
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ సేవల సంస్థ ఎస్‌ఏపీ మేధోహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని, ఇందులో ఆ సంస్థ మాజీ సీటీవో విశాల్ సిక్కాకు కూడా భాగం ఉందని అమెరికన్ టెక్నాలజీ సంస్థ టెరాడేటా ఆరోపించింది. ’హెచ్‌ఏఎన్‌ఏ’ ప్లాట్‌ఫాం రూపకల్పనలో తమ వ్యాపార రహస్యాలను, మేధోహక్కులను చోరీ చేశారంటూ అమెరికా కోర్టులో దావా వేసింది.
హెచ్‌ఏఎన్‌ఏను రూపొందించే క్రమంలో తమ కాపీరైట్స్‌ను చౌర్యం చేసేందుకే ఎస్‌ఏపీ తమతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిందని, ప్రాజెక్టు పూర్తి కాగానే తెగదెంపులు చేసుకుందని టెరాడేటా ఆరోపించింది. ఎస్‌ఏపీ దశాబ్దకాలంగా కస్టమర్లు, భాగస్వామ్య సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందంటూ పేర్కొంది.
మరోవైపు, ’హెచ్‌ఏఎన్‌ఏ’ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సిక్కా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. హెచ్‌ఏఎన్‌ఏను పూర్తి నిబద్ధతతో రూపొందించామని, మేధోహక్కుల ఉల్లంఘనేదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోగా కూడా సిక్కా పనిచేసిన సంగతి తెలిసిందే.