సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్
సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్
Published Fri, Aug 18 2017 2:48 PM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM
సాక్షి, ముంబై : విశాల్ సిక్కా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. నేటి సెషన్‌లో ఇన్ఫోసిస్ షేరు విలువ 52 వారాల నష్టంలో 13 శాతం మేర నష్టపోయి, రూ.884.40 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేస్తోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా భారీగా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు రూ.30 వేల కోట్ల మార్కెట్ విలువను ఇన్ఫోసిస్ కోల్పోయింది. గురువారం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,34,554.78 కోట్లగా ఉంది. నేడు అది రూ.30 వేల కోట్ల మేర పడిపోయింది.
ఐటీ సర్వీసు కంపెనీల్లో రెండో అతిపెద్ద దిగ్గజంగా ఉన్న ఇన్ఫోసిస్ సీఈవోగా, ఎండీగా విశాల్ సిక్కా గురువారం ఉదయం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ అన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ వివాదాల నేపథ్యంలో విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సిక్కా నిర్ణయంతో ఇటు మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, చాలా పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉందని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే ఐటీ సెక్టార్ వృద్ధి రేటు మందగించింది. అంతేకాక చాలా దేశాల్లో వీసాలపై పరిమితులు విధిస్తున్నారు. ఇవన్నీ ప్రవీణ్ రావుకు సవాళ్లేనని పేర్కొన్నారు. సిక్కా వైదొలగడం ప్రస్తుతం కంపెనీకి స్వల్పకాలంగా అతిపెద్ద ఎదురుదెబ్బేనని, కానీ ఇన్ఫోసిస్ ఈ ఎదురుదెబ్బను అధిగమిస్తుందని మరికొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Advertisement