలు ♦ ప్రస్తుత చైర్మన్ శేషసాయి, కో–చైర్మన్ రవి రాజీనామా ♦ బోర్డు నుంచి కూడా తప్పుకున్న విశాల్ సిక్కా ♦ స్వతంత్ర డైరెక్టర్లుగా వైదొలిగిన జెఫ్రీ, జాన్ ♦ కొత్త సీఈవో కోసం కొనసాగనున్న అన్వేషణ న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా వ్యవస్థాపకులు, బోర్డుకు మధ్య విభేదాలతో నలిగిపోయిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కి కాస్త ఊపిరి తీసుకునే అవకాశం దొరికింది. సంక్షోభ పరిస్థితులకు తెరదించుతూ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని సొంత గూటికి మళ్లీ తిరిగొచ్చారు. ఇతర సహ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న ఆర్.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తారు. గురువారం బోర్డు సమావేశం అనంతరం ఇన్ఫోసిస్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రవి వెంకటేశన్ సహ–చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇక గతవారం సీఈవో పదవికి రాజీనామా చేసినా.. వారసుడి ఎంపిక దాకా వైస్–చైర్మన్‌గా కొనసాగుతున్న విశాల్ సిక్కా.. తాజాగా బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు జెఫ్రీ ఎస్ లేమాన్, జాన్ ఎచ్‌మెండీ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. ఆయా అధికారుల రాజీనామాలను ఆమోదించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. తాత్కాలిక సీఈవోగాను, ఎండీగాను యూబీ ప్రవీణ్ రావు కొనసాగుతారు. పూర్తి స్థాయి కొత్త సీఈవో కోసం అన్వేషణ కొనసాగనుంది. తాజా పరిణామాలను వివరించేందుకు ఆగస్టు 25న (ఇవాళ) ఇన్వెస్టర్లతో సమావేశం అవుతున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందని, ఇన్ఫోసిస్ ప్రక్షాళన జరగాలంటూ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితరుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవస్థాపకులు పదే పదే తనను టార్గెట్ చేసుకుంటున్నారని పరోక్షంగా ఆరోపిస్తూ సిక్కా అర్ధంతరంగా సీఈవో పదవికి గత వారం రాజీనామా చేసినప్పటి నుంచి ఇన్ఫీ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. చైర్మన్‌గా నీలేకని నియామకం వార్తలతో అమెరికా నాస్డాక్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 0.74 శాతం ఎగిసింది. 14.93 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. నెలలుగా సంక్షోభం.. ఆరేడు నెలలుగా ఇన్ఫీలో సంక్షోభం చెలరేగుతోంది. సహవ్యవస్థాపకులు.. ముఖ్యంగా నారాయణ మూర్తికి, బోర్డుకు మధ్య విభేదాలు అంతకంతకూ ముదిరాయి. ఇజ్రాయెల్ సంస్థ పనయా కొనుగోలు వ్యవహారం మొదలు అనేక అంశాల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ మూర్తి పలు సందర్భాల్లో బోర్డును తప్పుపట్టారు. బోర్డు, మూర్తి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం బహిరంగంగానే కొనసాగింది. ఈ పరిణామాల నడుమ.. ఇన్ఫీ చరిత్రలో సీఈవోగా నియమితుడైన తొలి వ్యవస్థాపకయేతర వ్యక్తి విశాల్ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. అసలు బాధ్యతలపై దృష్టి పెట్టనివ్వకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు పెరిగిపోతుండటం ఇందుకు కారణంగా ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సిక్కా రాజీనామాకు వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి నిరంతరాయంగా ఆరోపణలు గుప్పిస్తుండటమే కారణమంటూ ఇన్ఫోసిస్ బోర్డు.. స్టాక్ ఎక్సే్చంజీలకు రాసిన ఈ–మెయిల్లో ఆరోపించింది. ఈ పరిణామంపై మండిపడిన నారాయణమూర్తి.. బోర్డు ఆరోపణలు ఖండించారు. ఇన్వెస్టర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు మూర్తి ప్రకటించినప్పటికీ.. అది వాయిదా పడింది. సిక్కా రాజీనామా అనంతరం నీలేకనికి బాధ్యతలు అప్పగించాలంటూ ఇన్వెస్టర్లతో పాటు ఇన్ఫీలో గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు మాజీ సిబ్బంది నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో నీలేకని తిరిగి వెనక్కి రావడానికి అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిక్కాతో తెగదెంపులు.. నందన్ నీలేకని తిరిగి రావడం ఖరారైన నేపథ్యంలో ఇన్ఫోసిస్.. సిక్కాతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకోనుంది. కాంట్రాక్టు ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన పరిహారాన్ని చెల్లించేయనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. ఆయనకు 90 రోజులకి సంబంధించి బేస్ పేతో పాటు ఉద్యోగులకు లభించే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని పేర్కొంది. ఇప్పటిదాకా షేర్ల రూపంలో ఆయనకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లించనున్నట్లు వివరించింది. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని 2002–2007 మధ్య కాలంలో సంస్థ సీఈవోగా పనిచేశారు. ఆ తర్వాత విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ ఆధార్‌కు సారథ్యం వహించేందుకు 2008లో వైదొలిగారు. నీలేకని సీఈవోగా వ్యవహరించిన 2002 మార్చి 2007 ఏప్రిల్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ ఏకంగా 374 శాతం ఎగిసింది. పరిశ్రమను మించిన పనితీరు కనపర్చింది. అమ్మకాలు 40%, లాభాలు వార్షికంగా 37 శాతం మేర వృద్ధి చెందాయి. సొంతగూటికి రాక సంతోషం: నీలేకని ఇన్ఫోసిస్‌కి మళ్లీ తిరిగిరావడం సంతోషంగా ఉంది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాను. క్లయింట్లు, షేర్హోల్డర్లు, ఉద్యోగులు మొదలైన వారందరికీ ప్రయోజనాలు చేకూర్చేలా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోర్డులోని నా సహచర సభ్యులతో కలసి పనిచేస్తాను. గడిచిన మూడేళ్లుగా సీఈవోగా సేవలు అందించిన విశాల్‌కి కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్‌లో చేపట్టే వాటిల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాను. స్వాగతిస్తున్నా..: విశాల్ సిక్కా నందన్ నీలేకని నియామకాన్ని స్వాగతిస్తున్నా. బాధ్యతల బదలాయింపు జరిగే వరకూ బోర్డులో కొనసాగుతానని గతంలో చెప్పా. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన రాకతో తక్షణం వైదొలుగుతున్నా. నందన్ సమర్థుడైన నాయకుడు. ఇన్ఫోసిస్ కొత్త శిఖరాలు అధిరోహించేలా మార్గనిర్దేశం చేసే దిశగా నీలేకని నియామకాన్ని స్వాగతిస్తున్నా. ఆయనతో పాటు ప్రవీణ్, ఇతర ఇన్ఫోసియన్లు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమర్ధ నాయకుడు నీలేకని..: శేషసాయి ఇన్ఫోసిస్‌ను వృద్ధి పథంలో నడిపించేందుకు నీలేకని సమర్ధుడైన నాయకుడు. భవిష్యత్తు వ్యూహాలపై కంపెనీ దృష్టి పెట్టేందుకు ఆయన నియామకం దోహదపడగలదు. నీలేకని సారథ్యంలో కంపెనీ మేనేజ్మెంట్ బృందం సమిష్టిగా పనిచేసి.. ఇన్ఫోసిస్‌ను పరిశ్రమలో అగ్రస్థానానికి చేర్చగలదనడంలో సందేహం లేదు. -
ఇన్ఫీ ఇన్నోవేటర్స్ కంపెనీగా ఉండడం కష్టం!
ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోగా రాజీనామా చేసిన అనంతరం విశాల సిక్కా తొలిసారి స్పందించారు. ఇన్ఫోసిస్‌ను వీడడం తన జీవితంలో అతి బాధాకరమైన సంఘటన అని ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు. అనివార్య పరిస్థితుల కారణంగా రాజీనామా చేయక తప్పలేదన్నారు. అంతేకాదు ఇన్ఫోసిస్ ఇన్నోవేటర్ల కంపెనీగా ఉండటం కష్టమని అభిప్రాయపడ్డారు. కానీ ఐకానిక్ ఇన్ఫోసిస్ నిలిచి గెలుస్తుందని నొక్కి చెప్పారు. ఇన్ఫోసిస్ సీఎండీగా పదవీ విరమణ చేసిన తరువాత తన మొదటి ముఖాముఖిళక్ష తన జీవితంలో అతి కష్టతరమైన నిర్ణయాలలో ఒకటి అంటూ తన రాజీనామాను గుర్తు చేసుకున్నారు. కానీ తనకు లభించిన మద్దతు, స్పందన చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఆ సమయంలో 72 గంటలలో కేవలం ఆరు గంటలపాటు నిద్రపోయానని సిక్కా తెలిపారు. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా తన గురువులాంటి, గొప్ప స్నేహితుడు ఇచ్చిన హెర్మాన్ హెస్సే పుస్తకంతోపాటు , జిడ్డుకృష్ణమూర్తి ఫ్రీడమ్ ఆఫ్ ది నోన్ పుస్తకాన్ని చదువుతున్నానని చెప్పారు. గతాన్ని మర్చిపోవడం ద్వారా కొత్తదనాన్ని ఆలింగనం చేసుకోవచ్చన్నారు. గతనుంచి స్వేచ్ఛ పొందడం మనల్ని మనం కొత్తగా అన్వేషించుకోవడానికి సాయ పడుతుదంటూ తాత్వికంగా మాట్లాడారు. ప్రస్తుతం తనకు కొంత సమయం కావాలనీ, దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన విషయాలపై దృష్టిపెట్టాలని అనుకుంటున్నానని చెప్పారు.ముఖ్యంగా పుస్తకాలను చదవాలనుకుంటున్నానని తన కుటుంబంతో సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స అంటే మక్కువ ఎక్కువని చెప్పారు. ఈ స్ విప్లవం , సృజనాత్మక ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన ఈ బిగ్ ఎమర్జింగ్ ప్లాట్‌ఫాం(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) లో ఏదో సాధించాలని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ప్రపంచంలో మార్పుకు నాందిపలికేలా చేయాలనుకుంటున్నాను. అయితే ఏంటి అనేది ఇంకా ఏమి తెలియదు, కానీ ఆవైపుగా తన పయనం సాగనుందని సిక్కా తెలిపారు. కాగా 1996లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కృత్రిమ మేధస్సు (ఎఐ) లో పీహెచ్డీ చేశారు సిక్కా. సిలికాన్ వ్యాలీలో ఐ బ్రెయిన్, బోధా అనే రెండు సొంత సంస్థలను ప్రారంభించారు. ఆ సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి , మరో ఫౌండర్ నందన్ నీలేకని సిక్కాకు బిగ్ హీరోస్. -
మార్కెట్‌కు ఇన్ఫీ దెబ్బ
♦ వరుసగా రెండో రోజూ పతనం సెన్సెక్స్ 266 పాయింట్లు, ♦ నిఫ్టీ 83 పాయింట్లు డౌన్ ముంబై: విశాల్ సిక్కా సీఈఓ పదవికి రాజీనామా చేసిన పరిణామాలతో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌తో పాటే మార్కెట్ కూడా సోమవారం వరుసగా రెండురోజు క్షీణించింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 266 పాయింట్లు పతనమై 31,259 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం కూడా ఈ సూచి 270 పాయింట్లు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,800 పాయింట్ల స్థాయిని కోల్పోయి, 83 పాయింట్ల నష్టంతో 9,754 వద్ద క్లోజయ్యింది. ట్రేడింగ్ తొలిదశలో బ్యాంకింగ్, మెటల్ షేర్ల దన్నుతో సెన్సెక్స్ 31,641 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగినప్పటికీ, మధ్యాహ్న సెషన్ నుంచి ఆ రెండు రంగాల షేర్లలో కూడా అమ్మకాలు జరగడంతో ఇంట్రాడేలో గరిష్టస్థాయి నుంచి 420 పాయింట్లకుపైగా పడిపోయి 31,220 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. ఇదేబాటలో నిఫ్టీ 9,884 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన అనంతరం 9,740 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. అమెరికా–దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక కవాతులు జరుపుతున్నాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్తగా లాభాల స్వీకరణకు పాల్పడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ ప్రీమియం ధరకు బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించినప్పటికీ, ఆ షేరులో అమ్మకాల ఒత్తిడి కొనసాగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్లో విక్రయాలు జరపడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని ఆయన వివరించారు. ఇన్ఫోసిస్ 5 శాతం డౌన్ గత శుక్రవారం 9 శాతంపైగా పతనమైన ఇన్ఫోసిస్ షేరు మరో 5 శాతం క్షీణించి మూడేళ్ల కనిష్టస్థాయి రూ. 873 వద్ద ముగిసింది. రూ. 1,150 ధరతో దాదాపు 5 శాతం షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు గత శనివారం ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన...ఈ షేరుపై సానుకూల ప్రభావం చూపలేదు. విశాల్ సిక్కా హఠాత్తుగా రాజీనామా చేసిన ప్రభావంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. రెండు ఎక్సే్ఛంజీల్లో కలిపి భారీగా 4.5 కోట్ల ఇన్ఫీ షేర్లు ట్రేడయ్యాయి. సెన్సెక్స్–30లో అత్యధికంగా పతనమైన షేరు ఇదే. అదాని పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, సన్‌ఫార్మా, ఓఎన్జీసీలు 2.7 శాతం వరకూ క్షీణించాయి. యాక్సిస్ బ్యాంక్, మహింద్రా, టెక్ మహింద్రా, ఐటీసీలు స్వల్పంగా పెరిగాయి. -
చేతకాకే మూర్తిపై నిందలు
సిక్కా రాజీనామాపై ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ పాయ్ మండిపాటు చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలని వ్యాఖ్య బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈఓ పదవికి అర్ధంతరంగా గుడ్‌బై చెప్పిన విశాల్ సిక్కాపై కంపెనీ మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిక్కా తన చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే మూర్తిపై ఆరోపణలు గుప్పించారని.. చేతకాక పదవినుంచి తప్పుకున్నారని ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ మండిపడ్డారు. తనపై పదేపదే నిరాధార ఆరోపణలు, వ్యక్తిగతంగా కూడా దూషణలను భరించలేకపోవడంవల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ఫీని వీడుతున్నానంటూ రాజీనామా లేఖలో సిక్కా పేర్కొన్న సంగతి తెలిసిందే. నేరుగా మూర్తిపేరును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ... ఇన్ఫీ బోర్డు మాత్రం సిక్కా రాజీనామాకు మూర్తే కారణమని కుండబద్దలుకొట్టింది. దీంతో దాదాపు ఏడాదికాలంగా బోర్డుతో మూర్తి సాగిస్తున్న పోరు తారస్థాయికి చేరింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిక్కా తనంతటతానుగా వైదొలగారనుకున్నారు. తన వైఫల్యాలను బయటపడకుండా చేసుకోవడం కోసం మూర్తిని టార్గెట్ చేసుకొని సిక్కా ఆరోపణలు చేశారు’ అని పాయ్ వ్యాఖ్యానించారు. ఒకపక్క, కొత్త సీఈఓ ఎంపిక కత్తిమీదసాముగా మారగా.. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై అమెరికాలోని కొన్ని న్యాయ సంస్థలు క్లాస్యాక్షన్ దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతోపాటు కంపెనీ క్లయింట్లలో కూడా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. షేర్ల బైబ్యాక్ ప్రకటనను చేసినప్పటికీ(షేరుకు రూ.1,150 చొప్పున ధరతో) స్టాక్ మార్కెట్లో ఇన్ఫీ స్టాక్ కుప్పకూలుతూనే ఉంది. వరుసగా రెండురోజుల్లో 14 శాతంపైగా దిగజారి... రూ.873 స్థాయికి పడిపోయింది. మళ్లీ కొత్త పోస్టు ఎందుకు...: పూర్తిస్థాయి కొత్త సీఈఓ నియామకం జరిగేవరకూ సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాయ్ తప్పుబట్టారు. ‘కంపెనీకి ఇప్పటికే చైర్మన్(ఆర్.శేషసాయి), సహ–చైర్మన్(రవి వెంకటేశన్)లు ఉన్నారు. తాత్కాలిక సీఈఓను(యూబీ ప్రవీణ్ రావు) కూడా నియమించారు మళ్లీ కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎందుకు? ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా, కాబోయే సీఈఓగా కంపెనీకి చెందినవారు ఉండలా, బయటివ్యక్తి అయితే మంచిదా అన్న ప్రశ్నకు... పొగరుబోతుగా, సొంత నిర్ణయాలతో వ్యవహరించే వ్యక్తులు కాకుండా... ఇన్ఫోసిస్ సంస్కృతి, విలువను గౌరవించే వ్యక్తి అయి ఉండాలని బదులిచ్చారు. ఇన్ఫీ చైర్మన్, కో–చైర్మన్లు వైదొలగాలి మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ న్యూఢిల్లీ: ఇన్ఫీలో సిక్కా రాజీనామా ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలాలేవు. కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలుపెట్టడానికిముందే కంపెనీ డైరెక్టర్ల బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కంపెనీ మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ డిమాండ్ చేశారు. చైర్మన్ ఆర్.శేషసాయి, సహ–చైర్మన్ రవి వెంకటేశన్లు కూడా బోర్డు నుంచి తప్పుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు ఆడిట్ విభాగం హెడ్ రూపా కుద్వా, రెమ్యూనరేషన్ విభాగం హెడ్ జెఫ్రీ ఎస్. లేమాన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి ఆరోపించిన నేపథ్యంలో బాలకృష్ణన్ వ్యాఖ్యలు కూడా ఇదే తరహాలో ఉండటం గమనార్హం. ముందుగా బోర్డును ప్రక్షాళన చేయకుండా కొత్త సీఈఓను తీసుకురావడం కంపెనీకి ఆత్మహత్యాసదృశంగా మారుతుందని బాలకృష్ణన్ అన్నారు. ‘పెద్ద ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులతో తగినవిధంగా చర్చించి బోర్డులోకి మంచి వ్యక్తులకు చోటుకల్పించాలి. ఇప్పుడున్న బోర్డును చూస్తే... ఇన్ఫీకి సారథ్యం వహించేందుకు మంచి సీఈఓలు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనబడటం లేదు’ అని బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువును ఇన్ఫీ బోర్డు నిర్దేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇజ్రాయిల్ కంపెనీ పనయా కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ డీల్‌పై దర్యాప్తు నివేదికను ఇన్ఫోసిస్ బయటపెట్టాల్సిందేనని కూడా బాలకృష్ణన్ పేర్కొన్నారు. -
ఇన్ఫీకి కొత్త సీఈవో ఎంపిక పెద్ద తంటా
సాక్షి, బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, ఈ కంపెనీ మేనేజ్మెంట్కు గత కొంతకాలంగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తొలి వికెట్ పడింది. ఈ కంపెనీ సీఈవో, ఎండీగా ఉన్న విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసేశారు. ఈ షాక్‌తో ఇన్ఫోసిస్ కొత్త చిక్కు వచ్చి పడింది. అదే విశాల్ సిక్కాను భర్తీచేసే కొత్త సీఈవో. ఆయన్ను భర్తీ చేస్తూ ఓ కొత్త వ్యక్తి ఇన్ఫోసిస్ సీఈవోగా ఆ పదవిలోకి రావాల్సి ఉంటుంది. అయితే ఆ పదవిని అలకరించేది ఎవరన్నది సర్వత్రా చర్చనీయాంశం. కానీ ఆ వ్యక్తిని గుర్తించేది ఎలా అన్నది ఇన్ఫోసిస్ తంటా. ఈ విషయాన్ని 2014లో కొత్త సీఈవోను ఎంపికచేసే సమయంలో సమస్యలు ఎదుర్కొన్న అధికారులే చెబుతున్నారు. 2014లోనే సీఈవోను వెతకడం అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. గ్రూప్ వ్యవస్థాపకులు కాక, మొదటిసారి బయట వ్యక్తి విశాల్ సిక్కా ఆ పదవిలోకి వచ్చారు. కానీ ప్రస్తుతం విశాల్ సిక్కా వైదొలగడంతో, ఈ కంపెనీకి కొత్త సీఈవోను నియమించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లోనే బయట వ్యక్తిని వెతికి నియమించడం చాలా కష్టమైందని, ప్రస్తుతం ఇది మరింత జటిలమని ఓ అధికారి చెప్పారు. కానీ ఈ సారి బయట వ్యక్తులకు అవకాశాలు తక్కువేనని కూడా తెలిపారు. కంపెనీలో పనిచేసే వారినే ఈ సారి సీఈవోగా నియమించే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా రాబోతున్న సీఈవోగా కచ్చితంగా 2014లో కంటే మరింత మంచిగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కొత్త ఏరియాలు క్లౌడ్, ఆటోమేషన్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్లపై ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సిక్కా సీఈవోగా 2014లో ఇన్ఫీలోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు ఇన్ఫీ షేరు ధర 22 శాతం పైకి ఎగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో మంచి షేరుగా నిలిచింది. కానీ ప్రస్తుతం వచ్చే సీఈవో బ్రెగ్జిట్, అమెరికాలో అనిశ్చిత పరిస్థితులు, వీసా విధానాల్లో మార్పులు వంటి వాటన్నింటిన్నీ భరిస్తూ.. ఇన్ఫీని మరింత మెరుగైన బాటలో నడిపించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు నుంచి ఇన్ఫీ కొత్త సీఈవోగా ఓ నలుగురు పేర్లు టెక్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు ఈ బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో ఒకరు ప్రస్తుతం ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, రెండో వ్యక్తి సీఎఫ్ఓ రంగనాథ్ డీ మావినకేరి, తర్వాత వ్యక్తి ప్రెసిడెంట్, డిప్యూటీ సీఓఓ రవి కుమార్ ఎస్, ఇక నాలుగో వ్యక్తి బీఎఫ్ఎస్ఐ హెడ్ మోహిత్ జోషి అని తెలుస్తోంది. -
సిక్కా పోస్టు బరిలో ఆ నలుగురు?
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్‌కు విశాల్ సిక్కా ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. తనపై పదేపదే వస్తున్న మాటలదాడిని, నిరాధారణమైన ఆరోపణలను తట్టుకోలేక ఇన్ఫోసిస్ సీఈవో పోస్టుకు రాజీనామా చేస్తున్నానంటూ సిక్కా అనూహ్య నిర్ణయం ప్రకటించారు. సిక్కా అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్ హోర్హోల్డర్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఆందోళనలతో ఇన్ఫీలో ఉన్న షేర్లను అమ్మేశారు కూడా. అయితే ఈ ఆందోళనలన్నింటిన్నీ చక్క పెట్టడానికి ఓ సమర్థుడైన వ్యక్తి సీఈవోగా సిక్కా పోస్టులోకి రావాల్సి ఉంటుంది. ఆ సీఈవోకు కంపెనీ బాధ్యతలే కాక, ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు, వీసాల విషయంలో ఇతర దేశాలు తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలు అతిపెద్ద సవాళ్లుగా నిలువనున్నాయి. కానీ సిక్కా పోస్టులోకి వచ్చేదెవరు? ఆ పోస్టుకు ఎవరెవరు? సమర్థులు. సిక్కా జాబ్‌ను విజయవంతంగా నడిపించేదెవరంటే..? ప్రస్తుతం నలుగురు పేర్లు అందరి నోళ్లలో నలుగుతున్నాయి. ఈ నలుగురిలో ఒక్కరు ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా రావొచ్చంటూ కంపెనీకి చెందిన అధికారులే చెబుతున్నారు. వారెవరంటే... ఒకరు ప్రస్తుతం ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, రెండో వ్యక్తి సీఎఫ్ఓ రంగనాథ్ డీ మావినకేరి, తర్వాత వ్యక్తి ప్రెసిడెంట్, డిప్యూటీ సీఓఓ రవి కుమార్ ఎస్, ఇక నాలుగో వ్యక్తి బీఎఫ్ఎస్ఐ హెడ్ మోహిత్ జోషి అని తెలిసింది. ఈ నలుగురు సిక్కా పోస్టుకు బరిలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. బయట వ్యక్తిని మాత్రం ఇన్ఫోసిస్ సీఈవోగా తీసుకురాదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కో-చైర్మన్‌గా ఉంటున్న రవి వెంకటేషన్ ఈ పదవి చేపట్టవచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ వెంకటేషన్నే ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. తనకు ఆ హాట్ సీటులో కూర్చోవడం ఇష్టంలేదంటూ తేల్చిచెప్పారు. ఇప్పటికే తామున్న వ్యూహంలోకి రాగల సమర్థుడైన నాయకుడు తమకు కావాలంటూ వెంకటేషన్ చెప్పారు. ఆ నలుగురే ఎందుకు? తాత్కాలిక సీఈవోగా పదవిలోకి వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, 1986 నుంచి ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ హెడ్ వంటి అతిపెద్ద నాయకత్వ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఇక సీఎఫ్ఓ రంగనాథ్, ఇన్ఫోసిస్ పనిచేయబట్టి దాదాపు 15 ఏళ్లయింది. ప్రస్తుతం కార్పొరేట్ ఫైనాన్స్, విలీనాలు, కొనుగోళ్లు, కార్పొరేట్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వాటిలో బాధ్యతలు చేపడుతున్నారు. అన్ని ఇండస్ట్రి సెగ్మెంట్లలో ఇన్ఫోసిస్‌ను గ్లోబల్‌గా ఓ స్థానంలో నిల్చోబెట్టిన ఘనత డిప్యూటీ సీఓఓ కుమార్‌ది. బీఎఫ్ఎస్ఐ అధినేత, ప్రెసిడెంట్ జోషి సంస్థ వ్యాప్తంగా జరిగే విక్రయ కార్యకలాపాలను, రిపోర్టింగ్ ప్రక్రియలను చూసుకుంటున్నారు. -
ఐటీ మునుపటి కళ తప్పింది: విదేశీ మీడియా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో భారతీయ ఐటీ రంగం ఎగుమతులు గత ఏడేళ్లలో ఎన్నడూలేని విధంగా కుదేలైన తీరును విదేశీ మీడియా విశ్లేషించింది. దేశీయ ఐటీ సేవల ఎగుమతులు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో పతనమవడం ఆందోళన రేకెత్తిస్తున్నదని, కరెంట్ ఖాతా లోటును పెంచడమే కాకుండా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పాలకులు కలత చెందుతున్నట్టు ఫారెన్ మీడియా పేర్కొంది. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఇబ్బందికరమని వ్యాఖ్యానించింది. హెచ్1బీ వీసాలపై ట్రంప్ వైఖరి భారత్ ఇంజనీర్లు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధమని ఎకనమిక్ సర్వే విస్పష్టంగా పేర్కొనడాన్ని విదేశీ మీడియా ప్రస్తావించింది. ఆటోమేషన్ దెబ్బతో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న వరల్డ్ బ్యాంక్ నివేదిక, 2020 వరకూ భారత్‌లో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కోల్పోతాయని హెడ్ హంటర్స్ ఇండియా అంచనాలూ టెక్నోక్రాట్ల దుస్థితికి అద్దంపడుతున్నాయని పేర్కొంది. -
సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్
-
వీడిన వాళ్లకు జోక్యం చేసుకునే హక్కులేదు
బీవీఆర్ మోహన్‌రెడ్డి హైదరాబాద్: విశాల్ సిక్కా వంటి మంచి సీఈవో గొప్ప సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ను వీడడం బాధాకరమని నాస్కాం మాజీ చైర్మన్, సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కంపెనీని వీడిన తర్వాత ప్రమోటర్లకు అట్టి సంస్థలో జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటన పశ్చిమ దేశాల్లో జరిగితే వాటాదారులు కంపెనీపై కోర్టులో దావా వేస్తారని అన్నారు. 12.8 శాతం వాటా ఉన్నవారు సమస్య సృష్టిస్తే, 87.5 శాతం వాటాదారులు ఇబ్బంది పడతారని తెలిపారు. బైబ్యాక్ యథాతథం.. సిక్కా రాజీనామా కారణంగా కంపెనీ ప్రతిపాదించిన షేర్ల బైబ్యాక్(దాదాపు రూ.13,000 కోట్లు) ప్రణాళికల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ఇన్ఫీ ప్రకటించింది. బైబ్యాక్‌పై నిర్ణయం కోసం కంపెనీ నేడు(శనివారం) బోర్డు సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. చైర్మన్‌గా నీలేకని రావాలి.. ఇన్ఫోసిస్ బోర్డు తమ సీఈవోను కాపాడుకోలేకపోయిందని ది ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బోర్డులో చేరేలా ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకనిని సంస్థ ఒప్పించాలని సూచించింది. దేశ ఐటీ రంగానికి ఇన్ఫోసిస్ గుండెలాంటిది కాబట్టి నీలేకని కూడా దీన్ని కార్పొరేట్ ఉద్యోగంలాగా భావించకుండా తన వంతు కృషి చేయాలని పేర్కొంది. ‘ఎప్పటికప్పుడు టెక్నాలజీలో మారిపోయే కొత్త ధోరణులను ఆయన అందిపుచ్చుకున్నారు. దేశాన్ని డిజిటలైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అధికారుల్లోను, అంతర్జాతీయంగా నాయకులతోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా ఇన్ఫీ ఆవిర్భావం నుంచి ఉన్నందున.. ఇటు కంపెనీ సంస్కృతితో పాటు అటు వ్యవస్థాపకుల ఆలోచనా ధోరణులపై ఆయనకు మంచి అవగాహన ఉంటుంది‘ అని ఐఐఏఎస్ తెలిపింది. ఇన్ఫీ గెలుపు.. భవిష్యత్‌లో దేశీ ఐటీ పరిశ్రమ దిశానిర్దేశాన్ని సూచించగలదని ఐఐఏఎస్ తెలిపింది. మరోవైపు, సిక్కా సారథ్యంలో కంపెనీ మెరుగ్గా రాణించినప్పటికీ.. 2020 నాటికల్లా 20 బిలియన్ డాలర్ల ఆదాయమంటూ ఆయన స్వయంగా విధించుకున్న లక్ష్యానికి దరిదాపుల్లో లేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ విభాగం) వీకే శర్మ వ్యాఖ్యానించారు. అటు ప్రస్తుత పరిణామాల ప్రభావం తాత్కాలికమేనని సమస్యలను అధిగమించి ఇన్ఫీ స్టాక్ మళ్లీ పుంజుకోగలదని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ విభాగం) సరబ్జిత్ కౌర్ నంగ్రా అభిప్రాయపడ్డారు. -
అంతా మూర్తే చేశారు..!
ఇన్ఫీ బోర్డు ఆరోపణ సిక్కాకు బాసట సిక్కా వైదొలగడానికి నారాయణమూర్తే కారణమంటూ ఇన్ఫీబోర్డు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. సిక్కా పనితీరు చాలా అద్భుతంగా ఉందని ఆయనకు బాసటగా నిలిచింది. అంతేకాదు కంపెనీలో మూర్తి సహా మరే ఇతర సహ–వ్యవస్థాపకులకు మళ్లీ చోటుకల్పించే అవకాశాల్లేవంటూ తేల్చిచెప్పడం గమనార్హం. సిక్కా రాజీనామా నేపథ్యంలో బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నారాయణమూర్తి బోర్డుకు రాసిన లేఖ పలు మీడియా సంస్థలకు కూడా నేరుగా వెళ్లింది. ఈ లేఖలో బోర్డు, యాజమాన్యం సమగ్రతను దెబ్బతీసేవిధంగా వ్యాఖ్యలు చేయడంతోపాటు కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు దిగజారాయంటూ మూర్తి ఆరోపణలు గుప్పించారు. అయితే, ఇవన్నీ పూర్తిగా నిరాధారం. ఆయన పదేపదే అసంబద్ధమైన డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. కంపెనీలో పటిష్టమైన కార్పొరేట్ గవర్నెన్స్‌ను కోరుకునే మూర్తి దీనికి విరుద్ధంగా వ్యవహరించారు’ అని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ‘ప్రమోటర్లు లేవనెత్తిన అంశాలపై చట్టపరిధిలో కంపెనీ స్వతంత్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పరిష్కారం కోసం కృషిచేశాం. అయితే, మూర్తి చర్యలు, డిమాండ్లు కంపెనీ ప్రతిష్ట, సమగ్రతను దెబ్బతీశాయి. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం’ అని బోర్డు వ్యాఖ్యానించింది. ‘కంపెనీ మేనేజ్మెంట్లోని సభ్యులపై పదేపదే ఇష్టానుసారంగా నిరాధార ఆరోపణలు చేయడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీనివల్ల కంపెనీ ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినడంతోపాటు ప్రతిభాశీలి అయిన సీఈఓను కోల్పోయేలా చేశారు’ అని ఇన్ఫీ సహ–చైర్మన్ రవి వెంకటేశన్ పేర్కొన్నారు. కాగా, పనయా డీల్‌పై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ మూర్తి చేసిన తాజా ఆరోపణలను ఇన్ఫీ చైర్మన్ ఆర్.శేషసాయి కొట్టిపారేశారు. కాగా, మూర్తిపై చట్టపరమైన చర్యలను శేషసాయి, రవి వెంకటేశన్లు కొట్టిపారేశారు. సరైన సమయంలో సమాధానమిస్తా తాను పదేపదే నిరాధార ఆరోపణలు చేయడం వల్లే సిక్కా గుడ్‌బై చెప్పారంటూ ఇన్ఫీ బోర్డు చేసిన వ్యాఖ్యలపై నారాయణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ‘నాకు ఎలాంటి డబ్బు ఆశలేదు. అదేవిధంగా నాకు, నా పిల్లలకుగానీ అధికార వ్యామోహం కూడా లేదు. ఎంతో శ్రమకోర్చి ఉన్నత ప్రమాణాలతో స్థాపించిన ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారుతోందనేదే నా ఆందోళనంతా. అదేవిధంగా కంపెనీ మేనేజ్మెంట్ చేపట్టిన కొన్ని కొనుగోళ్లు(పనయా ప్రధానంగా)పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తులు కూడా సరిగ్గా జరగలేదు. తూతూమంత్రంగా చేసి చేతులుదులుపుకున్నారు. నాపై బోర్డు చేసిన ఆరోపణలన్నింటికీ తగిన సమయంలో తగిన వేదికపై తగిన విధంగా సమాధానం ఇస్తా. ఇప్పుడు మాట్లాడితే నాకు అగౌరవం’ అని మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో కలత చెందా: సిక్కా గత కొద్ది నెలలుగా తనపై నిరాధార, కుట్రపూరితమైన వ్యక్తిగత దూషణలు పదేపదే జరగడం దారుణమని.. ఈ ఉదంతంతో తీవ్రంగా కలతచెందినట్లు సిక్కా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, మూర్తితోసహా ఎవరిపేరునూ ఆయన ప్రస్తావించలేదు. ‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తుల్లో తప్పని తేలింది. కంపెనీలో జరుగుతున్న గొప్ప మార్పుకు మద్దతుగా నిలవాల్సిన కొంతరు కీలక వ్యక్తులే ఈ విధమైన వ్యక్తిగత ఆరోపణలను గుప్పించడం దారుణం’ అని సిక్కా వ్యాఖ్యానించారు. అదేవిధంగా మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్‌కు ఇచ్చిన వీడ్కోలు ప్యాకేజీ భారీగా ఇచ్చారంటూ అదేపనిగా పలుమార్లు ఆరోపించడం, పనయా డీల్‌ను తప్పుబట్టడం గత కొద్ది నెలలుగా రోతపుట్టించే స్థాయికి చేరింది. ఈ రాద్ధాంతం కారణంగా నేను కొన్ని వందల గంటల విలువైన సమయాన్ని దీనిపై అనవసరంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇక దీనికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నా’ అని సిక్కా వివరించారు. కాగా, రాజీనామాపై వివరణ ఇస్తూ కంపెనీ ఉద్యోగులకు కూడా సిక్కా ఒక ఈమెయిల్ పంపారు. ‘జీవితం చాలా చిన్నది. అనవసర విషయాలపై బహిరంగంగా ఇలా వాదోపవాదనలు చేసుకోవడం ద్వారా మనం చేసే పనిపై దృష్టిని పెట్టలేకపోవడం కంటే దుర్భరం మరొకటి ఉండదు. దీనివల్ల విలువైన సమయం వృథా అవుతుంది. కంపెనీ భవిష్యత్తు వృద్ధికి అవసరమైన భారీ మార్పునకు నా వంతు చేయూతనందించేందుకు సిద్ధమే. అయితే, ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతాన్ని దాటుకొని మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది’ అని సిక్కా పేర్కొన్నారు. గ్లోబల్ టెకీ.. సిక్కా యాభై ఏళ్ల విశాల్ సిక్కా 2014 ఆగస్ట్ 1న ఇన్ఫీలో తొలి నాన్–ప్రమోటర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ముచ్చటగా మూడేళ్లుమాత్రమే ఆ పదవిలో కొనసాగిన సిక్కాకు ఐటీ రంగంలో అత్యుత్తమ కెరీర్ ఉంది. ♦ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఆయన ప్రతిభకుగాను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 1996లో సిక్కాకు పీహెచ్డీ ప్రదానం చేసింది. ♦ సిక్కా నెలకొల్పిన రెండు స్టార్టప్‌లనూ ఇతర కంపెనీలు భారీ మొత్తానికే చేజిక్కించుకున్నాయి. ♦ 2002లో జర్మనీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అగ్రగామి ఎస్ఏపీలో జాయిన్ అయ్యారు. 2007లో కంపెనీ తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ) పదవిని దక్కించుకున్నారు. ♦ విశాల్ సిక్కా... మూడేళ్ల ప్రస్థానంలో ఇన్ఫోసిస్ ఆదాయం 25 శాతం మేర ఎగబాకింది. అంతేకాదు ఏఐతో పాటు క్లౌడ్ ఇతరత్రా డిజిటల్ టెక్నాలజీలపైపు ఇన్ఫీ దృష్టిసారించేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ♦ 2014లో ఐదేళ్లపాటు సీఈఓగా నియమించారు. అయితే, సిక్కా పనితీరుపై నమ్మకం ఉంచుతూ కంపెనీ బోర్డు 2021 వరకూ(మరోరెండేళ్లు) సీఈఓగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
విశాల్ సిక్కా రాజీనామా
-
విశాల్ సిక్కాపై మూర్తి కౌంటర్ ఎటాక్
సాక్షి, న్యూఢిల్లీ : విశాల్ సిక్కా రాజీనామాతో, ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కు, వ్యవస్థాపకులకు మధ్య వివాదం మరింత ముదిరింది. రాజీనామా చేస్తూ విశాల్ సిక్కా చేసిన ఆరోపణలపై కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. విశాల్ సిక్కా చేసిన నిరాధారణమైన ఆరోపణలపై స్పందిస్తే తన గౌరవానికే భంగకరమంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్ఫోసిస్ బోర్డు రాసిన ప్రకటనంతటిన్నీ చదివినట్టు తెలిపిన మూర్తి, ఆ ఆరోపణలు చాలా బాధాకరమని కూడా ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాక సరియైన సమయంలో తగిన సమాధానమిస్తానంటూ మూర్తి చెప్పారు. 2014లో తానే స్వయంగా బోర్డు నుంచి తప్పుకున్నానని, కనీసం నగదు కూడా కోరలేదని తెలిపారు. తన పిల్లల కోసం ఇన్ఫీలో కనీసం ఎలాంటి అధికారాలను, స్థానాలను అడుగలేదని కూడా మూర్తి చెప్పారు. కాగ, కంపెనీ సీఈవో విధుల్లో తాను కొనసాగలేనని, నిరాధారమైన విషపూరిత వ్యక్తిగత దాడులను నిలువరిస్తూ తాను పనిచేయలేనని సిక్కా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ బ్లాగ్‌లో ఎవరి పేరును ఆయన పేర్కొనలేదు. కానీ నారాయణమూర్తి లాంటి హై ప్రొఫైల్ వ్యవస్థాపకులకు మధ్య తాను నలిగిన తీరును వివరించారు. గత కొంతకాలంగా కంపెనీ మేనేజ్మెంట్పై, సీఈవోగా ఉన్న విశాల్ సిక్కాపై వ్యవస్థాపకులు అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. అంతేకాక కంపెనీలో కార్పొరేట్ ప్రమాణాలు దెబ్బతింటున్నాయంటూ పలుమార్లు కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డుకి చురకలు పెట్టారు. చాలా విషయాల్లో వ్యవస్థాపకులకు, బోర్డుకు పొంతన కుదరడం లేదని పలుమార్లు బహిర్గతం కూడా అయింది. విశాల్ సిక్కాకు ఎక్కువగా పరిహారాలు చెల్లించడం, కంపెనీ నుంచి వైదొలిగిన కొందరు మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు అందించిన సెవరెన్స్ ప్యాకేజీ విషయంలోనూ వ్యవస్థాపకులు, బోర్డును ప్రశ్నించారు. -
సిక్కా ఆ విషయంలో పక్కా....
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా వైదొలగి పెను ప్రకంపనలు సృష్టించిన విశాల్ సిక్కా కంపెనీలో తన కళ్లెదుటే ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నా నిబ్బరంగా వ్యవహరించారు. ఇంత ఒత్తిడిలోనూ ఈ టెక్నోక్రాట్ కాస్త సమయం తీసుకని ట్విట్టర్లో తన హోదాను అప్డేట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు లక్షల పైచిలుకు ఫాలోయర్లు కలిగిన తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్‌లో ఎక్స్ సీఈవో ఇన్ఫోసిస్ అని అప్డేట్ చేశారు. ఇన్ఫోసిస్‌కు వీడ్కోలు పలకడం దిగ్ర్భాంతికి గురిచేసిందన్న ఫాలోయర్ దెబజాన్ మెహంతికి సిక్కా రిప్లయి కూడా ఇచ్చారు. అంతటితో ఆయన ఊరుకోలేదు. తన వ్యక్తిగత బ్లాగ్‌లో రాజీనామాకు దారితీసిన పరిస్థితులను సవివరంగా వెల్లడించారు. -
వ్యక్తిగతంగా వేధించారు: సిక్కా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా వైదొలగిన విశాల్ సిక్కా కంపెనీ వ్యవస్థాపకులపై విరుచుకుపడ్డారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, ఎన్ఆర్ నారాయణమూర్తి వంటి హై ప్రొఫైల్ వ్యవస్ధాపకులకు మధ్య తాను నలిగిన తీరును వివరించారు. కంపెనీ సీఈవో విధుల్లో కొనసాగలేనని, నిరాధారమైన విషపూరిత వ్యక్తిగత దాడులను నిలువరిస్తూ పనిచేయలేనని సిక్కా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు వివరించారు. గత కొన్ని వారాలుగా రాజీనామాపై తాను తర్జనభర్జనలు పడ్డానని, సుదీర్ఘంగా ఆలోచించిన మీదట గత కొన్ని త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు. గత మూడేళ్లుగా కంపెనీ ఎన్నో విజయాలను సాధించి, వినూత్న ఒరవడికి బాటలు వేసినప్పటికీ నిరాధార, వ్యక్తిగత దాడులు, ఆరోపణలను తట్టుకుని ఇక తాను పనిచేయలేనని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా కంపెనీ సాధించిన విజయాల్లో ఉద్యోగులందరి భాగస్వామ్యం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ ఇన్ఫోసిస్ బోర్డు, యాజమాన్యంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. నాయకత్వ మార్పిడి జరిగే వరకూ బోర్డులో ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్టు సిక్కా తెలిపారు. -
సిక్కా దెబ్బకు మార్కెట్లు ఢమాల్
ఇన్ఫోసిస్ సీఈవోగా, ఎండీగా విశాల్ సిక్కా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సిక్కా దెబ్బ మార్కెట్లకు భారీగా తగిలింది. సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ సైతం 9800 మార్కు దిగువకు దిగజారింది. మార్కెట్లో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్టు విశ్లేషకులు చెప్పారు. చివరికి సెన్సెక్స్ 270.78 పాయింట్ల నష్టంలో 31524.68 వద్ద, నిఫ్టీ 66.75 పాయింట్ల నష్టంలో 9837.40 వద్ద ముగిశాయి. మరోవైపు సిక్కా కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగడం ఆ కంపెనీ షేరును భారీగా దెబ్బతీసింది. ఇంట్రాడేలో ఆ కంపెనీ షేరు 13 శాతం మేర పడిపోయి 52 వారాల కనిష్టానికి పడిపోయింది. బైబ్యాక్ జోరుతో గురువారం సెషన్లో ఇన్ఫీ షేరు 4 శాతం మేర జోరు కొనసాగించిన సంగతి తెలిసిందే. నేడు వెలువడిన ప్రకటనతో బైబ్యాక్ జోరుకు కళ్లెం పడింది. బైబ్యాక్ ప్రతిపాదనపై రేపు(శనివారం) జరుగబోతున్న బోర్డు మీటింగ్ నేపథ్యంలో విశాల్ సిక్కా నుంచి ఈ అనూహ్య ప్రకటన వెలువడింది. గురువారం రూ.2,34,554.78 కోట్లగా ఉన్న ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్, నేటి ట్రేడింగ్‌లో రూ.2,07,553.94 కోట్లకు పడిపోయింది. అంటే సుమారు రూ.27 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. నేటి సెషన్లో రెండు సూచీల్లోనూ ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్ టాప్ లూజర్లుగా భారీగా నష్టపోతుండగా.... టీసీఎస్, హెచ్‌యూఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్ లాభాల్లో నడుస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.13 వద్ద ఉంది. -
సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్
సాక్షి, ముంబై : విశాల్ సిక్కా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. నేటి సెషన్లో ఇన్ఫోసిస్ షేరు విలువ 52 వారాల నష్టంలో 13 శాతం మేర నష్టపోయి, రూ.884.40 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేస్తోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా భారీగా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు రూ.30 వేల కోట్ల మార్కెట్ విలువను ఇన్ఫోసిస్ కోల్పోయింది. గురువారం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,34,554.78 కోట్లగా ఉంది. నేడు అది రూ.30 వేల కోట్ల మేర పడిపోయింది. ఐటీ సర్వీసు కంపెనీల్లో రెండో అతిపెద్ద దిగ్గజంగా ఉన్న ఇన్ఫోసిస్ సీఈవోగా, ఎండీగా విశాల్ సిక్కా గురువారం ఉదయం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ అన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వివాదాల నేపథ్యంలో విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సిక్కా నిర్ణయంతో ఇటు మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, చాలా పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉందని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే ఐటీ సెక్టార్ వృద్ధి రేటు మందగించింది. అంతేకాక చాలా దేశాల్లో వీసాలపై పరిమితులు విధిస్తున్నారు. ఇవన్నీ ప్రవీణ్ రావుకు సవాళ్లేనని పేర్కొన్నారు. సిక్కా వైదొలగడం ప్రస్తుతం కంపెనీకి స్వల్పకాలంగా అతిపెద్ద ఎదురుదెబ్బేనని, కానీ ఇన్ఫోసిస్ ఈ ఎదురుదెబ్బను అధిగమిస్తుందని మరికొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
విశాల్ సిక్కా రాజీనామా
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో సంచలనం చోటు చేసుకుంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రేపు బోర్డు సమావేశం జరగడానికి ముందే సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్) ప్రతిపాదనపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయన వైదొలగడం గమనార్హం. విశాల్ సిక్కా రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ సమాచారం అదించింది. సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఎన్ఆర్ నారాయణ మూర్తి సహా కొందరు ప్రమోటర్లు కొంతకాలంగా ఇన్ఫోసిస్ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ ఆరోపణలు కూడా గుప్పించారు. మరోపక్క, మోహన్‌దాస్ పాయ్ వంటి ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా యాజమాన్య నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫీలోకి మూర్తి పునరాగమనం ఖాయమన్న ఊహాగానాలు వస్తున్నాయి. కంపెనీలో మళ్లీ ఏదైనా బాధ్యతలను చేపట్టాలని నారాయణమూర్తి భావిస్తే.. పరిశీలించేందుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ఇన్ఫీ సహ–చైర్మన్ రవి వెంకటేశన్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ffffffffff -
ఇన్ఫీలో సీనియర్ల వలసలు తక్కువే
సీఈవో విశాల్ సిక్కా న్యూఢిల్లీ: మిగతా కంపెనీలతో పోలిస్తే తమ కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగుల వలసలు (అట్రిషన్) చాలా తక్కువేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా చెప్పారు. సీనియర్లు పెద్ద ఎత్తున కంపెనీని వీడిపోతున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. గ్లోబల్ హెడ్ అనిర్బన్ డే, ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ ఎండీ యూసుఫ్ బషీర్, ఈవీపీ రితికా సూరి తదితర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవలి కాలంలో నిష్క్రమించిన నేపథ్యంలో సిక్కా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ల నిష్క్రమణపై స్పందిస్తూ.. ఇదేమీ ఆందోళన కలిగించే అంశం కాదని సిక్కా చెప్పారు. ఇన్ఫోసిస్ చేతికి బ్రిలియంట్ బేసిక్స్ కాగా ఇన్ఫోసిస్ తాజాగా బ్రిలియంట్ బేసిక్స్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చిస్తున్నామన్నది చెప్పలేదు. లండన్‌కు చెందిన బ్రిలియంట్ బేసిక్స్... ప్రోడక్ట్ డిజైన్ తదితర సేవలు అందిస్తోంది. -
మూర్తి లేఖ: ఇన్ఫీలో మళ్లీ చెలరేగిన వివాదం
బెంగళూరు : మరోసారి సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, దాని వ్యవస్థాపకులకు లుకలుకలు ప్రారంభమయ్యాయి. పనాయా కొనుగోలుకు సంబంధించిన విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలంటూ ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల బోర్డు సభ్యులకు రాసిన లేఖతో మళ్లీ వివాదాలు చెలరేగాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. 200 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పనాయా విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరోపించింది. సెబీ ఆరోపణలపైనా, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజీలో తలెత్తిన వివాదం విషయంలోనూ, ప్రస్తుత సీఈవో అత్యధికమైన ఖర్చుల ఆరోపణల విషయంలోనూ కంపెనీ అంతర్గతంగా విచారణ చేపట్టింది. జూన్‌లోనే వీటిపై కంక్లూజిన్ అండ్ సమ్మరీ ఫైండింగ్ స్టేట్మెంట్ను ప్రచురించింది. పనాయా కేసు, సీఈఓ వ్యయాలు వంటి విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిర్థారణ లేదని గిబ్సన్ డన్ అండ్ క్రుచర్ అనే న్యాయ సంస్థ కూడా పేర్కొంది. కానీ మొత్తం రిపోర్టులను బహిర్గతం చేయాలని నారాయణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ రిపోర్టును అందించాలని ఆయన కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ రిపోర్టును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ రిపోర్టును బహిర్గతం చేస్తే, పనాయా ఇన్వెస్టర్లకు, దాని లిమిటెడ్ పార్టనర్లకు మధ్యనున్న క్లయింట్ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కొనుగోలుచేసిన వాటిలో పనాయా రెండో అతిపెద్ద డీల్. దీంతో మరోసారి కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు వివాదం తలెత్తినట్టు తెలిసింది. -
విశాల్‌సిక్కాకు దెబ్బ మీద దెబ్బ
బెంగళూరు : ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే కంపెనీ లార్జ్ డీల్స్ బాస్ రితికా సూరి ఇన్ఫీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో టాప్-లెవల్ ఎగ్జిక్యూటివ్ కూడా కంపెనీని వీడారు. కంపెనీ కొత్త డిజిటల్, నూతనావిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్న ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ అధినేత యూసఫ్ బషీర్ కంపెనీకి రాజీనామా చేసినట్టు తెలిసింది. 2015 మార్చిలో ఇన్ఫోసిస్‌లో చేరకముందు నుంచి బషీర్‌కు, విశాల్ సిక్కాకు ఎంతో దగ్గరి సంబంధాలున్నాయి. అప్పట్లో జర్మన్ దిగ్గజం ఎస్ఏపీలో బషీర్ కొత్త ప్రొడక్ట్‌ల వైస్-ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ లార్జ్ డీల్స్ బాస్ రితికా సూరీ కూడా ఈ మధ్యనే ఇన్ఫీకి రాజీనామా చేశారు. ఆమె కంపెనీల కొనుగోళ్ళు, విలీనాల్లో దిట్టగా వ్యవహరించేవారు. బషీర్ కూడా ఈ నెల మొదట్లోనే తన రాజీనామా పత్రాలను సమర్పించినట్టు రిపోర్టులు చెప్పాయి. ఎస్ఏపీలో అసోసియేట్ వైస్-ప్రెసిడెంట్ ర్యాంకు కలిగిన 16 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఇన్ఫోసిస్ నియమించుకున్న సంగతి తెలిసిందే. వారిలో బషీర్ కూడా ఒకరు. 2014 ఆగస్టులో విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్‌కు సీఈవోగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి గతేడాది మార్చి వరకు కనీసం తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడినట్టు తెలిసింది. రితికా సూరి, బషీర్, మరో మాజీ ఎస్ఏసీ ఎగ్జిక్యూటివ్ కలిసి, ఇన్ఫోసిస్ కొత్త డిజిటల్ వరల్డ్‌కు ఎంతో సహకరించారు. రితికా సూరి, మూడు కొనుగోళ్లను విజయవంతంగా పూర్తిచేస్తే, బషీర్ 12 స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లను చేపట్టారు. కానీ గత ఏడాదిగా కంపెనీలో ఎలాంటి మేజర్ డీల్స్ లేవు. గతేడాది జూలైలో రితికా సూరి ఎంఅండ్ఏ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి కొనుగోళ్లను చేపట్టలేదు. బషీర్ చివరి ఇన్వెస్ట్మెంట్ కూడా 2016 డిసెంబర్లోనే. ఇక అప్పటి నుంచి ఎలాంటి లావాదేవీలు లేవు. -
ఇన్ఫీ సీక్రెట్స్ బయటపెట్టిన విశాల్ సిక్కా
న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తమ కంపెనీ సీక్రెట్లను బయటపెట్టారు. భవిష్యత్తులో తమ కంపెనీ వృద్ది కోసం వేటివేటిపై దృష్టిసారించనున్నారో జూన్ క్వార్టర్ ఫలితాల సమీక్ష సందర్భంగా వెల్లడించారు. తమ రెవెన్యూలను పెంచుకోవడానికి ఎక్కువగా కొత్త టెక్నాలజీపై ఫోకస్ చేయనున్నట్టు చెప్పారు. రోబోటిక్స్, ఏఐ, డ్రైవర్‌లెస్ కార్లు వీటిలో ప్రధానమైనవిగా వివరించారు. మైసూర్లో ఉన్న సంస్థ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో పూర్తిగా డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికే కేటాయించినట్టు చెప్పారు. ఎవరు చెప్పారు తాము ట్రాన్సఫర్మేటివ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయమని అని ప్రశ్నించారు. డ్రైవర్‌లెస్ కారు తాము ఎక్కువగా ఫోకస్ చేసిన టెక్నాలజీలో ఒకటని, తమ రెవెన్యూలో 10 శాతం కొత్త టెక్నాలజీలు, సర్వీసుల నుంచే వచ్చాయని పేర్కొన్నారు. తాము రెవెన్యూలు ఆర్జించిన ఈ సర్వీసులు, టెక్నాలజీలు రెండేళ్ల క్రితం అసలు మార్కెట్లో లేనేలేవని వెల్లడించారు. దీంతో వీటిపై తాము ఎక్కువగా దృష్టిసారించినట్టు చెప్పారు. స్వతంత్ర, అనుసంధాన వాహనాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తామని సిక్కా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వ్యాపార అవకాశాల ప్రాజెక్టులలో పనిచేసే సామర్థ్యమున్న వేలకొద్దీ ఇంజనీర్లను సృష్టిస్తున్నట్టు కూడా తెలిపారు. కాగ, శుక్రవారం ఉదయం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు రూ.3,483 కోట్లగా నమోదుచేసింది. అంచనాల ప్రకారం ఇన్ఫీకి రూ.3,429 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయని విశ్లేషకులు భావించారు. -
ఐటీ కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు
ముంబై: ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన పాలనలో భారతీయ ఐటీ కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో భారత ఐటీ కంపెనీలకు అక్కడ ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందంటూ భరోసా ఇచ్చారు. వినూత్న పథకాలతో అమెరికాలోని కొత్త ప్రభుత్వం అద్భుత అవకాశాలను సృష్టింస్తోందన్నారు. ఐటి సంక్షోభంలో పడిందన్న నివేదికలను ఆయన తిరస్కరించారు. మరిన్ని అవకాశాలు రానున్నాయని ఒక ఇంటర్వ్యూలో పిటిఐకి చెప్పారు. ట్రంప్ పరిపాలన లో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పీటీఐ ప్రశ్నించినట్టు తాను ఆ విధంగా భావించడం లేదని సిక్కా చెప్పారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి కొనసాగినంతవరకూ, నూతన రంగాల్లో విలువైన సేవలు అందించినంతవరకు ఇది పెద్ద సమస్యకాదని తాను భావిస్తున్నాన్నారు. బిజినెస్ ఫ్రెండ్లీ, పారిశ్రామికవేత్త ట్రంప్ ఆధ్వర్యంలో అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయని విశాల్ సిక్కా చెప్పారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. గమెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాపై పట్టుసాధిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికాలో ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని ఆయన హామీ ఇచ్చారు. తన మూడు సంవత్సరాల అనుభవం (ఇన్ఫోసిస్‌లో) భారతీయ యువత ఈ మార్పుకోసం సిద్ధంగా ఉందనే విశ్వాసాన్ని విశాల్ సిక్కా వ్యక్తం చేశారు. గత మూడున్నర దశాబ్దాల్లో భారతీయ ఐటి కంపెనీలు అసాధారణ పురోగతి సాధించాయన్నారు. -
ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అనేక సమస్యలు, విమర్శలతో చిక్కుల్లో పడిన దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట లభించింది. అమెరికా ఆధారిత సంస్థ పనయ కొనుగోలు విషయంలో నెలకొన్న వివాదంలో ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ క్లీన్ ఇచ్చింది. పనయా ఒప్పందంలో అసంబద్ధతలపై ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలేవీ దర్యాప్తు సంస్థకు లభించలేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలిందని ఇన్ఫీ శుక్రవారం ప్రకటించింది. కాగా 2015 ఫిబ్రవరి లో, ఇన్ఫోసిస్ ఇజ్రాయిల్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థను 200 మిలియన్ డాలర్లు లేదా రూ .1,250 కోట్లు నగదుకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి అజ్ఞాత మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందాయి. అయితే పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా వివరణ ఇచ్చారు. అనంతరం గిబ్సన్ డన్ అండ్ కంట్రోల్ రిస్క్స్ ద్వారా అంతర్గత దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రిపోర్టులపై ఇన్ఫోసిస్ రియాక్షన్...
దేశ కార్పొరేట్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల స్టేక్ అమ్మకం విషయంపై తొలిసారి కంపెనీ నుంచి గట్టి స్పందనే వచ్చింది. ఇన్ఫీ సీఈవో విశాల్ సిక్కా దీనిపై స్పందించారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తానని, కానీ ఎన్ఆర్ నారాయణమూర్తినే ఈ అమ్మక విషయాన్ని కొట్టిపారేస్తున్నారని చెప్పారు. ఇవి కేవలం మీడియా రూమర్లు లేదా నిందలేనని తేల్చిచెప్పినట్టు పేర్కొన్నారు. '' ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, ముఖ్యంగా ఎన్ఆర్ నారాయణమూర్తి చాలా ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వ్యక్తి. చాలా హుందాతనంగా నడుచుకుంటారు. భారతీయులందరికీ ఆయన హీరో, భారతీయులకే కాక చాలామందికి ఆయన ఆదర్శం. ముఖ్యంగా మూర్తి విషయాన్ని తీసుకుంటే, మూర్తినే నన్ను నియమించుకున్నారు. ఆయన వల్లే నేను ఇన్ఫోసిస్ లోకి వచ్చాను. వారు తీసుకునే ఏ నిర్ణయానైనా నేను విశ్వసిస్తాను, కట్టుబడి ఉంటాను'' అని సిక్కా చెప్పారు. మూర్తినే ఈ అమ్మక రూమర్లను కొట్టిపారేస్తున్నారని సిక్కా పేర్కొన్నారు. ఈ రూమర్లను మరింత విస్తరించవద్దని తను, తన కొలిగ్స్ కలిసి కోరుకుంటున్నట్టు సిక్కా అభ్యర్థించారు. ఈ రూమర్లు ఇటీవల కాలంలో తమకు చాలా ప్రతికూలంగా మారుతున్నాయని, బిజినెస్ లను దెబ్బతీస్తున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, బోర్డు సభ్యులకు ఇటీవల చోటుచేసుకున్న లుకలుకలతో ఈ అమ్మక రిపోర్టులు వచ్చాయి. మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ అత్యధిక సెవరెన్స్ వేతనం, ప్రస్తుత సీఈవో, సీఓఓల భారీ వేతన పెంపులో కార్పొరేట్ ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఇన్ఫీ వ్యవస్థాపకులు బహిరంగంగానే కంపెనీ యాజమాన్యంపై మండిపడ్డారు. -
భారీగా తగ్గిన విశాల్ సిక్కా వేతనం
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా వేతనం భారీగా తగ్గింది. తక్కువ బోనస్ చెల్లింపులతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో సిక్కాకు చెల్లించే వేతనం 67 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టులో విశాల్ సిక్కాకు నగదు కింద చెల్లించే వేతనం రూ.16.01 కోట్లేనట. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో ఆయన రూ.48.73 కోట్లను పొందారు. అదేవిధంగా స్టాక్ గ్రాంట్స్, రిటైరల్ ప్రయోజనాలరూపంలో సిక్కాకు ఇచ్చే మొత్తం పరిహారాలు కూడా 7 శాతం పడిపోయి, రూ.45.11 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థికసంవత్సరంలో వీటి కింద రూ.48.41కోట్లను పొందారు. అయితే సిక్కా బేస్ శాలరీ 9 లక్షల డాలర్ల(రూ.5,82,45,750) నుంచి 10 లక్షల డాలర్ల(రూ.6,47,08,500)కు పెరిగింది. ఈయన బోనస్ లు, ఇతర ప్రోత్సహకాలు మాత్రం 0.82 మిలియన్ డాలర్లకు(రూ.5,30,60,970) తగ్గాయి. అదేవిధంగా నియంత్రిత స్టాక్ యూనిట్లను కూడా గతేడాది మాదిరిగా 2 మిలియన్ డాలర్లను మాత్రమే ఇచ్చారు. పనితీరు ఆధారితంగా ఇచ్చే స్టాక్ ప్రోత్సహకాలు గతేడాది ఏమి లేకపోగా, ఈ ఏడాది 2.88 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కాగ ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు పరిహారాలు భారీగా పెరుగగా, ఇదే సమయంలో విశాల్ సిక్కాకు చెల్లించే మొత్తం పరిహారాలు తగ్గినట్టు వార్షిక రిపోర్టులో తెలిసింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు మొత్తం వేతనం రూ.8.14 కోట్ల నుంచి రూ.11.80 కోట్లకు పెరిగింది. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవికుమార్ ఎస్ వేతనం కూడా రూ.8.27 కోట్ల నుంచి రూ.14.87కోట్లకు పెరిగింది. -
ఇన్ఫీ అమెరికా బాట!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఫలించింది. వచ్చే రెండేళ్లలో పది వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తామని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా వివిధ మీడియా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాపై విదేశీ కార్మికులను రప్పించి స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు దక్కకుండా చేయడాన్ని అనుమతించబోమనే హామీపై అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ ఈ వీసా కార్యక్రమాలను కట్టడిచేస్తూ నిర్ణయాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఉద్యోగులనే నియమించక తప్పని పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ ఎంచుకున్న ‘కొత్త దారి’లో మిగిలిన ఐటీ దిగ్గజాలూ పయనిస్తాయని సిక్కా మాటలు సూచిస్తున్నాయి. అమెరికా వత్తిడి కాదు– ఇనోవేషన్ కేంద్రాల ఏర్పాటు కోసమే హెచ్1బీ వీసాల ద్వారా అమెరికన్ల ఉద్యోగాలు ఇతరులు కొల్లగొట్టకుండా ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన వత్తిడితో తాము అమెరికన్లకు ఉద్యోగాలివ్వడం లేదనీ, మారిన పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటుచేసే నాలుగు టెక్నాలజీ, ఇనోవేషన్(నవకల్పన) కేంద్రాలు కూడా దీనికి కారణమని సిక్కా చెప్పారు. అయితే, హెచ్1బీ వీసాల కేటాయింపునకు నిర్వహించే లాటరీకి టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వేలాది అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా పంపి సగానికి పైగా ఈ వీసాలు కైవసం చేసుకున్నాయని, లాటరీ ప్రక్రియను ఇవి ‘రిగ్’ చేశాయని కూడా అమెరికా సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అనుసరిస్తున్న ‘గ్లోబల్ డెలివరీ మోడల్’ను సమీక్షించి స్థానిక నిపుణుల సేవలు వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిక్కా వివరించారు. హెచ్1బీ వీసాలతో తక్కువ జీతాలు! ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు హెచ్1బీ వీసాలతో తక్కువ జీతాలిచ్చి ఇండియా నుంచి సిబ్బందిని అమెరికాకు తరలిస్తున్నాయి. ఇన్ఫీ సగటున ఒక్కో హెచ్1బి వీసా దరఖాస్తుదారుకు 81,705 డాలర్ల వేతనాన్ని కిందటేడాది ఇవ్వజూపిందని మైవీసాజాబ్స్.కామ్ వెల్లడించింది. అయితే, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అత్యంత భారీ గ్లోబల్ టెక్ కంపెనీలు సగటున 1,30,000 డాలర్లు ఆఫర్ చేశాయి. అమెరికాలో స్థానికులు కాని 25 వేలమంది విదేశీ సిబ్బంది ఇన్ఫోసిస్ కేంపస్‌లలో పనిచేస్తున్నారు. వారికిచ్చే జీతాలు హెచ్1బీ వీసాలతో నడిచే ఇతర 55 ఔట్సోర్సింగ్ కంపెనీలతో పోల్చితే తక్కువే. సిక్కా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవడానికి ట్రంప్ అనుకూల నిర్ణయాలు ప్రకటించిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, అలీబాబా హోల్డింగ్స్ ఆసియా దిగ్గజాల జాబితాలో ఇప్పుడు ఇన్ఫోసిస్ చేరింది. ఇప్పటికే అమెరికాలో అత్యంత ప్రతిభావంతులను ఎంపికచేసి భారీ జీతాలతో ఉద్యోగాలిస్తే ఇన్ఫోసిస్ వేతనవ్యయం పెరిగినాగాని, యాక్సెంచర్, ఐబీఎం వంటి అమెరికా ఐటీ దిగ్గజాలతో పోటీపడే స్థాయికి అది ఎదుగుతుందని అంచనా. (సాక్షి నాలెడ్డ్ సెంటర్) -
ఐటీ ఇండస్ట్రీకి విశాల్ సిక్కా గుడ్ న్యూస్
ముంబై : ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా.. ఇటీవల చేసిన కామెంట్లు ఇండస్ట్రీపై ఆశలు పెంచుతున్నాయి. 2014-15 రెండో క్వార్టర్ నుంచి మొదటిసారి ఐటీ రంగంలో ధర స్థిరత్వం ఉన్నట్టు సిక్కా చెప్పారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి పాజిటివ్ డెవలప్ మెంట్ అని బ్రోకరేజ్ యూబీఎస్ అభివర్ణించింది. విశాల్ సిక్కా చేసిన కామెంట్ తో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీలలో భారీ ఎత్తున ఐటీ బడ్జెట్ పెరుగుతాయని, ముఖ్యంగా అమెరికాలో పెరుగుతాయని బ్రోకరేజ్ తెలిపింది. భారతీయ ఐటీ వెండర్స్ కు మేజర్ క్లయింట్స్ గా అమెరికానే ఉండటం విశేషం. 2017లో ఇండస్ట్రి వృద్ధికి కూడా ఇది సహకరించనున్నట్టు పేర్కొంది. మంచి డిమాండ్ పరిస్థితులను ఈ ధర స్థిరత్వ వాతావరణం సూచిస్తుందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. ఆటోమేషన్, వీసా సమస్యలు, రూపాయి విలువ పెరగడం మాత్రమే కాక, సాంప్రదాయ ఐటీ సర్వీసు బిజినెస్ లలో ఒకానొక ప్రధాన సమస్యలో ధరల ఒత్తిడి కూడా ఒకటి. ఈ సమస్యలతో 2016లో బీఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 5.5 శాతం పడిపోయింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 12.4 శాతం పైకి ఎగిసింది. కానీ ప్రస్తుతం ధరల స్థిరత్వం ఏర్పడటం సానుకూల అంశమని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. -
తగ్గిన ఇన్ఫోసిస్ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ
► 2015–16లో రూ.48.73 కోట్లు ► 2016–17లో రూ.43 కోట్లు న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ గత ఆర్థిక సంవత్సరానికి రూ.43 కోట్లు(66.8 లక్షల డాలర్లు)గా ఉంది. ఆయనకు వాగ్దా నం చేసిన వేతన ప్యాకేజీ(1.10 కోట్ల డాలర్లు)లో ఇది 61 శాతం. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరంలో ఆయన పొందిన వేతన ప్యాకేజీ (రూ. 48.73 కోట్లు) కంటే కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన పొందిన వేతన ప్యాకేజీ తక్కువగానే ఉండడం విశేషం. ఈ వేతన ప్యాకేజీలో మూల వేతనం, వేరియబుల్ పే, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్ఎస్యూ), పెర్ఫామెన్స్ స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి విశాల్ సిక్కా పొందిన 66.8 లక్షల డాలర్ల వేతన ప్యాకేజీలో మూల వేతనం కాకుండా 8.2 లక్షల డాలర్ల వేరియబుల్ పే, 19 లక్షల డాలర్ల ఆర్ఎస్యూలు, 9.6 లక్షల డాలర్ల ఈసాప్స్.. ఈ మొత్తం 36.8 లక్షల డాలర్లుగా ఉంది. 70.8 లక్షల డాలర్లుగా ఉన్న విశాల్ సిక్కా వేతనాన్ని ఇన్ఫోసిస్ కంపెనీ గత ఏడాది ఏప్రిల్‌లో 1.1 కోట్ల డాలర్లకు సవరించింది. విశాల్ సిక్కా వేతన విషయమై కం పెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
విశాల్ సిక్కా జీతం తగ్గిందా?
ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కాకు జీతం చాలా ఎక్కువగా ఇస్తున్నారని చాలామంది అంటుంటారు. కానీ, 2016-17 సంవత్సరానికి ఆయనకు అందిన వేరియబుల్ పే ఎంతో తెలుసా.. కేవలం 46 శాతం మాత్రమే. సాధారణంగా ఉద్యోగుల వేతనంలో కొంత భాగాన్ని వేరియబుల్ పే అని పక్కన పెడతారు. ఆ సంవత్సరంలో వారి పనితీరు ఆధారంగా అందులో ఎంత శాతం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇన్ఫోసిస్‌లో అయితే ఫస్ట్ గ్రేడ్ వచ్చినవారికి నూరుశాతం వేరియబుల్ పే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఈఓ విశాల్ సిక్కాకే 46% వేరియబుల్ పే మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2016-17 సంవత్సరంలో మొత్తం 51 కోట్ల వేరియబుల పే రావాల్సి ఉండగా, అందులో ఆయనకు కేవలం 24 కోట్లు మాత్రమే వచ్చింది. అదికాక ఆయన స్థిరవేతనం మరో రూ. 19 కోట్లు. దాంతో ఈ ఏడాది మొత్తం సుమారు 43 కోట్ల రూపాయలు సంపాదించినట్లయింది. 2015-16లో వచ్చిన 48 కోట్ల కంటే ఇది 5 కోట్ల రూపాయలు తక్కువ. విశాల్ సిక్కాకు వేతనం పెరిగిందని చాలామంది భావించినా, వాస్తవానికి అది వేరియబుల్ పేలో పెంపు మాత్రమేనని కంపెనీ బోర్డుతో పాటు స్వయంగా సిక్కా కూడా చాలాసార్లు చెప్పారు. లక్ష్యాలను పూర్తిగా సాధిస్తేనే పూర్తి మొత్తం చెల్లిస్తారు. అయితే ఆ లక్ష్యాలేంటనే విషయాన్ని మాత్రం కంపెనీ బహిరంగపరచలేదు. శుక్రవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో ఆదాయ వృద్ధి కేవలం 3.4 శాతం ఉండటంతో పాటు లాభాల్లో వృద్ధి అసలు లేకపోవడం లాంటివి కూడా సిక్కా వేతనం మీద ప్రభావం కనబర్చి ఉంటాయని భావిస్తున్నారు. -
ఇన్ఫీ బోణీ.. ప్చ్!
క్యూ4 లాభం రూ.3,603 కోట్లు...; వృద్ధి నిల్! ► ఆదాయం రూ.17,120 కోట్లు; 3.4% వృద్ధి ► సీక్వెన్షియల్‌గా ఆదాయం, లాభాలు డౌన్ ► ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌లో భారీ కోత... ► రూ. 14.75 చొప్పున తుది డివిడెండ్ ► డివిడెండ్, షేర్ల బైబ్యాక్ కోసం రూ.13,000 కోట్లు కేటాయింపు బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ చేసింది. వ్యవస్థాపకుల ఒత్తిడితో ఒకపక్క ఇన్వెస్టర్లకు డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్ రూపంలో భారీమొత్తంలోనే కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. కంపెనీ పనితీరు మాత్రం నిరాశకు గురిచేసింది. దీనికితోడు.. ఈ ఏడాది(2017–18) ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) భారీగా తగ్గించేయడం కూడా మార్కెట్‌కు రుచించలేదు. దీంతో గురువారం ఒక్కరోజే కంపెనీ షేరు ధర 4 శాతంపైగా దిగజారింది. ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (2016–17, క్యూ4) రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే.. వృద్ధి పూర్తిగా అడుగంటి 0.2 శాతానికి పడిపోయింది. మొత్తం ఆదాయం 3.4 శాతం వృద్ధితో రూ.17,120 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.16,550 కోట్లుగా ఉంది. ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్లో అనిశ్చితికి తోడు.. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా బలపడటం రాబడులపై ప్రభావం చూపినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీక్వెన్షియల్‌గా క్షీణత...: గడిచిన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.3,708 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో 2.8 శాతం క్షీణించింది. అదేవిధంగా ఆదాయం కూడా క్యూ3లో నమోదైన రూ.16,969 కోట్లతో పోలిస్తే 0.9% దిగజారింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో రూ.3,570 కోట్ల నికర లాభాన్ని, రూ.17,235 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, డాలరు ప్రాతిపదికన నికర లాభం మార్చి క్వార్టర్లో 1.8% వృద్ధి చెంది 543 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయం 5% వృద్ధి చెంది 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి ఏడాదికి కంపెనీ డాలరు ఆదాయం 7.4% పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. నికర లాభం 4.3% వృద్ధి చెంది 2.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గైడెన్స్ డీలా... ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాల(గైడెన్స్)ను తగ్గించేసింది. డాలరు ప్రాతిపదికన ఆదాయ గైడెన్స్ 6.1 శాతం నుంచి 8.1 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే.. 6.5–8.5 శాతం ఉండొచ్చని గైడెన్స్‌ను ప్రకటించింది. విశ్లేషకులు అంచనా వేసిన 7–9 శాతం గైడెన్స్ కంటే ఇది తక్కువే. కాగా, రూపాయిల్లో చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫీ 2.5–4.5 శాతంగా ప్రకటించింది. 2016–17 పూర్తి ఏడాదికి డాలర్లలో ఆదాయ వృద్ధి 7.4 శాతం, రూపాయిల్లో ఆదాయ వృద్ధి 9.7 శాతం కావడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఒక్కోషేరుపై రూ.14.75 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. దీంతో కలిపితే పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.25.75గా లెక్కతేలుతుంది. అంటే వాటాదారులకు డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.7,119 కోట్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ⇒ క్యూ4లో కంపెనీ మార్జిన్లు 49 బేసిస్ పాయింట్లు తగ్గి 24.60 శాతంగా నమోదయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్లో కంపెనీ కొత్తగా 6 భారీ కాంట్రాక్టులను దక్కించుకుంది. వీటి విలువ 806 మిలియన్ డాలర్లు. ⇒ ఉత్తర అమెరికా వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా 1.3 శాతం వృద్ధి నమోదైంది. ఇక యూరప్ వ్యాపారం 1.6 శాతం క్షీణించింది. భారత్ వ్యాపారంలో కూడా 5.4 శాతం క్షీణత నమోదైంది. మిగతా దేశాలకు సంబంధించి ఆదాయం 0.8 శాతం పెరిగింది. ⇒ అనుబంధ కంపెనీలతో కలిపితే మార్చి క్వార్టర్లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 17.1 శాతానికి తగ్గింది. క్రితం క్వార్టర్లో ఇది 18.4 శాతంగా ఉంది. అయితే, 2016–17 పూర్తి ఏడాదికి మాత్రం అట్రిషన్ రేటు 19.2%కి పెరిగింది. 2015–16లో ఇది 18.7%గా ఉంది. ⇒ క్యూ4లో నికరంగా కంపెనీ 601 మంది ఉద్యోగులను జతచేసుకుంది. దీంతో మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,00,364కు చేరింది. నిరుత్సాహకరమైన ఫలితాలు, గైడెన్స్ నేపథ్యంలో ఇన్ఫీ షేరు గురువారం బీఎస్ఈలో ఇంట్రాడేలో 4% పైగా దిగజారి రూ.927 కనిష్టాన్ని తాకింది. చివరకు 3.8% నష్టపోయి రూ.931 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.8,590 కోట్లు ఆవిరై... రూ.2,13,937 కోట్లకు పడిపోయింది. సీజనల్‌గా కాస్త నిస్తేజమైన త్రైమాసికం కావడంతోపాటు అనుకోనివిధంగా ఎదురైన కొన్ని నిర్వహణపరమైన సవాళ్లు, అవాంతరాలు కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా అధిగమించేందుకు వీలుగా తగిన వ్యూహాలను అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. ఈ దిశగా అనేక సానుకూల సంకేతాలు కనబడుతున్నాయి. ఉద్యోగుల వలసలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీర్ఘకాలంలో వాటాదారులకు మరింత విలువను చేకూర్చడమే మా లక్ష్యం. ఇక గడిచిన 15 ఏళ్లలో టెక్నాలజీ పరిశ్రమకు సంబంధించి వీసాల పాత్ర చాలా పటిష్టం కావడంతో పాటు గణనీయంగా పెరిగింది. అయితే, తాజాగా నెలకొన్న వీసా ఇబ్బందులను(అమెరికా అధ్యక్షడు ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధిస్తున్న కఠిన నిబంధనల గురించి మాట్లాడుతూ) ఐటీ పరిశ్రమ తప్పించుకోలేదు. దీనికి అనుగుణంగా ముందుకెళ్లాల్సిందే. ఈ విధమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానిక, గ్లోబల్ స్థాయిలో నిపుణులను తగిన రీతిలో నియమించుకోవాల్సిన అవసరం నెలకొంది . – విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ కొత్త డివిడెండ్ పాలసీ.. రూ.13,000 కోట్ల బైబ్యాక్! కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచాలంటూ గత కొంతకాలంగా ఇన్ఫీ వ్యవస్థాపకులు, మాజీ సీనియర్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల కోసం(లేదా ఈ రెండింటికి కలిపి) రూ.13,000 కోట్లు వెచ్చించనున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కొత్త డివిడెండ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ నికర లాభాల్లో సగాన్ని డివిడెండ్ల కోసం ఇచ్చే విధానం ఉంది. ఈ ఏడాది నుంచి అమలయ్యే కొత్త పాలసీ మేరకు వార్షికంగా ఉండే ‘ఫ్రీ క్యాష్ ఫ్లో’లో 70 శాతాన్ని ఇన్వెస్టర్లకు డివిడెండ్ల కోసం కేటాయించనున్నారు. ఇన్ఫోసిస్ వద్ద ప్రస్తుతం 6 బిలియన్ డాలర్ల మేర నగదు నిల్వలున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కాగ్నిజెంట్ సహా పలు దేశీ ఐటీ కంపెనీలు ఇటీవల వరుసపెట్టి షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ప్రకటించిన మొత్తాన్ని పూర్తిగా షేర్ల బైబ్యాక్ కోసం వినియోగిస్తారా లేదా డివిడెండ్లతో కలిపి ఖర్చుచేస్తారా అనే విషయాన్ని ఇన్ఫోసిస్ స్పష్టంగా వెల్లడించలేదు. కో–చైర్మన్‌గా రవి వెంకటేశన్ ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న రవి వెంకటేశన్‌ను కో– చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలి పింది. కంపెనీలో కార్పొరేట్ గవర్నె న్స్ దిగజారిందంటూ ఇన్ఫీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2011 ఏప్రిల్ నుంచి వెంకటేశన్ ఇన్ఫీ బోర్డులో కొనసాగుతున్నారు. ‘బోర్డు విధుల్లో తగిన సహకారం అందించడంతో పాటు కంపెనీ వ్యూహాల అమలులో యాజమాన్యానికి రవి ఇక నుంచి మరింత చేదోడుగా నిలవనున్నారు’ అని ఇన్ఫీ చైర్మన్ ఆర్.శేషసాయి వ్యాఖ్యానించారు. రవిని ఈ పదవికి ప్రమోటర్లెవరూ సూచించలేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారిందని, బోర్డును ప్రక్షాళన చేయాలంటూ ఇటీవల ప్రమోటర్లు చేసిన ఆరోపణలకు ఈ నియామకానికి ఎలాంటి సంబంధం లేదని శేషసాయి చెప్పారు. -
పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా
న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్ పంపారు. ఆటోమేషన్ కంపెనీ పనయను ఇన్ఫోసిస్ రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది. వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని, కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. -
'నేను వచ్చాక ఇన్ఫీ రెవెన్యూలు పెరిగాయ్'
ముంబై : ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులకు నెలకొన్న వివాద నేపథ్యంలో కంపెనీ సీఈవో విశాల్ సిక్కా సోమవారం ఇన్వెస్టర్లలో వీడియో కాన్ఫరెన్సీ నిర్వహించారు. తాను కంపెనీ సీఈవోగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ రెవెన్యూలు ప్రతి త్రైమాసికంలోనూ 400 మిలియన్ డాలర్ల(రూ. 2,677కోట్లకు )కు పెరిగినట్టు చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కంపెనీ స్థిరమైన మార్జిన్లను ఆర్జించిందన్నారు. కంపెనీ కోర్ ఐటీ సర్వీసుల వ్యాపారాలు స్థిరంగా వృద్ధి చెందాయని పెట్టుబడిదారులకు చెప్పారు. నూతానావిష్కరణ, ఆటోమేట్పై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఆటోమేషన్తో ఉద్యోగాలకు భారీగా ఎఫెక్ట్ చూపుతుందన్నారు. టెక్నాలజీ నిరంతరాయంగా మార్పులను చోటుచేసుకుంటుందని, వాటిని మనం స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కంప్యూటర్ ప్రొసెసింగ్ స్పీడ్‌లో అడ్వాన్స్లోకి రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో మంచి వృద్ధిని సాధించవచ్చన్నారు. ఇవి బిజినెస్ అవకాశాలను పెంచుతుందని పెట్టుబడిదారులకు వివరించారు. కంపెనీ సహవ్యవస్థాపకులతో తన సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయని సిక్కా చెప్పారు. క్వాంటమ్ ఫిజిక్స్, టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై నారాయణమూర్తితో చర్చిస్తుంటానన్నారు. కంపెనీలో వ్యవస్థాపకుల స్టాక్ 13 శాతముంది. మరోవైపు కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్‌కు ఎక్కువ వేతనం చెల్లించారనే విషయంపై వచ్చిన వాదనలు ఇన్ఫోసిస్ చైర్మన్ శేషసాయి క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రూ.17 కోట్ల వేతనం చెల్లించలేదని తెలిపారు. ఆయనకు చెల్లించాలని నిర్ణయించిన వేతనం రూ.17.38 కోట్లలో కేవలం రూ.5.2 కోట్లే చెల్లించినట్టు స్పష్టీకరించారు. -
ఇన్ఫీలో లుకలుకలకు ఫుల్ స్టాప్?
కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ ఇటీవల ఇన్ఫోసిస్ బోర్డులో నెలకొన్న లుకలుకలపై ఆ దిగ్గజ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ఫౌండర్ చైర్మన్ నారాయణమూర్తి ఇక ఫుల్‌స్టాఫ్ చెప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బోర్డుతో నెలకొన్న ఫైటింగ్‌కు ఇక ఇక్కడితో స్వస్తి చెప్తామని నారాయణమూర్తి పేర్కొనట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల తలెత్తిన ప్రశ్నలపై కంపెనీ ఓ డీల్ చేపడుతుందని మూర్తి చెప్పినట్టు సమాచారం. ఇన్ఫోసిస్ కంపెనీ కార్పొరేట్ నైతిక ప్రమాణాలు(గవర్నెన్స్) దిగజారాయని స్వయాన నారాయణ మూర్తే పేర్కొనడంతో ఆ లుకలుకలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. సీఈఓ విశాల్ సిక్కాకు వేతన ప్యాకేజీని భారీగా పెంచడం, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్ద మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీని ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు అభ్యంతరం వ్యక్తం చేశారంటూ వార్తలు గుప్పుమనడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అయితే, విశాల్ సిక్కా పనితీరుపై నారాయణమూర్తి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ వ్యవహారం ఆయనకు సంబంధించింది కాదన్నారు. '' ఇక ఇక్కడితో ఆపుద్దాం. కంపెనీ ఎక్కువగా వేతనాలు చెల్లించడం వ్యవస్థాపకుల్ని తికమకలో పడేసింది. ప్రస్తుతం దీనిని పరిష్కరించుకుద్దాం. నా దగ్గర సమయం లేదు. బోర్డు కాని, మేనేజ్మెంట్ కాని ఈ విషయంపై సమయం వెచ్చిచవద్దు'' అని మూర్తి చెప్పినట్టు రిపోర్టులు వస్తున్నాయి. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య నెలకొన్న పరిస్థితులు వృద్ధిని మందగించేలా చేస్తాయని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ కంపెనీపై ప్రభావం చూపుతుందని మూర్తి ఆందోళన వ్యక్తంచేశారట.. సహవ్యవస్థాపకుల కమ్యూనికేషన్లను హ్యాండిల్ చేయడానికి కంపెనీ ఓ న్యాయసంస్థను ఏర్పాటుచేసిన వెంటనే, మూర్తి సంధికి పిలుపునివ్వడం గమనార్హం. -
ఔను.. ఇన్ఫీలో లుకలుకలు నిజమే!
కంపెనీలో కార్పొరేట్ నైతికత దిగజారింది.. • బాంబు పేల్చిన నారాయణ మూర్తి... • అలాంటిదేమీ లేదంటున్న కంపెనీ బోర్డు • కొన్ని అంశాల్లో ప్రమోటర్లకు బోర్డుకు మధ్య విభేదాలున్నాయన్న కిరణ్ షా • సీఈఓ విశాల్ సిక్కాకు బోర్డు సభ్యుల సంపూర్ణ మద్దతు బెంగళూరు: దేశీ కార్పొరేట్ రంగంలో ఉన్నత ప్రమాణాలకు నెలవైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో బోర్డు రూమ్ యుద్ధం నిజమేనన్న విషయం బట్టబయలైంది. కంపెనీ ప్రమోటర్లకు, బోర్డు సభ్యుల మధ్య అగ్గి రాజుకుందన్నది ఊహాగానాలు కాదని.. వాస్తవమేనని తేలిపోయింది. కంపెనీలో కార్పొరేట్ నైతిక ప్రమాణాలు(గవర్నెన్స్) దిగజారాయని.. స్వయంగా కంపెనీ కీలక వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి బాంబు పేల్చడంతో లుకలుకలు తీవ్రరూపం దాల్చాయి. బోర్డుకు, ప్రమోటర్లకు మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతోంది. సీఈఓ విశాల్ సిక్కాకు వేతన ప్యాకేజీని భారీగా పెంచడం, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్ద మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీని ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ ఊహాగానాలేనంటూ కొట్టిపారేసిన కంపెనీ సిక్కా.. మూర్తి వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారో వేచిచూడాల్సి ఉంది. కాగా, కార్పొరేట్ ప్రమణాల అమల్లో లోపాలు ఉన్నాయన్న వాదనలను ఇన్ఫోసిస్ కొట్టిపారేసింది. బోర్డును ప్రక్షాళన చేయాల్సిందే... ఇన్ఫీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా తర్వాత వీడ్కోలు ప్యాకేజీ కింద దాదాపు రూ. 23 కోట్ల భారీ మొత్తాన్ని బోర్డు ఆఫర్ చేయడం తెలిసిందే. మరో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కెన్నడీకి కూడా రూ.5.85 కోట్ల రాజీనామా ప్యాకేజీ ఇచ్చారు. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా వార్షిక వేతన ప్యాకేజీని ఇప్పుడున్న 7.08 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 11 మిలియన్ డాలర్లకు పెంచేందుకు బోర్డు ఓకే చెప్పింది. ఇష్టానుసారంగా ఇలా భారీ ప్యాకేజీలను ఆమోదించడాన్ని నారాయణమూర్తితో పాటు ఇతర కీలక వ్యవస్థాకులు నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్ గట్టిగా వ్యతిరేకించినట్లు ఇప్పుడు తేటతెల్లమైంది. ఎంతో గొప్ప ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఇన్ఫోసిస్‌లో ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చూస్తుంటే బాధ కలుగుతోందని నారాయణ మూర్తి ఒక బిజినెస్ దిన పత్రిక, టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించారు. బోర్డులో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మూర్తి ఏమన్నారంటే... ‘ఉన్నత కార్పొరేట్ ప్రమాణాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మేం(ఇన్ఫోసిస్) ఎన్నో అవార్డులు అందుకున్నాం. అయితే, 2015, జూన్ 1 నుంచి(సిక్కాను అదే నెలలో సీఈఓగా ఎంపిక చేశారు) క్రమంగా ఈ ప్రమాణాలు దిగజారుతున్నాయి. దీనిపై వ్యవస్థాపకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది’ అని మూర్తి పేర్కొన్నారు. తాజా ఉదంతంలో ప్రధానంగా మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ ప్యాకేజీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, విశాల్ సిక్కా పనితీరుపై మాత్రం ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ‘ఒక విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. మేనేజ్మెంట్పై మాకు ఎలాంటి ఆందోళనా లేదు. సీఈఓపై మేం చాలా సంతృప్తితో ఉన్నాం. ఆయన పనితీరు బాగుంది. అయితే, మమ్మల్ని(వ్యవస్థాపకులు, సీనియర్లు, మాజీ ఉద్యోగులు) ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఒక్కటే. కొన్ని నిర్ణయాలు, అంశాలకు సంబంధించి కార్పొరేట్ ప్రమాణాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది’ అని మూర్తి పేర్కొన్నారు. ‘రాజీనామా చేసిన వాళ్లకు చాలా రహస్యాలు, కంపెనీ కీలక సమాచారం తెలుసని చైర్మన్ ఏజీఎంలో చెప్పారు. అయితే, ఇన్ఫోసిస్‌లో గతంలో ఇద్దరు సీఎఫ్ఓలతోపాటు పలువురు సీనియర్లు కూడా వైదొలిగారు. వాళ్లలో కొందరు బోర్డులో సభ్యులు కూడా. వాళ్లకు కూడా కంపెనీకి సంబంధించి చాలా రహస్యాలు, కీలక సమాచారం తెలుసు. అయినా, వాళ్లెవరికీ ఇంత భారీ మొత్తంలో ప్యాకేజీలు(బన్సల్‌ను ఉద్దేశిస్తూ) ఇవ్వలేదు. అని మూర్తి పేర్కొన్నారు. కంపెనీకి ఇబ్బంది కలిగించే సమాచారం ఉన్నదన్న కారణంగానే బన్సల్‌కు అంతభారీగా ప్యాకేజీ ఇచ్చారని మార్కెట్లో ఊహాగానాలు ఉన్నాయన్న ప్రశ్నకు.. దానికీ దీనికీ సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. బోర్డులోకి వచ్చే ఉద్దేశం లేదు..: పాయ్ ప్రధాన వాటాదారులుగా వ్యవస్థాపకులకు కంపెనీలో లోపాలు, చట్టబద్ధమైన ఆందోళనలను వ్యక్తం చేసే అధికారం ఉందని ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు. అయితే, ప్రమోటర్లతో పాటు తామెవ్వరం మళ్లీ బోర్డులోకి రావాలని భావించడం లేదని చెప్పారు. గవర్నెన్స్ లోపాల్లేవు: శేషసాయి కంపెనీలో కార్పొరేట్ ప్రమా ణాల అమలులో లోపాలున్నాయన్న వాదనలను ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. ‘ఇన్ఫీని కొత్త శిఖరాలవైపు నడిపించే దిశగా సీఈఓ విశాల్ సిక్కా వ్యూహాలు, ఆయన తీసుకుంటున్న చర్యలు ఎంతో అభినందించదగినవి. బోర్డు, సీఈఓల మధ్య మంచి సమన్వయం ఉంది’ అని కంపెనీ చైర్మన్ ఆర్. శేషసాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్ఫీ ఉదంతంలోకి మమ్మల్ని లాగొద్దు: సీతారామన్ కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం నెలకొన్న విభేదాల్లోకి తమను(ప్రభుత్వాన్ని) లాగొద్దని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్వతంత్ర డైరెక్టర్‌గా కేంద్ర మంత్రి జయంత్ సిన్హా భార్య పునీతా సిన్హా నియామకంలో స్వార్థ ప్రయోజనాలేవీ ముడిపడి లేవని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ఒక దిగ్గజ కార్పొరేట్ సంస్థలో చోటుచేసుకునే సంఘటనలపై మీడియాలో వస్తున్న వార్తలను చూసి వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఇక పునీతా సిన్హా నియామకానికి ప్రస్తుతం ఇన్ఫీలో కార్పొరేట్ ప్రమాణాలపై నడుస్తున్న భేదాభిప్రాయాలకూ సబంధం ఉందని నేను భావించడం లేదు. ఈ రంగంలో పునీతా చాన్నాళ్ల నుంచీ కొనసాగుతున్నారు. ఆమెకున్న నైపుణ్యాలు, సామర్థ్యం మేరకే ఇన్ఫీలో చోటు లభించి ఉండొచ్చు’ అని సీతారామన్ పేర్కొన్నారు. ప్రమాణాలను ఉల్లంఘించలేదు..: షా ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ నైతిక ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని బోర్డు సభ్యుల్లో ఒకరైన కిరణ్ మజుందార్ షా శుక్రవారం స్పష్టం చేశారు. అయితే, కొన్ని నిర్ణయాత్మక అంశాల్లో ప్రమోటర్లతో బోర్డు విభేదించి ఉండొచ్చని చెప్పడం విశేషం. ప్రమోటర్ల ఆందోళనలను తగ్గించే విషయంలో తగిన చర్యలపై బోర్డు దృష్టిసారిస్తుందని ఆమె పేర్కొన్నారు. సీఈఓ విశాల్ సిక్కా సారథ్యం పట్ల బోర్డు పూర్తి సంతృప్తితో ఉందని.. ఆయనను బాసటగా నిలుస్తుందని కూడా షా తేల్చిచెప్పారు. కలసికట్టుగా కంపెనీని కొత్త శిఖరాల దిశగా తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి గందరగోళాన్ని సృష్టించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మొత్తంమీద బోర్డుకు, వ్యవస్థాకులకు మధ్య పొరపొచ్చాలు ఉన్నాయన్నది షా మాటలతో స్పష్టం అవుతోంది. ‘కొన్ని అంశాలపై నారాయణ మూర్తి, ఇతర ప్రమోటర్లు అభ్యంతరం తెలపడం వాస్తవమే. ఇవన్నీ కేవలం అభిప్రాయపపరమైన విభేదాలే తప్ప.. కార్పొరేట్ ప్రమాణాలు దిగజారడం కిందకు రావని నేను అనుకుంటున్నా’ అని షా వ్యాఖ్యానించారు. ఇక మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్‌కు భారీ ప్యాకేజీ ఇవ్వడంపై స్పందిస్తూ... పలు సంక్లిష్టతల నడుమ దీనికి బోర్డు ఆమోదం తెలిపిందని, ఇలాంటి నిర్ణయాత్మక అంశాలను యాజమాన్యానికే వదిలిపెట్టడం మంచిదని షా పేర్కొన్నారు. బన్సల్ ప్యాకేజీని బోర్డు మొత్తం సమర్థించినట్లు కూడా ఆమె వెల్లడించారు. చైర్మన్ వైదొలగాల్సిందే: బాల కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్‌లో లోపాలకు పూర్తిగా చైర్మన్(ఆర్. శేషసాయి)దే బాధ్యత అని.. తక్షణం ఆయన పదవి నుంచి వైదొలగాలంటూ కంపెనీ మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్ పేర్కొన్నారు. వాటాదారుల ఆందోళనలను పరిష్కరించేందుకు తాత్కాలిక చైర్మన్‌ను నియమించాలని కూడా ఆయన సూచించారు. ‘లోపాలకు బోర్డు, చైర్మన్‌దే పూర్తి బాధ్యత. చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాలి. వ్యవస్థాపకులు లేవనెత్తిన ఆందోళనలను నేరుగా పరిష్కరించేందుకు బోర్డు తాత్కాలిక చైర్మన్‌ను నియమించాల్సిందే’ అని బాల ఒక ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించారు. కాగా, కార్పొరేట్ గవర్నెన్స్ అంశం అనేది వ్యవస్థాపకులు, ప్రస్తుతం సీఈఓ విశాల్ సిక్కాలకు సంబంధించినది కకాదన్నారు. కంపెనీతో సంబంధాలు తెగిపోయాక వ్యాపార కార్యకలాపాల్లో ప్రమోటర్లు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని కూడా చెప్పారు. ‘సిక్కా కు స్వయంగా వ్యవస్థాపకులే సారథ్యాన్ని కట్టబెట్టారు. ఆయనకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారుతోందంటూ ప్రమోటర్లు గత కొన్నాళ్లుగా ఆందోళనలను వ్యక్తపరుస్తున్నారు. అయినా, దీన్ని పరిష్కరించే దిశగా బోర్డు సమర్థమైన చర్యలేవీ తీసుకోలేదు’ అన్నారు. అయితే, బోర్డులో సిక్కా కూడా ఒక సభ్యుడే కాబట్టి.. ఆయనకు తామేమీ క్లీన్చిట్ ఇవ్వదలచుకోలేదని చెప్పారు. -
విశాల్‌కు మద్దతుగా కిరణ్ మజుందార్ షా
ముంబై: విశాల్ సిక్కా బోర్డు వివాదంలో బయోకాన్ చైర్ పర్సన్, ఇన్ఫీ స్వతంత్ర డైరక్టరు కిరణ్ మజుందార్ షా విశాల్ సిక్కాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్ఫోసిస్ బోర్డు నాయకత్వం విభేదాలు ఆందోళన కలిగించే అంశమని అంగీకరించారు. అయితే బోర్డు చాలా సమన్వయంతో కూడుకున్నదంటూ ఇన్ఫీ బోర్డుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే ఫౌండర్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కార్పొరేట్ గవర్నెన్స్ కాదనీ.. అభిప్రాయ భేదాలని వ్యాఖ్యానించారు. అలాగే తీవ్రమైన సముపార్జన వ్యూహాలు విశాల్‌కు ఉన్నాయని తాను భావించడంలేదన్నారు. లక్ష్యాల సాధనలో ప్రమోటర్ల మద్దతు ఆయనకు బలంగా ఉందన్నారు. కాగా టాటా -మిస్త్రీ బోర్డు వివాదం తరహాలో ఇన్ఫోసిస్‌లో కూడా మేనేజ్మెంట్లో విబేధాలు తలెత్తుతున్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. కంపనీకి మొదటి నాన్ ప్రమోటర్ సీఈఓ అయిన విశాల్ శిక్కాకు.. ఈ సంస్థ వ్యవస్థాపకులకు మధ్య నిర్ణయాత్మక విధానాల విషయంలో విబేధాలు మరింత ముదిరాయన్న వార్తలు ఆందోళన పుట్టిస్తున్నాయి. సంస్థ విలువలకు అనుగుణంగా శిక్కా నడుచుకోవడం లేదని కొందరు ప్రమోటర్ షేర్హోల్డర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు కూడా. అటు ఇన్పీతొలి ఛైర్మన్ నారాయణ మూర్తికూడా కార్పొరేట్ గవర్నెన్స్ క్రమంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫీపై వదంతులను నమ్మొద్దు: సిక్కా
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలపై కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా పెదవి విప్పారు. కార్పొరేట్ నైతికత, సమగ్రత, విలువల విషయంలో ఇన్ఫోసిస్‌కు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ఉద్యోగులను కోరారు. కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత ఈ–మెయిల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిక్కా వేతనం పెంపు, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ వీడ్కోలు ప్యాకేజీలను ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఇప్పటికే ఇన్ఫోసిస్ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీ పూర్తి ప్రయోజనాలమేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ‘క్లౌడ్, ఎడ్జ్ ఇతరత్రా కొత్త తరం సేవలపై మనం(కంపెనీ) అనుసరిస్తున్న వ్యూహంపై నిశితంగా దృష్టి కేంద్రీకరించండి. మీడియాలో వస్తున్న ఊహాగానాలను అసలు పట్టించుకోవద్దు. నైతికత, సమగ్రత, విలువలను కాపాడేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ప్రస్తుతం నెలకొన్న కొత్త తరహా అసాధారణ పరిస్థితుల్లో సైతం ఇన్ఫోసిస్ అనే గొప్ప కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. మా అంకితభావం విషయంలో మరో ఆలోచనకు తావులేదు. మనమంతా ఇకపై కూడా ఇదే నిబద్ధతతో కలసికట్టుగా సాగుదాం’ అని సిక్కా పేర్కొన్నారు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం ఐటీ పరిశ్రమ వృద్ధితో పోలిస్తే దాదాపు 50% వెనుకబడిన ఇన్ఫోసిస్.. ప్రస్తుతం పరిశ్రమ వృద్ధితో సమాన స్థాయికి చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నారాయణ మూర్తి తప్పు చేశారు: పాయ్ ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఉన్న నాయకత్వం.. వాటాదారులకు విలువను సమకూర్చడంపై దృష్టిసారించడం లేదని కంపెనీ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. అయితే, సీఈఓ విశాల్ సిక్కా సారథ్యంపై మాత్రం విశ్వాసం వ్యక్తం చేశారు. కంపెనీకి ఇప్పుడు అత్యంత బలమైన చైర్మన్ అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. 2000 ఏడాది నుంచి 2011 వరకూ ఇన్ఫీ బోర్డు సభ్యుడిగా పాయ్ కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కంపెనీతో 17 ఏళ్ల బంధాన్ని వదులుకొని 2011లో రాజీనామా చేశారు. ‘ఇన్ఫీ ప్రమోటర్లలో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి.. కేవలం వ్యవస్థాపకులు మాత్రమే సారథులయ్యే(సీఈఓలు) విధానంపై దృష్టిపెట్టి తప్పు చేశారు. చాలా మంది ఉద్యోగులు కంపెనీని వీడిపోయేందుకు ఇదే ప్రధాన కారణం. ఇన్ఫీ లాంటి గొప్ప కంపెనీని నిర్మించడంలో మేమంతా కీలక భూమిక పోషించాం. అయితే, ఈ పరిస్థితులను చూసి చాలా బాధపడుతున్నా’ అని పాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆర్.శేషసాయి వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన పేరును ప్రస్తావించకుండా.. ‘ఒక కంపెనీకి బలమైన సీఈఓ ఉన్నప్పుడు అంతే బలమైన చైర్మన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ఫోసిస్ పటిష్టమైన చైర్మన్ నాయకత్వంలోనే బలోపేతం అయింది’ అని పాయ్ వ్యాఖ్యానించారు. కాగ్నిజంట్ తరహాలోనే ఇన్ఫీ కూడా షేర్ల బైబ్యాక్‌ను అమలు చేయాలన్నారు. -
'గాసిప్స్ నమ్మి కలవరపడకండి'
బెంగళూరు : టాటా గ్రూప్‌లో నెలకొన్న యుద్ధం మాదిరి, ఇన్ఫోసిస్లోనూ కలకలం మొదలైందని, కంపెనీ సీఈవో విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడంపై వ్యవస్థాపకులు కన్నెర్రజేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని విశాల్ సిక్కా తన ఉద్యోగులకు తెలిపారు. ఊహాగానాలు నమ్మి పాలనలో, విలువల్లో కంపెనీకి ఉన్న అంకితభావంపై ఎలాంటి కలవరం చెందవద్దని సూచించారు. కోర్ ఇన్ఫోసిస్ విలువలను ఉల్లంఘిస్తూ కంపెనీ పాలన నడుస్తుందని వ్యవస్థాపకులు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తాము క్యూ4లో నిమగ్నమై ఉన్నామని, తమ వ్యూహాలను అమలుచేయడంలో దృష్టిసారించాలని, కంపెనీని గ్రేట్‌గా రూపొందించేందుకే కృతనిశ్చయంతో పనిచేయాలని సిక్కా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ''మనం పని చేస్తున్నాం.. మనం కలిసే పని చేయాలి'' అని ఉద్యోగులకు తెలిపారు. తాజాగా ఇన్ఫోసిస్‌లో వివాదాలు ముదురుతున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. సిక్కాతో పాటు కంపెనీని వీడిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా ప్యాకేజీ ఇవ్వడంపైనా ప్రమోటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారని సమాచారం. ఈ అంశాలపై కంపెనీ కీలక వ్యవస్థాపకులు ఎన్.ఆర్.నారాయణ మూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేఖని గత నెలలో ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. -
ఇన్ఫీలో ‘సిక్కా’ కలకలం..!
సీఈఓ విశాల్ సిక్కా వేతనం పెంపుపై వ్యవస్థాపకుల కన్నెర్ర! • అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు... • కంపెనీ ప్రయోజనాల కోసమేనన్న ఇన్ఫీ • అన్ని అంశాలనూ సవివరంగా వెల్లడించినట్లు స్పష్టీకరణ న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో కార్పొరేట్ యుద్ధం పూర్తిగా సద్దుమణగకముందే... మరో ప్రతిష్టాత్మక కంపెనీలో కలకలం మొదలైంది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లోనూ ‘టాటా’ తరహా ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడం పట్ల వ్యవస్థాపకులు కన్నెర్రజేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సిక్కాతో పాటు కంపెనీని వీడిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వటంపైనా ప్రమోటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారని సమాచారం. ఈ అంశాలపై కంపెనీ కీలక వ్యవస్థాపకులు ఎన్.ఆర్.నారాయణ మూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేఖని గత నెలలో ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇన్ఫీ ఇన్వెస్టర్లలో కలకలం మొదలైంది. ఇప్పటికే ప్రతికూల వ్యాపార పరిస్థితులతో భారీగా పడిపోతూ వస్తున్న కంపెనీ షేరు ధరపై... ప్రమోటర్లు, సీఈఓల మధ్య విభేదాలు మరింత ప్రభావం చూపుతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. 2016 డిసెంబర్ చివరినాటికి ఉన్న గణంకాల ప్రకారం చూస్తే... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు (వారి కుటుంబ సభ్యులతో కలిపి) కంపెనీలో 12.75 శాతం వాటా ఉంది. ఎక్కువ మంది స్వతంత్ర డైరెక్టర్లే ఉన్న బోర్డులో... వీరెవరూ లేరు కూడా. అబ్బే.. అంతా కంపెనీ మంచికే: ఇన్ఫీ సీఈఓ, వ్యవస్థాపకుల మధ్య పాలనపరమైన అగ్గి రాజుకుందన్న వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ బుధవారం వివరణ ఇచ్చింది. సిక్కా వేతనం పెంపు, ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్ చేసిన రాజీనామా ప్యాకేజీలను సమర్థించుకుంది. ‘పూర్తిగా కంపెనీ ప్రయోజనాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. బోర్డులో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం జరిగింది’ అని ఇన్ఫోసిస్ ఈ–మెయిల్ ప్రకటనలో పేర్కొంది. ప్రమోటర్లతో పాటు ఇతర వాటాదారులు అన్ని పక్షాల నుంచి తీసుకున్న సూచనలు, అభిప్రాయాలను బోర్డు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ అంశంపైనయినా నిర్ణయం తీసుకుంటుందని ప్రకటనలో ఇన్ఫీ వివరించింది. ఏం జరిగిందంటే: ఇన్ఫోసిస్‌కు నేతృత్వం వహించేందుకు తొలిసారి బయటి వ్యక్తి (ప్రమోటర్ కాని) విశాల్ సిక్కాను సీఈఓగా తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సిక్కా వచ్చాక కంపెనీ పనితీరు కాస్త మెరుగుపడిందన్న భరోసా అటు ఇన్వెస్టర్లలోనూ ఇటు ప్రమోటర్లలోనూ నెలకొంది. ఎస్డీ శిబులాల్ (చిట్టచివరి ప్రమోటర్ సీఈఓ) నుంచి 2014 ఆగస్టు 1న సిక్కాకు పగ్గాలు అప్పగించిన తర్వాత ఇన్ఫోసిస్ పాలనా వ్యవహరాల్లో వ్యవస్థాపకులు పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాల్లేవు. అయితే, గతేడాది ఇన్ఫోసిస్ బోర్డు... సిక్కా పదవీ కాలాన్ని 2021 వరకూ పొడిగించడమే కాకుండా ఆయన వార్షిక వేతన ప్యాకేజీని భారీగా 11 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 74 కోట్లు) పెంచింది. ఇందులో బేస్ శాలరీ 1 మిలియన్ డాలర్లు, పనితీరు ఆధారిత వేరియబుల్ పే 3 మిలియన్ డాలర్లు కాగా, మిగతాది స్టాక్స్ రూపంలో చెల్లిస్తారు. పాత ఒప్పందం ప్రకారం ఆయన మొత్తం వార్షిక ప్యాకేజీ 7.08 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గ్లోబల్ ఐటీ కంపెనీల సీఈఓల స్థాయికి సిక్కా వేతనం చేరింది. ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్, మాజీ జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెన్నడీలకు కూడా కంపెనీ నుంచి వైదొలగినందుకుగాను భారీ ప్యాకేజీలనే ఇన్ఫీ ఆఫర్ చేసింది. బన్సల్ 2014–15లో వేతన ప్యాకేజీ కింద రూ. 4.72 కోట్లు తీసుకోగా.. ఆయనకు వీడ్కోలు ప్యాకేజీ రూపంలో రూ.23.02 కోట్లను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఓకే చెప్పింది. కెన్నడీ ఈ ఏడాది జనవరిలో ఇన్ఫీని వీడారు. ఆయనకు రాజీనామా ప్యాకేజీ, ఇతరత్రా చెల్లింపుల రూపంలో 8,68,250 డాలర్లు(దాదాపు రూ.5.85 కోట్లు) చెల్లించేందుకు ఇన్ఫీ అంగీకరించింది. ఇంత భారీ స్థాయి చెల్లింపుల పట్ల వ్యవస్థాపకులు తీవ్ర ఆందోళేన వ్యక్తం చేస్తూ.. బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. షేర్ల బైబ్యాక్? అమెరికాలో హెచ్1బీ వీసాలపై నియంత్రణ ఆందోళనలు, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) వంటి పరిణామాలు ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్న భయాలతో కొంత కాలంగా ఐటీ షేర్లు తిరోగమనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ఫీ షేరు కూడా గత కొంతకాలంగా పడుతూవస్తోంది. గతేడాది జూన్‌లో 52 వారాల గరిష్ట స్థాయి(రూ.1,278)న నుంచి క్రమంగా క్షీణిస్తూ నవంబర్‌లో రూ. 900(52 వారాల కనిష్టం)కు పడిపోయింది. మం గళవారం ఇన్ఫీ షేరు ధర బీఎస్ఈలో దాదాపు 1% దిగజారి రూ.936 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.2,15,097 కోట్లు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేం దుకు కంపెనీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించే యోచనలో ఉంది. రూ.12,000 కోట్లను ఈ బైబ్యాక్‌కు వినియోగించనుందని సమాచారం. కీలక వాటాదారులు, వ్యవస్థాపకుల నుంచి బైబ్యాక్‌కు ఆమో దం లభించాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇన్ఫీ వద్ద రూ.35 వేల కోట్ల భారీ నగదు నిల్వలు ఉన్నాయి. బోర్డు సమాధానం ఇవ్వాలి: మోహన్‌దాస్ పాయ్ సిక్కా, మరో ఇద్దరికి భారీ ప్యాకేజీలు ఇవ్వడంపట్ల ఇన్షోసిస్ వ్యవస్థాపకులు ఆందోళన వ్యక్తం చేశారన్న వార్తలపై కంపెనీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ స్పందించారు. వ్యవస్థాపకులకు ఆయన మద్దతు పలికారు. కంపెనీ ప్రయోజనాలమేరకే అంటూ నామమాత్ర ప్రకటనకాకుండా.. సవివరంగా సమాధానాన్ని బోర్డు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘కంపెనీని నెలకొల్పి అద్భుతమైన విలువను చేకూర్చిన వ్యవస్థాపకులు సీరియస్ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహజమే. ఇప్పటివరకూ భారత్‌లో ఏ సీఎఫ్ఓకూ ఇంత భారీ వీడ్కోలు ప్యాకేజీ(24 నెలల వేతనం–బన్సల్‌ను ఉద్దేశిస్తూ) ఇవ్వడం నేను చూడలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇన్ఫోసిస్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా.. ఈసారి ఇన్ఫోసిస్ లాభాల మీద ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. తాను తీసుకునే టాప్ 3 విధాన నిర్ణయాల్లో ఇమ్మిగ్రేషన్ ఒకటని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. దానివల్ల సంస్థ లాభాల మీద ప్రభావం పడొచ్చని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా చెప్పారు. అయితే, ఈ ప్రభావం ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చన్న విషయంపై మాత్రం కంపెనీ ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. భారతీయ ఉద్యోగులైతే తక్కువ జీతాలతోనే తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలతో విదేశాలకు కూడా పంపి అక్కడ పనిచేయించుకోవడం సులభం అనేది ఇక్కడి కంపెనీల భావన. అమెరికన్లను అక్కడ ఉద్యోగాల్లోకి తీసుకుంటే వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరకరనే సమస్య మాత్రం లేదని సిక్కా అంటున్నారు. అక్కడ కూడా కావల్సినన్ని యూనివర్సిటీలున్నాయని, కావల్సినంత మంది ఇంజనీర్లు దొరుకుతారని చెప్పారు. అయితే.. ఇప్పుడు అక్కడివారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే అమెరికా మార్కెట్‌ను కాగ్నిజెంట్ లాంటి పోటీదారులకు వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఎలాగోలా ఖర్చు పెరిగినా సరే.. అక్కడి ప్రాజెక్టులను మాత్రం వదులుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తన వార్షిక రెవెన్యూ వృద్ధి లక్ష్యాలను మూడు నెలల్లో రెండోసారి తగ్గించుకుంది. చాలావరకు పాశ్చాత్య దేశాల క్లయింట్లు ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయించడంతో ఇక్కడి సాఫ్ట్వేర్ సేవల ఎగుమతి కంపెనీలకు ఆదాయం తగ్గుతోంది. ఈ ప్రభావం ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీల మీద కూడా పడింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుందో చూడాలి. -
ఆయన జీతం.. రూ. 74 కోట్లు!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం భారీగా పెరిగింది. తాజాగా ఇన్ఫోసిస్ విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ మంచి లాభాలు ఆర్జించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఆయన దాదాపు 74 కోట్ల రూపాయలను జీతభత్యాలుగా అందుకోనున్నారు. 2016 ఆర్థిక సంవత్సరంలో సిక్కా ఇన్ఫోసిస్ ఆదాయాన్ని 63,446 కోట్ల రూపాయలకు చేర్చారు. అక్కడితో ఆగిపోకుండా నాస్ కామ్ అంచనాలను తలక్రిందులు చేస్తూ 13.3 శాతం వృద్ధిని కూడా నమోదు చేసింది. దీంతో కంపెనీ సీఈవోగా సిక్కా పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పెంచింది. అంటే 2021 వరకు సిక్కానే ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగనున్నారు. సిక్కా పే స్కేల్లో మార్పులతో కంపెనీ సీనియర్ల జీతభత్యాల్లో కూడా మార్పులు రానున్నాయి. అయితే, మిగతా ఉద్యోగుల జీతాలను కంపెనీ వెల్లడించలేదు. రెండేళ్ల క్రితం ఇన్ఫోసిస్ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. -
ఇది ఓ సోలార్ సముద్రం!
సముద్రపు నీళ్లతో ఏం చేయగలమో తెలియదు గానీ.. ఈ సోలార్ సముద్రం మాత్రం కావల్సినంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్ శివార్లలోని పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో 6.6 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆ సంస్థ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సువిశాల ప్రదేశంలో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానళ్ల వద్ద ఫొటో తీయించుకుని, ఇది పోచారంలోని తమ సోలార్ ప్యానళ్ల సముద్రమంటూ ట్వీట్ చేశారు. నీలి ఆకాశం నవ్వుతోందని కూడా చెప్పారు. ఇప్పటికే పోచారం క్యాంపస్‌లో 0.6 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంటు ఉంది. దీంతో కలిపితే మొత్తం 7.2 మెగావాట్ల సామర్థ్యం ఉన్నట్లయింది. తమ క్యాంపస్ అవసరాలకు కావల్సిన మొత్తం విద్యుత్తు ఈ సోలార్ ప్లాంటు నుంచే వస్తుందని విశాల్ సిక్కా తెలిపారు. దీంతో.. ఇలా తమకు కావల్సిన విద్యుత్తు అంతటినీ పునరుత్పాదక ఇంధనవనరుల నుంచి పొందే మొట్టమొదటి కార్పొరేట్ క్యాంపస్‌గా పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ నిలిచింది. ఇక్కడి ప్లాంటును విజయవంతంగా గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఏడాదికి 12 మిలియన్ల కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. తద్వారా కార్బన్ ఉద్గారాలను 9,200 టన్నుల మేర తగ్గించినట్లవుతుంది. దీంతో కలిపి దేశవ్యాప్తంగా ఇన్ఫోసిస్ 12 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పినట్లయింది. రాబోయే రెండు నెలల్లో మరో 3 మెగావాట్ల ప్లాంట్లను పెడతామని చెబుతున్నారు. A sea of solar panels in our gorgeous @Infosys Hyderabad campus. Blue skies smiling at us... pic.twitter.com/iuVWI4ioGu — Vishal Sikka (@vsikka) December 28, 2015 The @Infosys Hyderabad campus is now 100% off the grid, thanks to our 7.2MW solar farm & our incomparable infra team https://t.co/iHsRwpaA13 — Vishal Sikka (@vsikka) December 28, 2015 Congrats Vishal https://t.co/B9hPx5Vmks — KTR (@KTRTRS) December 29, 2015 -
మెప్పించిన ఇన్ఫీ...
క్యూ1లో రూ.3,030 కోట్ల నికర లాభం; 5 శాతం అప్ ♦ ఆదాయం రూ. 14,354 కోట్లు; 12.4 శాతం వృద్ధి ♦ ఈ ఏడాది డాలర్ ఆదాయ అంచనాలు పెంపు... ♦ 11 శాతం దూసుకెళ్లిన షేరు ధర... బెంగళూరు : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో కంపెనీ రూ.3,030 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.2,886 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం కూడా 12.4 శాతం వృద్ధి చెంది రూ.14,354 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.12,770 కోట్లుగా ఉంది. గడచిన 15 త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి(రూపాయల్లో) ఇదే అత్యధికమని కంపెనీ పేర్కొంది. పరిశ్రమ విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ రూ.3,017 కోట్ల నికర లాభాన్ని రూ.14,097 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. దీన్ని మించి కంపెనీ ఫలితాలను ప్రకటించడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా... గతేడాది మార్చి క్వార్టర్(2014-15, క్యూ4, రూ.3,097 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదిక క్యూ1లో లాభం 2.16 శాతం తగ్గింది. ఆదాయం 7 శాతం వృద్ధి చెందింది. మార్చి క్వార్టర్లో ఆదాయం రూ.13,411 కోట్లుగా నమోదైంది. డాలర్ రూపంలో చూస్తే ఇన్ఫోసిస్ క్యూ1లో 2,256 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. సీక్వెన్షియల్‌గా 4.5 శాతం వృద్ధి చెందింది. డాలర్ ఆదాయం 3 శాతం వృద్ధి చెందొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇక స్థిర కరెన్సీ విలువ ప్రకారం డాలర్ ఆదాయం 4.4 శాతం ఎగసింది. ఐటీ అగ్రగామి టీసీఎస్ కంటే(3.5 శాతం వృద్ధి) మెరుగైన పనితీరును ఇన్ఫీ నమోదు చేసింది. గెడైన్స్ పెంపు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి డాలరు ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను ఇన్ఫోసిస్ 1 శాతం మేర పెంచింది. 7.2-9.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. అంతక్రితం 6.2-8.2 శాతంగా అంచనా వేసింది. అయితే రూపాయల్లో మాత్రం ఆదాయ గెడైన్స్‌ను గతంలో ప్రకటించిన విధంగా 10-12 శాతంగానే కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు ►క్యూ1లో ఇన్ఫోసిస్ మొత్తం (అనుబంధ సంస్థలతో కలిపి) 79 కొత్త క్లయింట్లను జతచేసుకుంది. ఇందులో 6 మెగా కాంట్రాక్టులు ఉన్నాయి. టీసీవీ నుంచి 688 మిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పాటు 200 మిలియన్ డాలర్ల విలువైన రెండు ఒప్పందాలను క్యూ1లో కుదుర్చుకుంది. ►జూన్ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.30,235 కోట్ల నగదు నిల్వలు(లిక్విడ్ అసెట్స్) ఉన్నాయి. మార్చినాటికి ఈ మొత్తం రూ.32,585 కోట్లుగా ఉంది. ►క్యూ1లో ఇన్ఫీ స్థూలంగా 11,889 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. అయితే 8,553 మంది కంపెనీని వీడటంతో నికరంగా 3,336 మంది కొత్త ఉద్యోగులే జతైనట్లు లెక్క. ఇక జూన్ చివరినాటికి అనుబంధ సంస్థలన్నింటితో సహా ఇన్ఫోసిస్‌లో మొత్తం సిబ్బంది సంఖ్య 1,79,523కు చేరింది. మార్చి చివరికి కంపెనీలో 1,76,187 మంది ఉద్యోగులు ఉన్నారు. ►ఇక ఇన్ఫోసిస్(స్టాండెలోన్ ప్రాతిపదికన)లో ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో భారీగా తగ్గుముఖం పట్టింది. క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో అట్రిషన్ 23.4 శాతం నుంచి ఈ క్యూ1లో 14.2 శాతానికి తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా అట్రిషన్ రేటు 26.4 శాతం నుంచి 19.2 శాతానికి దిగొచ్చింది. షేరు రయ్... ఆకర్షణీయమైన ఫలితాలు, గెడైన్స్ పెంపు నేపథ్యంలో ఇన్ఫీ షేరు ధర రివ్వున ఎగసింది. మంగళవారం బీఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ.1,113 వద్ద స్థిరపడింది. ఇక కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగి రూ.2,55,570 కోట్లకి చేరింది. దీంతో టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ఇండియా తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఐదో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ఐటీసీ, ఓఎన్జీసీలను వెనక్కినెట్టింది. తొలి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయడం శుభపరిణామం. క్లయింట్లతో సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు బడా కాంట్రాక్టులను సంపాదించడం, నవకల్పనలపై మరింత దృష్టిపెట్టడం వంటివి కంపెనీ పనితీరు మెరుగుపడేందుకు దోహదం చేశాయి. భవిష్యత్తు తరం కంపెనీల్లో అగ్రస్థానానికి చేరుకునే విషయంలో ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఈ ఏడాది మిగతా కాలంలో పనితీరుకు తాజా ఫలితాలు మంచి చేయూతనందించనున్నాయి. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ -
ఇన్ఫీ టెకీలకు స్మార్ట్ గిప్ట్
బెంగళూరు : సాప్ట్వేర్ కంపెనీలు పోటాపోటీగా తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ కూడా హెచ్‌సీఎల్ సంస్థను ఫాలో అయ్యింది. హెచ్‌సీఎల్...తమ ఉద్యోగులకు మెర్సిడెజ్ కారులు ఇస్తే... ఇన్ఫీ తమ ఉద్యోగులకు ఐ ఫోన్ 6 ఎస్‌ను ఇచ్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-3000 ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో విశాల్ సిక్కా హాలిడే బోనస్ ఇచ్చారు. ఐఫోన్ 6ఎస్తో పాటు ఓ ఈ మెయిల్‌ను ఉద్యోగులకు పంపారు. ఈ సందర్భంగా విశాల్ సిక్కా 'గతేడాది సంతోషకరంగా ముగిసింది. ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. సంస్థ సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు... వేడుక చేసుకోవాల్సిన సమయం' అని అన్నారు. హాలిడే బోసన్పై సంస్థ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తూ ...గతంలో ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. కాగా ఉన్నత పదవులతో పాటు, భారీ ప్యాకేజీల వేతనాల కోసం సాప్ట్వేర్ ఉద్యోగులు...ఉద్యోగాలు వీడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఉద్యోగులను నిలుపుకునేందుకు గిప్ట్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వటం విశేషం. -
ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్!
వాటాల అమ్మకంతో రూ.6,500 కోట్లు... ⇒3.26 కోట్ల షేర్లను విక్రయించిన నలుగురు సహ వ్యవస్థాపకులు... ⇒జాబితాలో నారాయణ మూర్తి, శిబులాల్, నీలేకని, దినేశ్ ⇒ఇంకా కంపెనీలో 5.2% మేర వాటా.. ⇒దీని విలువ దాదాపు 18,000 కోట్లు.. ⇒5% పైగా పడిపోయిన షేరు విలువ.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు అదిరిపోయే లాభాలను సొంతం చేసుకున్నారు. కంపెనీని స్థాపించిన దాదాపు 35 ఏళ్ల తర్వాత భారీస్థాయిలో వాటాలను విక్రయించడం ద్వారా నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు ఏకంగా రూ.6,500 కోట్ల మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సహ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఎస్డీ శిబులాల్, నందన్ నీలేకని, కె.దినేశ్‌లు సోమవారం ఈ భారీ డీల్‌తో స్టాక్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. కంపెనీ సీఈఓగా తొలిసారి బయటివ్యక్తి విశాల్ సిక్కా పగ్గాలు చేపట్టడం.. బోనస్ షేర్ల జారీ నేపథ్యంలో వాటాలను విక్రయించడం గమనార్హం. ఇంత భారీ అమ్మకం కారణంగా ఇన్ఫీ షేరు ధర 5% పైగా పతనమైంది. బెంగళూరు: ఇన్ఫోసిస్... దేశీ స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక కుదుపు కుదిపింది. కంపెనీ సహ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఎస్డీ శిబులాల్, నందన్ నీలేకని, కె. దినేశ్.. వాళ్ల కుటుంబ సభ్యులు తమ వాటాల్లో కొంత భాగాన్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించారు. 3.26 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా దాదాపు రూ.6,500 కోట్ల మొత్తం లభించింది. ఒక్కో షేరును రూ.1,988 చొప్పున విక్రయించినట్లు సమాచారం. బీఎస్ఈలో శుక్రవారం నాటి ముగింపు ధర రూ.2,069తో పోలిస్తే ఇది 4 శాతం మేర తక్కువ కావడం గమనార్హం. ఈ భారీ డీల్‌ను విదేశీ బ్రోకరేజి దిగ్గజం డాయిష్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇంత భారీ స్థాయిలో షేర్లు చేతులుమారడంతో కంపెనీ షేరు ధర భారీగా పడింది. ఒకానొకదశలో 5 శాతం పైగా పడిపోయి రూ.1,958 స్థాయికి దిగజారింది. చివరకు 4.88 శాతం నష్టపోయి... రూ.1,968 వద్ద స్థిరపడింది. కాగా, కంపెనీ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే సుమారు రూ.12,000 కోట్లు ఆవిరైంది. ఇంకా 5.2 శాతం వాటా.... ఈ నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులకు ఇప్పటిదాకా కంపెనీ మొత్తం ఈక్విటీలో 12.4 కోట్ల షేర్లు(సుమారు 8 శాతం వాటా) ఉన్నాయి. తాజాగా విక్రయించిన 3.26 కోట్ల షేర్లు.. మొత్తం కంపెనీ ఈక్విటీలో సుమారు 2.8 శాతం వాటాకు సమానం. అంటే ఇంకా 5.2 శాతం వాటా ఈ నలుగురు సహ వ్యవస్థాపకులు(ప్రమోటర్లు), వాళ్ల కుటుంబీకులకు ఉన్నట్లు లెక్క. దీని విలువ సోమవారం షేరు ముగింపు ధరతో చూస్తే... సుమారు రూ.18,000 కోట్ల పైమాటే కావడం గమనార్హం. కాగా, 1981లో కంపెనీని స్థాపించిన ఏడుగురు సహ వ్యవస్థాపకుల(అశోక్ అరోరా, క్రిష్ గోపాలకృష్ణన్, ఎన్ఎస్ రాఘవన్‌లతో కలిపి) మొత్తం వాటా ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి దాదాపు 15.9%. దీనిలో ఇప్పుడు నలుగురు ప్రమోటర్ల వాటా అమ్మకాన్ని(2.8 శాతం) తీసేస్తే.. 13.1 శాతంగా లెక్కతేలుతోంది. ఇక ఈ సెప్టెంబర్ చివరికి విదేశీ ఇన్వెస్టర్లకు 42.67% వాటా, దేశీ సంస్థల(డీఐఐ)కు 14.68%, కార్పొరేట్లు.. రిటైల్ ఇన్వెస్టర్లు, ఇతరులకు 26.93% వాటాలు ఉన్నాయి. కొత్త సీఈఓ రాకతో... గడిచిన రెండేళ్లుగా ఐటీ రంగంలోని ఇతర పోటీ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్ అటు వ్యాపారపరంగా.. ఇటు స్టాక్ మార్కెట్లో షేరు విలువ పరంగా కూడా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడం.. ఆయన కుమారుడు రోహన్ మూర్తిని తనకు సహాయకుడిగా నియమించుకోవడం జరిగాయి. అయితే, ఈ చర్యలపై ఇన్వెస్టర్లతో పాటు అటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సుమారు 14 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫోసిస్‌ను వదిలిపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో సీఈఓ వేట ప్రారంభించిన కంపెనీ.. జర్మనీ ఐటీ దిగ్గజం శాప్(ఎస్ఏపీ)కి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్.. విశాల్ సిక్కాను సారథిగా నియమించింది. నారాయణమూర్తితో పాటు అప్పటి సీఈఓ శిబులాల్, క్రిస్ గోపాల కృష్ణన్ కూడా కంపెనీ పదవుల నుంచి వైదొలిగారు. కాగా, ఆగస్టులో సిక్కా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫీ షేరు ఇప్పటిదాకా 20 శాతం పైగానే దూసుకెళ్లింది. షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టమైన రూ.4,400 స్థాయిని కూడా అందుకుంది. రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా అనూహ్యంగా ఒక్కో షేరుకి మరో షేరును బోనస్‌గా కంపెనీ ప్రకటించడం తెలిసిందే. ఇటీవలే ఈ బోనస్ ఇష్యూ అమల్లోకి రావడంతో షేరు విలువ సగమైంది. విశ్లేషకులు ఏమంటున్నారు... సహ వ్యవస్థాపకుల వాటా విక్రయం వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కార్పొరేట్ నైతిక నియమావళి(గవర్నెన్స్) విషయంలో అత్యున్నత ప్రమాణాలను ఇన్ఫీ నెలకొల్పింది. ఇది ఇకపైనా కొనసాగనుంది. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఈ ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులెవరూ పాలుపంచుకోవడం లేదు. అందువల్ల భారీగా షేర్ల విక్రయం వల్ల స్టాక్ ధరపై తక్షణం కొంత ప్రభావం ఉన్నప్పటికీ.. కంపెనీ మూలాలు పటిష్టంగానే ఉన్నందున భవిష్యత్తుకు ఢోకా లేదు’ అని బ్రోకరేజి సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అభిప్రాయపడింది. టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్ కాస్త వెనుకబడినప్పటికీ.. సిక్కా ఆగమనంతో మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోందని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ మాయురేష్ జోషీ అన్నారు. వ్యవస్థాపకుల వాటా విక్రయంవల్ల కంపెనీ ఫండమెంటల్స్‌పై ప్రభావమేమీ ఉండబోదని చెప్పారు. -
మోదీ పర్యటన దిగ్విజయం: కార్పొరేట్లు
మెల్బోర్న్: ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఆస్ట్రేలియా పర్యటనపై భారత వాణిజ్యవేత్తల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి ఊపునిస్తుందని, ద్వైపాక్షిక వాణిజ్యం జోరు పెరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటన విజయవంతమైందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్తమ స్థాయికి చేరాయని ఇన్ఫోసిస్ చైర్మన్ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజయంతమైతే, భారత్‌కు ముడి పదార్ధాలు భారీ స్థాయిలో అవసరమవుతాయని, దీంతో ఆస్ట్రేలియాతో అపార వ్యాపారవకాశాలు అందుబాటులోకి వస్తాయని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా వివరించారు. భారత్‌కు, ఆస్ట్రేలియాకు చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని, గత 28 ఏళ్లలో ఒక్క భారత ప్రధాని కూడా ఆస్ట్రేలియాను సందర్శించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఉద్యోగుల అలసత్వం వల్ల తమ వ్యాపారాలకు సంబంధించి చాలా నిర్ణయాలు, ఆమోదాలు పెండింగ్‌లో ఉండేవని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం వల్ల సత్వర నిర్ణయాలు వెలువడుతున్నాయని, అడ్డంకులు తొలగిపోతున్నాయని, వృద్ధిపై విశ్వాసం పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. -
ఇన్ఫీకి సిక్కా జోష్!
ఇన్వెస్టర్లలో ఉత్సాహం.. షేరు పరుగులు పూర్వవైభవానికి సంకేతాలంటున్న విశ్లేషకులు ‘సిక్కా అంటే హిందీలో నాణెం అని అర్థం.. తన పేరుకు తగ్గట్లే ఇన్ఫోసిస్‌కు ఆయన బోలెడంత డబ్బు తెచ్చిపెడతారని ఆశిస్తున్నాను’.. విశాల్ సిక్కాను ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ప్రకటిస్తూ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. సిక్కా మీద మూర్తి ఉంచిన నమ్మకానికి ఇన్ఫీ తాజా త్రైమాసిక ఫలితాలు నిదర్శనంగా నిల్చాయి. ఇటు ఇన్వెస్టర్లను, అటు ఉద్యోగులనూ ఆకట్టుకునే ందుకు సిక్కా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన సారథ్యంలో ఇన్ఫీ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దేశీ ఐటీ పరిశ్రమకు ఒకప్పుడు దిక్సూచిగా నిల్చిన దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రాభవం గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఒకవైపు టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి పోటీ సంస్థలు ముందుకు దూసుకెళ్లిపోతుంటే.. ఇన్ఫీ మాత్రం రేసులో వెనుకబడిపోయింది. వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తిరిగొచ్చి సంస్థ ఊపిర్లూదే ప్రయత్నం చేసినా.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అంతంత మాత్రం పనితీరే కనపర్చగలిగింది. పరిశ్రమ సగటు 13 శాతానికన్నా తక్కువగా 11.5 శాతం ఆదాయ వృద్ధితో నిరుత్సాహపర్చింది. పెపైచ్చు మూర్తి పునరాగమనం తర్వాత డజను మంది పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ నుంచి వైదొలిగారు. దాదాపు 30 వేల మంది పైచిలుకు ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారని పరిశ్రమవర్గాల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ సిక్కా .. ఇన్ఫీ సీఈవోగా నియమితులయ్యారు. ఆయన రాకతోనే కంపెనీ సెంటిమెంటు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించడం మొదలైంది. సెంటిమెంటు, షేరూ జూమ్ సిక్కా బాధ్యతలు చేపట్టాక క్యూ2లో కంపెనీ నికర లాభం అంచనాలను మించి దాదాపు 29 శాతం వృద్ధితో 3,096 కోట్లకు ఎగిసింది. ఆయన వస్తూ.. వస్తూనే ఇన్వెస్టర్లకు దీపావళి ధమాకాను అందించారు. ఒక్కో షేరుకి మరో షేరు బోనస్‌తో పాటు మధ్యంతర డివిడెండు ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా మెరుగుపడింది. సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాల ప్రకారం కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) వాటాలు ఆల్‌టైమ్ గరిష్టమైన 42.76 శాతానికి పెరిగాయి. ఈ పరిణామాలతో ఇన్ఫీ షేరు ధర కొత్త రికార్డు స్థాయి రూ. 3,985ని తాకింది. మొత్తం మీద ఆగస్టు 1న సిక్కా ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టినప్పట్నుంచీ షేరు సుమారు 14 శాతం పైగా ర్యాలీ చేసింది. మరో రెండేళ్లలో స్టాక్ మార్కెట్‌ను తమ షేరే ముందుకు నడిపించేస్థాయికి తీసుకువస్తామంటూ ఇటీవల సిక్కా చేసిన ప్రకటన ఆయన విశ్వాసానికి అద్దంపడుతోంది. ఉద్యోగుల్లో ఉత్సాహం .. విశాల్ సిక్కా ఎంట్రీ ఇటు ఉద్యోగుల్లో కూడా ఉత్సాహం నింపుతోంది. వారి నుంచి పని రాబట్టుకోవడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీంతో.. సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడం క్యూ2లో 82.3 శాతానికి పెరిగింది. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించింది. ఒక్క త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం అన్నది కంపెనీ చరిత్రలో ఇదే ప్రథమం. అయినా సరే.. సిక్కా సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి త్రైమాసికంలో ఉద్యోగుల వలసలు భారీగా ఎగిశాయి. పరిశ్రమ సగటును మించి రికార్డు స్థాయిలో 20.1 శాతంగా నమోదయ్యాయి. అయితే, ఉద్యోగులకు ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు వంటి చర్యలతో అట్రిషన్‌ను సిక్కా నెమ్మదిగా పరిశ్రమ సగటు అయిన 13-15 శాతానికి తీసుకురాగలరని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే గాకుండా గతంలో ఇన్ఫీని వీడిపోయిన ఉద్యోగులను కూడా మళ్లీ వెనక్కి రప్పించేందుకు సిక్కా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా దాదాపు వంద మంది పైచిలుకు పూర్వ ఉద్యోగులు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపారు. రెన్యూ అండ్ న్యూ మంత్రం.. కంపెనీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టడం, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా సిక్కా .. రెన్యూ అండ్ న్యూ మంత్రాన్ని పఠిస్తున్నారు. అలాగే కంపెనీ ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే దిశగా సిక్కా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పూర్వం శాప్‌లో తనతో కలిసి పనిచేసిన సహచరుల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా అయిదుగురు శాప్ ఎగ్జిక్యూటివ్స్ తాజాగా ఇన్ఫీలో చేరారు. మరోవైపు, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకానైతే అన్ని అంశాలూ సిక్కాకు సానుకూలంగానే పనిచేస్తున్నాయి. వాటిని భవిష్యత్‌లో ఎంత కాలం పాటు నిలబెట్టుకోగలరన్నది చూడాల్సి ఉంటుందన్నది పరిశ్రమ వర్గాల మాట. -
ఇన్ఫోసిస్ బోనస్ బొనాంజా
1:1 నిష్పత్తిలో... ఒక షేరుకి మరో షేరు ఫ్రీ అంచనాలను మించిన క్యూ2 ఫలితాలు... నికర లాభం రూ. 3,096 కోట్లు.. వార్షికంగా 28.6 శాతం, త్రైమాసికంగా 7.3 శాతం వృద్ధి ఆదాయం రూ.13,342 కోట్లు ఈ ఏడాది ఆదాయ గెడైన్స్ 7-9% యథాతథం షేరుకి రూ.30 చొప్పున మధ్యంతర డివిడెండ్ మా క్లయింట్లలో ప్రతిఒక్కరి వ్యాపారాల్లోనూ డిజిటల్ పరిజ్ఞానం వినియోగం జోరందుకుంటోంది. వాళ్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు, అదేవిధంగా కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఈ పరిణామం మాకు ఉపయోగపడనుంది. సాధ్యమైనంత వేగంగానే దీని ఫలితాలు అందుకోనున్నాం. భవిష్యత్తులో కంపెనీ వృద్ధికి ఇదే ప్రధాన చోదకంగా నిలవనుంది. మా సొంత వ్యాపారంలోకూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసి వృద్ధిని పెంచుకుంటాం. -విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో అదరగొట్టింది. కంపెనీకి తొలి నాన్-ప్రమోటర్ సీఈఓగా రెండు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా.. తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. అనూహ్యరీతిలో బోనస్ షేర్లను ప్రకటించి ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దీంతో షేరు ధర కూడా రివ్వుమంటూ 7 శాతం ఎగబాకింది. బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో మంచి పనితీరును కనబరిచింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,096 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,407 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక 28.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.13,342 కోట్లకు ఎగసింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.12,965 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే ఈ క్యూ2లో ఆదాయం 2.9 శాతం పెరిగింది. నికర లాభం జోరుకు పటిష్టమైన ఆదాయం, నిర్వహణపరంగా మెరుగైన పనితీరు చేదోడుగా నిలిచాయని కంపెనీ పేర్కొంది. సీక్వెన్షియల్‌గానూ... ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ఇన్ఫీ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. దీంతో పోల్చి చూస్తే.. సీక్వెన్షియల్‌గా క్యూ2లో లాభం 7.3 శాతం ఎగసింది. ఇక క్యూ1 ఆదాయంతో పోలిస్తే(రూ.12,770 కోట్లు) జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 4.5 శాతం మెరుగుపడింది. మార్కెట్ వర్గాలు క్యూ2లో రూ.2,985 కోట్ల నికర లాభం, రూ.13,307 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. దీనికంటే మెరుగైన గణాంకాలను ఇన్ఫీ నమోదుచేయడం విశేషం. గైడన్స్‌లో మార్పులేదు... ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఏప్రిల్‌లో ప్రకటించినట్లుగానే 7-9 శాతం గెడైన్స్(డాలర్ల రూపంలో)ను యథాతథంగా కొనసాగించింది. రూపాయిల్లో గెడైన్స్ 6.7-8.7 శాతంగా ఉంది. ఇతర ముఖ్యాంశాలివీ... జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ఇన్ఫీ, దాని సబ్సిడరీలు కొత్తగా 49 క్లయింట్లను దక్కించుకున్నాయి. దీంతో మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 912కి చేరింది. ఇక సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతరత్రా నిల్వలు 5,444 మిలియన్ డాలర్లకు ఎగసింది. జూన్ చివరికి ఈ మొత్తం 4,943 మిలియన్ డాలర్లు. బోనస్ షేర్లు, మెరుగైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ధర 7 శాతం మేర ఎగబాకి కొత్త రికార్డును(రూ.3,909) తాకింది. చివరకు 6.68 శాతం లాభంతో రూ.3,889 వద్ద స్థిరపడింది. పెరిగిన ఉద్యోగుల వలస... క్యూ2లో ఇన్ఫోసిస్ స్థూలంగా 14,255 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 10,128 మంది కంపెనీని వీడటంతో నికరంగా 4,127 మంది సిబ్బందే జతయ్యారు. దీంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 20.1 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆట్రిషన్ రేటు 17.3 శాతం కాగా.. ఈ ఏడాది క్యూ1లో 19.5 శాతం. మొత్తంమీద సెప్టెంబర్ చివరినాటికి ఇన్ఫోసిస్, దాని సబ్సిడరీ సంస్థలన్నింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 1,65,411కి చేరింది. బోనస్ షేర్లు.. బంపర్ డివిడెండ్.. ఇన్ఫోసిస్ డెరైక్టర్ల బోర్డు తమ ఇన్వెస్టర్లకు దీపావళి ధమాకాను ప్రకటించింది. ఒక్కో షేరుకి మరో షేరు(1:1 నిష్పత్తిలో)ను బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది.అదేవిధంగా న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఒక్కో అమెరికా డిపాజిటరీ షేరు(ఏడీఎస్)కు కూడా మరో ఏడీఎస్ను బోనస్‌గా ఇవ్వనుంది. బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో షేర్ల సరఫరా(లిక్విడిటీ)ని పెరగడంతోపాటు, రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్యను కూడా పెంచేందుకు దోహదం చేయనుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాజీవ్ బన్సల్ చెప్పారు. మరోపక్క, రూ.5 ముఖ విలువగల ఒకో షేరుపై ఆరు రెట్లు అధికంగా రూ.30 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది క్యూ2లో మధ్యంతర డివిడెండ్ రూ.20 మాత్రమే కావడం గమనార్హం. కాగా, షేర్ల బైబ్యాక్ ద్వారా కంపెనీవద్దనున్న అదనపు క్యాపిటల్(నగదు నిల్వలను)ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, బోర్డు సభ్యుడు మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. మార్కెట్ నుంచి షేర్లను కంపెనీ కొనుగోలు చేయడంద్వారా ఈక్విటీ తగ్గి.. పీఈ నిష్పత్తి(షేరు వారీ ఆర్జన) మెరుగవుతుందన్నారు. గతంలో కూడా బైబ్యాక్‌లు కంపెనీ పనితీరును పెంచాయని చెప్పారు. భారీ నగదు నిల్వలను ఏవిధంగా వెచ్చిస్తారో యాజమాన్యాన్ని వాటాదారులు అడగాలన్నారు. బ్యాలెన్స్‌షీట్లలో ఇంతపెద్ద మొత్తం నిరుపయోగంగా పడిఉంటే.. ఏదోఒకసమయంలో ఒత్తిడికిలోనై బడా కంపెనీని దేన్నైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఇన్ఫీ సిక్కాకు రూ. 8 కోట్ల షేర్లు
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కాకు కంపెనీ రూ. 5 చొప్పున 22,794 షేర్లను కేటాయించింది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేరు ధర (రూ. 3,600) ప్రకారం వీటి విలువ సుమారు రూ. 8.2 కోట్లు ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో కీలకమైన మైలురాళ్లు అధిగమించడం, ఉద్యోగంలో కొనసాగడం తదితర అంశాలను బట్టి ఈ షేర్లు ఆయనకు పూర్తిగా లభిస్తాయి. సిక్కా వార్షిక జీతభత్యాలు సుమారు రూ. 30 కోట్లు. -
ఇన్ఫీకి పూర్వ వైభవం తెస్తా...విశాల్ సిక్కా
* కొత్త సీఈఓ విశాల్ సిక్కా... * మేధోపరమైన యాప్స్, డేటా సెన్సైస్, * ఎనలిటిక్స్‌పై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ పూర్వ వైభవాన్ని మళ్లీ తిరిగితీసుకొచ్చి.. పరిశ్రమలో అగ్రస్థానానికి చేర్చడానికి ప్రయత్నిస్తానని ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. కంపెనీ చీఫ్‌గా శుక్రవారం ఆయన ప్రస్తుత సీఈఓ ఎస్డీ శిబులాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సీఈఓ స్థానంలో ఆయన మీడియాతో తొలిసారిగా మాట్లాడారు. మేధోపరమైన సంపద, సాఫ్ట్వేర్ రంగాల్లో వినూత్నతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జటిలమైన ఇంటెలిజెంట్ అప్లికేషన్లు(యాప్స్), డేటా సెన్సైస్, ఎనలిటిక్స్‌పై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీ భవిష్యత్తు వృద్ధిలో ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు. దేశీ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా వెలుగొందుతున్న ఇన్ఫీ 30 ఏళ్ల ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా వ్యవస్థాపకులు కాకుండా ఒక బయటి వ్యక్తి సీఈఓ కుర్చీలో కూర్చోవడం విశేషం. సిక్కా అంతక్రితం జర్మనీ సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి మాట్లాడుతూ... కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోనని ఆయన తనతో స్పష్టంగా చెప్పారని సిక్కా పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం నారాయణ మూర్తి సలహాలను తీసుకోవడాన్ని ఇష్టపడతానన్నారు. ఇన్ఫోసిస్‌కు లేదంటే దేశీ ఐటీ పరిశ్రమకుమాత్రమే కాకుండా దేశంలోనే ఎందరికో స్పూర్తినిచ్చిన ఒక మహోన్నత వ్యక్తి అంటూ మూర్తి సేవలను ఆయన కొనియాడారు. సమన్వయంతో ముందుకు... కాగా, కంపెనీ భవిష్యత్తు వ్యూహాలను పేర్కొంటూ... వివిధ విభాగాలను ఒకదానితో మరొకటి మరింత సమన్వయం పెంచుకునేవిధంగా తీర్చిదిద్దనున్నట్లు సిక్కా వెల్లడించారు. అదేవిధంగా ఇప్పుడున్న నిపుణులైన సిబ్బంది బృందంతోనే విభిన్న విభాగాల్లో ప్రాజెక్టులను విజయవంతంగా నడిపిస్తానన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పనిచేయాలని కూడా తాను భావిస్తున్నట్లు సిక్కా పేర్కొన్నారు. ‘బరోడాతో నాకున్న అనుబంధమే మోడీకి కూడా ఉండటాన్ని చాలా ఆనందంగా ఫీలవుతున్నా. ఆయనను కలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మోడీ మిషన్‌లో మా(ఇన్ఫీ) వంతు సహకారమేదైనా అవసరమైతే తప్పకుండా అందిస్తాం. ప్రపంచాన్ని మార్చగలిగే ప్రయత్నాల్లో భాగం పంచుకునే గొప్ప అవకాశం మాకు ఉంది. అంతేకాదు భారత్ కోసం కూడా ఏదైనా ప్రత్యేకంగా చేయకపోతే మా ప్రయత్నాలకు అర్ధం ఉండదు’ అని సిక్కా వ్యాఖ్యానించారు. -
ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్
విశాల్ మరింత వృద్ధి సాధిస్తారని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఆదాయాన్ని పెంచడంలో కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సఫలీకృత ం అయ్యారని నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన విశాల్ శిక్కా భవిష్యత్‌లో కంపెనీని మరింత వృద్ధిబాటన నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈవో శిబూలాల్ నుంచి శిక్కా ఆగస్ట్‌లో బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు లేదా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాకుండా ఇతర సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఇన్ఫోసిస్ సీఈవోగా ఎంపిక చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కాగా, ఇన్ఫీని గాడిలో పెట్టేందుకు రెండోసారి అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టారని, ఇకపై శిక్కా ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళతారని కామత్ వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి పదవీ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే. సానుకూల ధృక్పథంతోనే విజయాలను సాధించగలమని, ఇన్ఫోసిస్‌ను తాను ఈ దృష్టితోనే చూస్తానని చెప్పారు. నారాయణమూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్‌ను వీడారు. 1981లో ఆవిర్భవించిన ఇన్ఫోసిస్ 8 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) కంపెనీగా నిలిచింది. -
ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా
ఆగస్టు 1 నుంచి సీఈఓ, ఎండీగా బాధ్యతలు * తొలిసారి కంపెనీ బయటివ్యక్తికి పగ్గాలు * పదవి నుంచి రేపు వైదొలగనున్న * ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి టెక్నాలజీ పరిశ్రమ మార్గదర్శకులు నెలకొల్పిన ఇన్ఫోసిస్‌కు సారథ్యం వహించడం నాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఇన్ఫీ ఉద్యోగులతో కలసి పనిచేయాలని, వారి నుంచి నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. కంప్యూటింగ్ టెక్నాలజీ అన్ని పరిశ్రమల తీరుతెన్నులను మారుస్తోంది. మా ఖాతాదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వాటాదారుల విలువను మరింత ఇనుమడింపచేసేలా బ్రేక్‌త్రూ సొల్యూషన్స్‌ను అందించే అరుదైన అవకాశం మాకు లభించింది. - ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ, ఎండీగా ఎంపికైన తర్వాత విశాల్ సిక్కా వ్యాఖ్యలు బెంగళూరు: వరుసగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్ర్కమణతో సతమతమవుతున్న సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా(47) నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి శనివారం పదవి వీడనున్నారు. మరో సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ కూడా అదే రోజు తప్పుకోనున్నారు. ఈ విషయాలను ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. కాగా, అసలు ఇన్ఫోసిస్‌కు సంబంధం లేని బయటవ్యక్తి కంపెనీకి సారథ్యం వహించడం తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, కంపెనీ వ్యవస్థాపకుల్లో లేనివ్యక్తి సీఈఓ కావడం కూడా ఇదే మొట్టమొదటిసారి. జర్మన్ సాఫ్ట్వేర్ సంస్థ శాప్ ఏజీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యుడైన సిక్కా ఇన్ఫీ పూర్తికాల డెరైక్టర్‌గా శనివారం చేరనున్నారు. ఇప్పటివరకు ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ఎస్.డి.శిబూలాల్ వచ్చే మార్చిలో రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ ముందుగానే పదవీ విరమణ చేస్తానని చెప్పడంతో ఆయన వారసుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. కాగా, ఇన్ఫోసిస్‌లోకి నారాయణ మూర్తి గతేడాది జూన్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రెండో ఇన్నింగ్ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటిదాకా 11 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పడం తెలిసిందే. అక్టోబర్ వరకు నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా... గతంలో ఇన్ఫీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ మూర్తి, కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది జూన్ 1న మళ్లీ పగ్గాలు చేపట్టారు. మూర్తి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, గోపాలకృష్ణన్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వచ్చే అక్టోబర్ 10 వరకు కొనసాగుతారు. ఇన్ఫీ బోర్డు ఎక్స్టర్నల్ డెరైక్టర్ కె.వి.కామత్ అక్టోబర్ 11 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారు. ‘సంస్థ పురోగతికి అందించిన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 11 నుంచి మూర్తి గౌరవ చైర్మన్ (చైర్మన్ ఎమిరిటస్)గా వ్యవహరిస్తారు..’ అని ఇన్ఫీ ప్రకటన తెలిపింది. 14 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫీసు రద్దు... ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (నారాయణ మూర్తి) కార్యాలయం ఈ నెల 14 నుంచి రద్దు కానుంది. మూర్తి కుమారుడు, ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోహన్ పదవీకాలం మూర్తితో పాటే ముగియనుంది. అంటే, రోహన్ శనివారం నుంచే కంపెనీని వీడనున్నారు. కంపెనీలో సీనియర్ ఉద్యోగులైన పన్నెండు మందికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి ఇవ్వడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థ కొత్త సీఈఓగా సిక్కాను ఎంపికచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. గ్లోబల్ కార్పొరేషన్ సారథిగా పనిచేసిన ఆయన తన విలువైన అనుభవాన్ని ఇన్ఫీ అభివృద్ధికి వినియోగిస్తారు. శాప్‌లో విశేష విజయాలు సాధించిన సిక్కాను ఇన్ఫీ అత్యున్నత పదవికి ఎంపికచేయడం ఆదర్శనీయం..’ అని మూర్తి తెలిపారు. నేనూ టీచర్ కుమారుడినే: విశాల్ పంజాబీ కుటుంబంలో జన్మించిన విశాల్ సిక్కా విద్యాభ్యాసం గుజరాత్లో కొనసాగింది. ఆయన తండ్రి రైల్వే ఇంజనీరు. వడోదరలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌ను సిక్కా పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని సైరాక్యూస్ యూనివర్సిటీలో ఎంఎస్(కంప్యూటర్ సైన్స్) చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 1996లో పీహెచ్డీ పొందారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఇన్ఫీ సీఈఓ పదవి ఆయన్ను వరించడానికి కారణం ఆయన విజ్ఞాన తృష్ణే. పలువురు సీనియర్ లెవల్ అధికారులు ఇటీవల ఇన్ఫీకి గుడ్‌బై చెప్పారు. మరోపక్క టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ నుంచి ఇన్ఫీకి పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ సారథ్యాన్ని చేపట్టడం సవాలు వంటిదే. ‘కొత్త బాధ్యతలను నేను సంతోషంగా, వినయంగా స్వీకరిస్తున్నాను. నారాయణ మూర్తిలానే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ రాజ్‌కోట్ (గుజరాత్)లో టీచరుగా పనిచేశారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇన్ఫీ ఇస్తున్న ప్రాధాన్యత నన్ను సంభ్రమానికి గురిచేసింది..’ అని విశాల్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జెరాక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత సోదరునితో కలసి ఐబ్రెయిన్ పేరుతో తొలి కంపెనీని స్థాపించారు. ఐబ్రెయిన్ను ఆ తర్వాత పాటెర్న్ ఆర్ఎక్స్ టేకోవర్ చేసింది. తదనంతరం నెలకొల్పిన బోధ.కామ్‌ను పెరిగ్రైన్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. అందులో కొంతకాలం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సిక్కా, 2002లో శాప్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్రూప్ హెడ్‌గా చేరారు. ఐదేళ్లలోనే కంపెనీ సీటీఓ స్థాయికి ఎదిగారు. గేమ్ చేంజింగ్ ‘హానా’ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఘనత విశాల్‌దే. -
ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా
బెంగళూరు : దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ కొత్త సిఈఓగా విశాల్ సిక్కా పేరు ఖరారు అయ్యింది. మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టనున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి విశాల్ సిక్కా ఇన్ఫీ పగ్గాలు చేపడతారు. ఆయన శిబూలాల్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పిహెచ్డీ చేసిన సిక్కా.. ఎస్ఏపీ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఎస్ఏపీలో క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ అప్లికేషన్ల ఎనాలసిస్ల విభాగాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నారాయణ మూర్తి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతారు. గౌరవ అధ్యక్షుడిగా మాత్రం కొనసాగతారు. కొత్త సీఈఓ వార్త నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర లాభపడింది. ఈరోజు మళ్లీ ఒక శాతానికి పైగా నష్టపోతోంది. ప్రస్తుతం 3,150కి సమీపంలో ట్రేడవుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఇన్ఫోసిస్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో కొత్త సీఈఓ రావడం కంపెనీకి కాసింత పాజిటివ్ న్యూసేనని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే కంపెనీ గత వైభవాన్ని తీసుకురావడం మాత్రం చాలా పెద్ద సవాల్ అని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు.