సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్‌ఏపీ ఇండియా, ఐబీఎమ్‌లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది.
సాఫ్ట్‌వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్‌ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్‌స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది.
సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్‌లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్‌ఏపీ ఏజీ నుంచి ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది.
ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు?
ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్‌వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్‌ఏపీ, ఐబీఎమ్‌లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment